ఉద్యోగం చేస్తేనేనా నేడు స్త్రీ కి గుర్తింపు?డబ్బు సంపాదనేనా జీవిత పరమావధి?
మనిషిని మనిషిగా మనిషి గుర్తించడా ?మనిషి స్వభావంలో మార్పు ఎప్పుడు వస్తుంది?
ఎన్ని వేలు సంపాదిస్తే చిన్నపిల్లలకి మన చేత్తో మనం అన్నం పెట్టుకున్న తృప్తి వస్తుంది ?
'అమ్మా' అని బిడ్డ కౌగిలిన్చుకున్నప్పుడు వచ్చే తృప్తి,ఆనందం యెంత పెద్ద ఉద్యోగం చేస్తే వస్తాయి ?
పిల్లల చిన్నప్పటి ముద్దు-ముచ్చట్లు ఉద్యోగాలకి వెళ్ళిపోయి కోల్పోతే మళ్లీ పొందగలమా?
భర్తకు కావాల్సినవి సమకూర్చి ,బయిటనుంచి రాగానే పలకరించి,దగ్గర కూర్చుని వడ్డించే ఓపిక,సమయం ఉద్యోగానికి వేళ్తే ఉంటాయా?ఈ ఆనందాన్ని ఉద్యోగం చేస్తే పొందగలమా?
తప్పనిసరి అయితే తప్పదు.పరిస్థితులతో రాజీ పడాల్సిందే!!
కానీ అలాంటి అవసరాలని పక్కన పెడితే;
పరుగులు,హడావుడిలు ,చిరాకులు,పరాకులు,పనుల పంపకాలు ,పంచుకోవటానికి మిగలని క్షణాలు ,పెంచుకోవటానికి వీలవని బంధాలు...ఇవే సంపాదన మనకిచ్చే వరాలు!
'పిండి కొద్దీ రొట్టె ','చెట్టు కొద్ది గాలి' అన్నట్లు--భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే,
జీతాలు పెరిగే కొద్ది పెరిగే సుఖాలు,వాటి కోసం కట్ అయ్యే loan instalments,ఆడవాళ్ళకి ఇంట్లో+బయట పేరిగే పనుల వత్తిడ్లు--కనిపించని సత్యాలు,ఓప్పుకోని నిజాలు.ఎక్కువ నలిగేది ఆడవాళ్లే.
కానీ ఇవాళ ఇవి ఎవరూ పట్టించుకోవట్లేదు .
"అయ్యో ఉద్యోగం చేయట్లేదా?"అంటారు పెద్ద నేరమేదో చేస్తున్నట్లు !
"మరి ఖాళీ సమయాల్లో యేంచేస్తూ ఉంటారు?" అని ప్రశ్న.ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ ఉంటానండి --అని చెప్పాలనిపిస్తుంది.
నిజంగా ఇంట్లో ఉండే ఏ ఇల్లాలికి తీరిక ఉంటుంది?పొద్దున్న లేచిన దగ్గర నుంచి 10,11గంటల దాకా స్కూళ్ళు,ఆఫీసుల హదావుడి.ఆ తరువాత ఇల్లు సర్దుడు,బట్టలు-ఇస్త్రీలు,నీళ్ళు కాచడాలు/వాటర్ ఫిల్టర్ కడగటాలు-బోటిల్స్ నింపి ఫ్రిజ్ లొ పెట్టడాలు,సాయంత్రానికి కూరలు,టిఫిన్లూ తయారీలు,కావాల్సినవి ఉంటే బయటికి వెళ్ళి కూరలు ,సరుకులూ తెచ్చుకోవటాలు ఇలా ఏ రోజు పని ఆ రొజు ఉంటుంది.ఇలా గృహిణి పనుల లిస్టు చెప్పుకుంటూ పోతే యెంతైనా ఉంటుంది..ఇక ఉండేది జాయింట్ ఫ్యామిలీ లో అయితే పనులతో పాటు బాధ్యతల బరువులు కూడా ఆడవారికి అదనపు సౌకర్యమే.
ఆదివారం అన్నిరోజులకన్న బిజీ.అన్ని పనులూ లేటు నడుస్తాయి కాబట్టి!! ఇలా రోజులో మహా అయితే ఒక గంట,2గంటలు పేపర్,పుస్తకం,టివి లకు లేక ఇతర హాబీలకి మిగిలి ఉంటాయి...
కానీ ఇవన్నీ కనిపించని పనులు.గృహిణి అంటే అందరికీ లోకువే!
అందుకే అనిపిస్తుంది మనిషిని మనిషిగా మనిషి ఎప్పటికి గుర్తిస్తాడు?అని.
వెనక ఉన్న ఆస్థిపాస్తులకో,సంపాదించే డబ్బుకో మాత్రమే విలువ ఇచ్చే మనిషి స్వభావంలో మార్పు ఎప్పుడు వస్తుంది?
గమనిక:
నేను ఉద్యోగం చేసే వాళ్లకు వ్యతిరేకిని కాను.ఉద్యోగం కేవలం డబ్బు కోసమే కాదు ,మనల్ని మనం నిరూపించుకోవటం కోసం అని కూడా నా అభిప్రాయం. కానీ పైన రాసినది ఇద్దరూ ఉద్యోగం చేసే చాలా మంది అలా ఇబ్బందులు పడతున్నారని చెప్పటానికి ; ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళని కించపరచకూడదు ,వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది అని చెప్పటానికి .