సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, September 19, 2009

శరన్నవరాత్రులు

"సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే"


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచీ శరదృతువు ప్రారంభం కావడం ఈ ఆశ్వయుజమాస విశేషం.ఈ రోజు అంటే "ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి" నుండి తొమ్మిది రాత్రులు ఆదిశక్తిని పూజించటం శుభప్రదం. ఈ నవరాత్రులలోనూ శక్తి స్వరుపిణిని-- దుర్గ,మహాలక్ష్మి,లలిత,సరస్వతి,గాయిత్రి,అన్నపూర్ణ,బాలాత్రిపురసుందరి,శ్రీరాజరాజేశ్వరి,మహిషాసుర మర్దిని మొదలైన రూపాలలో ఆరాధిస్తారు.వెన్నెలను "శారద" అని కూడా అంటారు.శారదకాంతులతో విరాజిల్లే దేవి కాబట్టి ఆదిశక్తిని "శారద" అని స్తుతిస్తాము.అందువల్ల ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుంచీ ఆ మాతను పుజించే తొమ్మిది రాత్రులను "శరన్నవరాత్రులు" అనీ,"శారదరాత్రులు" అనీ పిలస్తాము.సాంప్రదాయమున్నవారు ఈ తొమ్మిది రోజులూ కలశాన్ని స్థాపించి దేవిని నియమంగా పూజిస్తారు.దశమి రోజున ఉద్వాసన చేస్తారు.

తొమ్మిది రోజులలో మూలా నక్షత్రం రోజున "సరస్వతీ దేవి"ని ఆరాధిస్తారు.తొమ్మిది రోజులు పూజ చేయలేనివారు ఈ రోజు నుండీ నవమి దాకా ముడు రోజులూ పూజ చేస్తారు.శక్తి స్వరూపిణి అయిన దేవి ఆశ్వయుజ శుధ్ధ అష్టమి నాడు అవతరించినందువల్ల ఆ రోజు "దుర్గాష్టమి" గా ప్రసిధ్ధి చెందింది.నవరాత్రులలో అతి ముఖ్యమైనది "మహానవమి".దసరా పూజలకి ఇదే ప్రధానమైన రోజు.ఆశ్వయుజ శుధ్ధ నవమి నాడు జగన్మాత "మహిషాసురుడు" అనే రాక్షసుని సంహరించి లోకోపకారము చేసినందువల్ల ఈ నవమి "మహా నవమి" అయ్యింది.ఈ నవరాత్రులూ దేవిని ఆరాధించి ఏ పనైనా మొదలుపెడితే తప్పక విజయం లభిస్తుందని భారతీయుల నమ్మకం.

శ్రీరాముడు ఈ మాసమున ఆ దేవిని పుజించిన తరువాతే లంకకు వెళ్లి రావణుణ్ణి వధించాడని రామాయణంలో చెబుతారు.
అలానే భారతంలో, అజ్ఞాతవాస సమయంలో దుర్యోధనాదులతో యుధ్ధము చేయటానికి అర్జునుడు,పాండవులు ఆయుధాలుంచిన శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసి,గాండీవమును తీసుకుని కౌరవులందరినీ తానొక్కడే జయించి,విరాటుని గోవులను నగరానికి మరలుస్తాడు.అర్జునుడికి "విజయం" దశమి రోజున కలిగినందువల్ల
ఆశ్వయుజ శుధ్ధ దశమికి "విజయదశమి" పేరు వచ్చిందని చెబుతారు.ఎక్కడో చదివిన గుర్తు--ఈ రోజున నక్షత్రాలు కనబడిన వేళ "విజయ ముహుర్తం" అని,ఈ ముహుర్తంలో తలపెట్టిన పనులు,ప్రయాణాలూ తప్పక విజయవంతమౌతాయనీ నమ్మకం ఉందట.
శరన్నవరాత్రులకు సంబంధించి నాకు తెలిసిన కొద్దిపాటి విశేషాలు ఇవి.

పండుగలలో "వినాయకచవితి" తరువాత నాకు చాలా ఇష్టమైనవి ఈ "నవరాత్రులు".కలశం పెట్టే ఆనవాయితీ లేకపోయినా ,మా అమ్మ తొమ్మిదిరోజులూ పూజ చేసి నైవేద్యాలు చేసేది.బెజవాడలో ఉండటం వల్ల కనకదుర్గ అమ్మవారి అలంకరణలు తెలుసుకుని ఆ ప్రకారం ఆయా అవతారాలను పూజించేది అమ్మ.పెళ్లయ్యాకా నేను కూడా అలానే నవరాత్రులూ దేవీ పూజ చేసి,నైవేద్యాలు చెయ్యటం మొదలుపెట్టాను.ఈ పుజలు చేసి ఏదో భోగభాగ్యాలు పొందెయ్యాలని కాదు...ఇలా చేయటం వల్ల నాకు ఎంతో మన:శ్శాంతి లభిస్తుంది.పెళ్లైన మొదటి ఏడాది నవరాత్రులు బొంబాయిలో చేసుకున్నాను.మా ఇంటి దగ్గర "మహిషాసురమర్దిని" ఆలయం ఉండేది.ఆయన ఆఫీసు నుంచి వచ్చాకా రాత్రి 9,9.30కి గుడికి వెళ్ళేవాళ్ళం.అప్పుడు ఆఖరు హారతి ఇస్తూ ఉండేవారు...చూడటానికి కన్నుల పండుగ్గా ఉండేది.అదే First and best celebrated festivalగా నా స్మృతుల్లో ఉండిపోయింది.ఇవాళ కుడా పొద్దున్నే మొదటిరోజు పూజాకార్యక్రమాలు ముగించి, అన్నం పరమాన్నం నైవేద్యం పెట్టాను..!!