సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, July 19, 2024

చీకట్లను వెలుతురుగా మార్చుకున్న - SRIKANTH





చాలా రోజుల తర్వాత ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సినిమా చూసానన్న భావన కలిగింది. వెలుతురు లేని ప్రపంచాన్ని అసలు ఊహించలేము. అలాంటి పరిస్థితే వస్తే మన మనస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహకందని విషయం. కానీ చీకటే తన ప్రపంచం అని తెలిసినా సరే దిగులు చెందకుండా, "నువ్వు చెయ్యలేవు" అని ఎవరైనా సవాలు చేసిన పనిని చేసి చూపించడమే ధ్యేయంగా మార్చుకున్న ఒక ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తి కథే "శ్రీకాంత్" సినిమా. అంధత్వం శరీరానికి కాదు మనసుకి అనిపించక మానదు సినిమా చూస్తూంటే! నిరాశతో కృంగిన ప్రతి వ్యక్తికీ మార్గాన్ని చూపి, స్ఫూర్తినీ ఇచ్చే కథ ఇది. 'శ్రీకాంత్ బొల్లా' గారి యదార్థ జీవిత గాథ!


ఇదివరకూ differently abled person మీద సినిమా తీస్తే వారు రకరకాల బాధలకు గురైయ్యాకా ఎవరో వచ్చి సహాయం చేస్తే వాళ్ల జీవితం బాగుపడినట్లు ఉన్న కథలు ఎక్కువగా ఉండేవి. సినిమాలు బాగున్నా, అటువంటి కథలు నిజాలే అయినా, ఆ ఫలానా వ్యక్తి పడిన కష్టాలు చూసి మనసంతా భారమయ్యేది. కానీ మొదటిసారిగా ఒక differently abled person జీవితగాథ చాలా స్ఫూర్తిదాయకంగా, ఉత్సాహభరితంగా అనిపించింది. చిత్రం మొదటి నుంచీ చివరిదాకా అదే ఉత్సాహభరితమైన ఫీల్ ని కొనసాగించాడు దర్శకుడు. బహుశా ఆయన దృష్టికోణం అదేనేమో. బావుంది. 



రాజ్ కుమార్ రావ్ గురించి చెప్పేదేముంది..వంక పెట్టడానికి లేని నటనా కౌశలం అతనిది. ఆ పాత్రకు ఉండే మేనరిజమ్స్, హావభావాలు అన్నీ చాలా బాగా వ్యక్తపరిచాడు. మెచ్చుకోదగ్గ నటన! రాజ్ కుమార్ నటించిన కొన్ని సినిమాలు - Kai po che, Queen, Hamari adhuri kahani, Bareilly ki barfi, Newton, Stree, Hum do hamare do, Monica, O my Darling..మొదలైనవి ఇదివరకు చూశాను. వాటిల్లో Newton చిత్రం నాకు చాలా నచ్చింది. ఇదే కథను కొద్దిగా మార్చి ఆ మధ్య తెలుగులో "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" అనే సినిమా తీశారు కూడా. కానీ ఒరిజినల్ హిందీ సినిమాయే బావుంది నాకైతే. Monica, O my Darling కూడా సస్పెన్స్, కామిడీ మిక్స్. సరదాగా ఉంటుంది. 


ఇంతకీ శ్రీకాంత్ సినిమా కబుర్లలోకి మళ్ళీ వచ్చేస్తే, జ్యోతిక కూడా తన దేవికా టీచర్ పాత్రను బాగా పోషించింది. ఒక డైలాగ్ లో చెప్పినట్లు శ్రీకాంత్ లాంటి వ్యక్తులు విజయాలను పొందాలంటే వారి చుట్టూ దేవికా టీచర్, రవి, స్వాతి లాంటి పాజిటివిటీ నింపి, ప్రోత్సహించే వ్యక్తులు ఉండాలి. అలానే శ్రీకాంత్ లో పట్టుదలను, కసిని పెంచే మహేశ్ లాంటి cruel చిన్ననాటి స్నేహితులు, హాస్టల్ లోంచి బయటకు తోసేసే వార్డెన్ లాంటి mean minded వ్యక్తులు కూడా ఉండాలి. శ్రీకాంత్ మాత్రమే కాదు ఎవరికైనా సరే, జీవితంలో ప్రోత్సహించే చేతులతో పాటుగా.. కిందకు తోసేసే చేతులు కూడా.. తన చుట్టూ ఉన్నప్పుడే తనలోని లోపాలను అధిగమించి ఒక వ్యక్తి పరిపూర్ణంగా వికసించగలుగుతాడు. ఇది నా అభిప్రాయం. 


సినిమా చూశాకా ఒకే ఒక బాధ కలిగింది.. ఈ శ్రీకాంత్ మన తెలుగువాడు కనుక "మల్లేశం" తీసినట్లుగా ఎవరైనా తెలుగు సినిమా దర్శకుడు ఈ సినిమా తీసి ఉంటే ఇంకా బవుండేది కదా.. అనిపించింది!



3 comments:

P. Sudha said...

So nice to know. You have created ample enthusiasm through Trishnaventa

Padma said...

Hi Trishna garu, Just saw your dad's(Ramam garu) inspirational interview in youtube and came to visit your blog, please continue blogging.

తృష్ణ said...

@P,sudha : Thank you very much.
@padma : Thank you very much.