సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, December 4, 2021

మనోభావాలు

 


రెండు, మూడు రోజులుగా పరస్పర విరుధ్ధమైన ద్వంద్వ  భావాలు  మనసులో ఒకేసారి పొటీపడుతున్నాయి.

"ఏదో ఒకటి రాయాలి.. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ప్రతి దృష్టికోణంలోనూ ఏదో ఒక వైరుధ్యం ఉంటుంది. ఎవరి భావాలువారివి కాబట్టి నా బ్లాగులో నా రాతలు నేను రాసుకోవాలి అనే నిరంతర తపన" ఒకవైపు!

" ఏదీ కూడా శాశ్వతం కానీ కనురెప్పపాటి జీవితంలో ఏం రాస్తే ఏమిటి? నేను రాయకపోతే వచ్చే అణుమాత్రం నష్టం కూడా లేనప్పుడు, ఏం రాసి ఏం ప్రయోజనం? అనే నిర్లిప్తత మరోవైపు!!


పాటలు పోగేసుకున్నాను, అక్షరాలను వెతుక్కున్నాను, మాటలు సమీకరించుకున్నాను, ఎంతో రాయాలనే తపన కూడా ఉంది కానీ పైన పేర్కొన్న ద్వంద్వ భావాలలో నన్ను రెండవదే ఎక్కువగా ప్రభావితంచేస్తోంది. ఒకానొక అనాస్థ దశలో ఎలాగైతే నిర్లిప్తంగా నాకత్యంత ప్రియమైన ఈ బ్లాగు మూసేసి ఏకాంతంలోకి వెళ్పోయానో, ఇప్పుడూ అదే అనాస్థ దశ. మూగగా, స్తబ్దంగా, భావాలను ముందుకు నడవనివ్వని ఒక నిస్తేజ స్థితి ఆవరించి ఉంది.

కాదు.. ఇది వైరాగ్యం కానే కాదు.. అంతకు మించిన ఏదో భావం!

ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మలోని పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కలిగే నిర్లిప్త భావమేమో... బహుశా!!


కానీ నేను సమీకరించుకున్న పాటలతో, మాటలతో ఒక మహానుభావుడికి అంజలి ఘటించే ప్రయత్నం త్వరలో తప్పకుండా చేస్తాను.


Saturday, September 11, 2021

OTT Entertainment : 1


ఇవాళ ఒక కొత్త సినిమా చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు -

సినిమా బానే ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే, మనకి కావాలి అనిపించేవి, ఇలా జరిగితే బాగుండు.. అనిపించేవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. నిజ జీవితంలో అలా ఏమీ జరగవు. అసలు అలాంటి ఒక ఊహజగత్తులో బ్రతకడమే ఎంత తప్పో తెలిసేసరికీ సగానికి పైగా జీవితం అయిపోతుంది. వెర్రిమొర్రి కథలతో సినిమాలు తీసేసి ప్రజలపై రుద్దేసి డబ్బు చేసుకోవడమే తప్ప ఇవి ప్రజల జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో అన్న ఆలోచన ఎవరికి ఉండదు. ఇది మా జీవనోపాథి అంటారు సినీమారాజులు. చూడడం చూడకపోవడం, మన తప్పొప్పులు  మన బాధ్యత. కానీ రివైండ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా మొదలుపెట్టడానికి ఇది వీడియోనో, రిమోట్ కంట్రోలో కాదుగా... అసలు సిసలైన జీవితం!! ఒక్క రోజు, ఒక్క క్షణం పోయినా మళ్ళీ వెనక్కు రావు! వెనక్కి తెచ్చుకోలేము. 


ఇంత చిన్న విషయం అర్థం కాదా మనుషులకి? అర్థం అయినా అర్థం కానట్టు బ్రతికేస్తారా? ఇన్నాళ్ళూ నువ్వూ చూశావు కదమ్మా నానారకాల సినిమాలూ...ఇప్పుడేమో బోధిచెట్టు క్రింద జ్ఞానోదయమైన బుధ్ధుడిలా పెద్ద చెప్పొచ్చావులే పో పోవమ్మా! జీవిత సత్యాలు అందరికీ తెలుసు. ఇది జగన్నాటకంలో భాగం. అంతే! అంటారు మేధావులు. 


అయినా నా పిచ్చి కానీ ఎవరు చెప్తే ఎవరు వింటారు? నేను విన్నానా? ఎవరి జ్ఞానం వాళ్లకి రావాల్సిందే. అంతవరకూ మన జపం మనం చేసుకుంటూ చూస్తూ ఉండడమే :-) 

Friday, September 10, 2021

random thoughts...



2021... వచ్చి  ఎనిమిది నెలలు గడిచిపోయాయి.. ఇవాళ్టి వినాయకచవితి కూడా స్దబ్దుగా గడిచిపోయింది ! ఈ కాలం ఇలా త్వరగా గడవడం  మంచిదే కానీ మరీ ఇంత త్వరగానా .. అనిపిస్తోంది . ఏ హడావుడి లేకుండా పండుగ వెళ్పోయింది .  ఏమో నాకైతే అలానే అనిపించింది .  రోడ్డు మీద పత్రి  అమ్మేవాళ్ళు కూడా ఇదివరకటిలా పది అడుగులకొకళ్ళు లేరు. మా వైపున పత్రి అమ్మకం ఉన్న ఒక్క చోటా కూడా ఇదివరకటిలా అన్ని రకరకాల ఆకులు అమ్మలేదు .  జిల్లేడు ఆకులూ , తామరపూలు , తామర ఆకులూ , ఏవి లేవు .  ఇదివరకూ చాలామంది నానారకాల ఆకులూ అమ్మేస్తున్నారు అని విసుక్కునేవాళ్ళం .  అయినా వాళ్లకి ఆ ఒక్కరోజే ఉపాధి .  ఎక్కడెక్కడికి  వెళ్లి ఇవన్నీ తెస్తారో వీళ్ళు  అని ఆశ్చర్యపోయేవాళ్ళం కూడా. మన జీవితాలలోకి  ఈ మహమ్మారి ఎన్ని మార్పులు తెచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రోజువారీ ఉపాధి అవకాశాలు మాత్రం బొత్తిగా శూన్యం అయిపోయాయి .  నిరుపేద జీవితాలపై మాత్రం ఇది చాలా బలమైన దెబ్బ అనే చెప్పాలి . ఈ గడ్డు కాలం సమసి , వారి జీవితాలు వికసించే రోజులు మళ్ళీ రావాలని ఆ వినాయకుడుని ప్రార్థిస్తున్నాను . 


***           ***             ***


పుస్తకం  తెరిచి ఎన్నాళ్లైయిందో ! ఇంటి పనితోనో , ఆఫీసు పనితోనే రోజులు గడిచిపోతున్నాయి .  OTT ల పుణ్యమా అని నానావిధ సినిమాలకేకొదవాలేదు. అవి పనులు చేసుకుంటూ  కూడా చుసేయచ్చు .  కానీ పుస్తకానికి ఏకాంతం , ఏకాగ్రత రెండూ కావాలి.   ఎప్పుడైనా సమయం  దొరికితే కాసేపు పడుకుందాం , రెస్ట్ తీసుకుందాం అన్న ఆలోచనే తప్ప  చదువుదామనే ధ్యాసే ఉండడం  లేదు .  

ఇదివరకూ  ఇంట్లో సామాను కూడా ఎటునుంచి ఇటు , ఇటు నుంచి అటూ అవలీలగా జరిపేసి సర్దేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక్కరోజు సర్దితే నాలుగురోజులు మరేపని చెయ్యలేని స్థితి .  ఇది వయసు ప్రభావమా ? లేక పనిపనిషి లేకుండా గత రెండేళ్ల నుండీ చాకిరి చేసుకుంటున్న వత్తిడి ప్రభావమా ? అన్నది తేల్చుకోవడం కష్టమే!


***      ***.    ***


ఈ టపాలో  ప్రత్యేకత ఏమిటంటే నా కొత్త లాప్టాప్ లో  ఇంకా సరైన సదుపాయాలు లేక డైరెక్ట్ గా బ్లాగ్ నుండే డ్రాఫ్ట్ లోoచి ఈ టపా రాస్తున్నాను. ఎలాగైనా ఇవాళ రాయాలనే సంకల్పంతో ! అక్షరాలు వెతుక్కుoటూ రాస్తుంటే బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తల్లో  ఒక టపా రాయడానికి ఎన్ని కష్టాలు పడేదాన్నో, ఎన్ని తప్పులు వచ్చేవో గుర్తుకొస్తోంది. 

నవ్వు వస్తోంది .... మళ్ళీ  గతం తాలూకూ చెరగని చేదు గురుతులు కలవరపెడుతున్నాయి కూడా! కానీ ఒకటి మాత్రం నిజం - ఏది జరిగినా మన మంచికే అని నేను ఎప్పుడూ నమ్మే సూత్రం . ఈ బ్లాగు రాతలు నాకు కేవలం చేదు  జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చినా , ఈ రాతలు నాకు తెలుగు టైపింగ్ నేర్పాయి .  ఎలా రాయాలో ,  ఎంత రాయగలనో , ఏది రాయగలనో తెలిపాయి .  నా జీవితకాలపు  కలను నిజం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించింది ఈ బ్లాగ్ రాతలే! భగవంతుడు నాకు అన్ని విధాలా సహకరించాడనే చెప్పాలి.  ఆ నిరాకార స్వరూపుడికి కృతజ్ఞతలు . 


***     ***    ***


చాలా కాలం నుంచి తెలిసిన కొందరి గురించి మనకి ఏర్పడిన అభిప్రాయాలను మార్చుకోవడం కష్టమే  అయినా ఒకోసారి మార్చుకోవాల్సి వస్తుంది .  ఇలాంటివాళ్ళు  అనుకున్నాము ... కాదన్నమాట  అని ఆశ్చర్యం వేసినా నిజరూపం తెలిసాకా అసలు కొందరితో మాట్లాడాలనే అనిపించదు .  ఎదురైనా తప్పించుకు తిరుగుతాం. 


***     ***      ***


ఏకాంతాన్ని  ఆస్వాదించడం మొదలైయ్యాకా మనుషులకు దూరంగా ఉండడమే ఆనందాన్ని ఇస్తోంది .  మనసు మరింత ఏకాంతాన్ని కోరుకుంటుందే తప్ప మరో ఊసే గుర్తుకురాదు .  భగవధ్యానం , ఆధ్యాత్మిక జీవితం , మరిన్ని  ఆధ్యాత్మికమైన  విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి  ఇదివరకటి మామూలు పుస్తకాల వైపుకి దృష్టిని మరలనివ్వడమే లేదు .  ఇందులో ఉన్న ప్రశాంతత మరెందులోను లేదు అన్న సత్యం ఆలస్యంగానైనా తెలిసిరావడం పూర్వజన్మ సుకృతమే  అనుకుంటాను. గత ఆరేళ్లలో  ఆత్మోన్నతికి ఉపయోగపడే  ఎన్నో మంచి మంచి పుస్తకాలు తెప్పించుకున్నాను. కొన్ని చదివాను .. ఆనందించాను. ఇంకా చాలా చదవాలి .  అటువంటి  ఏకాగ్రతనిచ్ఛే ఖాళీ సమయాన్ని ఇమ్మని భగవంతుడిని కోరుకుంటున్నాను . 










Saturday, May 15, 2021

శాంతిః శాంతిః శాంతిః

 



చెట్టంత మనుషులు.. 

బాగా తెలిసిన ఎందరో మనుషులు..

మొన్న ఒక వార్త, నిన్న ఒక వార్త... 

ఇలా ఎన్నెన్నో వింటూంటే దిగులుమేఘాలు కమ్మేస్తున్నాయి..

తెలిసినవాళ్లందరినీ పేరుపేరునా ఎలా ఉన్నారండీ అని పలకరించాలనిపిస్తోంది. 

కానీ ఎవరిని పలకరిస్తే ఏ వార్త వినాల్సివస్తుందో అని భయంగా కూడా ఉంది.

నిన్నటిదాకా ఆరోగ్యంగా, ఆనందంగా మన మధ్య తిరిగినవారు...

ఇవాళ మాయమైపోతున్నారు..

ఎంతటి మహమ్మరి ఇది..

జాతీయ విపత్తు కాదు ఇంకేదో పేరు పెట్టాలి దీనికి..

ఊహూ...ఏ మాట సరిపోవట్లేదు..

అక్షరాలు కుదరట్లేదు...:((

ఇంత అన్యాయమా...అయ్యో.. అని మాత్రం దు:ఖం కలుగుతోంది!!!

ప్చ్!!!

శాంతించు భూమాతా... ఎందరిని నీలో కలిపేసుకుంటే నీ కోపం తీరుతుంది?

శాంతిః శాంతిః శాంతిః


 द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः
पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ।
वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः
सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥
 शान्तिः शान्तिः शान्तिः ॥


యజుర్వేదంలోని ఈ శాంతి మంత్రార్ధాన్ని క్రింద లింక్ లో చూడచ్చు -

https://www.siddhayoga.org/shanti-mantras/om-dyauh-shanti



Saturday, May 8, 2021

మోడ్రన్ Genieలు !


కొందరు దేశ ప్రజల నిర్లక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల చేతులారా కొని తెచ్చుకున్నదే ఈ ప్రస్తుత విషమ పరిస్థితి ! (ప్రభుత్వాలనో, మరెవరినో నిందించే కన్నా ముందర బాధ్యత గల దేశ పౌరులుగా మన బాధ్యతను మనం ఎంతవరకూ నిర్వర్తించాం అన్నది కూడా మనం అంతర్లోచన చేసుకోవాల్సిన విషయం.)

ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ విధులను ఎంతో సమర్థవంతంగా, శక్తికి మించి నిర్వర్తిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర హాస్పట్లల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు మొదలైనవారందరూ ఎంతో హర్షనీయులు. కానీ వారందరితో పాటూ మనం చేతులెత్తి నమస్కరించాల్సినవారు మరికొందరు ఉన్నారు. వారే ఆన్లైన్ వెబ్సైట్ల డెలివరీ కుర్రాళ్ళు! ఎంతో రిస్క్ తీసుకుంటూ వీధుల్లో , ఎండల్లో, ఎన్నెన్నో దూరాలు తిరిగి తిరిగి మనందరి ఆన్లైన్ ఆర్డర్లను మన తలుపు దగ్గరకు తెచ్చి అందిస్తున్న Genieలు వాళ్ళు.


ఇవాళ ప్రపంచమంతా మన చేతుల్లోని ఆరేడు అంగుళాల ఫోనులో ఇమిడిపోయింది. మహమ్మారి వైరస్ కారణంగా ఇవాళ ప్రపంచం వణికిపోతోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లద్దని పదే పదే అంతటా వినిపిస్తున్న మాట. తప్పనిసరి పనులు, ఆఫీసులు ఉన్న ప్రజలు ముసుగులు మొదలైన రక్షణా కవచాలు ధరించి యుధ్ధసైనికుల్లా తప్పక తిరుగుతున్నారు. కానీ ఇంట్లో ఉండి, ఇంట్లోంచి పనులు చేసుకుంటున్న ప్రజానీకం అందరమూ ఏ వస్తువు కావాలన్నా చేతిలోకి ఫోన్ తీసుకుని టిక్కు మని ఒక్క నొక్కు నొక్కుతున్నాము. గంటల్లోనో, ఒక రోజులో, రెండురోజుల్లోనో మనకి కావాల్సిన వస్తువు మన తలుపు దగ్గర వచ్చి పడుతోంది. మనం హాయిగా ఇంట్లోంచి ఆర్డర్ చేసుకుని తెప్పించుకుంటున్నాం కానీ అవి తెచ్చేవాళ్ళు ఎంత శ్రమ పడతారో అనిపిస్తుంది నాకు. వాళ్ళ శ్రమ మాత్రమే కాదు, మనం బయటకు వెళ్ళక్కర్లేకుండా మనకి కావాల్సినది మన చేతుల్లోకి వచ్చేయడం చాలా చిత్రమైన విషయంగా నాకు అనిపిస్తుంది. నా మటుకు నాకు ఆ డెలివరి కుర్రాళ్ళు అల్లావుద్దీన్ జీనీలాగ అనిపిస్తారు. కూరలు, పాలు,పళ్ళు, పుస్తకాలు, నిత్యావసరాలు. కిరాణా వస్తువులు...అసలు ఈ సామానుకి అంతేమిటి? ఇదివరకూ మనకి ఏదన్నా కావాలంటే వీధి వీధీ తిరిగి, కొన్ని వస్తువుల కోసం ఎంతో దూరం కూడా బస్సుల్లో ప్రయానించి వెళ్ళి తెచ్చుకున్న రోజ్కులు ఉన్నాయి. ఇవాళ అస్సలు ఏమాత్రం శ్రమ లేకుండా ఫోనులో మీట నొక్కిన తక్షణం ఆ ఫలానా వస్తువు మన చేతుల్లోకి వచ్చేస్తోంది. ఎవరికైనా ఏదైనా పంపాలన్నా కూడా చక్కగా ఆర్డర్ చేస్తే ఆ ఫలానావారికి అందించేస్తున్నారీ డెలివరీ కుర్రాళ్ళు. మనకీ ఆనందం, అవతలవారికీ ఆనందం. కావున  చెప్పొచ్చేదేమిటంటే ఈ డెలివరీ బాయ్స్ మన పాలిట వరాలిచ్చే దేవతల్లాంటివారు. 


ఈ సంవత్సర కాలంలో ఓలా, ఊబర్ వాళ్ల పేకేజీ సర్వీసుల ద్వారా నేను ఎన్నో సార్లు మావాళ్లకి నే వండిన పదార్ధాలు, తినుబండారాలు పేక్ చేసి పంపించాను. ఇంట్లోంచి కదలడానికి భయపడే పరిస్థితుల్లో, మనవాళ్లకి మనం స్వయంగా చేసిన పదార్ధాలు మనం వెళ్లలేకపోయినా ఎవరిద్వారానో అందివ్వగలగడం ఎంతో సంతోషకరమైన సంగతి. ఈ సర్వీస్ నిజంగా ఎంతో ఉపయోగకరమైనది. బిగ్ బాస్కెట్, అమ్మాజాన్(Amazonకి మేము పెట్టుకున్న ముద్దు పేరు), ఫ్లిప్కార్ట్, ఆర్గానిక్ ప్రాడక్ట్స్ అమ్మే వెబ్సైట్స్...ఇలా ఎన్నో వెబ్సైట్ల ద్వారా ఒకటేమిటి నానావిధాల వస్తువులు ఇవాళ మన ముంగిట్లో వాలుతున్నాయి. ఆఖరికి మొక్కలకి నీళ్ళు పోసే వాటర్ పంప్ నాజల్ పోతే, అది కూడా నెట్లో ఒకచోట వెతికి బుక్ చేస్తే మర్నాడే ఇంటికి వచ్చింది! [కాకపోతే అది చిన్న సైజ్ అయి పర్పజ్ సర్వ్ అవ్వలేదు :( ] 


గత ఏడాది లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న చాలామంది యువత ఈ డెలివరీ ఉద్యోగాలలో చేరారని వినికిడి. డిమాండ్ పెరిగిపోయి బుక్ చేసిన నాలుగు రోజులకి కానీ వస్తువులు రావట్లేదు. ఆన్లైన్ ఆర్డర్స్ వల్ల వాళ్లకి అంత పని ఉంటోంది. మంచిదే కదా. వాళ్లకీ ఉపాధి లభిస్తోంది. మన పర్పజ్ సర్వ్ అవుతోంది. రానున్న మరిన్ని నెలల పాటు మనకి వీళ్ల అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళు చల్లగా ఉండుగాక. ఇలాగే మనందరి అవసరాలనీ తీరుస్తూ ఈ మోడ్రన్ జీనీలు మనల్ని సంతోషపెట్టు గాక.

సర్వేజనాః సుఖినోభవంతు.


Thursday, January 21, 2021

భానుమతి & రామకృష్ణ - ఒక సరదా సినిమా

 
         

పేరు భలే ఉందే అని ఈ సినిమా పేరు చూసి ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాము. హైదరాబాద్ నగరంలో ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరు హీరోయిన్. పేరు భానుమతి. రామకృష్ణ అనే అబ్బాయి ఆమె దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. తెనాలి నుంచి వచ్చిన అతగాడు నెమ్మదస్తుడు, మంచివాడు. రీసెంట్ గా బ్రేకప్ అయిన బాధలో ఉన్న భానుమతికి ఈ అసిస్టెంట్ అబ్బాయి ఎలా దగ్గరయ్యాడు, ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి  వాళ్ల మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఎలా వాళ్ళిద్దరూ ఒకటౌతారు అన్నది చిత్ర కథ.

మామూలు కథే కానీ కథని చాలా పోజిటివ్ గా, స్మూత్ గా, మనసుకి హత్తుకునే మంచి రొమాంటిక్ కామిడీ లా బాగా మలిచాడు దర్శకుడు Srikanth Nagothi. డైరెక్ట్ వెబ్ రిలీజ్ కే ప్లాన్ చేసి రాసుకున్న స్క్రిప్ట్ ఇది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడతను. నవీన్ చంద్ర, సలోనీ లూథ్రా ప్రధానపాత్రలు పోషించారు.


ఈమధ్యన కాస్త పెళ్ళి వయసుకే పెళ్ళిళ్ళు జరుగడం చూస్తున్నాం కానీ గడిచిన దశాబ్దంలో ఉద్యోగాలు, కెరీర్ ప్లాన్స్ అంటూ యువత చాలావరకూ లేట్ మేరేజెస్ బాటలోనే పయనిస్తూ వచ్చారు. గత దశాబ్దంలో పెళ్ళీళ్ళు జరిగిన చాలామంది వధువరులిద్దరి వయసులూ ముఫ్ఫై పైనే ఉండడం చాలాకాలంగా చూస్తున్నాం కాబట్టి చాలామంది యువతీయువకులు ఈ సినిమాకి ఈజీగా కనెక్ట్ అయిపోయే అవకాసం ఉంది. అమ్మాయి పెళ్ళి గురించి, లేట్ మేరేజ్ అవుతున్న అమ్మాయిల గురించి చెప్పే డైలాగ్ భలే నవ్వు తెప్పించింది. సినిమా అయిపోయాకా బావుంది, ఒక మంచి సినిమా చూశాం అనే భావన తప్పకుండా కలుగుతుంది. నాకు ఆ తల్లీ,కొడుకుల రిలేషన్  బాగా నచ్చింది.



చిత్రం టైటిల్ పై కోర్టువారి అభ్యంతరం చెప్పడం వల్ల సినిమా టైటిల్ లో హీరో,హీరోయిన్ల పేర్ల మధ్యలో "&" కలిపారుట.  2020 జూలైలో విడుదల అయిన ఈ చిత్రం "ఆహా యాప్(Aha app)" లో చూడవచ్చు. ఈ దర్శకుడు నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. మరొక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పారు.


movie Trailer - 



Saturday, January 16, 2021

ఒక తమాషా కథ - Maara !

                         
                        

 ఒక బస్సు ప్రయాణంలో ఒక చిన్న పాపకి ఓ నర్స్ ఒక తమాషా కథ చెప్తుంది. కాలాంతరంలో ఆ పాప పెద్దదై ఓ అందమైన అమ్మాయి అవుతుంది. ఉద్యోగ నిమిత్తం ఒక అందమైన ఊరు వెళ్తుంది. ఆ అందమైన ఊరిలో పాడుబడినట్లున్న పురాతన భవనాల, ఇళ్ళ గోడల మీద తాను చిన్నప్పుడు బస్సులో విన్న కథ చిత్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ చిత్రాలు గీసిన చిత్రకారుడిని వెతుక్కుంటూ ఆ అమ్మాయి అలా...అలా...వెళ్ళి వెళ్ళి....చివరికి సినిమా చివరాఖరు సీన్ లో ఆ చిత్రకారుడిని కలుసుకుంటుంది. ఆ కథకీ, ఆ చిత్రకారుడికీ, ఆ అమ్మాయికీ ఏమిటి సంబంధం? చిన్నప్పుడు తను బస్సులో విన్న కథ ఆ చిత్రకారుడికి ఎలా తెలుసు? తెలుసుకోవాలంటే Amazon Primeలో "Maara" సినిమా తెలుగు వర్షన్ చూడాల్సిందే :-) 

ఇది ఒక మళయాళ చిత్రానికి తమిళ రీమేక్ అని గూగులమ్మ చెప్పింది. ఒక తమాషా కథని, అందమైన ఫోటోగ్రఫీని, అందమైన పెయింటింగ్స్ లా ఉన్న కొన్ని ఫ్రేమ్స్ ని, అందమైన శ్రధ్ధా శ్రీనాథ్ ని, కాస్త ఓల్డ్ అయినా ఛార్మ్ తగ్గని - అందమైన నవ్వు తనకు మాత్రమే సొంతమైన మాధవన్ నీ,  చూసి ఆనందించేయండి!! వినసొంపైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు అందం. ఈ సినిమా చూశాకా ఒకే విశేషణాన్ని ఇన్నిసార్లు ఎందుకు వాడానో అర్థమౌతుంది.


చిన్న మాట: ఈ సినిమా ఇప్పటికీ చందమామ కథలను, యేనిమేషన్ మూవీస్ ని ఇష్టపడే పెద్దవారికి మాత్రమే నచ్చుతుంది :)

 



సినిమా ట్రైలర్: