సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, August 5, 2019

స్నేహితులు




పైన పద్యంలో చెప్పినట్లుగా ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో ద్రవించింది మనసు నిన్న. నా ప్రియమైన స్నేహితులందరినీ కలిసిన తరువాత. అచ్చంగా పాతికేళ్ళ తరువాత ఐదేళ్ళపాటు కలిసి చదువుకున్న మా మారిస్ స్టేల్లా కాలేజీ మిత్రురాళ్ళము కొందరం నిన్న బెజవాడలో కలుసుకున్నాం. టీనేజ్ లో విడిపోయిన మేము మళ్ళీ టీనేజీ పిల్లల తల్లులుగా మారాకా జరిగిన ఈ కలయిక మాలో ఎంత అద్భుతమైన ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ నింపిందో అసలు మాటల్లో చెప్పలేను. మరీ దూరాల్లో ఉన్న స్నేహితులను వీడియో కాల్స్ చేసి పలకరించాము. అందరి కళ్ళల్లో సంబరం, ఆశ్చర్యం, ఆత్మీయత! ఒక్కరోజు, ఒకే ఒక్క రోజు అన్నీ మర్చిపోయి, సంసారాన్ని పక్కన పెట్టి, మళ్ళీ మేము చిన్నపిల్లలమైపోయి అప్పట్లో క్లాస్ లో లాగ గలగలా గట్టిగట్టిగా మాట్లాడుకుని, ఏమే, ఒసేయ్ అని పిలుచుకుంటూ మహా ఆనందపడిపోయాం. మేము ప్లాన్ చేసుకోలేదు కానీ అనుకోకుండా నిన్న "ఫ్రెండ్ షిప్ డే " అవ్వడం మరో గొప్ప కోయిన్సిడెన్స్!!

నాది అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా సెక్లూడెడ్ లివింగే. నా కొకూన్ లో, నా కంఫర్ట్ జోన్ లో జీవిస్తూ గడపడం నా స్వభావం. మధ్యలో ఒక్క రెండు మూడేళ్ళు మాత్రం మునుపెన్నడూ ఎరుగని ఆర్థిక ఇబ్బందుల వల్ల, వాటిని మర్చిపోవడానికి ఎక్కువ భాగం ల్యాప్టాప్ ముందర గడిపాను. అదే నేను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు. ఒకేలాంటి ఆసక్తులు ఉన్న మనుషులందరూ ఒక్కలాగ ఆలోచిస్తారనుకునే పిచ్చి భ్రమలో ఉండి జీవితాంతం మర్చిపోలేని అవమానాల్ని భరించాల్సి వచ్చింది!! దైవికంగా ఇప్పుడు నా మిత్రురాళ్ల కలయికతో ఆ బాధ అంతమైంది. అంత స్నేహమూ, అంత ప్రేమాభిమానాలూ ఉంటే ఇన్నాళ్ళూ ఎందుకు కలవలేదు? కనీసం ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంటే ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా పెళ్ళి, సంసార బాధ్యతలు, పిల్లలు, ఉద్యోగాలూ, వయసుతో పాటూ వచ్చిన ఆరోగ్య సమస్యలూ... ఒకటా రెండా? సవాలక్ష కారణాలు. నామటుకు నేను గుర్తుకొచ్చినప్పుడు తలుచుకోవడం తప్ప ఏనాడూ గట్టిగా కలవడానికి గానీ, కనీసం మాట్లాడడానికి గానీ ప్రయత్నించలేదు. ఏమో...అలా గడిచిపోయాయి రోజులు.. అంతే. 


" बेक़रार दिल इस तरह मिले
जिस तरह कभी हम जुदा न थे
तुम भी खो गए, हम भी खो गए
एक राह पर चलके दो क़दम..."
అందరమూ పాతికేళ్ల తర్వాత కలిసినా అదే స్నేహభావం, అదే ఆప్యాయత, అందరి కళ్ళల్లో అదే ప్రేమ. ఇది కదా నిజమైన స్నేహం అంటే. చెప్పుడు మాటలు విని అకారణ ద్వేషభావాల్ని పెంచుకుని మనసుని ముక్కలుచేసే వర్చువల్ స్నేహాల్లాంటివి కావవి. అందరమూ మొత్తం ఐదేళ్ళు 9a.m to 4p.m కలిసిమెలసి గడిపినవాళ్ళం.ఒకరిగురించి ఒకరం పూర్తిగా ఎరిగిన మనుషులము.


ఇంటర్ లో మా స్పెషల్ ఇంగ్లీష్(HSC) గ్రూప్ లో మొత్తం నలభై మందిమి. తర్వాత B.A లో కూడా సేమ్ బ్యాచ్. ఎకనామిక్స్ గ్రూప్, Eng.Litt రెండు గ్రూప్స్ నీ కలిసి ఒకే క్లాస్ లో కూర్చోపెట్టేవారు. క్లాస్ లో మొత్తం ఎనభై, తొంభై మందిమి ఉండేవాళ్ళం. ఆ రెండు సబ్జెక్ట్స్ కీ, లాంగ్వేజెస్ కీ రూమ్స్ మారేవాళ్ళం. లంచ్ టైమ్ లో మా లిట్రేచర్ వాళ్లమందరమూ రౌండ్ గా కూచుని ఒకరి బాక్సెస్ ఒకరం ఎక్స్ఛేంజ్ చేసుకుంటూ లంచ్ చేసేవాళ్ళం. పాటలు పాడే అమ్మాయిగా నేను అందరికీ బాగా తెలిసేదాన్ని. మేడమ్ రాకపోతే లీజర్ పిరియడ్ లో నాతో పాటలు పాడించుకునేవారు. డిగ్రీలో నాకు తోడు మరొక సింగర్ క్లాస్ లో జాయిన్ అయ్యాకా నాకు కాస్త రెస్ట్ వచ్చింది. తను చాలా బాగా పాడేది. బోల్డు హై పిచ్. ముఖ్యంగా మల్లీశ్వరిలో పాటలు ఎంత బాగా పాడేదో. నేనైతే "ఎందుకే నీకింత తొందర.." పాటని మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునేదాన్ని. ఆ పాటల వల్లే నాకు మంచి స్నేహితురాలైంది కూడా తర్వాతర్వాత. ఇప్పుడు కెనడాలో ఉంటోందా రాక్షసి.

విజయవాడకు దగ్గరలో ఉన్న ఊళ్ళవాళ్లందరూ నిన్న వచ్చారు. ఇంతకీ నిన్న కలిసిన వాళ్ళల్లో చాలా మటుకు అందరూ మంచి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీలలో టీచింగ్ ప్రెఫెషన్ లోనే ఉన్నారు. చాలావరకూ పి.హెచ్.డీ కేండిడేట్ లే. ప్రెఫెసర్ గిరీలే! వివరాలు అప్రస్తుతం కానీ ఇలా మంచి పొజిషన్స్ లోకి ఎదిగినవాళ్ళు మా బ్యాచ్లో ఇంకా కొందరున్నారు.

దాదాపు అందరూ వర్కింగే అవడం వల్ల పని ఒత్తిడి, పలు ఆరోగ్య సమస్యలూ కూడా కామన్ గానే కనబడ్డాయి మాలో! కానీ నాకు ముఖ్యంగా సంతోషం కలిగించిన విషయం పిల్లలు. అందరూ కూడా పిల్లలని చక్కని క్రమశిక్షణతో, ఉన్నతమైన చదువులు చదివించారు. చదివిస్తున్నారు. బుధ్ధిమంతులుగా పెంచుతున్నారు. మన మంచితనం, మన బాధ్యతా నిర్వహణలే మన పిల్లలకూ మార్గదర్శకంగా మారతాయి. ఇవే కదా మనం పిల్లలకు ఇచ్చే ఆస్తులు. 

నేను గమనించిన ఇంకో సరదా విషయం మా మానసిక ఎదుగుదల. ఒకప్పుడు టీనేజ్ ఆలోచనలతో ఉన్న మేమే మాకు తెలుసు. ఇప్పుడు అందరమూ దాదాపు సగం జీవితాన్ని చూసిన, గడిపిన అనుభవంతో ఉన్నాము. అందువల్ల అందరి మాటల్లోనూ లోతైన అవగాహన, చక్కని పరిపక్వత ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇదంతా జీవితంలో నేర్చుకున్న పాఠలు అనేకన్నా మా కాలేజీ మాకు ఇచ్చిన శిక్షణ వల్లనే అనుకోవడమే సబబు. అప్పట్లో అధ్యాపకులు కూడా ఎంతో ఆదర్శవంతంగా, విజ్ఞానవంతులుగా ఉండేవారు. అలానే బోధించేవారు. ఇప్పుడు కూడా క్లాస్ చెప్పేప్పుడూ ఫలానా మేడమ్ మాటలు గుర్తుచేసుకుంటూ ఉంటాము అని కూడా ఒకరిద్దరు స్నేహితురాళ్ళు అన్నారు నిన్న. అందరు అధ్యాపకులనూ పేరు పేరునా తల్చుకున్నాం. నాలుగైదు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. 

గిఫ్ట్స్ ఎక్ఛెంజ్ చేసుకుని, నెక్స్ట్ మీట్ లోపూ మరికొందరు మిత్రులని వెతికిపట్టుకోవాలనే నిశ్చయంతో, భారమైన హృదయాలతో, కళ్లల్లో నీళ్ళతో, కౌగిలింతలతో వీడ్కోలు చెప్పుకున్నాం. ఏడాదిలో ఒక్కసారైనా ఇలా కలుస్తూ ఉందామర్రా! అని గట్టిగా చెప్పుకున్నాం. అప్పటికే లేటయిపోవడం వల్ల ఇంక వేరే ఎవరినీ కలవకుండానే ఇంటిదారి పట్టాను. దారిలో కృష్ణా బ్యారేజ్ దాటాకా అదేదో పవిత్ర సంగమంట. కృష్ణా,గోదావరుల కలయికా స్థలం. పార్క్ లా డేవలప్ చేశారు. అది మాత్రం చూశాము. రాత్రి ఇల్లు చేరేసరికీ పన్నెండైంది. ఆదివారం కాబట్టి ఇలా కలవడం సాధ్యమైంది అందరికీ. కానీ మరొక్కసారి టీనేజ్ లోకి వెళ్ళి వచ్చినట్లు ఉన్న magical intoxication లోంచి మాత్రం ఎవ్వరమూ ఇంకా బయటకురాలేదు. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న మా కాలేజీ వాట్సప్ గ్రూప్ లో ఇందాకటిదాకా టింగ్ టింగ్ మని వస్తున్న మెసేజెస్ అందుకు సాక్ష్యం :-)

 స్నేహసుగంధాల మత్తులో, ఈ జ్ఞాపకాలతో మరోసారి మేమందరమూ కలిసే వరకూ బహుసంతోషంతో బతికేయచ్చు అని మాత్రం ధీమాగా అనిపించింది.









Friday, August 2, 2019

ఇప్పపూలు

  


                                                  

ఆహ్లాదానికో, పొద్దుపోవడానికో చదివే కాలక్షేపపు సాహిత్యంలా కాకుండా వివేకాన్నీ, ఆలోచననీ, ఆవేశాన్నీ నిద్ర లేపే ఉపయోగకరమైన సాహిత్యం మరింతగా అందుబాటులోకి రావాలని  తోపించడమే "ఇప్పపూలు" కథాసంకలనం ప్రత్యేకత. "ఇప్పపూలు" కథలు పాఠకులని నాగరిక సమాజం నుండి అమాంతం అడవుల్లోకి తీసుకుపోతాయి. ప్రకృతి శోభ, కొండా కోనా అందాలు, రకరకాల పశుపక్ష్యాదులు, వన్యమృగాలు, అటవీ సంపద, గిరిజనుల పాటా పదం.. అన్నింటినీ చూసి ఆస్వాదించి ఆనందించే లోపూ అక్కడి గిరిజనుల జీవితాలలో అలుముకున్న అలజడుల తాలూకూ విషాదం హృదయాలను దిగాలు పెట్టేస్తాయి..! వీళ్ళ కోసం మనమేం చెయ్యగలము? అన్న ప్రశ్న డ్రిల్లింగ్ మషీన్ లా మెదడుని దొలిచేస్తుంది. గిరిజన తెగలన్నింటికీ ఒకో ప్రత్యేకత, ఒకో దైవం, విశ్వాసాలూ, నమ్మకాలూ ఉన్నాయి. ఎన్ని విశిష్టతలు ఉన్నా వీరందరూ గురైయ్యే దోపిడీ విధానం మాత్రం ఒక్కటే! కాంట్రాక్టర్లు, దొంగ వ్యాపారులు కాలుపెట్టాకా పల్చబడిన అడవి, గిరిజనుల భూమి తగాదాలు, వారి నిరక్షరాస్యత వల్ల జరిగే మోసాలూ.. అవన్నీ గిరిజన యాస, భాష, మాండలీక పదజాలంలో రాస్తేనే చదువరులకి గిరిజనుల ఆవేదన వాడిగా తగలాలనేనేమో పుస్తకంలోని చాలా కథలు ఆయా ప్రాంతాల మాండలీకాలనూ, గిరిజన యాసనూ మనకు పరిచయం చేస్తాయి.

2009 వరకూ గిరిజన సంచార తెగలపై కథాసంకలనం రాలేదు కాబట్టి గిరిజన సంచార తెగల జీవితం, సంస్కృతి, వాటి పరిరక్షణకై సాగే సంఘర్షణల ఇతివృత్తంతో ఒక  కథాసంకలనం తేవాలనే సంకల్పంతో 2009లో ప్రతిభాప్రచురణలు వారు "ఇప్పపూలు" అనే కథా సంకలనాన్ని వెలువరించారు సంపాదకులు ప్రొ.జయధీర తిరుమల రావుజీవన్ గార్లు. 1930 నుండీ వస్తున్న గిరిజన, సంచార తెగల కథాసాహిత్యాన్ని తమ శక్తిమేరకు పరిశీలించి, లభ్యమైనంతలో ఉత్తమ రచనలను ఈ సంకలనంలోకి తెచ్చామని, ఇంతకన్నా సమగ్రమైన సంకలనం తేవాలనే ఆశనీ వ్యక్తపరుస్తూ అందుకు తగ్గ ప్రోత్సాహాన్నీ అభిలషించారు. పుస్తకాన్ని "గిరిజన హక్కులు మానవహక్కులేనని ఎలుగెత్తిన బాలగోపాల్ కు.." అంకితమిచ్చారు. కథల చివరన ప్రచురణా కాలం తేదీ వివరాలు, పుస్తకం చివరన కథారచయితల వివరాలూ, చిరునామాలు అందించారు.

కథాన్వేషణలో 1930 మొదలు 1970 వరకూ జరిగిన కథారచనలు పరిశీలిస్తే గిరిజనజీవితాల ఇతివృత్తంతో వేళ్ల మీద లెఖ్ఖించగలిగిన కథలే లభ్యమయ్యాయట. 1970లో శ్రీకాకుళ, తర్వాత1980 ఉత్తర తెలంగాణా గిరిజన ఉద్యమాల నేపధ్యంలో అనేక కథలు వచ్చినా, ఉద్యమానంతరం అవీ మందగించాయిట. వాటిల్లో కూడా అదీవాసీలపై జరుగుతున్న ఆర్ధిక దోపిడీ గురించి రాసినంతగా గిరిజన సంస్కృతిపై నాగరిక సంస్కృతి చేస్తున్న దాడిని గురించిన కథలు కనబడలేదట. అభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరున జరుగుతున్న అనేక విధ్వంసాల కారణాలుగా పెద్ద ఎత్తున నిర్వాసితులౌతూ, మనుగడే ప్రశ్నార్థకంగా మారిన గిరిజనుల దయనీయ స్థితిగతుల గురించి ఈతరం కథకులు దృష్టిపెట్టకపోవడం శోచనీయమంటారు ప్రచురణ కర్తలు.

ఈ పుస్తకంలోని ముందుమాటలు చాలా ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వందేళ్ళ తెలుగు కథ వాస్తవికత, అవాస్తవికత, హాస్యం, శృంగారం, స్త్రీవాదం, కుటుంబ సమస్యలు, సమాజంలోని ఇతర సమస్యలు మొదలైనవాటి గురించే ఎక్కువ మాట్లాడింది కానీ అడవిలో పుట్టి పెరిగి, ప్రతి చెట్టుపుట్ట, ఆకూపువ్వూ తమ సొత్తైనా కూడా అడుగడుగునా ఆంక్షలకు లోబడుతూ అన్యాయానికి గురౌతున్న గిరిజనుల వ్యధలను, ఆరాట పోరాటాలనూ అక్షరీకరించడంపై కథారచయితలు దృష్టి సారించలేదన్న ఆవేదనని సంపాదకులు తమ ముందుమాటలో వ్యక్తపరిచారు. శ్రీకాకుళం, నల్లమల, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల్లో ఉన్న కోయ, గోండు, పరిధాను, బంజార, సవర, మేరియా, చెంచు, కోదు వంటి ౩౩ గిరిజన తెగల గురించిన 29 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సంచార,అరసంచార తెగలైన గంగిరెద్దులు, నక్కల వారి గురించి రెండు కథలున్నాయి. "మీటూ భూక్య"అనే మౌఖిక కథ కూడా ఉంది. ఏడాదిలో ఆరునెలలైనా ఊరూరా తిరిగి జీవనాలు సాగించే మందహెచ్చులు, డక్కలి, పెద్దమ్మలవారు, కిన్నెర వాద్యకారులు, శారదలు మొదలైన సంచార,అర సంచార సమూహాల గురించి ప్రత్యేకంగా మరో సంకలనాన్ని తేవాలనే అభిలాషను ప్రచురణకర్తలు వ్యక్తం చేసారు.

సంకలనంలోని మొదటిదైన "చెంచి" (భారతి,1932) కథలో అమాయక జంటైన చెంచి,చెంచుగాడు ఒకరికోసం ఒకరు పడే తాపత్రయం, కథాంతం మనసును తడిచేస్తాయి. "పులుసు" కథలో బోడేమ్మ ముసలిపై పోలీసు బూటూ కాలు పడినప్పుడు మనలో మరిగే ఆవేశం "ఇప్లవం వొర్దిల్లాలి" అని ఆమె అరిచినప్పుడు చల్లబడుతుంది. ఎ.అప్పల్నాయుడు గారి "అరణ్యపర్వంలో మాకీ యాపీసులొద్దు, ఆపీసర్లొద్దు,అప్పూ సప్పులొద్దు. ఆకటి సబ్సిడీలొద్దు, వొద్దు బాబో వొద్దు. మీ కాయితం కలాల వాయికొంటపాళీలాటలొద్దే వొద్దు! మమ్మల్ని పావులు మింగేత్తాయి.అవును బావ్. మమ్మల్నొగ్గీయండి. యిది నా ఒక్కడి గోశ కాదు. మా అడవి బతుకోలందరి గోస..! " అని ప్రార్ధించే కొయ్యంగాడి మాటలు గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలతో పాటూ నాగరీకుల వికృతరూపాన్నీ కళ్లముందుంచుతాయి. ఈ కథ తరువాయి కథలన్నీ గిరిజనలపై కాక, వారి ఆస్తులపై, వన సంపదలపై జరుగుతున్న రకరకాల అన్యాయాలను, దోపిడీ విధానాలను గురించి చెప్తాయి. అభివృధ్ధి, వన్యపరిరక్షణ ముసుగులో జరుగుతున్న వివిధ అక్రమాల గురించి చదవడం ఆవేశాన్నే కాక, తెలివైన మనిషులు తెలివిలేని మనిషులను ఇన్ని రకాలుగా మోసం చెయ్యగలరా అన్న ఆశ్చర్యం కూడా కలగుతుంది. "జంగుబాయి" కథలో గోండుల ఆచారాలూ, మూఢవిశ్వాసాలనూ ఒకపక్క, కొత్తగా అడవికి వచ్చిన స్కూల్ మాష్టారి భార్యకు ఎదురైన అనుభవాలూ, భయాలూ, కొన్ని విషయాలలో కలగజేసుకోవాలనున్నా చెయ్యలేకపోయిన ఆమె నిస్సహాయతను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి.

వాడ్రేవు వీరలక్ష్మి గారి "కొండఫలం"లో గిరిజనుల భూమి తగాదాలను పరిచయం చేస్తే, "గోరపిట్ట", "ఆర్తి", "కలలోని వ్యక్తి","గోస","పయనం" మొదలైన కథలు గిరిజన తెగల నిస్సహాయతను, తద్వారా ఉద్యమం దిశగా సాగిన కొందరి పయనాలనూ తెల్పుతూ తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. కొండవీటి సత్యవతి గారి "గూడు" లో తండావాసులందరికీ ఇళ్ళూ కట్టించాలని ఆఫీసర్ చందన పడే తాపత్రయం స్ఫూర్తిదాయకంగా ఉండి, ఆఫీసర్లందరూ ఇలా పాటుపడితే గిరిజనుల బ్రతుకులు ఎంత మెరుగౌతాయో కదా అనిపిస్తుంది. "అరణ్య రోదన", ""పోటెత్తిన జనసంద్రం" రెండు కథలూ పోలవరం ప్రాజక్ట్ గురించిన ఎన్నో విషయాలను ఎరుకపరుస్తాయి. ఇవన్నీ ఒకరకమైతే చివరలో రచనైన "మూగబోయిన శబ్దం" కథ ద్వారా రచయిత్రి పద్దం అనసూయ చెప్పినట్లు ’మతమే లేని కోయ జాతిలోకి మతం వేరుపురుగులా ప్రవేశించిందన్న ’ సత్యం కలవరపరుస్తుంది. ఈ కథల్లోని మాన్కు, శిడాంశితృ, డోబి, యిస్రూ, వడ్డియా, గైతా మొదలైన చిత్రమైన పేర్లు, ఆ పేర్ల తాలూకూ మనుషులూ వాళ్ళ అమాయకత్వాలతో సహా గుర్తుండిపోతారు. డోలోళ్ళ పూర్భం గానం , గుస్సాడి నృత్యం, ధింసా నృత్యం.. మన:ఫలకంపై ఆ నృత్యాల తాలూకూ చిత్రాలను చూపెడతాయి. "ఆకాశం పండిన పత్తిచేను గాలికి కదులుతున్నట్లుగా ఉంది..", "పొట్టలు విచ్చుకుని తెల్లగా నవ్వుతూ భూమి మీద రాలిన నక్షత్రాల్లా పత్తిచేలు..", "అడవిలో కాస్తున్న ఎండ కూడా వెన్నెలలా చల్లగా ఉంది..", "గూడేనికి పచ్చల హారం తొడిగినట్లుగా అన్నివైపులా చేలూ,చెలమలూ.." మొదలైన అలంకార వాక్యాలు అడవి అందాలను కళ్ళ ముందు నిలబెడతాయి.

ఇటువంటి గుర్తుండిపోయే కథల ఎంపికే కాకుండా తెలుగు కథాసాహిత్యంలో తొలి గిరిజన కథకుడుగా భావించే చింతా దీక్షితులు కన్నా ముందే గూడూరు రాజేంద్రరావు "చెంచి" అనే కథను రాసారన్న సమాచారం సంపాదించడం సులభసాధ్యమైన విషయం కాదు. ఇలానే పుస్తకం పేరుని గురించి వివరిస్తూ గిరిజ తెగలలో, వారి సమాజంలో, కర్మకాండలో, పూజలో, విశ్వాసాలలో, నమ్మకాలలో ఇప్పపూలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నందువల్ల; ఇంతకు మునుపే బోయి జంగయ్య గారు "ఇప్పపూలు" పేరుతో తమ కథా సంపుటిని వెలువరించినా, ఈ సంకలనానికి వారి అనుమతితో, "గిరిజన సంచార తెగల కథలు" అనే ఉప శీర్షికతో ఇప్పపూలు పేరునే నిర్ణయించామని తెలియపరచడం మొదలైనవాటి వల్ల ఈ పుస్తకం తయారీ వెనుక ఉన్న సంపాదకుల శ్రధ్ధ, గిరిజనుల సంక్షేమం పట్ల వారి తపన వెల్లడౌతాయి.