నిశ్శబ్దాన్ని ప్రేమిస్తూ, ప్రపంచాన్ని పట్టించుకోకుండా ప్రశాంత ఏకాంత జీవితం గడిపే ప్రయత్నంలో ఉన్న నన్ను అక్షరాల వెంట పరుగులు పెట్టించడానికి వినపడిందో పాట ఇవాళ..! ఇక మౌనాన్ని వీడక తప్పలేదు. హృదయ తంతృలను కదిపే పాట విన్నప్పుడు, ఆ అనుభూతిని పంచుకోకుంటే మన ఆనందం కూడా సంపూర్ణమవ్వదు కదా..!
సాయంత్రపు నడకలో రోజూలాగే రేడియో(102.8) వింటూ నడుస్తుంటే "స్వానంద్ కిర్కిరే" ఇంటర్వ్యూ చివరి భాగం మొదలైంది. ఆమధ్యెప్పుడో మొదటి భాగం విన్నాను. తరవాత అదే రోజు విన్నానో మర్చిపోయాను. రెండో భాగం మిస్సయ్యాను. మళ్ళీ ఇన్నాళ్ళకి అదృష్టవశాత్తూ మూడవ, చివరి భాగం వినడం అయ్యిందీవాళ. కార్యక్రమం మధ్యలో ఓ పాట వేసారు. అదే నా మనసుని కదిపింది..
గీత రచయిత, సంభాషణా రచయిత, గాయకుడు, నటుడు అయిన ఈ బహుముఖ ప్రఙ్ఞాశాలి మాటలు కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయి. "లుటేరా" చిత్రం కోసం ఈయన పాడిన "మోంటా రే" పాట గురించి ఇదివరకూ ’చలువ పందిరి’ లో రాసాను. ముంబై ఆకాశవాణి వారి మొదటి ఇంటర్వ్యూ లో తన సాహితీ ప్రస్థానం వివరాలు , ఇష్టమైన పాటలు గురించి చెప్పారు. ఇవాళేమో కొన్ని పాటలు ఎలా రాసారు, వాటి వెనుక కథలేమిటో చెప్పారు. నిజానికి ఈ సున్నితమైన భావాల్ని, ప్రేమల్ని, స్నేహాభిమానాలనీ, ఆప్యాయతలూ గట్రాలన్నింటిపై నమ్మకమే పోయింది. (ఊ.. అచ్చంగా నేనే ఈ మాట అంటున్నది!!) కానీ ఎందుకో ఇవాళ ఈ గీత రచయిత మాటలు వింటుంటే ఇంకా ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి భావాలు మిగిలున్నాయేమో అన్న అనుమానం, ఆశ కలిగాయి. ఎందుకంటే ఒక పాట రాయాలంటే ఇలాంటి సున్నితమైన భావాలను నమ్మాలి.. ఆ భావంలో మమేకమవ్వాలి.. అప్పుడే లలితమైన పాట పుడుతుంది. ఈయన ఇలాంటి పాటలు ఇంకా రాయగలుగుతున్నారంటే మరి సున్నితత్వం ఇంకా బ్రతికే ఉందని నమ్మాలేమో..
ఇంతకీ ఈ పాట నాకు మాత్రమే కొత్తదని, ప్రపంచానికి పాతదేనని ఇంటికొచ్చి నెట్లో వెతికాక తెలిసింది. సినిమా పాట కాదు "సత్యమేవ జయతే" పేరిట టివీలో ప్రసారమైన కార్యక్రమం తాలూకూ పాట అదని. స్వయంగా రచయితే పాడారు. సో.. పాట పాతదే. మూడేళ్ళుగా కేబుల్ కనక్షన్ కి దూరంగా ఉన్నందువల్ల నాకు తెలీదు. తెలిసిన వాళ్ళూ మరోసారి, లేదా ఒకవేళ నాలా ఎవరన్నా తెలియనివాళ్ళు ఉంటే మొదటిసారి, ఈ హృద్యమైన పాటను ఆస్వాదించండి..
పాటలో "हम नॆ सॊचा नही
तू जॊ उड जायॆगी
यॆ जमी तॆरॆ बिन
सूनी रेह जायॆगी
किसकॆ दुम पॆ सजॆगी मॆरा अंगना.." అన్న వాక్యాలు వింటుంటే మన పాలగుమ్మి వారు రాసిన "అమ్మ దొంగా" పాటలో
"ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా.. గూడు నిదురపోవునా.." లైన్స్ గుర్తుకు వచ్చాయి..
5 comments:
As usual very good description!
Thanks indira gaaru.
ఇంత మంచి పాట గురించి మాతో పంచుకొన్నందుకు మీకు ధన్యవాదాలు...మరియు పోస్ట్ కు అభినందనలు.
ఈ పాటను సత్యమేవ జయతే టెలికాస్ట్ అయ్యే రోజుల్లో చూశా. బావుంటుంది. అలాగే ఈ పాట కూడా... గృహహింస మీద బాగుంటుంది.
https://www.youtube.com/watch?v=_0VbCiAqycA
@navjeevan: thanks for the visit navjeevan gaaru.
@Nagraj: Song and the singer's voice both are very nice. Thanks for the link.
Post a Comment