సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, January 14, 2015

ఆ పరిమళాలు..




ఊళ్ళో ఏ బజారుకో, గుడికో, పేరంటాలకో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంటే గుప్పుమని వచ్చేది నైట్ క్వీన్ పువ్వుల పరిమళం.. గభాలున గుండెల నిండా గాలి పీల్చుకుని ఆ మత్తులో తేలాలనే ఆత్రుత తప్ప మరేమీ తోచేది కాదు కొద్ది క్షణాల పాటు. అలా ఆ సుగంధాలనాఘ్రాణిస్తూ అక్కడే గేట్ దగ్గర కాసేపు నిల్చుండిపోయేదాన్ని.. ఒక్కసారి..రెండుసార్లూ కాదు.. మా కాకినాడ ఇంటికెళ్ళినప్పుడల్లా.. ఊరెళ్ళిన ప్రతిమాటూ.. రాత్రిపూట బయటకు వెళ్ళిన ప్రతిసారీ! 

చిన్నప్పుడొకసారి మామ్మయ్యనడిగా "గేట్ దగ్గర కొత్తగా వస్తున్న మంచి వాసన ఎక్కడిదని".. అప్పుడు మా మామ్మయ్య(నానమ్మ) గేట్ దగ్గర గోడ పక్కగా ఉన్న మొక్కల మధ్యనున్న నైట్ క్వీన్ మొక్క, దానికున్న పూలు చూపించి.. "వాటిదే ఆ వాసన" అని చెప్పింది. నక్షత్రాల్లాంటి బుల్లి బుల్లి పూల గుత్తులు చెట్టంతా పూసి ఉన్నాయి. "నైట్ క్వీన్...!" పేరెంత హుందాగా ఉందో అనుకున్నా అప్పుడు. అంతకు ముందు మా గేట్ తీస్తూంటే గేట్ పైన ఉన్న ఇనుప పందిరి మీదకి పాకించిన గిన్నెమాలతి తీగ తాలూకూ పూల సువాసన చాలా లైట్ గా వస్తూండేది. నైట్ క్వీన్ వచ్చాకా ఆ సువాసనను ఈ పూలు డామినేట్ చేసేసాయి. ఆ చిన్నప్పటి నుండీ కోరిక నాకు నైట్ క్వీన్ మొక్క పెంచాలని! అప్పుడు తెలీదు నర్సరీల్లో ఏ మొక్క కావాలన్నా దొరుకుతుందని.


ఈమధ్యనే ఓ నర్సరీలో కనిపిస్తే కుండీలో అయినా పెంచేద్దామని కొని బాల్కనీలో కుండీలో వేసాను. రెండుమూడు నెలల్లో బాగా ఎదిగి మొగ్గ తొడిగింది. రోజూ ఆ మొగ్గలు పెద్దవెపుడౌతాయా..పూలెప్పుడు పూస్తాయా అని చూడ్డమే. వారం క్రితం చిన్న గుత్తి పూసింది. పొద్దున్న కూడా మొగ్గలు చూసి ఫోటో తీశాను..ఎప్పుడు పూస్తాయో అనుకున్నా. ఇందాకా బయట నుండి రాగానే గబగబా బాల్కనీ తెరిచాను.. ఒక్కసారిగా మత్తు ఆవరించేసింది... ఆశ్చర్యంగా ఐదారు గుత్తులు పూసాయి. గుప్పుగుప్పుమనే ఆ పరిమళాలను గుండెల నిండా పిల్చుకోవాలనే ఆత్రం కమ్మేసింది. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ ఇంటి గుమ్మంలో ఎలాగైతే గేట్ తీస్తూ తీస్తూ నిలబడిపోయేదాన్నో అలాగ బాల్కనీ తలుపు దగ్గర నిలబడిపోయాను మైమరచిపోతూ.. ఎన్నాళ్లకెన్నాళ్ళకి.. మామ్మయ్య పెంచిన నైట్ క్వీన్ పూల వాసన నా బాల్కనీలో!! ఒక్కసారిగా చిన్నప్పటి రోజుల్లోకి.. మామ్మయ్య ఙ్ఞాపకాల్లోకీ వెళ్పోయి... 'కల నిజమాయెగా..కోరిక తీరెగా..' అని పాడేసుకున్నా. ఇంకా ఎంకి పాటలు ఫోల్డర్ తెరిచి.. 'పూల బాసలు తెలుసు ఎంకికీ..' పెట్టుకుని మైమరచిపోతూంటే నన్నో వింతగా చూస్తూండిపోయారు అయ్యగారు!

పూలకి ఫోటో వాట్సప్ లో అమ్మానాన్నలకి "పూలే చూడండి.. వాసన తేలేను..." అని చూడమని పెట్టాను. ఇంకా ఆనందం ఆగక ఫోన్ చేసి "నాన్నా ఇదిగో మామ్మయ్య పెంచిన నైట్ క్వీన్ పూలు నా బాల్కనీలో మళ్ళీ పూసాయి" అంటే నాన్నేమో.. "మా మామ్మయ్య కూడా మా చిన్నప్పుడు నైట్ క్వీన్ చెట్టు పెంచింది తెల్సా... ఇవి మా మామ్మయ్య పెంచిన పూలు.." అన్నారు :)

పొద్దుటి మొగ్గలు

రాత్రికి పూలై..

7 comments:

sarma said...

కొత్త చిగురు తొడిగితే అందం, కొత్త మొగ్గ విడిస్తే ఆనందం.

Dantuluri Kishore Varma said...

మీ ఆనందం నైట్ క్వీన్ పరిమళం లాగే మీ బ్లాగ్ అంతా పరచుకొన్నట్టుంది. అభినందనలు.

Manasa Chamarthi said...

నాకు చూస్తేనే ఇంత సంతోషంగా ఉంది, ఇష్టంగా పెంచుకుంటోన్న మీకెలా ఉంటుందో ఊహించగలను. మీ మొక్కలు ...ఇంటి ముందో బాల్కనీలో చిన్న తోటలా పెరిగి, మీకింకా ఇంకా ఇంకా సంతోషాన్నివ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి శుభాకంక్షలు.
మంచి వంటలూ, ముగ్గులూ కూడా కావాలి మాకు.

శ్యామలీయం said...

నైట్ క్వీన్ పరిమళం చాలా బాగుంటుందండీ.
ఎంతవరకూ నిజమో తెలియదు కాని కొందరేమో పాములొచ్చేస్తాయీ అని భయపడతారు వీటిని పెంచేందుకు.

ఐనా నైట్ క్వీన్ అన్న ఇంగ్లీషు పేరెందుకండీ?
హాయిగా రేరాణి అని తెలుగుపేరు పెట్టేద్దాం. ఏమంటారు?

తృష్ణ said...

@sarma: శర్మ గారూ, ధన్యవాదాలు.
@Dantuluri Kishore Varma: :-) ధన్యవాదాలు.
@మాన్సా, ఊ.. ఊ.. సమయం కుదుర్చుకుని రాయాలనే కోరిక.. ధన్యవాదాలు.
@శ్యామలీయం: అవునండీ అలానే నేనూ విన్నానండి. కానీ మేడ మీదకి కాబట్టి రావనే కాస్త ధైర్యం. చిన్నప్పటి నుండీ నైట్ క్వీన్ అనే పిలుపే అలవాటైపోయిందండి..:)
ధన్యవాదాలు.

Unknown said...

baavundandi mee suvaasanala sambaram:)
maa intlo aa vaasanaki paamulu vastunnaayani teeyinchesaam :)
radhika (nani)

తృష్ణ said...

@radhika(nani):వారమైనా అవే పూలు పొద్దున్న ముడుచుకుని మళ్ళీ రోజూ రాత్రికి విచ్చి భలే సువాసన వస్తొందండీ. చలైనా ఆ పరిమళాల కోసం బాల్కనీ తీసి ఉంచుతున్నాను వంటింట్లో ఉన్నంత సేపూ. కానీ మీరు కూడా 'పామ్స్' అంటే.. పైకి వచ్చేస్తాయేమో అని నాకిప్పుడు భయం వేస్తోంది :((