సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, April 26, 2014

'Queen' సినిమా... కొన్ని ఆలోచనలు..



'బావుంది చూడమని' కొందరు మిత్రులు చెప్పాకా మొత్తానికి ఇవాళ ఈ సినిమా చూసాను. మొదటిసారి నేను కంగనా ని "గ్యాంగ్ స్టర్" సినిమాలో చూసాను. ఆ సినిమా బాగా నచ్చింది అనేకన్నా నన్ను బాగా కదిలించేసింది అనాలి. ఆ తర్వాత చాలా రోజులు పట్టింది ఆ కథ తాలూకూ బాధలోంచి బయట పడడానికి. ఆ తర్వాత మళ్ళీ మరో కంగనా సినిమా.. అది మధుర్ భండార్కర్ "ఫ్యాషన్"! అది కూడా చాలా నచ్చింది నాకు. ఈ రెండు సినిమాలూ చాలు కంగనా ఎంత ఫైన్ ఏక్ట్రస్సో తెలియడానికి. గాసిప్స్ & రూమర్స్ సంగతి ఎలా ఉన్నా, ఒక మంచి నటిగా గుర్తుంచుకోదగ్గ ఆర్టిస్ట్ కంగనా. ఇప్పుడు "క్వీన్" సినిమా దగ్గరికి వచ్చేస్తే ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ! మొత్తం కథంతా హీరోయిన్ భుజాలపైనే నడుస్తుంది. రాణీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది కంగనా.


కథలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. సన్నివేశాలు కాస్త స్లో గా ఉన్నా కథాబలం వల్ల చిత్రం నడిచిపోతుంది. ఈ కథ ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్న పాయింట్ చాలా నచ్చింది. అది ఏమిటంటే మనుషుల కన్నా జీవితం చాలా గొప్పది. ఎన్ని ఆటంకాలు వచ్చినా జీవితం ఆగిపోదు.. life goes on..! కొద్దిగా మనకొచ్చిన సమస్య లోంచి తల బయటకు పెట్టి జీవితాన్ని పరికించి, పరిశీలిస్తే చాలు! తిరిగి జీవించడానికి మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. మన జీవితంలోకి ఎందరో మనుషులు వస్తూంటారు.. వెళ్తూంటారు. కొందరు వెళ్పోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వము కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడతాము. చాలాకాలం నిలదొక్కుకోలేము కూడా. కానీ "when God closes one door, he'll open another" అన్నట్లు మరో దారి.. ముందరి కన్నా మంచి దారి భగవంతుడే మనకు చూపెడతాడు. ఈ సినిమా చివర్లో తనను కాదన్న పెళ్ళికొడుకు దగ్గరకొచ్చి ఉంగరం ఇచ్చేసి, మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి వెళ్తుంది రాణి. ఆ సీన్ నాకు చాలా చాలా నచ్చింది. ఒకోసారి కొందరు మన జోవితంలోంచి వెళ్పోవడమే మంచిది. అప్పుడు కానీ మనం వాళ్లకి ఎంత అనవసరపు ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనకు అర్థమవ్వదు.


చిత్రంలో పెళ్ళి తప్పిపోవడం ప్రధాన అంశం కానీ ఈ కథ నాకు చాలా మందిని గుర్తుచేసింది. ఆడ, మగ అని కాదు. ప్రేమ, పెళ్ళీ అని కాదు. అసలు ఏదో ఒక పరిచయం, అనుబంధం పేరుతో జోవితాల్లోకి ప్రవేశించి అర్థాంతరంగా మాయమైపోతుంటారు కొందరు. అలాంటివాళ్ళు గుర్తుకు వచ్చారు. కేవలం నా జీవితం అనే కాదు నా మిత్రులు, పరిచయస్థులు కొందరి జీవితాల్లో కూడా ఇలాంటివాళ్ళను చూశాను నేను. జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఇలానే ఉంటుందేమో అనుకుంటూంటాను నేను. మనం పట్టించుకోనంతవరకూ మనకెంతో విలువ ఇస్తారు. వెనక వెనకే ఉంటారు. కానీ ఒక్కసారి మనం పట్టించుకుని ప్రాముఖ్యతనిచ్చి నెత్తిన పెట్టుకున్నామా...అంతే! మనల్ని లోకువ కట్టేసి ఇగ్నోర్  చేసేయడం మొదలుపెడతారు. అంతకు ముందర చూపెట్టిన శ్రధ్ధ, ఆసక్తి ఏమౌతాయో తెలీదు. బహుశా వాళ్ల అవసరం తీరేదాకానో, మన వల్ల పొందాల్సిన సహాయమేదో అయ్యేదాకానో అలా బిహేవ్ చేస్తారేమో అనుకుంటాను నేను. లేదా వాళ్ళు కావాలనుకున్నది మన దగ్గర లభించదు, మన వల్ల వాళ్ల పనులు అవ్వవు అని అర్థమయ్యాకా ఇంక వదిలేస్తారు. కానీ అంతకు ముందు వాళ్ళు చూపెట్టిన శ్రధ్ధనీ, అభిమానాన్నీ చూసి మనం వాళ్ళకు అలవాటు పడిపోతాం. అవతలి వాళ్ళ నిర్లక్ష్యాన్ని భరించి, అధిగమించి, మళ్ళీ ఆ అలవాటు నుండి బయటపడడానికీ మన జీవితం మనం జీవించడానికీ ఎంతో సమయం పడుతుంది. దీనికంతటికీ ఎవర్నో ఏమీ అనలేము. మనమే దానికి బాధ్యులం. ఒక వ్యక్తికో, అభిమానానికో, అలవాటుకో బానిస అయిపోవడం మన బలహీనత. కానీ అందులోంచి బయటపడ్డాకా కానీ తెలీదు మనం కొందరికి ఎంత అనవసరపు ప్రాముఖ్యత ఇచ్చామో. అలాంటి ఒక బలహీనత లోంచే బయటపడుతుంది "క్వీన్" చిత్రనాయిక "రాణీ". సినిమాలో ఏ రకమైన సన్నివేశాలు చూపెట్టినా నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి తన బాధలోంచి బయటపడటం. 


ఈ చిత్రంలో ఓ పెళ్ళికొడుకు ఓ అమ్మాయి వెంట పడి, పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలి, తీరా ఆమె ఒప్పుకుని అతడ్నే నమ్ముకుని, అతడికి అలవాటు పడిపోయి, పెళ్ళికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యాకా హటాత్తుగా పెళ్ళి వద్దని వెళ్పోతాడు. కన్నీళ్ళతో ప్రాధేయపడినా వినడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి ప్రపంచమంతా తలక్రిందులైపోతుంది. కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని చూశాకా ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది. తన దు:ఖం జీవితాన్ని తలక్రిందులు చేసేది కానే కాదని. మనుషుల చుట్టూ, అనుబంధాల చూట్టూ జీవితాన్ని ముడిపెట్టేసుకోవడం కన్నా జీవితాన్ని జీవించడంలో ఎంతో ఆనందం ఉందని తెలుసుకుంటుంది. ఆ అబ్బాయి వద్దన్నాడు కాబట్టే తను ఆ సంగతిని కనుక్కోగలిగింది. అందుకే చివర్లో థాంక్స్ చెప్తుంది. ఇదే సత్యాన్ని మనం చాలా సందర్భాలకు అన్వయించుకోవచ్చు. ఒక చెడు సంఘటన, చేదు అనుభవం మొత్తం జీవితాన్ని చీకటి చేసేయదు. ఆ క్షణంలోనే ఉండిపోతే తప్ప!! ఆ క్షణాన్ని దాటి ముందుకు వెళ్తే తెలుస్తుంది జీవితం ఎంత గొప్పదో.. మనకు ఎన్ని ఆనందాలను ఇవ్వగలదో! నేనూ ఇలాంటి ఎన్నో క్షణాలను దాటి ముందుకు నడిచాను కాబట్టే నాకు ఈ చిత్రం నచ్చింది. 


ఇవాళ్టిరోజున నేను మనుషులనూ, అనుబంధాలనూ, సిధ్ధాంతాలనూ.. ఏమీ నమ్మను. జీవితాన్ని మాత్రం నమ్ముతాను. జీవితం అందించే పాఠాలను నేర్చుకుంటాను.. మనుషుల కన్నా జీవితమే ఎక్కువ ఆనందాలను ఇవ్వగలదని నమ్ముతాను.. ఎందుకంటే నేను దాటిన చీకటి క్షణాల నుండి నేను జీవితాన్ని ప్రతిక్షణం జీవించడం నేర్చుకున్నాను కాబట్టి..!

16 comments:

పుచ్చా said...

Good write up on how to face , accept and understand LIFE. The review goads me to view the movie ma'm. Thanks!

Sujata M said...

Yes. Ade bavundi. Ending lo kaboye atta garu future girinchi cheptunte how foolish it is anpinchindi. Asalu ending chala bavundi.

శ్రీలలిత said...


క్వీన్ సినిమా బాగుందని చాలామంది చెప్పారు కానీ మీరు యెందుకు బాగుందో చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. మీరన్నది అక్షరాలా నిజం. జీవితాన్ని మించింది యేదీ లేదు. ముందు మనం జీవించడం నేర్చుకోవాలి.

Anonymous said...

ఈ సినిమా ధీం నచ్చింది. అందులో కొన్ని సన్నివేశాలు నచ్చాయి. మొత్తంగా వ్యక్తీకరించాలనుకున్న 'ఫల్‌సఫా' నచ్చింది. ఈ సినిమా చూసిన రాత్రి, పీటలమీద పెళ్ళాగిపోతే పెళ్ళికూతురు ఆత్మహత్యచేసుకుని, అన్నగారైఅన హీరో పగకి మరోకారణాన్ని జతాయించే సినిమాలు తప్ప తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమాలు రావు అని ఆలోచించి.. చించీ విరక్తి కలిగి పడుకున్నాను.

అలాగని సినిమా కధనం నచ్చలేదు(It's too mellow for me), కంగనా రనౌత్ నటన నాకు ఎంతమాత్రమూ నచ్చలేదు (దీనికి apt character నా దృష్టిలో పరిణీతి చోప్రా) కాబట్టి ప్రధానంగా మీ మొదటి పేరాతో విభేదిస్తున్నాను :-) (గ్యాంగ్‌స్టర్ సినిమాని ఒక కుందేలిని, ఎలుగుబంటిని హీరో-హీరోయిన్లుగా పెట్టి తీసినా హిట్టయితీరవలసిన సినిమా అని నాకున్న మరో అభిప్రాయం :-D )

ఆకుంచెం మినహాయిస్తే మిగతాదంత నా అభిప్రాయమూ cum అనుభవమూనూ.

Indira said...

Eppatilaane mee daina padhatilo chaalaa baagaa raasaaru.Actually I wanted to ask u about this movie.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగా రాశారు తృష్ణగారు... నాకు కూడా బాగా నచ్చింది ఈ సినిమా.

జ్యోతి said...

ఈ సినిమా గురించి నా అభిప్రాయం ఆల్మోస్ట్ Iconoclast అభిప్రాయంలాంటిదే. కంగనా యాక్షన్ అస్సలేం నచ్చలేదు నాకు. అందరి మాటల్లో చాలా బాగుందని విని, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానేమో తెలీలేదు. సినిమా కూడా, అంతా అయిపోయిన తర్వాత, గుర్తుండిపోయే ఒక్క విషయం కూడా లేదనిపించింది.
I was totally disappointed after watching this movie :(

తృష్ణ said...

@నందిని: టపాలో రాసినట్లు సినిమా స్లోగా కాస్త బోర్ కొడుతుంది మధ్య మధ్య కానీ థీమ్ బాగుందండి. థాంక్స్ పర్ ద కామెంట్.

@sujata: కదా.. నాక్కూడా అలానే అనిపించింది. 'హౌ బోరింగ్..' అని ఆ అత్తగారి మాటలకి!
thank you.

తృష్ణ said...

@శ్రీలలిత: టపా నచ్చినందుకు ధన్యవాదాలు శ్రీలలిత గారూ.

@Iconoclast: టపాలో రాసినట్లు నాక్కూడా థీమ్, ఎండింగ్ బాగా నచ్చాయండి. కథనం స్లో గా, కాస్త బోరింగ్ గానే ఉంది.
’కంగన' గురించి మీతో ఏకీభవించలేను.For me she is a fine actress.. పసంద్ అప్నీ అప్నీ :-)
Thanks for the comment.

తృష్ణ said...

@ఇందిర: నచ్చినందుకు థాంక్యూ! అసలు ఇది రివ్యూ లా రాయదలుచుకోలేదండి. ఈ సినిమా చూశాకా కలిగిన ఆలోచనలు మాత్రమే రాయాలనుకున్నాను..

@వేణూ శ్రీకాంత్: మొత్తం నచ్చిందని అనలేనండి.. theme & climax బాగా నచ్చాయి నాకు. థాంక్సండీ..

తృష్ణ said...

@జ్యోతి: విజయ గారూ, మీ వ్యాఖ్య నాకు సర్ప్రైజింగ్ ! పాటల విషయంలో ఎంత ఫెమిలియర్ గా ఉన్న అభిప్రాయాలు ఇక్కడ కలవకపోవడం ఆశ్చర్యం. అయినా నాకు టేకింగ్, సన్నివేశాలూ పెద్దగా నచ్చలేదు కానీ బేసిక్ థీమ్ నచ్చిందండీ! ఐ హేవ్ సీన్ సమ్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్(only girlfriends :)) వాకింగ్ ఔట్ ఆఫ్ మై లైఫ్.. హూ హేవ్ బికమ్ ఏన్ ఆదత్ ఫర్ మీ.. అండ్ ఫెల్ట్ బ్రోకెన్!!అండ్ ఐ హేవ్ సీన్ మెనీ అదర్స్ టూ..! సో ఐ ఫెల్ట్ కనెక్టెడ్...
Thank you :)

శిశిర said...

ఎన్ని విలువైన మాటలు రాశారండీ. మీ టపాలలో ఈ టపా ఒక ఆణిముత్యం. థాంక్స్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ వర్డ్స్.

తృష్ణ said...

@శిశిర: అనుభవం నేర్పిన పాఠాలు..అంతే! నచ్చినందుకు థన్యవాదాలు.

sphurita mylavarapu said...

Trishna garu!The best write up I have red in recent times.

ఎంత బాగా రాసారంటే చదువుతుంటేనే నాకు చాలా మంది గుర్తొచ్చారు. మీరు చెప్పిన ప్రతీ పాయింట్ తోనూ కనెక్ట్ అయ్యాను.

ఈ సినిమా చూస్తానో లేదో, చూసినా ఇంత బాగా అర్ధమవుతుందో లేదో (బుర్ర పెట్టి సినిమాలు చూడ్డం మానేసా ఈ మధ్య) తెలీదు గానీ మీరు ఇంత మంచి టపా రాయడానికి కారణమైనందుకైనా ఆ సినిమాకి అభినందనలు.

Manasa Chamarthi said...

kyaa baat.. kyaa baat! high-five for that last paragraph. మనిద్దరం ఒకే రకంగా చూశామీ సినిమాని :)) థాంక్యూ!

తృష్ణ said...

@manasa: nice.. glad to know that :-) Thank you dear.