సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, February 28, 2014

ఒక నిన్న...



27-2-14,
గురువారం
శివరాత్రి!

పొదున్నే హడావుడిగా తెమిలి ముగ్గురం హాస్పటల్ కు చేరుకున్నాం. అప్పుడే నాన్నను లోపలికి తీసుకువెళ్ళారని అన్నయ్య చెప్పాడు. ఓ ముప్పావుగంట అయ్యాకా అన్నయ్యని పిలిచారు. 'ఇదివరకు పెట్టిన స్టెంట్స్ బాగానే ఉన్నాయి. కొత్త ప్రమాదాలేమీ లేవు. హీ ఈజ్ ఓకే' అని చెప్పారుట డాక్టర్. హమ్మయ్య! అని ఊపిరితీసుకున్నాం.


 పొద్దుట ఏంజియో తీస్తారని నిన్ననే చెప్పారు. గతకొన్నాళ్ళుగా ఎదో ఒక ఇబ్బందితో అవస్థ పడుతున్న నాన్న మొన్న రాత్రి బాగోలేదని చెప్తే ఎమర్జన్సీ ఎడ్మిషన్ చేసారుట. నేనొట్టి కంగారుమనిషినని రాత్రి చెప్పకుండా నిన్న పొద్దున్న తను ఊరు నుండి వచ్చాకా అప్పుడు అమ్మ చెప్పింది ఇలా అని..! ఆఫీసు పనిలో బిజీగా ఉండి అన్నయ్య కేబ్ మాట్లాడితే వాళ్ళిద్దరే వెళ్లారుట హాస్పటల్కి. రాత్రంతా అమ్మ ఒక్కర్తే కంగారుగా గడిపింది పాపం! ముగ్గురు పిల్లలం ఉన్నాం.. ఏం లాభం? చాలాదూరంలో తమ్ముడు, ఆఫీసులో పీకల్లోతు పనిలో అన్నయ్య, విషయం తెలియక నేను.. ముగ్గురం ఉపయోగపడలేదు. అంతేనేమో ఒక స్టేజ్ వచ్చాకా.. భార్యాభర్తలిద్దరే ఒకరికి ఒకరు తోడు.. అదీ ఇద్దరిలో ఒకరైనా ఆరోగ్యంగా ఉంటే రెండోవారిని చూసుకోవడానికి ఉంటుంది! సరే, కాసేపుండి తను ఆఫీసుకెళ్ళిపోయారు. పాపను రూం లోకి అలో చెయ్యమని హాస్పటల్ స్టాఫ్ చెప్పేసారు. ఓ ల్యాపీ ఇస్తే ఏవో కార్టూన్స్ చూసుకుంటుందిలే అని పాపను అన్నయ్య వాడితో ఆఫీసుకు తీస్కెళ్ళాడు.


ఆ పూటకి అమ్మకు తోడుగా నేను ఉండిపోయాను హాస్పటల్లో. రకరకాల సందర్భాల్లో గతంలో చుట్టిన నానారకాల ప్రదక్షిణల మూలంగా హాస్పటల్ అంటేనే పరమ చిరాకు, భయం నాకు. అయినా ఇప్పుడు పూర్వంలా లేవు హాస్పటల్స్ కూడా. ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఫీలింగ్. విశాలమైన రూమ్స్, సోఫాలు, ఏసీ, టివీ, ఫోన్ చేస్తే టిఫిను, కాఫీ-టీలు, భోజనాలు క్షణాల్లో ప్రత్యక్ష్యమౌతున్నాయి. మధ్యలో డ్యూటీ నిమిత్తమై కిలకిల్లాడే మళయాళీ నర్సులు! పేషేంట్ రోగం సంగతెలా ఉన్నా వాళ్ళకీ, వాళ్ళ వెంటనున్నవాళ్ళకీ వైభోగమే! పచ్చకాగితం పవరది...!! ఇంత పెద్ద హాస్పటలూ పేషేంట్స్ తో కిటకిటలాడిపోతోంది. రూమ్స్ ఖాళీ లేవుట అస్సలు :(  ఐసీయూ లో పేషంట్స్, బయట హాల్లో వాళ్ల తాలూకా మనుషులు వెయిట్ చేస్తున్నవారెందరో! రకరకాల కథలు..కన్నీళ్ళూ.. అనారోగ్యాలూ.. వాటికి వందరకాల ఆధునిక వైద్యాలూ! కేథ్ రూమ్ బయట ఆ అరగంటలో నాలుగు కథలు విన్నా! దినచర్యల్లో, తినే ఆహారంలో మార్పులే ఇన్ని రకాల ఆరోగ్యసమస్యలకు దారితీస్తున్నాయి అనిపించింది.


చిన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే బైపాస్ సర్జరీనే మార్గం. ఇప్పుడేమో ఇక్కడ గంటకు నాలుగు ఏంజియోగ్రాములు తీస్తున్నారు.. ఎక్సరేలు, స్కానింగ్ లు చేసినట్లు! అసలు వీటిల్లో ఎన్ని అత్యవసరమో తెలీదు. మొన్న మా బంధువులొకరు విజయవాడలో ఏంజియో పదిహేనువేలన్నారని కాకినాడ వెళ్ళి తొమ్మిదివేలకు చేయించుకు వచ్చారు. స్టెంట్స్ కి కూడా హాస్పటల్ ని బట్టి, పేషంట్ ని బట్టి రకరకాల రేట్లు. ఏంజియోలు మాత్రం తప్పవు.. స్టెంట్స్ అక్కర్లేని కేసులు కొన్ని.. అప్పటికప్పుడు స్టెంట్స్ వేయాల్సిన కేసులు కొన్ని.. అవి వేయడం కోసమే చేస్తున్న ఆంజియోలు కొన్ని! మళ్ళీ ఆ స్టెంట్స్ లో మూడు నాలుగు రకాలు. హాస్పటల్లో ఒక రేటు, బయట కొంటే ఒక రేటు, ఏజెంట్ ద్వారా ఎక్కడ్నుంచైనా తెప్పించుకుంటే ఒక రేటు, డయాబెటిక్ పేషేంట్స్ కి కోటెడ్ స్టెంట్స్ అంటూ అవో రకం..! ఈ వైద్యాలకు పేదా, గొప్పా తేడాలేమీ లేవు. ఎవరికైనా అదే గుండె, అదే సమస్య, అదే స్టెంట్ మరి! మనసు లేకుండా మనుషులు ఉండగలరు కానీ గుండే లేకుండా మనుషులు ఉండలేరు కదా మరి!!


సరే ఇక నాన్నకు కొత్త ఇబ్బందులేమీ లేవు.. మందులు కాస్త మార్చి ఇస్తామన్నారు మా డాక్టరు. నాన్నకు రూమ్ కు తీసుకువచ్చాకా అమ్మా, నేను కాసేపు శరీరాలూ, ఆరోగ్యాలూ, డాక్టర్లు,ఖర్చులు గురించి కాసేపు మాట్టాడేసుకున్నాం. కరెంట్ పోయిందని నేను మూడో అంతస్థులో ఉన్న ఆ రూమ్ అద్దం కిటికీ తెరిచాను. క్రిందన చిన్న మురికివాడ ఉంది. రేకు టాపులతో ఓ పదిపదిహేను ఇళ్ళు ఉన్నాయ్. మధ్యన ఓ చిన్న గుడి కూడానూ. పిల్లల్లు, పెద్దలు ఎవరిపనుల్లో వాళ్ళున్నారు. నీళ్ళు పట్టేవాళ్ళూ, అంట్లు తోముకునేవాళ్ళూ, ఉన్న ఆ కొద్దిపాటివాకిలీ తుడిచేవాళ్ళూ.. ఓ పక్కగా శివరాత్రి అనేమో మైక్లో పెద్దగా సినిమా పాటలు పెట్టారు. నే గమనించినదేమిటంటే అన్ని ఇళ్ళల్లో ఈ క్లీనింగ్ పని ఆడవాళ్ళే చేస్తున్నారు. వంట, అంట్లు తోమడం, ఇల్లు-పరిసరాలు శుభ్రం చేయడం, చంటి పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం ఇవన్నీ ఎక్కడైనా ఆడవారి పనులే...ఎక్కడైనా ఇంతే కదా అని నవ్వొచ్చింది! అభ్యుదయం, సమానత్వం, వంకాయ, బీరకాయ పది శాతం జనాభాలో మాత్రమే నాకు కనబడుతుంది. చదువులేనివాళ్ళు ఇళ్ళలో చాకిరీ చేస్తే, చదువుకున్నవాళ్ళు ఆఫీసుల్లో+ఇళ్ళల్లో రెండుచోట్లా చాకిరీ చేస్తున్నారు. డబ్బు, సౌఖ్యం ఉన్నా శారీరిక శ్రమ కూడా రెట్టింపు ఉంటోంది కదా..ఇంతకన్నా పూర్వకాలం అమ్మమ్మలూ,మామ్మలే నయమేమో ఇంటిపనులయ్యాకా కాస్తైనా విశ్రాంతి దొరికేది వాళ్ళకి! ఇంటాబయటా పనులతో సతమతమయ్యే నేటి మహిళల పరిసరాల్లో 'స్ట్రెస్ అండ్ స్ట్రైన్' తప్ప 'రెస్ట్' అనే పదం ఎక్కడైనా కనబడుతోందా..?! ఈలోపూ మళ్ళీ కరెంట్ రావడంతో ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి కిటికీ మూసేసి ఇవతలకొచ్చేసా !


కాసేపు నే ప్రస్తుతం చదువుతున్న పుస్తకం తాలూకూ కథనీ, రచయిత గురించి అమ్మానాన్నలకు చిన్న సైజు లెక్చర్ ఇచ్చేసా! సాయంత్రం తను అన్నయ్య వద్దనుండి పాపను తీసుకుని హాస్పటల్ కి వచ్చాకా, నాన్నని రేపు డిస్చార్జ్ చేస్తారని తెలుసుకున్నాకా మళ్ళీ ముగ్గురం ఇంటిదారి పట్టాం. ఎంతరాత్రైనా గుడికి తీసుకువెళ్ళాల్సిందే నాన్నా అని పిల్ల ఆర్డర్! దారిలో శివాలయానికి వెళ్ళి హరహర మహాదేవా! అని పొద్దుటి నుండీ ఎక్కువైపోయిన హృదయభారాన్ని అక్కడే దింపేసి, కొంత ప్రశాంతతని  మళ్ళీ మనసులో నింపుకిని, కాసిని క్షణాలక్కడ గడిపి పదవుతుంటే ఇల్లు చేరాం! అప్పుడు మళ్ళీ పొద్దుట చెయ్యని పూజాకార్యక్రమాలు పూర్తిచేసి, ఇంటిలోని ఈశ్వరుణ్ణి స్తుతించేసరికీ పొద్దుటి నుండీ అలుముకున్న అలజడంతా ఒక్కసారిగా దూరమయినట్లయ్యింది. అలా హడావుడిలో కూడా లోటు లేకుండా తన పూజలు తాను జరిపించుకున్నాడీవాళ శివయ్య!!

నిన్న ఇవాళ్టికి నిన్నే కానీ నిన్నటికి ఇవాళే కదా! 

రెహ్మాన్ కొత్త ఆల్బమ్ పాట



రెహ్మాన్ స్వరాలనందించిన కొత్త ఆల్బమ్ ఒకటి "రౌనక్" పేరుతో రాబోతోంది. అందులో శ్రేయా ఘోషాల్ మధురంగా ఆలపించగా మొదటి పాటను నిన్న రిలీజ్ చేసారు. ఈ ఆల్బంలోని గీతాలకు ఒక యూనియన్ మినిస్టర్ సాహిత్యాన్ని అందించడం విశేషం. ఆల్బమ్ తాలూకూ మిగతా వివరాలు ఇక్కడ చదవచ్చు.




పాట కన్నా సంగీతం నన్ను బాగా అలరించింది. ముఖ్యంగా రెహ్మాన్ గిటార్స్ వాడిన తీరు నాకు బాగా నచ్చింది..
మరి శ్రేయా స్వరమధురిమలనూ, రెహ్మాన్ జాదూనీ మరోసారి ఆస్వాదించేద్దామా...

Tuesday, February 18, 2014

Horti Expo 2014


ఈ ఏడాది హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ కోసం చాలా ఎదురు చూసాను..! జనవరి వెళ్పోయింది కానీ ప్రదర్శన జాడ లేదు. చూడగా చూడగా మొన్నొకరోజు సిటీలోకెళ్ళి వస్తుంటే ఒక హోర్డింగ్ చూసా..13 నుండి 17వరకూ ఎగ్జిబిషన్ అని. ఆ వీక్ అంతా బోళెడు పనులు.. హడావుడి! ఎక్కడా కుదిరేలా కనబడలే..:( ఆఖరికి ఏలాగైతేనేం మొన్న ఆదివారం మధ్యాహ్నం వెళ్ళివచ్చాం. 




ఈసారి ప్రదర్శన నన్ను బాగా నిరాశ పరిచింది. అసలు ఏం గడబిడ జరిగుతోందో.. ఎందుకు ఆలస్యంగా ఏర్పాటయ్యిందో తెలీదు. ఏడాది ఏడాదికీ తగ్గుతూ వస్తున్న క్వాలిటీ ఈసారి పూర్తిగా పడిపోయింది. చాలా సాధారణంగా ఏవో మొక్కలు,పువ్వులూ అంతే! ప్రత్యేకతలేమీ లేవు. వ్యాపార ధోరణి బాగా పెరిగిపోయింది. రెండు పుస్తకాల స్టాల్స్ (మొక్కల దగ్గర బుక్సెందుకో..?!), చిరుధాన్యాల తినుబండారాల స్టాల్, రెండుచోట్ల సేంద్రీయ కూరల అమ్మకాలూ ఉన్నాయి. ఎప్పటిలా బయట స్నాక్స్, పాప్కార్న్, బజ్జీలు గట్రా, లోపల నేచరల్ ఫ్లేవర్ తో సాప్ట్ ఐస్క్రీం స్టాల్స్ ఉన్నాయి. ఆ నేచరల్ ఫ్లేవర్ ఐస్క్రిం ఇదివరకు కోన్ లో ఇచ్చేవాడు. వెనిల్లా ఐస్క్రీం కి ఫ్రెష్ ఫ్రూట్ పీసెస్ కలిపి ఇచ్చే ఆ రుచి అద్భుతంగా ఉండేది. ఈసారి క్వాంటిటీ తగ్గి కప్పులోకి వచ్చి, రుచి కూడా బాలేదు :(  హనీ, హెర్బల్ టీ, తులసీ టీ, స్టీవియా స్టాల్స్ మామూలే. స్టీవియా స్టాల్ లో హెర్బ్వియా  పిల్స్  బయట దొరకట్లేదంటే పంపిస్తానని అడ్రస్ తీసుకున్నాడు. 
ఎవరికైనా herbvia కావాలంటే ఈ నంబర్ల లో సంప్రదించవచ్చు: 09000100071/09912629999





జనవరి అయిపోవడంతో ఎప్పుడూ ప్రధానాకర్షణగా నిలిచే బంతులు, చామంతులూ అక్కడక్కడా తప్ప ఎక్కువ లేవు! గులాబీలు కూడా ఎక్కువ కనబడలేదు. మొక్కల ధరలు మాత్రం బయట నర్సరీల రేట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. డెకొరేటివ్ ఫ్లవర్స్, స్టోన్స్, ప్లాస్టిక్ క్రీపర్స్ మొదలైనవి ఉన్న స్టాల్ మాత్రం కిక్కిరిసి ఉంది. 
రెండు మూడు కొత్త మొక్కలేమైనా కొందామన్నా ఆసక్తికరంగా అనిపించలేదు. చివరికి సెంటెడ్ కాగడామల్లె (చెంబేలీ కాదు) ఒకటి కొని నిరుత్సాహంగా బయటకు నడిచా!




ఇది బాగుంది :)


ఈ ప్రదర్శన తాలూకూ మిగిలిన ఫోటోలు క్రింద లింక్ లో..:
http://lookingwiththeheart.blogspot.com/2014/02/horti-expo-2014.html



Friday, February 14, 2014

పాట వెంట పయనం : ప్రేమభరితమైన యుగళగీతాలు







ఇవాళ 'Valentine's day' కదా అని ఈసారి "పాట వెంట పయనం"లో కొన్ని romantic duets గురించిన కబుర్లు...

క్రింద లింక్ లో వ్యాసం చూడవచ్చు...
http://wp.me/p3amQG-2if


Thursday, February 13, 2014

సప్తపర్ణి + కేలిగ్రఫీ రామాయణం




ఈ టపాలో రెండు విషయాలు చెప్పాలి.. ఒకటి సప్తపర్ణి గురించి, రెండోది కేలిగ్రఫీ రామాయణం గురించీ! క్రితం వారం హిందూ(న్యూస్ పేపర్) ఫ్రైడే రివ్యూ లో  పూసపాటి పరమేశ్వర రాజు గారి "కేలిగ్రఫీ రామాయణం" గురించిన ఆర్టికల్ ఒకటి వేసారు. చిన్నప్పుడు మా నాన్నగారి వద్ద కేలిగ్రఫీ పెన్స్ ఉండేవి. ఆ పెన్స్ కి వివిధ సైజుల్లో మార్చుకోవడానికి నిబ్స్ కూడా ఉండేవి. నాన్న ఆ పెన్స్ లో రంగురంగుల ఇంక్స్ మారుస్తూ, వాటితో అందంగా రాయడం, బొమ్మలెయ్యడం చూసి మేము సరదా పడితే మాకేమో కేలిగ్రఫీ () స్కెచ్ పెన్స్ సెట్ కొంటూండేవారు. వాటితో మేము బొమ్మలు, చార్ట్స్ లో కొటేషన్స్ రాస్తూండేవాళ్ళం.  అందువల్ల పేపర్లో కేలిగ్రఫీ రామాయణం అని చదవగానే చూడాలని అనిపించింది. సిటీలో అమ్మావాళ్ళింట్లో ఉన్నా కాబట్టి అనుకున్నదే తడవు వెళ్ళి చూడగలిగాను. 



news paper article

రామాయణం లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకుని, వాటికి కేలిగ్రఫీ స్తైల్లో పైంటింగ్స్ వేసారు పరమేశ్వర రాజు. కొన్ని అర్ధమవుతున్నాయి గానీ కొన్ని పెయింటింగ్స్ abstract paintings లాగ ఉన్నాయి. అయినా అసలు ఇలాంటి ఒక ఐడియా వచ్చినందుకు ఆయనను మెచ్చుకోవాలి. ఈ పెయింటింగ్స్ అన్నీ ఒక బుక్ వేసారు. ప్రతి బొమ్మకూ క్రిందన ఆ ఘట్టం తాలూకూ డిస్క్రిప్షన్ రాసారు కానీ ఖరీదే చాలా ఉంది.. ఏకంగా వెయ్యి రూపాయిలు! ఐదువందలన్నా కొందును గానీ వెయ్యి అనేసరికీ వెనకడుగు వేసేసాను..! ఫోటోలు తీసాను కానీ అవి బ్లాగులో పెట్టడం వారికి ఒప్పుదల కాదేమో అని పెట్టడం లేదు. నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ను బంజారా హిల్స్ రోడ్ నెం.8 లో ఉన్న సప్తపర్ణి లో చూడవచ్చు. ఈ నెల ఇరవై ఆరు దాకా ఉంటుందిట.


ఇప్పుడు నే చెప్పదలుచుకున్న రెండవ సంగతి.. సప్తపర్ణి! ఇది ఒక బుక్ స్టోర్స + కల్చరల్ సెంటర్ ట. నేనిదే మొదటిసారి చూడటం. ఫేస్బుక్ లో కూడా 'సప్తపర్ణి' ఉంది. అక్కడ జరిగే ఈవెంట్స్ ఏడ్స్ అందులో చూడచ్చు. ఇక్కడ వివిధరకాల సాంస్కృతిక ప్రదర్శనలే కాక శాస్త్రీయ సంగీతం క్లాసెస్ కూడా ఉన్నాయి. వోకల్, వయోలిన్, తబలా నేర్పిస్తారుట. ఇంక ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందంటే ఇంకాసేపు అక్కడే ఆ చెట్ల మధ్యన, పచ్చదనం మధ్యన గడపాలనిపించేలా ఉంది. లోపల ఉన్న బుక్ స్టోర్స్ లో ఎక్కువగా పిల్లల పుస్తకాలు ఉన్నాయి. ఏదో బొమ్మలు చూపెడదామని పొరపాటున మా అమ్మాయిని తీసుకువెళ్ళి  అక్కడ బుక్ అయిపోయా నేను. అది కొను..ఇది కొను.. అని గొడవ! పోనీ కొందామా అంటే ధరలన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి. 'పరమపదసోపానపటం' చూసి ముచ్చటపడి రేట్ చూసి బెదిరిపోయా:( ఎనిమిదొందల ఏభైట!! మరి ఆ బుక్ సెంటర్ ఉన్న ఏరియా మహత్యం అది అనుకున్నా!







ప్రదర్శనలేమీ లేకపోయినా ఎప్పుడైనా వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడపాలనిపించేలా ఉందీ చోటు! 
ఈ చోటులో తీసిన మిగిలిన ఫోటోలు ఇక్కడ: 



Friday, February 7, 2014

ఆబ్దీకం


స్నానాలూ, మడిబట్టలు, బ్రాహ్మలు, గదిలోపల కార్యక్రమంలో హోమం.. ఇంటి నిండా పొగ, పిండాలూ, నల్ల నువ్వులూ, వంటింట్లో వంటావిడ హంగామా, ఇంట్లో బంధువులు, కబుర్లు, ఆపై భోజనాల్లో నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, గారెలు, పరమాన్నం, అప్పాలో..అరిసెలో.., ముద్దపప్పు, నెయ్యి, కమ్మటి పెరుగు.. అరిటాకుపై కడుపునిండా భోజనం..  చిన్నప్పుడు 'ఆబ్దీకం' అంటే తెలిసిన అర్థం ఇదే!


మా అమ్మమ్మ,తాతయ్యల మరణాల మధ్య పదిహేను ఇరవైఏళ్ళ అంతరం ఉన్నా వాళ్ల ఆబ్దీకాలకు మధ్యన ఒక రోజే తేడా! ఏడాదికోమాటు తాతయ్య ఆబ్దీకానికి, ఆ తర్వాత ఇద్దరి ఆబ్దీకాలకీ మా కజిన్స్ అందరం మావయ్య ఇంట్లో తప్పనిసరిగా కలిసేవాళ్లం. ఈ వంకతో అయినా అందరం ఓసారి కలుస్తున్నాం అని తృప్తి ఉండేది మాకు. రాన్రానూ చదువులూ, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ మా అందరిమధ్యన దూరాలను కూడా పెంచేసాయి. మా ఇంట్లో అయితే నాన్న ఏడాదికి మూడు ఆబ్దీకాలు పెట్టేవారు. కొడుకుల్లేని వాళ్ల అమ్మమ్మకు ఏకైక మనవడిగా వాళ్ల అమ్మమ్మ,తాతయ్యలదీ, వాళ్ల నాన్నగారిదీ! ఆ తరవాత పదిహేనేళ్ళుగా మా మామ్మయ్య(నాన్నమ్మ)దీ మొత్తం కలిపి నాలుగు! ఎప్పుడైనా శెలవు రోజైతే ఆబ్దీకం భోజనం తినేవాళ్లం తప్ప స్కూలుకి, కాలేజీలకీ వెళ్పోయేవాళ్లం కాబట్టి మాకు ఇంట్లో జరిగే కార్యక్రమం గురించి పెద్దగా అవగాహాన ఉండేది కాదు. మంత్రం చెప్పే ఆయన, ఇద్దరు భోక్తలు మొత్తం ముగ్గురు బ్రాహ్మలు వచ్చేవారని మాత్రం గుర్తు. అప్పట్లో పప్పు రుబ్బటానికి రుబ్బురోలే కాబట్టి వంటావిడ రుబ్బలేకపోతేనో, రావడం లేటు చేస్తేనో "నేనే పప్పు రుబ్బానని.." అమ్మ చెప్తే ఓహో అనేవాళ్లం తప్ప ఆ కష్టం ఏపాటిదో ఊహకైనా తెలిసేది కాదు! ఆబ్దీకాలైన ప్రతిసారీ "నా కూతుర్ని పెద్ద కొడుక్కో, ఒక్కడో కొడుక్కే ఇవ్వను బాబూ.." అని అమ్మ అంటూండడం మాత్రం బాగా గుర్తుంది! 


కట్ చేస్తే... నేను ఓ ఇంటి పెద్దకోడల్నే అయ్యాను!! దురదృష్టవశాత్తూ ఏడేళ్ల క్రితం మా మావగారు కాలం చేసారు. మడిబట్ట ఎలా కట్టుకుంటారో కూడా తెలీదప్పటికి నాకు. అప్పటికి మా పాపకు రెండేళ్ళూ, నాకు ఒక మిస్కేరేజ్ అయ్యి రెండు నెలలు కూడా పూర్తవ్వలేదు. చణ్ణీళ్ల స్నానాలు, మడిబట్టలు.. నెలా నెలా మాసికాలు.. ఆ కార్యక్రమాలు.. మళ్ళీ అందులో గోదారిజిల్లా రూల్స్ వేరు..కృష్ణాజిల్లా రూల్స్ వేరు... అంతా గందరగోళంలా ఉండేది. అమ్మ, అత్త, మామ్మయ్య, తాతమ్మా.. అంతా ఇంతేనా? ఇలానే తడిబట్టలు, మడిబట్టలు, కట్టుకుని ఉండేవారా? ఒక్క చీరనే కట్టుకుని ఎలా ఉండాలి? వచ్చినవాళ్లంతా మనల్నే చూస్తూంటారు కదా...అయినా ఇంతేనా..  మడిబట్ట మార్చేదాకా మధ్యలో బాత్రూం లోకి కూడా వెళ్లకూడదా... ఇవేమి రూల్స్? ఎవరు పెట్టారు? ఇలానే ఎందుకు చెయ్యాలి? చదువులూ, ఉద్యోగాలూ, సమాజం..మార్పు.. ఇవన్నీ పుస్తకాలకీ, సినిమాలకీ, కాయితాలకీ, కవితలకే పరిమితమా? సవాలక్ష సందేహాలు... 


మావగారి సంవత్సరీకాలు కాశీలో చేసాం. గయా వెళ్లాం.. అక్కడ కూడా కొన్ని విధులు పూర్తిచేసాం. వచ్చాకా కాశీసమారాధన మొదలైన కార్యక్రమాలు అయ్యాయి. ఆ తర్వాత నుండీ ఏడాదికోమాటు ఆబ్దీకాలు ఇంట్లోనే జరుపుతున్నాం. "అమ్మా.." అని ఆప్యాయంగా పిలిచే మావగారి పిలుపు.. "కాస్త చాయ్ పెట్టిస్తావామ్మా..", "చపాతీలు ఇలా వత్తాలి..", "టమాటా పచ్చడి నే రోట్లో రుబ్బితే అంతా వచ్చి రుచి చూసాకా చివరికింత ముద్ద మిగిలేది.." అంటూండే ఆయన మాటల్ని తలుచుకుంటూండగానే ఏడేళ్ళు గడిచిపోయాయి. కానీ అబ్దీకం వస్తోందంటే అది పూర్తయ్యేదాకా గుబులు మాత్రం పోవట్లే..! ఎవరితోనూ మాటపడకుండా కార్యక్రమం పూర్తిచెయ్యాలి. అత్తగారు తృప్తిపడాలి. వచ్చినవాళ్ళు కడుపునిండా భోజనం చేసి వెళ్లాలి. పెద్దకోడలిగా నా బాధ్యత నేను నెరవేర్చాలి. ఇదీ నా తాపత్రయం. ప్రతి అబ్దీకానికీ అమ్మ, పిన్ని, అత్త.. ఇలా అంతా గుర్తుకువస్తారు..! పది మంది, మహా అయితే ఓ పదిహేను మందికే నేను అతలాకుతలం అయిపోతుంటే, గ్రైండర్లు లేని రోజుల్లో ప్రతి ఆబ్దీకానికీ నలభైకి తక్కువకాకుండా బంధువులకి చేసిపెట్టిన పెద్దవాళ్లను తల్చుకుంటే అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. 


నిన్న మా మామగారి ఏడవ ఆబ్దీకం జరిపాము.ఈమధ్యన రెండేళ్ళుగా ఆరోగ్యం బాగోక నే వడ్డన చెయ్యలేక వంటావిడనే వడ్డనకి కూడా మాట్లాడుకుంటున్నాం. నిన్న భోజనం చేస్తుంటే మా సీతత్త గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సీతత్త మా మేనమామ భార్య. మా అమ్మమ్మా తాతయ్యల ఆబ్దీకాలకి వాళ్ల ఎనమండుగురు సంతానం, వారి పిల్లలు అంతా కలిపి రెండు మూడు బ్యాచ్ లలో భోజనాలు చేసేవారు. అందరికీ దగ్గరుండి వడ్డన చేస్తూ, "ఇదిగో నువ్వీ గారెలు తిను", "పరమాన్నం బావుంది మరికాస్త వేయించుకో", "కొబ్బరిపచ్చడి కావాలా?" , "ఈ కూర వేయించుకో..వద్దనకు", "తాతగారి ప్రసాదం తినాలి.." అంటూ నవ్వుతూ అందరికీ కడుపునిండా భోజనాలు పెట్టించి, చివరికెప్పుడో నాలుగింటికి తను భోజనం చేసి మడిబట్ట మార్చుకుని వచ్చేది తను. నేను వడ్డన చెయ్యకపోయినా బ్రాహ్మల భోజనం అయ్యి, వారి విస్తళ్ళు తీసి, నేలంతా తుడిచేసరికే చుక్కలు కనబడ్డాయి నాకు.


అసలు ఈ కాలంలో అప్పటి ఓపికలు ఎందుకు ఉండట్లేదు? మా పరిస్థితే ఇలా ఉంటే అసలు ముందుతరాల మాటేమిటి? ఒకవేళ ముందు తరాలవాళ్ళు తల్లిదండ్రులకి ఇలా కార్యక్రమాలు నిర్వహించలేకపోతే...?  అసలు కొడుకే లేకపోతే..? ఎవరు ఇవన్నీ జరిపిస్తారు? ఎవరో ఒక బంధువులు చేస్తే కొడుకు చేసినంత శ్రధ్ధగా చేస్తారా? వాళ్ళు ఈ శ్రార్థకర్మలన్నీ విధిగా జరపలేకపోతే మరి చనిపోయినవాళ్లకు ఏం నష్టం జరగదా? అసలు ఇవన్నీ ఇలానే చెయ్యాలా? ఎవరి చేసినా చెయ్యకపోయినా చనిపోయాకా మనకి ఏం తెలుస్తుందసలు? ఇలా అల్లిబిల్లిగా ముసురుకున్నాయి ఆలోచనలతో మనసు బరువైపోయింది... 


ఇంతలో "పెద్దమ్మా నాకు కలర్ చాక్పీస్ ఇయ్యవా? నే బొమ్మ వేస్తా" అని మా మరిది కూతురు, "బెద్దమ్మా..నాక్కూడా ఇంకో స్లేట్ ఈయ్.. నే కూడా మంఛి బొమ్మ వేస్తా.." అన్న దాని తమ్ముడి ముద్దుముద్దు మాటలతో ఆలోచనాలోకం నుండి బయటపడి వాళ్ల కేరింతలకు నా నవ్వులను జత చేసేసా! 

"గుల్జార్ కథలు"





బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గుల్జార్ కవిత్వం, దర్శకత్వం, చిత్రాలకు సంభాషణలు, గీతరచనలే కాక పిల్లల కోసం కూడా చక్కని సాహిత్యాన్ని అందించారు. అంతేకాక  Half a rupee stories, Raavipaar, धुवाँ పేర్లతో తనను కథా రచయితగా గుర్తుంచుకోదగ్గ మూడు కథా సంకలనాలు కూడా రాసారు. అనుకోకుండా క్రిందటేడు పుస్తకప్రదర్శనలో ‘గుల్జార్ కథలు’.. సి. మృణాళిని గారి అనువాదం అని చూసి వెంఠనే కొనేసాను. గుల్జార్ కు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించిన “धुवाँ”(పొగ) అనే ఉర్దూ కథల సంకలనానికి అనువాదం ఇది. అనువాద పుస్తకంలో మొత్తం 28 కథానికలున్నాయి.

తన కలం పేరును “గుల్జార్” పూర్తిగా సార్థకం చేసుకున్నారనిపించింది ఈ కథానికలు చదివితే నాకు. ఒక తోట ఎలాగైతే వివిధరకాలైన చెట్లు, పూలమొక్కలతో నిండి ఉంటుందో, గుల్జార్ సాహిత్యరచన కూడా అలానే వివిధరకాల శాఖలకు విస్తరించింది. అలానే ఈ పుస్తకంలో కథలు కూడా వైవిధ్యభరితమైన అంశాలతో ఓ తోటను జ్ఞప్తికి తెస్తాయి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు కథానేపథ్యాలకు కూడా ఎల్లలు లేవని నిరూపిస్తారు గుల్జార్. తన సంభాషణలు కూడా ఆయన రాసే కవిత్వంలా ఉంటాయి కాబట్టి ఈ ఉర్దూకథల్లోని వచనం కూడా తప్పకుండా ఓ కవిత్వంలానే ఉండిఉంటాయని నా నమ్మకం. 


గుల్జార్ రాసిన ఈ కథానికల తెలుగు అనువాదం "గుల్జార్ కథలు" గురించిన మిగతా వ్యాసాన్ని  పుస్తకం.నెట్ లో చదవవచ్చు...
లింక్ :
http://pustakam.net/?p=16186


Saturday, February 1, 2014

చలువపందిరి: मोन्टा रे!





గాయకుడు “స్వానంద్ కిర్కిరే” కూడా గీతరచయిత, సంభాషణా రచయిత. పరిణిత లో “పియు బోలే”, కై పో చీ లో “మాంఝా”, త్రీ ఇడియట్స్ లోని అవార్డ్ పొందిన “బెహతీ హవా సా థా వో” లతో పాటూ ఎన్నో విలువైన సాహిత్యాలను అందించారాయన. అవటానికి ఇది చిన్న పాటే అయినా, ప్రతిభావంతులైన రచయిత, స్వరకర్త, గాయకుడు త్రిమూర్తుల్లా వెనుక నిలబడ్డ ఉత్తమ గీతంగా ఈ పాటను చెప్పుకోవచ్చు.

ఈ పాట గురించిన కబుర్లు క్రింద లింక్ లో చదవవచ్చు:
http://vaakili.com/patrika/?p=4913


నవలానాయకులు - 2


కౌముదిలో ప్రచురితమౌతున్న "నవలానాయకులు" శీర్షిక లో ఈ నెల కోడూరి కౌసల్యాదేవి గారి 'శాంతినికేతన్' నవలా నాయకుడు 'రాజా' పరిచయం ఇక్కడ చదవవచ్చు:

http://www.koumudi.net/Monthly/2014/february/feb_2014_navalaa_nayakulu.pdf