ఆ మధ్యన చల్లగాలికి బాల్కనీ లో నించుంటే పక్కనెక్కడ్నుంచో ఎవరివో ఆఫీసు కబుర్లు వినబడ్డాయి. ఇంట్లో నెట్వర్క్ లేదని బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవర్నో తిడుతున్నారు, ఎవరి గురించో ఫిర్యాదు చేస్తున్నారు.. ఆఫీసులో జరిగిన గొడవ ఎంతదాకా వెళ్ళిందో చెప్తున్నారు..! విసుగెత్తి లోపలికి వచ్చేసా. మరోసారి వంటింటి బాల్కనీలో బట్టలు ఆరేస్తుంటే.. క్రింద ఇంట్లో ఇల్లాలు సెల్ ఫోన్లో దగ్గటం, తుమ్మటం దగ్గరనుంచీ ఆ రోజు ఏ కూర వండిందో, ఏ కూరలో ఏ కారం, ఏ పొడి వెయ్యాలో విపులంగా వివరిస్తోందెవరికో! ఇక ఎదురు బిల్డింగ్(దగ్గరగా ఉంటుంది) లో ఓ బామ్మగారు ఎప్పుడూ బాల్కనిలోకి వచ్చే ఫోన్ మాట్టాడతారు వారి కూతురితో! కోడలి గురించీ, మనవల గురించీ, బంధువుల గురించీ..ఏవేవో చెబుతూంటారు. వద్దనుకున్నా వంటింట్లోకి వినబడిపోతాయా కబుర్లన్నీ! కారిడార్లోకి ఏ ముగ్గు వేయటానికో, మొక్కలకి నీళ్ళు పొయ్యటానికో వచ్చామా.. రకరకాల గొంతులు.. వాళ్ల ఫోన్ కబుర్లు వినబడిపోతూనే ఉంటాయి.
ఇక సిటి బస్సులో వెళ్తుంటే హింసే..! బస్సు చప్పుడులో ఎవరికీ వినబడదనుకుంటారో ఏమో కొందరు.. ఎవరూ వినకూడని కబుర్లు కూడా హాయిగా సెల్ఫోన్లో చెప్పేసుకుంటూంటారు. ముందు సీటులో వాళ్లకి వినబడుతుందేమో, పక్కన నించున్నవాళ్లకి వినబడుతుందేమో అన్న స్పృహే ఉండదు కొందరికి. కాలేజీ అబ్బాయిలు ఏ అమ్మాయిని ఎలా పడేసారో, ఏ అమ్మాయి ఎలా ఉంటుందో మొదలైన అందమైన కబుర్లు చెప్పుకుంటే, అమ్మాయిల టాపిక్కులు ఫిగర్ మైంటైనెన్స్, బ్యూటీ టిప్స్ ! ఉద్యోగస్తులు కొలీగ్స్ గురించి గాసిప్స్, వ్యాపారస్తులు తమతమ లావాదేవీలు... ఒకటేమిటి? సిటీబస్సులో వినబడినన్ని కబుర్లు టివీ వార్తల్లో కూడా వినలేం !! ఇక కొందరు సంగీతప్రియులు తమకిష్టమైన పాటలు బస్సులో అందరికీ వినబడేలా ఫుల్ స్పికర్లో పెట్టి మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు :(
ఇలా చెప్పుకుపోతే సెల్ ఫోన్ బాధకాల చిట్టాతో టపా కాదు ఒక పుస్తకం రాయచ్చు. చాలావరకూ సెల్ ఫోన్ల నెట్వర్క్ ఇళ్ళలోకి అందదు. మనమేమో ఊపిరి తోస్కోకుండా అయినా ఉండగలము కానీ సెల్ ఫోన్ లేకుండా అసలు ఉండలేమాయే! ఎవరి పరిమితులను బట్టి వారు హాయిగా సెల్ ఫోన్ వాడుకోవచ్చు.. కానీ ఇలా ఇంటి బయటకో, బాల్కనీలోకో వెళ్లి మాట్టాడితే అందరికీ వినబడుతుంది ఇంటిగుట్టు, ఆఫీసు గుట్టు రట్టే.. అని ఎవరికీ తోచదా? అన్నది నా ప్రశ్న. తప్పనిసరిగా ఎవరితోనైనా ఏదైనా మాట్టాడాల్సి వస్తే కాస్త నెమ్మదిగా మాట్టాడుకుంటే బావుంటుంది కదా! మేమైతే ఓ పధ్ధతి కనిపెట్టాం.. నెట్వర్క్ ఉండదని + సెల్ వాడకం మంచిది కాదని కూడా చెప్తున్నారని, ఇంట్లో వీలైనంత ల్యాండ్ లైన్ వాడుతున్నాం. ఆఫీసు ఫోన్ చేయాలంటే తను క్రింద సెల్లార్ లోకి వెళ్లి మాట్లాడి వస్తారు.
అందరి ఇళ్ళలో టెలీఫోన్ లేని రోజుల్లో ఎదురింట్లోకో, పక్కనే ఉన్న షాపు లోకో వెళ్ళాల్సివస్తే ఎంతో ఇబ్బందిగా ఉండేది. తర్వాతర్వాత అందరి ఇళ్ళలో ల్యాండ్ లైన్ ఫోన్లు వచ్చాయి. కాస్త ప్రైవసీ పెరిగింది. ఎవరింట్లో వాళ్ళు సుఖంగా మంతనాలు,చర్చలు చేసుకునేవారు. ఇప్పుడు సుఖాలు మరీ పెరిగిపోయి, టీనేజీ పిల్లలతో సహా మనిషి మనిషికీ సెల్ ఫోన్లు వచ్చాకా మనుషుల కమ్యూనికేషన్, కనక్టివిటీ బాగా పెరిగాయి. అది సంతోషకరమే. సెల్ ఫోన్ సొంతమే, ఫోన్ కాల్ వ్యక్తిగతమే, కానీ తాము పబ్లిక్లోనో, బాల్కనీల్లోనో మాట్లాడే సెల్ ఫోన్ల మాటలకి ప్రైవసీ లేదన్న సత్యాన్ని జనాలు గమనించగలిగితే బాగుంటుంది కదా !
13 comments:
"కొంతమంది" అంతేనండీ, అదేదో గొప్పలా ఫీల్ అవుతూ, ఎదుటి వారికి వినిపించాలని అలా గట్టిగా మాట్లాడుతుంటారు :(
అది వారి మానసిక సమస్య అంతే, వారికి ప్రైవసీ తో సంబంధం వుండదు :)
మరుగేలరా ఓ రాఘవా అంటున్నారండీ అంతా, మరుగు కావాలనుకునే పిచ్చాళ్ళు అక్కడక్కడ ఉన్నారనమాట :)
ప్రైవసి సంగతేమోగానీ మొబైల్ని చూస్తే నాకు అంతరించిపోతున్న పిచ్చుకలే గుర్తొస్తున్నాయి.జీవవైవిధ్య సదస్సు జరిగినప్పుదు ఒక హోర్డింగ్ నాకు గుర్తుండిపోయింది.ఒక పిచ్చుకని రెండు చేతులలో పట్టుకుని,దిసీజ్ మై ఫాదర్స్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్,నౌ హోంలెస్ అని అనుకుంటా.ఇంట్లో వున్నప్పుడు అన్నివిధాలా లాండ్ లైన్ బెస్టు.
మొన్న రాధిక గారి కథలో అనుకుంటాను చదివాను. ఒక వర్షంరాత్రి కరెంట్ పోతే వినిపించే చప్పుళ్ళ గురించి వ్రాశారు. జల్లు పడుతున్న చప్పుడు కంటే జనరేటర్ లు, ఎసిల చప్పుడు ఎక్కువగా ఉందట. వెన్నెల రాత్రి నిశ్శబ్దాన్ని వినే అదృష్ట౦ లేదన్నమాట. ప్చ్...
మేము ఇంట్లో ఎక్కువ లాండ్ వాడతాము. ఎక్కువగా బస్సులో వెళ్తూ ఇలాంటి ఇబ్బంది ఎదుర్కుంటా...చాలా విసుగేస్తుంది .అందరూ గట్టి గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు.కాసేపు ఏపుస్తకమో చదువుకుందామన్నా కుదరదు.సెల్ లేని రోజుల్లో ఎలా ఉండేవారో అంతా అనిపిస్తుంది అప్పుడప్పుడు .రాధిక (నాని)
లింకు వెదికి తేలేను కానీ, క్రిష్ణ ప్రియ గారు ఈ టాపిక్ మీద ఒక పోస్టు భలే రాశారు :-)
సుజాత గారికి మరీ మొహమాటం, నన్ను అడిగితే నేను వెతికి పెట్టేద్దాని కదా ఆ లింక్ , ఇదుగోండి ఇదే అనుకుంటున్నా మీరు అనే పోస్టు :-)
http://krishna-diary.blogspot.sg/2012/03/blog-post.html
సుజాత గారు ... మీరన్న లింక్ ఇదేననుకుంటా....
http://krishna-diary.blogspot.in/2012/03/blog-post.html
ఇలా సంభాషణలు విని నవ్వుకొవడం మంచి టైం పాస్స్ కానీ మన ఫోనులో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి!
బాగుందండి. అది వాళ్ళ ప్రైవసీ అన్నమాట:)
@ఫోటాన్: వాళ్లకి లేకపోయినా వినటానికి మనకి చిరాకు కదా :)
ధన్యవాదాలు.
@శర్మ: :)
ధన్యవాదాలు.
@ఇందిర: అవునండి.. ధన్యవాదాలు.
@జ్యోతిర్మయి: ఆ కథ మిస్సయినట్లున్నా...చదవాలి..
ధన్యవాదాలు.
@రాధిక(నాని): సెల్ లేని రోజుల్లో.. కమ్యూనికేషన్ తక్కువ ఉన్నా హాయిగా ఉండేవాళ్లం కదండి. ఇప్పుడు వెళ్ళినవాళ్ళు,వచ్చేవాళ్ళు ఫోన్ చెయ్యకపోతే టెంషన్, ఫోన్ వచ్చినా రాకున్నా టెంషన్ :)
ధన్యవాదాలు.
@సుజాత: ఎలా వెతకాలా అని వెతుకుతూంటే శ్రావ్య గారు శ్రమ తగ్గించారు..! ఇలాంటి టాపిక్కే గానీ టపా మొత్తం ఆ అమ్మాయి మీద ఫోకస్ చేసారుగా..:)
ధన్యవాదాలు.
@శ్రావ్య: థాంక్సండి శ్రమ తగ్గించినందుకు. నాకు గుర్తే రాలేదు..
హమ్మయ్య మరీ ఇదే టపా కాదులే అని ఊపిరిపీల్చుకున్నా :)
ధన్యవాదాలు.
@నరసింహ: అవునండి నిజమే!Thanks for the visit and the link.
@జయ: అలా అంటారా..ఏమో :)
ధన్యవాదాలు.
Post a Comment