సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 27, 2012

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 6 !!

while recording for 'gala gala gOdAri' at antarvEdi

రెండు మూడు రోజుల పాటు ఇంట్లో రామం కనబడకపోతే అవార్డ్ ప్రోగ్రాం చేస్తున్నాడని అర్ధమయ్యేది అతని కుటుంబానికి.
తిండీ, నిద్ర మానుకుని అకుంఠిత దీక్షతో అతను చేసిన అవార్డ్ ప్రోగ్రాం ల కథాకమామిషు:


1.1980 - నీలినీడలు ( సృజనాత్మక శబ్దచిత్రం -- ప్రధమ బహుమతి)
ఐదవ భాగం చివరలో ఈ కార్యక్రమం తాలూకు వివరాలు రాసాను.


2. 1982 - We Two (సృజనాత్మక శబ్దచిత్రం -- ఎంట్రీ)

3. 1983 - లహరి ( సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
మానవుడి దైనందిన జీవితంతో సంగీతం ఒక అంతర్భాగంగా ఎలా పెనవేసుకుపోతోందో ఉదాహరణలతో సహా వివరించే రూపకం. కార్యక్రమం చివరలో సినిమా ట్రైలర్ మాదిరే ప్రత్యేకంగా తయారుచేసిన ఫిల్మ్ డివిజన్ వారి న్యూస్రీల్ ప్రతీక ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రోగ్రాం విని మన తెలుగువారు, ప్రముఖ వేణుగాన విద్వాంసులు,అప్పట్లో ఫిల్మ్ డివిజన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏల్చూరి విజయరాఘవరావుగారు ఇందులోని కొన్ని అంశాలనూ, కాన్సెప్ట్ నీ స్మగుల్ చేయాలనిపించింది అని మెచ్చుకుంటూ రెండు పేజీల ప్రశంసాపూర్వక ఉత్తరం రాయటం రామానికి ఎంతో ఉత్సాహం ఇచ్చింది.

4.1984 - సారే జహాసే అచ్ఛా (సృజనాత్మక శబ్దచిత్రం -- ప్రశంసాపత్రం)
చిన్నప్పుడూ social studies లెసన్స్ లో బోలెడన్ని హిందూదేశపటాలు ఉండేవి. వరి,గోధుమ ,తేయాకు పండు ప్రదేశములు, భారత దేశంలో వివిధ నదులు,భారత దేశంలో రైలు మార్గాలు ఇలా ఒకో పటం ఒకో రకం. కానీ అన్నీ భారత దేశ పటాలే. ఈ కాన్సెప్ట్ ఆధారంగా తీసుకుని వివిధ అంశాలు వినబడేలాగ మూడు నిమిషాల వ్యవధిగల భారత దేశ సౌండ్ మ్యాప్ లు వినిపిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది రామానికి. అంటే ఆధ్యాత్మిక భారత దేశం, దేశభక్తుల మహామహుల భారత దేశం, ఆకలిదప్పుల భారత దేశం, ప్రకృతి సౌందర్యాల భారత దేశం, పురాతన సంగీత పరంపర గల భారత దేశం, సాంకేతిక వైజ్ఞానిక ప్రగతితో పరిఢవిల్లే భారత దేశం ఇలాంటివన్న మాట. అన్నీ శబ్దమయంగానే. వీటన్నింటితో నిండిన సమగ్ర భారత దేశమే "సారే జహాసే అచ్ఛా" అని తేల్చి చెప్పటం.

5.1985 - ఒక పాట పుట్టింది (సృజనాత్మక రూపకం ఎంట్రీ)
ఆకాశవాణిలోనూ, సినిమాల్లోనూ వందలాది పాటలు తయారవుతూ ఉంటాయి. ఒకో పాటకూ ఒకో చరిత్ర ఉంటుంది. (బాలు గారు ’పాడుతా తీయగా”లో చెప్తున్నట్లు) కానీ ఒక్క పాట తయారవ్వాలంటే ఎందరో వ్యక్తుల శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. పాట వినే సామాన్య శ్రోతకి దాని వెనుక దాగిన తయారీ గురించి తెలిసే అవకాశం తక్కువ. ఎవరో పాట రాసి ఇస్తే, ఎవరో స్వరాలు చేకూరిస్తే, మరొకరు కంఠాన్ని జోడిస్తే, ఇంకొంతమంది వాద్య సహకారాన్ని అందిస్తే , ఒక సాంకేతిక నిపుణుడు రికార్డ్ చేసేస్తే పాట తయారీలో కష్టమేముంది? ఒకో పాటకి ఒకోసారి పదిహేను ఇరవై టేక్స్ దాకా ఎందుకు అవసరం అవుతుంది? దర్శకుడు వివరించిన సన్నివేశానికి ఐదారు రకాలుగా అక్షరాల అల్లిక రచయిత తయారుచేస్తే, అందులో ఒక్కటే ఎలా ప్రాణం పోసుకుంటోంది? సంగీత దర్శకుడు కూడా ఐదారు రకాల బాణిలు వినిపిస్తే అందులో ఒక్కటే ఎలా హిట్ అవుతోంది? గాయకుడికీ, వాద్యబృందానికీ స్వరలిపి ఇచ్చి రిహార్సల్స్ చేసిన తరువాత కూడా ఎక్కువ టేక్స్ ఎందుకు అవసరమౌతున్నాయి? రికార్డింగ్ స్టుడియోలో జరిగే వింతలు విశేషాలూ ఏమిటి? మొదలైన అంశాలన్నీంటినీ సామాన్య శ్రోతకు కూడా అర్ధమయ్యేలాగ వివరిస్తూ ఒక పాట చివరికి ఎలా పుడుతుందో తెలియజేసే సృజనాత్మక రూపకం ఇది. ఈ పాటకు స్వరకర్త విజయరాఘవరావుగారే కావటం వల్ల ఇందులోని నావెల్టీని ఆయన బహుధా ప్రశంసించారు.

ఈ ప్రోగ్రాం ను documentary feature గా పంపించి ఉంటే అవార్డ్ వచ్చి ఉండేదేమో అని తరువాత అనిపించింది రామానికి.

6.1986 - వర్షానందిని (సంగీత రూపకం - ప్రధమ బహుమతి)

7.1986 - నేను కాని నేను (సృజనాత్మక శబ్దచిత్రం - ప్రధమ బహుమతి)
సాధారణంగా సినిమాల్లో పాట రచన పూర్తయ్యాకా స్వరపరచటం ఒక సంప్రదాయ పధ్ధతి కానీ ఒకోసారి దానికి విరుధ్ధంగా ట్యూనే ముందు తయారయి అక్షరాల అమరిక తరువాత జరగటం కూడా మనకు తెలుసు. ఈనాటి పాటల్లో ఎక్కువభాగం ఇలా తయారవుతున్నవే. ఇదే ఒరవడిలో పదహారు శబ్దచిత్రాలను sound effects and musicతో కలిపి ముందుగానే తయారు చేసి ఈ సీరీస్ మొత్తాన్ని రచయిత, రేడియో మిత్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారికి వినిపించి ఆయన స్పందన వచన కవితా రూపంలో రాయించి రివర్స్ లో తయారైన సృజనాత్మక కార్యక్రమం ఇది. దీనికి ఆంగ్లానువాదం తయారుచేసిన ప్రముఖ నైరూప్య వచన కవి శ్రీ "మో" (వేగుంట మోహనప్రసాద్)గారికి ఈ కార్యక్రమం అవార్డ్ రాకముందే ఎంతగానో నచ్చింది. ఈ కార్యక్రమం వింటుంటే ఇటివల వచ్చిన క్రిష్ చిత్రం ’వేదం’ స్క్రీన్ ప్లే లా ఉంటుంది.

8.1987 - స్మృతి (రేడియో నాటకం - ప్రశంసాపత్రం)

9.1988 - నిశ్శబ్దం గమ్యం (సృజనాత్మక శబ్దచిత్రం -- ద్వితీయ బహుమతి)
నిశ్శబ్దంలోంచి పుట్టిన మానవుడు తిరిగి నిశ్శబ్దంలోకే నిష్క్రమిస్తాడు.మధ్యలో మాత్రమే ఎంతో సందడి. అందుకే "రెండు చీకట్ల మధ్యన వెలుగు తోరణం నరుడు" అన్నారు శ్రీకాంతశర్మగారు. ఏనాడో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉండగా ఒక షార్ట్ ఫిల్మ్ కోసం రాసుకున్న అల్లిబిల్లి ఐడియాల సమాహారమే ఈ శబ్ద చిత్రం. అతి చిన్న నీటి బిందువు నుంచి అతి భీకరమైన మేఘ గర్జన వరకూ, చెక్కిలిపై చెక్కిలి ఆనించి వినిపించే గుసగుస మొదలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించే జనఘోష వరకూ, భళ్ళుమని శబ్ద ప్రకంపనలతో మొదలయ్యే వేకువ నుంచి నీరవ నిశీధిలో నక్షత్రాల రోదసీ సంగీతం వరకూ ఎన్ని అంతరాలున్నాయో శబ్ద మూలంగా వివరిస్తూ చివరకు ధ్యానంవల్ల సాధించే నిశ్శబ్దమే మనిషికి ఊరటనిస్తుంది అని ప్రతిపాదించే శబ్ద చిత్రం ఇది.

10.1990 - మెట్లు (సృజనాత్మక శబ్దచిత్రం -- ద్వితీయ బహుమతి)
మనిషి ఉన్నతికి దోహద పడేది మెట్టు. పైకి చేరిన స్థానాన్ని నిలబెట్టుకోలేకాపోతే అధోగతికి తోసేది కూడా ఆ మెట్టే. ఇది ఇందులోని ప్రధాన ఇతివృత్తం. ఎన్నో స్థాయిలు అధిగమించి ప్రేమ సాఫల్యాన్ని పొందుతారు ప్రేమికుల జంట. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్క మెట్టే ఎక్కి పదోన్నతులు పొందుతారు. అష్టాంగమార్గాన్ని ప్రబోధించిన గౌతమబుధ్ధుడు కూడా ఓ అర్ధరాత్రివేళ తన కుటుంబాన్నీ, రాజ్యాన్నీ, త్యజించి, రాజప్రాసాదం మెట్లు దిగి విశాల ప్రపంచంలోకి అడుగిడి, తిరిగి బౌధ్ధభిక్షువుగా అదే సోపానాల వద్దకు రావటం జీవిత పరిణామక్రమంలో సంభవించిన అద్భుత దృశ్యం. ఇన్ని రకాల మెట్లు గురించి వివరిస్తూ ఒక తల్లి తన పసి కుమారుణ్ణి చెయ్యి పట్టుకుని ప్రకృతి మానవుణ్ణి నడిపిస్తున్న రీతిలో కొనసాగిస్తూ చూపటం ఈ సృజనాత్మక రూపకంలో శ్రోతల్ని ఆకట్టుకునే ప్రధానాంశం.


11.1991- గలగల గోదారి (డాక్యుమెంటరీ -- ఎంట్రీ)
నాసికాత్రయంబకం దగ్గర గోముఖం నుంచి బిందు రూపంలో మొదలైయ్యే గోదావరి అంతర్వేది వద్ద సాగరసంగమం చెందేవరకూ గోదావరి సజీవ యాత్ర ఈ డాక్యుమెంటరీలో వినిపిస్తుంది. అదే సంవత్సరంలో యమునా నదిపైన కూడా డాక్యుమెంటరీ ఎంట్రీ రావటంతో గోదావరి చిన్నబోయిందని తెలిసింది. అయితే, ఈ కార్యక్రమం కోసం రామం, శ్రీకాంత శర్మగారు, మిగిలిన టేక్నికల్ టీం నాసిక్ మొదలు కోనసీమ దాకా ఒక నెల రోజులు తిరగటం మాత్రం రామం స్మృతులలో ఒక అందమైన ప్రయాణం.

'mahavishva' recording
12.1992 - మహావిశ్వ (రేడియో నాటకం(సైన్స్ ఫిక్షన్) -- ద్వితీయబహుమతి)


ఆకాశవాణిలో ఈ నాటకానికి ఒక చరిత్ర ఉంది. చాలా అరుదైన సైన్స్ ఫిక్షన్ నాటకం ఇది. స్పెషల్ ఐ.జి.పి, రచయిత, కవి కె.సదాశివరావుగారు ’ఇండియా టుడే ’ తెలుగు మ్యాగజైన్లో రాసిన "మానవ ఫాక్టర్" అనే సైన్స్ ఫిక్షన్ కథ దీనికి మూలం. ఈనాడు మనిషి గ్రహాంతరాల వైపు అడుగు సారిస్తున్నాడు. చంద్రుడి పైన ఎప్పుడో కాలు మోపాడు. మానవ వాస యోగ్యమైన ఇతర గ్రహాలేమైనా ఉన్నాయేమో అని కూడా పరిశోధిస్తున్నాడు. చండ్రుడిపైన, మార్స్ పైన అనతికాలంలో మనిషి నివాసాన్ని ఏర్పరుచుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. దానికి అనేక కారణాలు ఉండే అవకాశం ఉంది. భూమి పైన పెరుగుతున్న జనాభా విస్ఫోటనం వల్ల, భూవనరులు తరగిపోవటం వల్ల మనిషి ఇతర గ్రహాల వైపు దృష్టి సారించక తప్పేలాలేదని శాస్త్రజ్ఞులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇంతే కాక పరస్పర కలహాలు, వాతావరణ కాలుష్యం, అణుయుధ్ధాలు మొదలుగా గల మనిషి స్వయంగా తెచ్చిపెట్టుకుంటున్న అనర్ధాలు కూడా ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. దానా దీనా మానవజాతే అంతరించే ప్రమాదం గానీ, ఈ భూగ్రహం నుంచి ఫలాయనం చేయవలసిన అగత్యం ఏర్పడవచ్చు.


ఈ నేపథ్యం ఆధారంగా ఇప్పటికి 400 సంవత్సరాల తరువాత మానవ మనుగడ ఎలా ఉంటుంది? అప్పటికి గ్రహాంతర వాసానికి అలవాటు పడిపోయిన వైజ్ఞానిక మానవుడు ఎలా ఉంటాడు? రోబోలే సేవకులు, పరిచారికలు ఐతే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన ఆథెన్టిక్ ఇన్ఫర్మేషన్ తో సదాశివరావుగారు చేసిన విచిత్ర కల్పన ఈ కథ. దీనికి రేడియో అనుసరణ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు చేయగా, రసవత్తరమైన వైజ్ఞానిక నాటకంగా రెండు నెలలు అవిశ్రాంతమైన కృషి చేసి రామం దీనిని రూపొందించాడు. ఇంత శక్తివంతమైన కథావస్తువుకు అనుగుణమైన సంగీతం సమకూర్చాలి అనే ఉద్దేశంతో అధికారుల ప్రత్యేక అనుమతి తీసుకుని చెన్నై నుంచి సినీ ఆర్కెస్ట్రాని తెప్పించి ఒక నాటకానికి కేవలం నేపథ్యసంగీతం రికార్డ్ చేసేందుకు AIR వేలకువేల బడ్జట్ ఖర్చుపెట్టడం అదే మొదలు. ఈ కథాగమనంలో రెండు రోబోలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకోసం కూడా ప్రత్యేకమైన సాంకేతిక పరికరాలను చెన్నై సినీ ఫీల్డ్ నుంచి తెప్పించటం జరిగింది.


జాతీయ బహుమతి ఇవ్వటమే కాకుండా ఈ నాటకాన్ని ఆకాశవాణి ఢిల్లీలో ఒక మోడల్ ప్లే గా కూడా పెట్టడం విజయవాడ స్టేషన్కు గర్వకారణం.


13.1992 - 29minutes - 4th dimension (సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
రామానికి వచ్చిన పది జాతీయ బహుమతుల్లో ఈ ప్రోగ్రాం చోటు చేసుకోలేకపోయినప్పటికీ ఈ ప్రోగ్రాం పట్ల అతనికి ప్రత్యేకమైన అభిమానం. తన ఆలోచనా సరళి, తన ఆత్మ ఇందులో ప్రతి అడుగడుగునా ప్రతిఫలిస్తుందని రామం ఎప్పుడూ అంటాడు. దీని పూర్తి రచన, తయారీ తన స్వభావ సరళికి అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది. శ్రీకాంతశర్మగారి కవితా సంపుటి "నిశ్శబ్దం గమ్యం" నుంచి తనకిష్టమైన కొన్ని కవితలు కూడా తానే ఇందులో చదవటం జరిగింది. సందర్భాన్ని అనుసరించి చలంగారి వాణిని, అలాగే ఒక పసిపాప కంఠాన్ని, ఠాగూర్ రచన "where the mind is without fear",
దానికి రజని తెలుగు అనువాదం "చిత్తమెచట భయ శూన్యమో.."(బృందగాన రూపంలో) ఇందులో వినియోగించటం జరిగింది. మన ప్రియతమ భారతదేశాన్ని ఇంత ఆదర్శవంతమైన దేశంగా మనం ఎప్పటికైనా పుననిర్మించుకోగలమా అని రామం ఆశ. రామం కల కూడా.


14.1995 - మ్యూజిక్ ఫ్యాక్టరీ ( సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)


15.1996భూమిగీత (సంగీత రూపకం -- ప్రధమబహుమతి)
ఈ సంవత్సరంలోనే Brazil లోని రియో డిజనిరియో లో ఎర్త్ సమిట్ జరిగింది. అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా పాల్గొంది. ఈ భూగ్రహాన్ని ఎలా కాపాడుకోవాలి్? ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి/ మానవుడి మనుగడ ఏ దిశ వైపు? మొదలైన అనేక అంశాలు అక్కడ చర్చించటం జరిగింది. మన దేశం ప్రధాన పాత్ర వహించింది కూడా. దీని ఆధారంగా రూపొందించిన సంగీతరూపకం ఇది. చక్కని సంగీతం, ఆకర్షణీయమైన సౌండ్ ఎఫెక్ట్స్ గల ఈ రూపకం జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి అందుకోవటమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచీ ఒకేసారి ప్రసారం చేయబడింది కూడా.


16.1997 యాత్ర (సృజనాత్మక రూపకం -- మొదటి బహుమతి)
తాత్కాలికంగా తను ప్రేమించిన వ్యక్తికి దూరమైన ఒక వనిత ఒంటరి పయనం సాగిస్తూ రకరకాల ఋతువుల్లో అతనికై అన్వేషణ సాగిస్తూ తీపి జ్ఞాపకాల భూతకాలంలోకి వెళ్తూ, భవిష్యత్తులో తను కలుసుకోబోయే ప్రియుని కోసం భవిష్యత్ కలలు కంటూ ప్రస్తుత వర్తమానం కొనసాగించటం ఈ "యాత్ర"లో ముప్పేటగా సాగిపోతుంది. చిట్టచివరికి వారిద్దరూ కలుసుకోవటంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఇందులో అడుగడుగునా సంగీతమే ప్రధాన ఆకర్షణ. ఆ పాటలన్నీ ప్రఖ్యాత గాయని శ్రిమతి ద్వారం లక్ష్మి పాడటం ఓ విశేషం. రామం awards కోసం ఢిల్లీ వెళ్ళిన చివరి యాత్ర కూడా ఇదే.


17. 2000 - శబ్ద2000 (సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
నూతన శతబ్దంలోకి అడుగుపెట్టే తరుణంలో 2YK గురించి అనేక ఊహలు, కలలు ఉండేవి. ఈ చారిత్రాత్మక కాలగతిని స్వయంగా అనుభవించినవారందరూ నిజంగా అదృష్టవంతులే. ఒక నూతన శకంలోకి పాదం మోపబోయే భారత దేశం వెనుతిరిగి చూసుకుంటే తన గత చరిత్ర శబ్ద రూపంలో ఎలా వినిపిస్తుందో అని చేసిన కల్పన ఈ "శబ్ద2000".

రామం జాతీయ అవార్డ్ కార్యక్రమాల పరంపర ఇంతటితో ముగిసింది.

**** *** ***

awards
విజయవాడలో అనేక కళాసంస్థలు రామానికి జాతీయ బహుమతులు వస్తున్న తరుణంలో ఎన్నోసార్లు సన్మానాలు, సత్కారాలు చేసాయి. రేడియో మిత్రులు పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు రామానికి ఎనిమిది అవార్డులు వచ్చిన సందర్భంలో విజయవాడలోనే రామం కుటుంబ సభ్యులందరి సమక్షంలో అపూర్వమైన సన్మానం ఏర్పాటు చేసారు. నెల్లూరు "కళామందిర్", విజయవాడ "మధూలిక", "రసతరంగిణి" విజయవాడ, విజయవాడ "రోటరీ", ఢిల్లీలోని "ఢిల్లీ తెలుగు సంఘం" మొదలైన సంస్థలన్నీ కూడా రామానికి సన్మానాలు చేసాయి.


మద్రాసు తెలుగు అకాడమీ వారు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను సన్మానిస్తూ ఉగాది పురస్కారాలు అందజేయటం ప్రతి ఏటా ఒక ఆనవాయితీ. "ఆకాశవాణి"లో "ట్రెండ్ సెట్టర్" గా ఈ సంస్థవారు 2000సంవత్సరంలో రామానికి మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాలులో మాజీ గవర్నర్ శ్రీమతి వి.ఎస్.రమాదేవిగారి చేతుల మీదుగా 'ఉగాది పురస్కారాన్ని' అందజేసారు.


Ugadi puraskar


విజయవాడ రేడియో కేంద్రానికి మూల స్థంభాలుగా చెప్పుకునే నండూరి సుబ్బారావు, సి.రామ్మోహనరావు స్మారక బహుమతులు కూడా రామానికి లభించాయి. ఇటీవలే హైదరాబాద్ రవీంద్రభారతిలో కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా "వాచస్పతి పురస్కారాన్ని" కూడా అందుకోవటం జరిగింది.



Sri.K.Vishwanath giving 'vachaspati Award' to ramam



ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రతి శనివారం ప్రసారం చేసే "ఈవారం అతిథి" కార్యక్రమంలో జంట రేడియో మిత్రులైన శ్రీ ఇంద్రగంటి శ్రికాంత శర్మ గారినీ, రామాన్ని కలిపి ఒకేసారి పరిచయం చేసారు. అలాగే రైన్ బో ఎఫ్.ఎం లో "సరదా సమయం"లో ఓ గంట సేపు రామం అవార్డ్ కార్యక్రమాల ఆడియో క్లిప్పింగ్స్ తో ఓ పరిచయ కార్యక్రమం ప్రసారమైంది.


రామాయణ మహాకావ్య ఆవిర్భావానికి మూల కారకుడైన వాల్మీకి మహర్షిలాగ రామం ఆకాశవాణి విజయ పరంపరకు మూలం, ప్రేరణ - ప్రముఖ వాగ్గేయకారులు, కవి, రచయిత, గాయకులు, స్వర శిల్పి, రేడియో మాంత్రికుడు "రజని" (డా. బాలాంత్రపు రజనీకాంతరావు) అని రామం ఇప్పటికీ వినమ్రంగా చెప్పుకుంటూ ఉంటాడు. రజని రచించిన ’ఆదికావ్య అవతరణ” సంగీత రూపకాన్ని రంగస్థలంపై నృత్యరూపకంగా చేసిన ప్రదర్శనలో వాల్మీకి వేషం రామం ధరించటం యాదృచ్ఛికం. జాతీయ, అంతర్జాతీయ బహుమతులు రేడియోకి సంపాదించి పెట్టిన రజని పరిపాలనా కాలం విజయవాడ కేంద్రానికి ఎప్పుడూ ఒక స్వర్ణయుగం అని రేడియో శ్రోతలు ఇప్పటికీ అభివర్ణిస్తూఉంటారు. అందుకే ఆయన వర్ణచిత్రాన్ని తన గదిలో అలకరించుకున్నాడు రామం. ఈనాటికీ 90ఏళ్ళ వృధ్ధాప్యంలో కూడా పిలిస్తే పలికే దైవంలాగ సంగీత సాహిత్య రంగాల్లో ఎవరికి ఏ సందేహం వచ్చినా తక్షణం నివృత్తి చేస్తూనే ఉన్నారాయన. నేటికీ పాటే ఆయన ప్రాణం. రామం లాంటి ఎందరో శిష్యప్రశిష్యగణం ఆయన ఆయురారోగ్యాల కోసం నిత్యం ప్రార్ధిస్తూనే ఉంటారు.


Dr.B.Rajanikantha Rao

**** *** ***
ముఫ్ఫై ఏళ్ళ సుదీర్ఘ ఆకాశవాణి అవిశ్రాంత జీవితం తరువాత 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు రామం. గ్రాండ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో అన్ని సెక్షన్ల నుంచీ వచ్చిన విజయవాడ ఆకాశవాణి కేంద్ర స్టాఫ్ అందరూ రామాన్ని "అజాతశత్రువు" అని కొనియాడారు. ఆ ఫంక్షన్ లో ఇతర కేంద్రాలనుంచి కూడా రేడియోమిత్రులు వచ్చి పాల్గొన్నారు. అతని సుస్వభావానికి, సహృదయతకూ లభించిన గౌరవం అది.

ఇదీ రామం కథ. ఇది రామం ఒక్కడి కథే కాదు సీతారాముల కథ. విజయపథంలో నిరంతరం కొనసాగే ప్రతి పురుషుని వెనుకా ఒక స్త్రీ ఉంటుందని నానుడి. అలానే 65ఏళ్ల రామం జీవనయానం వెంట జంటగా నడుస్తూ, తన సహకారాన్ని అందిస్తున్నది అతని సహధర్మచారిణి, మీదుమిక్కిలి అతని స్నేహితురాలు, సహజ శాంత స్వభావురాలు, చప్పుడు చెయ్యని వెన్నెల లాంటి సీతామహాలక్ష్మి అనే "సీత".


(కథ...సంపూర్ణం)


Tuesday, December 25, 2012

"వాకిలి" లో కాస్త చోటు..



బ్లాగ్ రాయటం మొదలుపెట్టాకా, బ్లాగ్లోకపు గోడల్ని దాటి ఒకసారి "నవతరంగం"లో, మూడు నాలుగుసార్లు "పుస్తకం.నెట్" లో, మరో నాలుగు వ్యాసాలు "చిత్రమాలిక"లో రాసాకా.. ఎందుకో ఇక్కడే నా బ్లాగ్ గూట్లోనే ఉండిపోయా....

ఇన్నాళ్ళకి మళ్ళీ మరో అడుగు వేసాను... అది కూడా "వాకిలి" ప్రోత్సాహంతోనే ! "వాకిలి e-పత్రిక" వాళ్ళు నన్ను కాలమ్ రాయమని అడిగినప్పుడు ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను...

మరి నాతో పాటూ మొదటి సంచికలో, నే వేసిన "చలువ పందిరి" క్రింద నా పాటల కబుర్లు విందురుగాని రండి...

http://vaakili.com/patrika/?cat=28

వాకిలిలో నాకూ కాస్తంత చోటిచ్చి, నా వ్యాసాన్ని ప్రచురించిన సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.

Wednesday, December 19, 2012

ఈ సంవత్సరం కొన్న పుస్తకాల కబుర్లు



ఉన్నవి చాలు ఇక కొత్తవి ఎందుకని పుస్తకాలు కొనటం మానేసి, సంసార సాగరంలో పడ్డాకా ఖాళీ దొరక్క సినిమాలు చూడ్డం మానేసి ఏళ్ళు గడిచాయి. అయితే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకా మళ్ళీ ఈ రెండు అభిరుచులకీ సమయం కేటాయించటం మొదలయ్యింది. ప్రస్తుతానికి ఈ టపాలో పుస్తకాల గురించి చెప్తానేం.. బ్లాగుల్లో అక్కడా అక్కడా రకరకాల పుస్తకాల గురించి చదువుతుంటే మళ్ళీ విజయవాడ పుస్తకప్రదర్శన రోజులూ, మొదలుపెట్టింది మొదలు ప్రతి ఏడూ విడువకుండా వెళ్లటం అన్నీ గుర్తొచ్చి... మళ్ళీ పుస్తకాలు కొనాలనే కోరిక బయల్దేరింది. బుర్రలో ఆలోచన పుట్టిందే మొదలు పుస్తకాల షాపులవెంట పడి తిరగటం మళ్ళీ అలవాటైపోయింది. చిన్నప్పటి నుండీ ఎవరు ఎప్పుడు బహుమతిగా డబ్బులు ఇచ్చినా దాచుకుని, వాటిని పుస్తకాల మీద ఖర్చుపెట్టడం నాకు అలవాటు. ఇప్పటికీ అదే అలవాటు. ఇప్పుడు పెద్దయ్యాం కాబట్టి బహుమతులు కూడా కాస్త బరువుగానే ఉంటున్నాయి నే కొనే పుస్తకాలకు మల్లే..:)

క్రిందటేడు పుస్తక ప్రదర్శనలో పెద్ద పెట్టున పుస్తకాలు కొన్నాననే చెప్పాలి. క్రింద ఫోటొలోవి మొదటి విడతలో కొన్నవి. చివర్లో మరోసారి వెళ్ళినప్పుడు మరికాసిని అంటే ఓ ఐదారు పుస్తకాలు కొన్నా. వాటికి ఫోటో తియ్యనేలేదు :( వాటిల్లో ఓ పది పుస్తకాలు చదివి ఉంటాను. మిగిలినవి అలానే ఉన్నాయి..




ఆ తర్వత ఓసారి మార్చిలొనొ ఏప్రిల్ లోనో విశాలాంధ్రలో క్రింద ఫోటోలో పుస్తకాలు కొన్నా..



అవి సగమన్నా చదవకుండా మళ్ళీ ఎవరికోసమో పుస్తకాలు కొనటానికి వెళ్ళి అప్పుడు మరో పదో ఎన్నో తీసుకున్నా. ఓసారి ఏదో గిఫ్ట్ కొందామని Landmarkకి వెళ్ళి అక్కడ "త్రీ ఫర్ టూ" ఆఫర్ నడుస్తోందని మూడు కాక మూడు కాక మరో రెండు కలిపి ఐదు బుక్స్ కొనేసా. వాటిల్లో ఓ మూడు చదివా. 





మా అమ్మావాళ్ళింటి ముందరే కోటి వెళ్ళే బస్సులు ఆగుతాయి. కోటికి గంట ప్రయాణమైనా అక్కడికి వెళ్తే ఈజీగా కోటీ వెళ్ళొచ్చని నాకు సంబరం. ఓసారి ఇంటికెళ్ళినప్పుడు ఏం తోచక కోటీ వెళ్ళొస్తానని బయల్దేరి మళ్ళీ కొన్ని పుస్తకాలు వెంటేసుకొచ్చా. ఇల్లు మారేప్పుడు అట్టపెట్టిలోకెళ్ళిన ఈ కొత్త పుస్తకాలన్నీ ఇంకా వాటిల్లోనే ఉన్నాయి. మళ్ళీ ఇల్లు మరినప్పుడే అవి బయటకు వస్తాయి. అన్ని పేర్లు గుర్తులేవు కానీ కొన్ని పేర్లు గుర్తున్నాయి.. గోదావరి కథలు, ఓహెన్రీ కథలకి తెలుగు అనువాదం, సోమరాజు సుశీల గారి దీపశిఖ, కొత్తగా ప్రచురించిన రవీంద్రుడి కథలు, రవీంద్రుడి నవలలకు తెలుగు అనువాదాలు కొన్ని..  

ఆ తర్వాత ఇటీవలే మావారు ఎవరికోసమో పుస్తకం కొనటానికి వెళ్తూ పొరపాటున నన్ను కూడా నవోదయాకు తీసుకువెళ్ళారు. అప్పటికే నన్ను గుర్తుపట్టడం వచ్చేసిన షాపులో ఆయన "మేడం ఇవొచ్చాయి.. అవొచ్చాయి.." అని నాతో ఓ సహస్రం బిల్లు కట్టించేసుకున్నారు. అగ్రహారం కథలు, ఏకాంత కోకిల, వాడ్రేవు వీరలక్ష్మి గారి మా ఊళ్ళో వాన, ఒరియా కథల పుస్తకం ఉల్లంఘన, మొదలైనవి కొన్నా.  అప్పుడే నవోదయా ఆయన చెప్పారు పుస్తకప్రదర్శన డిసెంబర్ పధ్నాలుగు నుండీ అని. ఎందుకు సామీ ఈవిడకు చెప్తారు...అని పాపం మావారు అదోలా చూసారు నన్ను :))




ఇక ఈ ఏడు పుస్తక ప్రదర్శన కబుర్లు:

డిసెంబరు వచ్చింది.. ఈ ఏడు పుస్తక ప్రదర్శన కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడున్న ఇల్లు ఊరికి చాలా దూరం. ఎలా వెళ్ళాలా అని మధనపడుతుంటే క్రితం వారాంతంలో అమ్మావాళ్ళింటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. ఐసరబజ్జా దొరికింది ఛాన్స్ అని అయ్యగారిని గోకటం మొదలెట్టా..:) పాపం సరేనని మొన్నాదివారం  తీస్కెళ్ళారు. పన్నెండింటికి వాళ్ళు ప్రదర్శన ప్రారంభించగానే దూరేసాం లోపలికి. 


గేట్లో న్యూ రిలీజెస్ అని రాసిన పేర్లు చదువుతూంటే మావారు ఎవరినో చూసి నవ్వుతు చెయ్యి ఊపటం గమనించి ఎవరా అని చూస్తే ఎవరో చైనీస్ అమ్మాయి చేతిలో ల్యాప్టాప్ పట్టుకుని చూసుకుంటోంది. నేను పెళ్ళిపుస్తకంలో దివ్యవాణిలా మొహం పెట్టాను. "ఆ అమ్మాయి తన ల్యాపి లోంచి నీకు ఫోటో తీస్తోంది..అందుకే నవ్వుతూ చెయ్యి ఊపాను" అన్నారు తను. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని చూసా.. అప్పుడా అమ్మాయి కూడా నవ్వుతు నాకు చెయ్యి ఊపి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత చూసాం లోపల "Falun Dafa"  అనే సెల్ఫ్ కల్టివేషన్ ప్రాక్టీస్ తాలుకూ స్టాల్ ఉంది. అందులో బోలెడుమంది చైనీస్ అమ్మాయిలు సీరియస్గా మెడిటేషన్ చేసేస్తున్నారు. ఈ 'కల్టివేషన్ ప్రాక్టీస్' వివరాలు కూడా ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి. ఆ వెబ్సైట్లో వివరాలు చదవాలి.


పైన రాసినట్లు ఈ ఏడాదంతా పుస్తకాలు కొంటూనే ఉన్నా కాబట్టి కొత్తగా కొనాల్సినవి చాలా తక్కువగా కనబడ్డాయి. అయినా పుస్తకాల కొనుగొలుకు అంతం ఎక్కడ? కనబడ్డవేవో కొన్నాను.. క్రితం ఏడు కొనలేకపోయిన "Living with the Himalayan Masters"కి తెలుగు సేత దొరికింది. అమ్మకు గిఫ్ట్ ఇద్దామని వి.ఎస్.ఆర్ మూర్తి గారి "ప్రస్థానమ్" కొన్నాను.




నవోదయా షాపాయన హలో మేడమని పలకరిస్తే ఆ స్టాల్లో దూరి మృణాళినిగారు తెలుగులోకి అనువదించిన "గుల్జార్ కథలు", నా దగ్గర లేని శరత్ నవల "చంద్రనాథ్", ఎప్పటి నుంచో కొందామనుకున్న "స్వేచ్ఛ", పిలకా గణపతి శాస్త్రి గారి "ప్రాచీనగాథాలహరి" కొన్నా. తర్వాత ఓ చోట కొన్ని ఆరోగ్య సంబంధిత పుస్తకాలూ తీస్కున్నా. వీటిలో "చిరుధాన్యాల" గురించిన చిన్న పుస్తకం బావుంది.





"హాసం" పత్రికలో తనికెళ్ల భరణి గారివి "ఎందరో మహానుభావులు" పేరుతో వ్యాసలు వచ్చేవి. అవి చదివాకే నాకు ఆయనపై మరింత గౌరవాభిమానాలు పెరిగాయి. ఆ ఆర్టికల్ కట్టింగ్స్ అన్నీ దాచుకున్నా కూడా. ఆ సంకలనం కనబడగానే తీసేస్కున్నా. తర్వాత అమ్మ బైండింగ్ చేయించి దాచిన పత్రికల్లోని నవలలో "ఉదాత్త చరితులు" అన్న పేరు బాగా గుర్తు నాకు. ఈ నవల ఆ బైండింగ్స్ లోనిదే అనిపించి అది కూడా కొన్నా.



స్కూల్లో ఉండగా నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఇంగ్లీష్ నవలలు బాగా చదివేది. స్కూల్ బస్సులో రోజూ వెళ్ళేప్పుడు వెచ్చేప్పుడు బస్సులోకూడా చదువుతూ ఉండేది. అలా ఓసారి తను "రూట్స్" అనే నవల చదివింది. చాలా గొప్ప నవల చదువు అని అప్పుడప్పుడు కథ చెప్పేది. అప్పట్లో నాకు పుస్తక పఠనం పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆ తర్వాత చాలా సార్లు "రూట్స్" కొనాలనుకున్నా కానీ కొననేలేదు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండు మూడేళ్ల నుండీ రూట్స్ కి తెలుగు అనువాదం చూస్తున్నా కానీ కొనలేదు. అందుకని ఈసారి తెలుగు అనువాదం "ఏడు తరాలు" కొన్నా.



Oxford University Press వాళ్ల స్టాల్లో పిల్లలకి మంచి పుస్తకాలు దొరుకుతాయి. క్రితం ఏడాది కొన్న మేథమేటిక్స్ వర్క్బుక్స్ మా పాపకి చాలా పనికివచ్చాయి. అందుకని ఈసారి కూడా ఇంగ్లీష్ + మేథ్స్ బుక్స్ కొన్ని తీసుకున్నాము. వాటితో పాటు లోపల సీడిలు కూడా ఉన్నాయి. ఇవి కాక పిల్ల కోసమని మరికొన్ని కొన్నా నేను. "ఫన్నీ కార్టూన్ ఏనిమల్స్" అనే పుస్తకంలో పెన్సిల్ స్కెచెస్ బాగా నచ్చి, పిల్లతో పాటు నేను వేద్దామని కొన్నా :) క్రింద ఫోటోలో బుక్స్ లో "పారిపోయిన బఠాణీ" అనే పిల్లల నవల మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది. చిన్నప్పుడు బోలెడన్ని సార్లు అదే కథ చదివేదాన్ని నేను. కథ గుర్తుండి ఎప్పుడూ పాపకి చెప్తూంటాను కానీ అసలు పుస్తకం ఇంట్లో కనబడట్లేదు. ఒక చోట పిల్లలపుస్తకాల మధ్యన "పారిపోయిన బఠాణీ" కనబడగానే పట్టలేని ఆనందం కలిగింది.




పుస్తక ప్రదర్శనలో ఏదో ఒక పోస్టర్ కొనటం చిన్నప్పటి నుండీ నాకు అలవాటు. ఒక చోట త్రీడీ పోస్టర్స్ అమ్ముతున్నారు. రాథాకృష్ణులది ఒకటి కొన్నా. క్రింద ఉన్న మూడు ఫోటోలూ ఒకే పోస్టర్ వి.





ఇంకా కొత్తగా నాకు పింగళి గారి పాటలపై రామారావుగారు రాసిన రెండవ భాగం కనబడింది. మొదటిది ఎప్పుడో వచ్చింది. ఈ రెండూ మాత్రం కొనాల్సిన జాబితాలో ఉన్నాయి..:) ఎప్పుడో తర్వాతన్నా తీసుకోవచ్చు కదా అని ఊరుకున్నా.


ఇంకా.. పాత ఇంగ్లీష్ నవలలు ఏభైకి, అరవైకి రెండు చోట్ల అమ్ముతున్నారు. మంచివి ఎన్నుకుని టైమ్ పాస్ కీ, ప్రయాణాల్లో చదవటానికి కొనుక్కోవచ్చు. పిల్లల పుస్తకాలు కూడా ఓల్డ్ స్టాక్ అనుకుంటా తక్కువ ధరకి అమ్ముతున్నారు. అవి కూడా కొన్ని కొంటే,  ఇంటికి పిల్లలెవరైనా వస్తే ఇవ్వటానికి పనికివస్తాయి అనిపించింది.

చివరాఖరుగా పుస్తకాల షాపువాళ్ళిచ్చిన తాలుకూ రంగురంగుల క్లాత్ కవర్లు..బిల్లులు, ప్రదర్శన టికెట్లు :-)



Friday, November 30, 2012

యానాం - పాపికొండలు - పట్టిసీమ - 3






పట్టిసీమ :

మూడవరోజు ఎక్కడికెళ్ళాలో ప్లాన్ లేదు కాబట్టి కాస్త ఆలస్యంగా లేచాము. ఆ రోజు రాత్రికే కాకినాడలో అత్తయ్యగారిని కలిసి, రైలు ఎక్కాలి. అంతర్వేది, అదీ ఇది అని రకరకాలు అనుకుని చివరకు "పట్టిసీమ" వెళ్ళొచ్చేద్దాం అని నిర్ణయించుకున్నాము. పోలవరం బస్సులు ఎక్కమని మావయ్య చెప్పాడు. బస్టాండ్ లో మేం వెళ్ళిన సమయానికి పోలవరమ్ బస్సులేమీ లేవు. "తాళ్లపూడి" బస్సు ఉంది, అది ఎక్కమని టికెట్ కౌంటర్లో చెప్తే అది ఎక్కాము. ఆ బస్సు గోదావరి దాటి "కొవ్వూరు" మీదుగా గంటన్నర కి తాళ్లపూడి చేరింది. ఎర్రబస్సులెక్కి చాలా కాలమైంది. పైగా రోడ్డు కూడా బాగోలేదు. అక్కడ నుండి షేర్ ఆటోలో పట్టిసం వెళ్లటానికి అరగంట పట్టింది. ఆ రోడ్డు మరీ దారుణంగా ఉంది. అన్నీ గొయ్యిలే. పిల్ల ఇబ్బంది పడింది పాపం. దగ్గరే కదా వెళ్ళొచ్చేయచ్చు అనుకున్నాం కానీ రోడ్డు ఇంత ఘోరంగా ఉంటుందని తెలిస్తే ఏ టాక్సీనో మాట్లాడుకుని ఉందుమే అనుకున్నాం.  


పట్టిసీమకు వెళ్ళే రేవు దగ్గర షేరాటో దిగి రేవుకి వెళ్లాం. పేద్ద ఆంజనేయస్వామి విగ్రహం, అందమైన రేవు ఆహ్లాదాన్ని కలిగించాయి. అక్కడే జీళ్ళు చేసి అమ్ముతూంటే వాటి ఫోటోలు తీసా. దేవాలయానికి లడ్డూ ప్రసాదం కూడా అక్కడే చేస్తున్నారు. అవతల ఒడ్డుకు వెళ్ళిన పడవ రావటానికి కాసేపు ఆగాము. మేం  ఎక్కిన పడవలో మోటారు ఉంది కానీ అది మేము కాశీలో  ఎక్కిన తెడ్డు పడవలాగానే ఉంది. చెయ్యి పెడితే నీళ్ళు అందుతున్నాయి. పడవ వెళ్తుంటే వంగి నీళ్ళలో చెయ్యిపెట్టడం భలే తమాషాగా ఉంటుంది. కనుచూపు మేరదాకా చుట్టూరా అంతా నీళ్ళు, దూరంగా కనబడుతున్న పాపికొండలు, ఎదురుగా చిన్న కొండ మీద వీరేశ్వరస్వామి ఆలయం.. ఎంతో అందమైన దృశ్యం అది. ఈ మొత్తం ప్రయాణంలో మేము బాగా సంతోషంగా ఎక్కువసేపు గడిపిన ప్రదేశం ఇది.
















అవతల ఒడ్డు ఒక ద్వీపంలాగ ఉంది. పడవ లేకపోతే అవతలి ఒడ్డుకు మళ్ళీ వెళ్ళలేము. తిరిగి వెంఠనే వెళ్లకుండా రెండు మూడు ట్రిప్స్ వదిలేసి ఓ గంట సేపు అక్కడ గడిపాము. మిట్టమధ్యాన్నం ఒంటిగంట అవుతోంది. ఎండబాగా ఉంది కానీ నదీతీరం కాబట్టి చల్లగా ఉంది. తడిసిన ఇసుక సముద్రపు ఒడ్డును గుర్తుకు తెచ్చింది. గోదావరి అంచు, ఇసుక తప్ప ఇంకేమీ లేదక్కడ. మా పాప నీళ్లలో ఆడుతుంటే, లోతులేని ప్రాంతం చూపెట్టి అక్కడ ఆడుకోవచ్చన్నాడు పడవబ్బాయ్. ఇక అక్కడికి వెళ్ళి మేం కూడా మా మా లోకాల్లో ములిగిపోయాం. పిల్ల ఒడ్దునే ఇసుక గూళ్ళు కడుతూ కూచుంది. తనేమో కాస్త నీళ్లలోపలికి వెళ్ళారు. నేనేమో white డ్రస్ పాడవుతుందని మరీ నీళ్లలోపలికి వెళ్లలేదు. ఒడ్డునే కాస్త పాదాలవరకు నీళ్ళల్లో మునిగేలా చూసుకుని ఆ అంచమ్మటే నడుచుకుంటూ అటూ ఇటూ తిరిగాను. 


ఆ గోదావరి తీరం అంచున చాలా బుజ్జి బుజ్జి చేపల గుంపులు తెగ తిరిగేస్తున్నాయి కానీ ఎన్నిసార్లు ఫోటో తీసినా ఫోటోలోకి రాలేదవి. క్లిక్ మనేలోపూ పారిపోతున్నాయి. నా పాదాల మధ్యన  బుజ్జి బుజ్జి చేపలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే అలా నీళ్ళల్లో నడవటం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళీ కాస్త ఇవతలకి వచ్చి తడి ఇసుకలో నా పాదాలగుర్తులు కనబడేలా నడిచి వాటికి ఫోటో తీస్కున్నా :) అలా ఎంతోసేపు ముగ్గురం సరదాగా పట్టిసీమలో గడిపాము.








ఆ ప్రకృతిలో, నిశ్శబ్దంలో మమేకమవ్వాలని చేసే ప్రయత్నంలో నాకు Thoreau తన "Walden" ఎంత ఉద్వేగంతో రాసి ఉంటాడో అర్థమైంది. ఇటీవల ఓ పుస్తకంలో చదివిన నది నేర్పే పాఠాలు కూడా గుర్తుకువచ్చాయి.  ఈ చిన్నచిన్న ఆనందాలన్నీ ఆస్వాదించగలుగుతూ ఇక్కడే ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది. కానీ ఇక్కడుండేవాళ్ళు ఇలా అనుకోరేమో... సిటీ రణగొణధ్వనుల మధ్యనుంచి, ఆదరాబాదర జీవితాల నుండీ వచ్చాం కాబట్టి ఇలాంటి గొప్ప అనుభూతిని కలిగిందేమో అని కూడా అనిపించింది.

మేం వెనక్కి తిరిగి రాజమండ్రి వచ్చేసరికీ నాలుగున్నర. పాపకి అన్నం పేక్ చేసుకుని, ఇద్దరు మావయ్యల దగ్గరా శెలవు తీసుకుని బస్సు ఎక్కేసరికీ ఆరున్నర. కాకినాడ చేరేసరికీ పావుతక్కువ ఎనిమిది. ఈ చివరి కాసేపు మాత్రం హడావుడి అయ్యింది. మేమింకా రాలేదని అత్తగారికి కంగారు. అత్తయ్యగారిని తీసుకుని రైల్వేస్టేషన్ చేరేసరికీ సరిగ్గా ట్రైన్ వచ్చే టైం అయ్యింది. మర్నాడు పొద్దున్న ఇక్కడ రైలు దిగి ఇల్లు చేరేసరికీ పొద్దున్న ఏడున్నర. ఎనిమిదింటికి పిల్ల స్కూల్ ఆటో వస్తుంది. అప్పటి నుండీ మళ్ళీ నా మామూలు తకధిమి తకతైలు మొదలైపోయాయి !! ఎన్నాళ్ళకో అరుదుగా దొరికిన ఈ అందమైన అనుభూతిని, ప్రకృతి ఇచ్చిన ప్రశాంతతనీ మర్చిపోకూడదని ఇలా బ్లాగులో పొందుపరుచుకుంటున్నా..!


***              ***               ***


మరికొన్ని ఫోటోలు ఇక్కడ:





Thursday, November 29, 2012

యానాం - పాపికొండలు - పట్టిసీమ - 2





నేను బ్లాగు రాయటం మొదలెట్టినప్పటి నుండీ ఎందరో బ్లాగ్మిత్రులు తమ టపాల్లో "పాపికొండలు" అందాలు చూపించి, వారి అనుభూతిని పంచి.. ఊరించి ఊరించి... ఎలాగైనా పాపికొండలు చూడాలి అనే కోరికను బలపరిచేసారు..:)  కానీ ఎన్నిసార్లు ప్లాన్ వేసుకున్నా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అందుకని అటువైపు వెళ్తున్నా కూడా ఉన్న రెండురోజుల్లో ఈసారి పాపికొండలు ప్రయాణం కుదరదులే అని అసలు ప్లాన్ చేసుకోలేదు మేము. కానీ మేము యానాం దగ్గర ఉళ్ళో ఉండగా మా పిన్నత్తగారు ఫోన్ చేసి నేను టికెట్లు బుక్ చేస్తాను. శెలవుల టైమ్ కాదు కాబట్టి రష్ తక్కువగానే ఉంటుంది అందరం సరదాగా వెళ్దాం అని వత్తిడి చేసేసరికీ సరేననేసాం. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి "అనుకోకుండా బంధువులు వస్తున్నారు మాకు కుదరదు.." అనేసారు. మా అత్తగారు కూడా రాలేననేసారు. అనుకున్నాం కదా మనం వెళ్ళొచ్చేద్దాం అని శ్రీవారిని ఒప్పించాను.


అసలు రాజమండ్రి నుండి భద్రాచలం దాకా బోటులో వెళ్ళాలి అనేది మా కోరిక. సమయాభావం వల్ల పేరంటపల్లి వరకే టికెట్ తీసుకున్నాం. పొద్దున్నే ఏడున్నరకే రావాలని టూరిజం వాళ్ళు చెప్పారు. మేం వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఆ రాత్రికి కాకినాడ వచ్చి, అక్కడ నుంచి రాజమండ్రి చేరేసరికి పదకండు అయ్యింది. పొద్దున్నే లేచి ఏడున్నరకల్లా పుష్కరాల రేవు వద్దకు చేరాం. హైదరాబాద్ లో చలి చంపుతోంది కానీ ఇక్కడ చలి జాడే లేదు. పొద్దున్నే చుర్రున ఎండ. ఎనిమిదిన్నరక్కూడా మమ్మల్ని ఎక్కించుకోవాల్సిన టూరిజం వాళ్ల బస్సు రాలేదు. టిఫిన్, భోజనం వాళ్ళే బోటులో పెడతానన్నారు. పిల్లకి ఇంట్లోనే తిఫిన్ పెట్టేసి, దారిలో అది తినడానికి బిస్కెట్లు,బ్రెడ్ మొదలైనవి కూడా కొని తెచ్చాను. బస్సు రాలేదు కదా అని ఈలోపూ రేవులోకి వెళ్ళి కాసేపు గోదారిని చూసి వచ్చాం..:) తొమ్మిదవుతూండగా వచ్చింది బస్సు. బస్సులో వెళ్తుండగా ఫోటోలు తీద్దాం అని బ్యాటరీలు వేసేసరికీ కెమేరా "లో బ్యాటరీ" అని బ్లింక్ అవ్వటం మొదలెట్టింది. రాత్రంతా చార్జ్ చేసా కదా..ఏమయ్యిందో తెలీలే...:( ఇంతదూరం రాకరాక వచ్చి ఫోటోలు తీసుకోలేకపోతే...నా ప్రాణం గిలగిలలాట్టం మొదలెట్టింది. పాపికొండలు ఫోటోలు తీసాకా అప్లోడ్ చెయ్యమని ఎంతమంది చెప్పారో ! బస్సువాడు పురుషోత్తపట్నం రేవుకి తీస్కెళ్ళి అక్కడ బోటు ఎక్కించాడు. ఆ రేవులో డ్యూరాసెల్ బ్యాటరీలు దొరకలేదు. దారిలో గండి పోచమ్మ గుడి వద్ద దొరుకుతాయి అనిమాత్రం చెప్పారక్కడ. ఏడుపుమొహం వేసుకుని బోటెక్కి కూచున్నా.









బోట్ లోపల ఏసి ఉన్నా, పైన అయితే బాగా చూడచ్చని పైనే కూచున్నాం. కడుపు నకనకలాడుతుంటే పదకొండింటికి తిఫిన్ పెట్టాడు. పెద్ద బాలేకపోయినా ఆకలి మీద తినేసాం. గండి పోచమ్మ గుడి ఎప్పుడు వస్తుందా...అని నిమిషాలు లెఖ్ఖేసుకుంటూ కూచున్నా. వచ్చింది. శ్రీవారు బ్యాటరిల కోసం వెళ్లారు. ఊళ్ళో బయల్దేరేప్పుడు మా మొబైల్ ఛార్జర్స్ తేవటం మర్చిపోయా :( రైల్లో అది గమనించాకా కూడా సుభ్భరంగా పాటలు పెట్టుకు వినేసా. రైలు దిగేసరికీ మా ఇద్దరి ఫోన్లు ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఇప్పుడు తిరిగి బోట్లోకి అంతా వచ్చేసారు కానీ తను రాలేదు. ఫోన్ చెయ్యటానికి ఇద్దరి వద్దా ఫోన్లు లేవు. ఎందాకా వెళ్లారో తను... నా కంగారుకి తోడు అన్నీ ఇలాగే అవుతాయి అని నన్ను నేను బాగా తిట్టేసుకున్నా ! "మావారు రావాలి..కాసేపు ఆపమని బోటువాడికి చెప్పా.." చేతులూపుకుంటూ వస్తున్న మావారిని చూసి నా కంగారు ఎక్కువయ్యింది. మెట్లెక్కి పైకి వచ్చి "హాయిగా ట్రిప్ ఎంజాయ్ చెయ్యి. ఫోటోల గురించి మర్చిపో..." అన్నారు. మరో నిమిషంలో కుళాయి కారుతుంది అనగా జేబులోంచి బ్యాటరీలు తీసారు. వెంఠనే వెయ్యి వాట్లు బల్బ్ లా నా మొహం వెలిగిపోయింది. అమాంతం బ్యాటిరీలు లాగేసుకుని కెమేరాలో వేసేసి కరువుతీరా ఫోటోలు తీసేయటం మొదలెట్టేసా :)


దారిలో వచ్చే గిరిజన పల్లెల వివరాలు, షూటింగ్ స్పాట్స్ (సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి మొదలైన సినిమాలు) అన్నీ చూపిస్తూ మధ్య మధ్య కాటన్ దొర గారి గురించి, గోదావరి నది గురించీ, పోలవరం ప్రాజక్ట్ గురించి కబుర్లు చెప్పాడు గైడ్. మధ్యాన్నం భోజనాలు బానే ఉన్నాయి. కాస్త కడుపు నిండకా చుర్రున ఎండ మండిస్తుంటే క్రింద ఏసి హాల్లోకి వెళ్ళి సేదతీరాం. దాదాపు రెండింటికి "పాపికొండలు" మొదలయ్యాయి. అసలు అక్కడ నుండే బోటు ప్రయాణం ఆస్వాదించాం అని చెప్పాలి. నెమ్మదిగా బోటు కదులుతుంటే, బయట నడవలో నిలబడి ప్రవహించే గోదారినీ, అటుఇటు పచ్చని చెట్లతో మనల్ని దాటి వెన్నక్కు వెళ్తున్న పాపికొండల అందాలనూ చూసి తీరవలసిందే. అక్కడ కోండల్లో ఉండే గిరిజనవాడల గురించి వింటుంటే నాకు వంశీ "మన్యంరాణి" గుర్తుకు వచ్చింది. దారిలో నైట్ స్టే ఉండే వెదురు కాటేజీలు అవీ చూపించాడు.

















 చివరి మజిలీగా పేరంటపల్లి లో శ్రీరామకృష్ణ మునివాటిక,శివాలయం చూసిరమ్మని ఆపాడు. మునివాటిక పక్కగా అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గలగలా శబ్దం చేస్తూ రాళ్ల మీదుగా పారుతున్న చిన్న జలపాతం అత్యంత మనోహరంగా ఉంది. ఆ నీళ్ళు కూడా చాలా నిర్మలంగా మొహం కడిగితే హాయిగా అనిపించింది. అసలిలాంటి జలపాతాల తాలూకూ నీటిలో, నదీ ప్రవాహాల్లో బోలెడు ప్రాణ శక్తి ఉంటుందిట. వాటిని తాగినా, స్నానం చేసినా ఎంతో మంచిదిట. నది నీటిని గొట్టాల్లోంచి ప్యూరిఫై చేసి మన ఇళ్ళకి తెప్పించటంతో నీటిలోని ప్రాణశక్తి నశిస్తుందిట. అందుకే నదీ స్నానం, జలపాతాల్లో స్నానం మంచిదనేదీ, ఆ నీళ్ళు బాటిల్స్ లో పట్టుకుని తెచ్చుకునేదీ. ఈసారి వస్తే ఈ చోటుకు ఎక్కువ సమయం గడిపేలా రావాలని అనుకున్నాం. రేవు మొదట్లో ఉన్న పేద్ద చెట్టు మరొక ఆకర్షణ. పైకి కనబడేలా చెట్టు తాలూకూ పేద్ద పేద్ద వేళ్ళు బయటకే ఉండి విచిత్రంగా తోచింది. చాలా మంది వాటిపై కూచుని కబుర్లాడుకుంటున్నారు. రాత్రపూట అక్కడ తప్పకుండా భయంవేస్తుందేమో! "గోపి,గోపిక గోదావరి" సినిమాలో ఓ పాట వెనుక కనబడేది ఈ చెట్టే అనుకుంటా.






తిరుగు ప్రయాణంలో మళ్ళీ పైన బావుంటుందని పైకి చేరాం. ఈసరికి చాలా మంది క్రిందనే కునికుపాట్లు పడుతుండటంతో పైన బోటు గోడ పక్కనే కుర్చీలు వేసుకుని కూచోవటానికి వీలయ్యింది. సాయంత్రం అరగంట సేపు గుప్పున వాసనలు తెప్పించి ఓ గుప్పెడు పకోడీలు, కస్తంత టీ ఇచ్చాడు. చక్కని సాయంత్రం, చల్లని గాలి, వేగం తగ్గి సద్దుమణిగిన నది ప్రవాహం, ముసురుతున్న చీకట్ల నడుమ అక్కడక్కడ ఒడ్డునున్నగూడాల్లో మిణుకు మంటున్న దీపపు కాంతులు, కాసేపటికి నిర్మలంగా ఉన్న ఆకాశంలోంచి తోడొచ్చిన తెల్లని చందమామ... షాల్ కప్పుకుని ఆ బోట్ డెక్ మీద ఎంత ప్రశాంతతని ఆస్వాదించానో మాటల్లో చెప్పలేను. అయితే ఆ ఆనందాన్ని పరిపూర్ణం చెయ్యటానికి వెనకాల ఏ సంతూరో, ఫ్లూటో.. వాద్య సంగీతం వినిపించి ఉంటే ఎంతో గొప్పగా ఉండేది. పేద్ద సౌండ్ లో సినిమా పాటలు పెట్టి, వాటికి నృత్యం చెయ్యటం, పొద్దు గడపటానికి అన్నట్లు హౌసీ మొదలైన గేమ్స్, బోట్లో ఉన్న మనుషులతో డాన్సులు చేయించటం మొదలైనవి మా ఇద్దరికీ అస్సలు నచ్చలేదు. చాలా చిరాగ్గా, ఆనందానికి అంతరాయంగా తోచింది వారి ఎంటర్టైన్మెంట్.


ప్రపంచానికి దూరంగా, ప్రశాంతంగా, ప్రకృతి ఒడిలో ఓ రోజంతా గడపటానికి, మనం రీఛార్జ్ అవ్వటానికీ ఆ బోటు ప్రయాణం చాలా ఉపయోగపడుతుంది. బోటులో ఉండి ప్రకృతిని ఆస్వాదించకుండా ఈ కార్యక్రమం ఎందుకో, పనిగట్టుకుని మా పొద్దు గడపటానికి వాళ్లంత శ్రమ పడ్డం ఎందుకో తెలీలే. టివీ చూపినట్లు అక్కడ కూడా డాన్స్, గేమ్స్ ఎందుకో అర్థం కాలేదు. అవి ఒడ్డున ఉండి కూడా చేయచ్చు. బోట్ ఎక్కటం ఎందుకు? ఆ ఇద్దరు అబ్బాయిలూ చాలా కష్టపడి ఆ డాన్సులు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద పెద్దవాళ్ళు బోట్లలో వచ్చినప్పుడు వాళ్లకి అవకాశాలు వస్తాయని, టిప్స్ వస్తాయని అలా చేస్తున్నాం అని వాళ్లు చెప్పటం, డబ్బులు అడగటం విచిత్రంగా తోచింది. ఇంకో విచిత్రం ఏంటంటే దాదాపు అందరూ వాళ్ల డాన్సులు ఎంజాయ్ చేసి, వాళ్ళు డాన్స్ చేయిస్తే కూడా పులకించిపోతూ, మెలికలు తిరిగిపోతూ డాన్సులు చేసేసి ఆనందించేయటం ! బహుశా మేమే ఆదివాసుల్లాగానో, గ్రహాంతరవాసుల్లాగానో ఉన్నమేమో. అందుకే మేము అందరిలా ఎంజాయ్ చెయ్యలేకపోయాం. అసలు అంత చక్కటి నిశ్శబ్దాన్ని ఆస్వాదించే అవకాశం ఊళ్లల్లో జనజీవనస్రవంతిలో వస్తుందా? ప్రకృతిని అంత నిశ్శబ్దంగా ఆస్వాదించగల అవకాశం ఎక్కడుంది? నేల మీద దొరకని అందమైన నిశ్శబ్దాన్ని ఆ కొండలు, నదీప్రవాహం అందిస్తుంటే జనాలు ఎందుకు ఆస్వాదించలేరో తెలీలేదు..:((






మరొక నచ్చని విషయం.. బోటు ప్రయాణం పేరుతో గోదావరిని చెత్తతో నింపటం. వద్దంటున్నా ప్లాస్టిక్ గ్లాసులు, తినేసిన చిప్స్ తాలుకూ ప్లాస్టిక్ కవర్లు నదిలో పారేయటం. నదేమన్నా డస్ట్ బిన్నా? ఇంకా ఘోరమేమిటంటే తుక్కు పాడేయద్దని చెప్పిన బోటువాళ్ళే మాకు భోజనం పెట్టిన ప్లేట్లు, గిన్నెలూ, డబ్బాలూ అక్కడే కడిగేస్తున్నారు. ఆ సబ్బునీళ్ళన్నీ  గోదావరిలో కలిసిపోతున్నాయి...:(( ఇలా రోజుకి ఎన్ని బోట్లవాళ్ళు ఎన్ని ప్లాస్టిక్ గ్లాసులు, ఎన్ని తినేసిన ఖాళీ కవర్లు, ఎంత సబ్బు నీరు గోదావరిలో కలిపేస్తున్నారో కదా...!!! ఇక బోటు మీదున్న రెండు బాత్రుమ్స్ తాలూకూ నీళ్ళు ఎటు పోతాయో పరమాత్మకే ఎరుక ! విహారం పేరుతో నన్ను ఇన్నిరకాలుగా అపవిత్రం చేస్తున్నారేమని గోదావరితల్లి అడగలేదని అలుసు కదూ ??! నా మాట ఈ బ్లాగులో కల్సిపోయేదే అయినా.. విహారం వెళ్ళే చోట్ల ఒడ్డున బాత్రూమ్స్, బోటులో కాక ఒడ్డునే ఆగిన చోటనే తినే ఏర్పాట్లు, బోటులో వినటానికి కేవలం వాద్య సంగీతం ఏర్పాటు చేస్తే మాత్రం ఈ ప్రయణం అంత అద్భుతమైనది మరోటి ఉండదు.


చివర చివరకి పురుగులు వచ్చేస్తున్నాయని అందరం క్రిందకు చేరిపోయాం. రాత్రి ఏడుంపావుకల్లా ఒడ్డు చేరి, మేం మళ్ళీ రాజమండ్రి చేరేసరికీ ఎనిమిదిన్నర అయ్యింది.



పాపికొండలు తాలుకూ మరిన్ని ఫోటోలు "ఇక్కడ" చూడండి...


(రేపు చివరిరోజు ప్రయాణం 'పట్టిసీమ' కబుర్లు..)

Tuesday, November 27, 2012

యానాం - పాపికొండలు - పట్టిసీమ -1




కాకినాడ - యానాం - రాజమండ్రి - పాపికొండలు - పట్టిసీమ..
పడవలు - రేవులు - గోదావరి - కొబ్బరిచెట్లు..
రెల్లుపూలు - ఇసుక - సూర్యుడు - వెన్నెల..
అన్నింటితో మరోసారి చెలిమి చేసి.. 
నేను ఈమట్టిలో పుట్టినదాన్నే.. అని..
ప్రతి చెట్టుపుట్టకీ గుర్తుచేసి..
తిరిగి తిరిగి.. అలసి సొలసి.. వచ్చా !!


బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో వెళ్ళిన "తూర్పుగోదావరి ప్రయాణం" కబుర్లు సిరీస్ రాసాను. అప్పుడు బిక్కవోలు, ద్వారపూడి, ద్రాక్షారామం, కోటిపల్లి, యలమంచలి మొదలైన చోట్లకి వెళ్ళాం. ఇప్పుడు ఈ ప్రయాణంలో అటువైపే వెళ్ళినా మరికొన్ని చూడని ప్రదేశాలు చుట్టి వచ్చాం ...







శిర్డీ ప్రయాణం అనుకోనిదే కానీ మొన్నవారంలో వెళ్ళివచ్చిన ప్రయాణానికి మాత్రం రెండునెలల క్రితమే రిజర్వేషన్లు చేయించాము. ఈ ప్రయాణంలో కాకినాడ, యానాం, రాజమండ్రి, పాపికొండలు, పట్టిసీమ చుట్టివచ్చాం. అసలు యానాం దగ్గర్లో ఉన్న ఒక ఊరికి ముఖ్యమైన ఫంక్షన్ నిమిత్తం వెళ్ళాము. ముందుగా కాకినాట్లో దిగి అత్తయ్యగారిని మా పెద్దత్తగారి దగ్గర దిగపెట్టి, మా కోసం పంపిన కారులో యానాం దగ్గర ఉన్న బంధువుల ఊరికి బయల్దేరాం.



చాలా చిన్న పల్లెటూరు అది. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం. బహుశా పల్లెటూర్లన్నీ ఇలానే ఉంటాయేమో. దేశంలో ఇటువంటి రిమోట్ పల్లెలు ఎన్ని ఉన్నాయో అనిపించింది. ప్రతి ఇంటికీ చక్కని పెరడు, అందులో బోలెడు మొక్కలు, కొందరి ఇళ్ళల్లో ఓ పక్కగా ఆవులు, గేదెలు. మేం వెళ్ళిన ఇంట్లో మందారాలు, పనస, బత్తాయి, మామిడి, అరటి, ఉసిరి, పొగడ చెట్లు ఉన్నాయి.  అపార్ట్మెంట్లు ఎంత సౌకర్యంగా, అధునాతనంగా ఉన్నా ఇలా మొక్కలు వేసుకుందుకు ఇంటి చూట్టూ జాగా ఉండే ఇల్లే ఇల్లు కదా..! మా పాప అయితే "అమ్మా ఇక్కడే ఉండిపోదాం.. బావుంది" అని గొడవ. పెరట్లో నుయ్యి చూసి శ్రీవారు అక్కడే ఆగిపోయారు. వాళ్ల నూతిలో నీళ్ళన్నీ మీరే పోసేసుకునేలా ఉన్నారు ఇక రండి...అని పిలవగా పిలవగా కదిలారు :) నాకు మా కాకినాడ ఇల్లు గుర్తుకు వస్తే, తనకి ఏలూరులో ఉన్న వాళ్ళ అమ్మమ్మగారి ఇల్లు గుర్తుకొచ్చిందట. అలా ఇద్దరం ఎవరి స్మృతుల్లో వాళ్లం తిరగాడుతూ ఉండిపోయాం..!





ఆ సాయంత్రం కాసేపు ఆ ఊరు చూసిన తర్వాత యానాం బయల్దేరాం. యానాం ఫెర్రీ రోడ్డులో photos..


















యానాం ఫెర్రీ రోడ్డులో కాసేపు గడిపి, తిరిగి ఊరు వెళ్తూంటే దారిలో ఒకచోట అచ్చం వంశీ సినిమాల్లో సీన్ లాగ బావుందని ఆగాం. గోదావరి ఒడ్డు, పడవలు, జాలరులు, ఇసుకతిన్నెలు, సూర్యాస్తమయం... ఆ సాయంత్రం మాకందించిన అనుభూతి నిజంగా మరువలేనిది. లోతులేని గోదారినీళ్ళలో కాళ్ళు పెట్టుకుని నించోవటం భలేగా అనిపించింది. చేపల కోసం అప్పుడు వెళ్ళి, వల పన్ని రాత్రంతా గోదారి పైనే ఉండి, మళ్ళీ పొద్దున్నే వస్తారుట. అక్కడి జాలరులు చెప్పారు. అందుకే నిద్ర వచ్చినా ఇబ్బంది లేకుండా ఒక్కో పడవలో ఇద్దరుంటారుట.












 పిల్లతో పోటీపడి అక్కడున్న ఇసుకతిన్నెలు ఎక్కిదిగటం, ఆ ఇసుకతిన్నెలపై నిలబడి దూరంగా ఉన్న బ్రిడ్జి నీ, సూర్యాస్తమయాన్నీ, ఆ కిరణాలవల్ల మిలామిలా మెరుస్తున్న గోదారినీ చూడటం గొప్ప అనుభూతి. రైలు అందుకోవటానికి వెనక్కి వెళ్పోవాలని అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాం. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కువ సేపు గడపాలని గాఠ్ఠిగా అనుకున్నాం. రోడ్డు మీదకి వచ్చేసరికీ  కన్నులకింపైన దృశ్యం.








వెనక్కెళ్ళే దారిలో కొబ్బరి చెట్లతో పాటూ అరటిచెట్లు, వాటికి వేళ్ళాడుతున్న గెలలు, అరటిపూలూ కన్నులపండగ చేసాయి. అయితే, ఈసారి కూడా నా చిరకాల కోరిక తీరలేదు..:( ఎక్కడా కూడా తామరపూలున్న కొలనేది కనబడనేలేదు. మేము వచ్చామని తెలిసి మా పిన్నత్తగారు పాపికొండలు ట్రిప్ ప్లాన్ చేసారు అప్పటికప్పుడు. ఎలాగూ పొద్దున్నే బోట్ దగ్గరకు వెళ్లాలి కదా అని ఆ రాత్రికి రాజమండ్రి చేరుకున్నాం.  కానీ అనుకోకుండా బంధువులు వచ్చారని పాపికొండలు ట్రిప్ కు మా పిన్నత్తగారు వాళ్ళూ డ్రాప్ అయిపోయారు. అనుకున్నాం కదా మానేయటం ఎందుకని, మేం మాత్రమే వస్తామని ట్రావెల్స్ వాళ్లకి చెప్పేసాం.



మొదటిరోజు ప్రయాణం తాలూకూ మరిన్ని ఫోటోలు ఇక్కడ:
http://lookingwiththeheart.blogspot.in/2012/11/blog-post_28.html


(తదుపరి టపాలో పాపికొండలు ప్రయాణం కబుర్లు...)