Wednesday, November 30, 2011
మిథునం : దస్తూరీ తిలకం
1998 లో "రచన" పత్రికలో బాపూగారి స్వదస్తూరిలో మిథునం కథానిక అచ్చయినప్పుడు; ఆ కథానిక, ఇంకా శ్రీరమణ గారి "బంగారు మురుగు" కథ తాలూకూ జిరాక్స్ కాపీ, రెండూ శ్రీకాంత శర్మగారు నాన్నకు ఇచ్చారు. అపురూపమైన బాపుగారి స్వదస్తూరిలో మిథునం కథానిక, ఆద్యంతం మధురమైన "బంగారు మురుగు".. రెండు కథలూ మా ఇంటిల్లిపాదికీ ఎంతగానో నచ్చేసి, ఆ రెండు కథలూ మరిన్ని జిరాక్సులు తీయించి మరికొందరు సాహితీ మిత్రులకూ, బంధువులకూ అప్పట్లో కొరియర్లో కూడా పంపించాము. తర్వాత ఇంటర్నెట్ లో బాపుగారి దస్తూరితో ఉన్న కథానిక పెట్టారనీ, బాగా ప్రాముఖ్యం పొందిందనీ విన్నాం.
తర్వాత మద్రాసు రేడియోస్టేషన్ నుంచి మిథునం కథ నాటక రూపంలో ప్రసారమైంది. శ్రీమతి పద్మజా నిర్మల గారు ప్రొడ్యూస్ చేసిన ఈ నాటకంలో సినీనటులు సుత్తివేలు, రాధాకుమారి గారూ అనుకుంటా ప్రధాన పాత్రలు పోషించారు. వాసుదేవన్ నాయర్ గారు ఈ కథపై తీసిన మళయాల సినిమా గురించి అందరికీ తెలిసినదే. తనికెళ్ళ భరణి గారు ఈ కథను తెలుగులో సినిమాగా తియ్యబోతున్నారన్నది కొత్త వార్త.
ఇప్పుడు మరొక కొత్తవార్త ఈ కథానిక అదే బాపూ గారి స్వదస్తూరీతో "ఒకే ఒక్క మిథునం" పేరుతో పుస్తకరూపంలో వచ్చింది. రచయిత శ్రీరమణ గారి ముందుమాట కొత్త విషయాలను తెలిపితే, శ్రీ జంపాల చౌదరి గారి ముందుమాట మనసుకు హత్తుకునేలా ఉంది.
ఈ పుస్తకాన్ని నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా పంపిన బ్లాగ్మిత్రుడు, అంతకు మించి మంచి సహోదరుడు అయిన శంకర్ గారికి బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు. అభినందనలు.
Tuesday, November 29, 2011
కొత్త మొక్కల్.. కొత్త మొక్కల్...
చలికాలంలో పూసే చామంతులు ఎన్ని రంగులు ఉన్నా మళ్ళీ కొత్త మొక్కలు కొందామనిపిస్తుంది. పెద్ద చామంతులు ఐదారు రంగులున్నాయి కదా అని ఈసారి చిట్టి చామంతులు కొన్నా. కుండీ నిండుగా బాగా పూస్తాయి ఇవి.
తెల్లటి ఈ స్వచ్ఛమైన గులాబీలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా? ఒకే చెట్టుకి ఎన్ని మొగ్గలేసాయో...
ఎన్నో రోజుల నుంచీ చెంబేలీ తీగ కొనాలని. కుండీలో బాగా పెరగదేమో అని ఆలోచన. మొత్తానికి ఈసారి కొనేసా. మొగ్గ పింక్ కలర్లో ఉండి పువ్వు పూసాకా తెల్లగా ఉంటుంది. చాలా మత్తైన సువాసన ఈ పువ్వుది. చాలా ఇళ్ళలో గేటు పక్కగా గోడ మీదుగా డాబాపైకి పాకించి ఉంటుందీ తీగ.
క్రింది ఫొటోలోని గులాబీ రంగు గులాబి పువ్వు చెట్టు విజయవాడలో మా క్వార్టర్ గుమ్మంలో ఉండేది. చాలా పేద్ద చెట్టు. రోజుకు ఇరవైకి మించి పూసేది. ఎన్ని కొమ్మలు ఎందరికి ఇచ్చామో...అందరి ఇళ్ళలో ఈ మొక్క బతికింది. నర్సరిలో కనిపించగానే వెంఠనే కొనేసా.
Monday, November 28, 2011
చాలా సేపైంది..
చాలా సేపైంది
ఎంత సేపని కూర్చోను...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..
చీకట్లు కమ్మే సంజెవేళ ఎంతసేపని నిరీక్షించడం
ఆశనిరాశల తక్కెడకి ఎటుమొగ్గాలో తెలీని సందిగ్ధం
గెలుపుఓటమిల నడుమ మనసు ఆడుతోంది కోలాటం
రేపైనా వస్తావన్నది ఒక రిక్త నమ్మకం..
జీవిత చక్రాల క్రింద నలుగుతున్న రేయీపగళ్ళు..
చూస్తూండగానే పేజీలు మారిపోతున్న కేలెండర్లు !
జ్ఞాపకాల మాటున కదలాడే నీ ఊసులు
అలుపెరుగని కెరటాల లాస్యాలు
ఎంత దూరం పరుగులెట్టినా వద్దని
మళ్ళీ నీ దరికే చేరుస్తాయినన్నవి !!
ఎదురుచూపులు నావరకే ఎందుకు
నువ్వూ నాకోసం కలవరించకూడదూ..
అని తహతహలాడుతుంది మనసు
వెర్రిది.. దానికేమి తెలుసు
నీ మనసు రాయి అని
ఈ జన్మకు అది జరగని పని అని
అయినా ఎందుకో ఈ ఎదురుచూపు..
నాకోసం నువ్వొస్తావని... కలలు తెస్తావని..
చాలా సేపైంది..
ఎంతసేపని కూర్చోనూ...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..
tujhe bhulaa diyaa -- Mohit Chauhan
స్వరంలో గాంభీర్యం, హై పిచ్ లో కూడా సడలని పట్టు, కొన్ని పదాలు పలికేప్పుడు ఒక విధమైన జీర మొదలైనవన్నీ ఇతని గళంలోని ప్రత్యేకతలు. మొదటిసారి "మై మేరీ పత్నీ ఔర్ వో" సినిమాలో "గుంఛా కోయీ" పాట విన్నప్పుడూ ఆహా ఓహో అనుకున్నా. "jab we met " లో " tu hi tu.." ఆ తర్వాత అతనికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తెచ్చిన Delhi-6 లో "masakali" పాట సూపర్.
ఆ తర్వాత "న్యూయార్క్" సినిమా చూస్తున్నప్పుడు "తూ నే జో నా కహా... " పాట బాగా నచ్చేసి పాడింది ఎవరా అని చూస్తే "మోహిత్ చౌహాన్" అని ఉంది. ఆ పాట ఎన్నిసార్లు విన్నానో....అంత నచ్చేసింది. సమాచారం వెతికితే కాలేజీ రోజుల్లో Silk route band తరఫున V channel, Mtv ల్లో "డూబా డూబా " అనుకుంటూ పాడిన అబ్బాయి ఇతనే అని తెలిసి ఆశ్చర్యపోయా.
తర్వాత అతను పాడినవాటిల్లో నాకు నచ్చినవి:
* "luv aaj kal" లో "ye dooriyaan" పాట
* once upon a time in mumbai"lO "పీ లూ..."
* rajneeti"లో "భీగీ సీ.."
* "Rockstar" లో దాదాపు చాలానే అద్భుతంగా పాడాడు.
ఇప్పుడే ఇంకో కొత్త పాట add అయ్యింది. "anjaanaa anjaani" లో "తుఝే భులా దియా". ఈ పాట ఒకరోజు Fmలో వస్తూంటే సంగం నుంచీ విన్నా. అదే రికార్డ్ చేసి తర్వాత మర్చిపోయా. ఇవాళ మళ్ళీ ఏ ఫైల్ కనబడితే ఆ లైన్స్ తో నెట్లో వెతికితే ఫలానాసినిమాలోది అని తెలిసింది. పాట నాకు బాగా నచ్చింది. సాహిత్యం కూడా.
Saturday, November 26, 2011
ఈ కార్తీకం కబుర్లు
హమ్మయ్య ! పొద్దున్నే లేచి "పోలి స్వర్గం" దీపాలు వెలిగించేసాను. ఈ ఏటి కార్తీకమాస పూజలన్నీ సమాప్తం. అసలు పుణ్యప్రదమైన కార్తీక మాసంలో ముఖ్యంగా చెయ్యాల్సినవి దీపారాధన, పురాణ శ్రవణం లేదా పఠనం, ఉపవాసం, నదీస్నానం, దీపదానం, వనభోజనాలు మొదలైనవిట. వీటిలో కుదిరినవి చేసాను మరి. నదీస్నానం వీలయ్యేది కాదు కాబట్టి అది కుదరలేదు. ఉపవాసాలు చిన్నప్పుడు అమ్మతో ఉండేదాన్ని కానీ పెద్దయ్యాకా ఎందుకో వాటి జోలికి పోవాలనిపించలే. ఉండలేక కాదు కానీ ఏమిటో నమ్మకమూ, ఆసక్తి లేవంతే. so, ఉపవాసాలు కూడా చెయ్యలేదు.
నెలరోజులూ సాయంత్రాలు తులశమ్మ దగ్గర దీపంతో పాటూ కార్తీకపురాణంలో ఒకో అధ్యాయం చదివేసుకున్నా. కార్తీకపురాణంలో, సోమవారాలు శివలయంలో పొద్దున్న కానీ, సాయంత్రం కానీ దీపం వెలిగిస్తే బోలెడు పుణ్యమని రాసారు కదా అని శ్రధ్ధగా ప్రతి సోమవారం వెళ్ళి ఉసిరి చెట్టు క్రింద ఆవునేతిదీపం పెట్టేసి, పట్టుకెళ్ళిన పుస్తకంలోంచి నాలుగైదు స్తోత్రాలు అవీ చదివేసుకుని మరీ వచ్చేదాన్ని. ఆ గుడి ప్రాంగణం విశాలంగా ఉండి పేద్ద పేద్ద చెట్లు ఉంటాయి. నాకిష్టమైన కాగడా మల్లెపూల చెట్టు కూడా. దాని క్రిందే కూచునేదాన్ని మంచి సువాసన వస్తూంటుందని....:))
మధ్యలో ఓ ఆదివారం కీసరగుట్ట వెళ్ళి రామలింగేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్న పార్కులో అందరూ వనభోజనాలు చేస్తూంటే మేమూ సేదతీరాం. ఓ చెట్టు క్రింద కూచుని గుళ్ళో కొన్న పులిహార పేకేట్లు తినేసాం. తీరా చూస్తే మేం కూచున్నది బిళ్వవృక్షం క్రిందన. చుట్టూరా బోలెడు మండి వంటలు కూడా అక్కడే వండుకుంటున్నారు. భలే భలే మనకూ వనభోజనాలయిపోయాయి అనేసుకున్నాం.
క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసే పూజ నాకు చాలా ఇష్టం కాబట్టి అది బాగా చేసుకున్నా. ఈసారి అమ్మ మాటికి వచ్చింది. నేను, అమ్మ, పాప కలిసి పూజ చేసుకుంటుంటే భలే ఆనందం వేసింది. మళ్ళీ కార్తీకపౌర్ణమి పూటా శివాలయంలోనూ , ఇంట్లో తులశమ్మ దగ్గరా 365 వత్తులతో, ఉసిరి కాయతోనూ దీపం వెలిగించానా, ఇంకా ఎందుకైనా మంచిదని విష్ణుసహస్రనామాలు అవీ కూడా చదివేసా. మధ్యలో నాగులచవితి వచ్చిందా...అప్పుడు కూడా పుట్టకు వెళ్ళే ఆనవాయితీ లేదు కాబట్టి ఇంట్లోనే తులశమ్మలోని మట్టితో పుట్టలా చేసి, అందిమీద నావద్ద ఉన్న రాగి నాగపడగను కూచోబెట్టి ఇంట్లో అందరితో పాలు పోయించా. చిమ్మిలి, చలివిడి చేసి నైవేద్యం పెట్టా కానీ పుట్టకు ఫోటోతియ్యటం మర్చిపోయా...:( ఇక పౌర్ణమి అయిపోతే కార్తీకంలో మేజర్ పూజలన్నీ అయిపోయినట్లే. మిగిలిన రోజులు సాయంత్రాలు దీపం పెడుతూ ఉండటమే. నిన్నటి అమావాస్య దాకా.
అమావాస్య వెళ్ళిన పాడ్యమి తెల్లవారుఝామున "పోలి" అనే ఆవిడ కార్తీక దీపాలు ఇంట్లోనే, అదీ వెన్న చిలికిన కవ్వానికున్న వెన్నతో దీపాలు శ్రధ్ధగా పెట్టిన కారణంగా స్వర్గానికి వెళ్ళిందట. అందుకని ప్రతిఏడూ కార్తీకమాసం అయిపోయిన మర్నాడు పాడ్యమి తెల్లవారుఝామున లేచి నదీస్నానం చేసి, అరటిదొప్పలో ఆవునేతివత్తులు వేసి నదిలో దీపాలు వదులుతారు చాలామంది. నెలంతా దీపాలు పెట్టలేకపోయినా ఈ రోజు ముఫ్ఫై దీపాలూ పెడితే చాలని అన్ని దీపాలూ వదులుతారు. నదీ స్నానం చేసి అక్కడ దీపాలు పెట్టడం కుదరనివారు ఇంట్లోనే తులసమ్మ దగ్గర పళ్ళేం లోనో, పేద్ద బేసిన్ లోనో నీళ్ళు పోసి అందులోనే దీపాలు పెడతారు అమ్మలాగ. చిన్నప్పుడు అలా పళ్ళేంలో నీళ్ళల్లో అమ్మ దీపాలు పెట్టడం బావుండేది చూట్టానికి. ఇప్పుడు నేనూ అమ్మలాగ రాత్రే ఆవునెయ్యిలో వత్తులు వేసి ఉంచేసి, పొద్దున్నే అరటిదొప్పలో వత్తులు వెలిగించి నీళ్ళల్లో దీపాలు వదులుతున్నను క్రింద ఫోటోలోలాగ.
ఇంకా, కార్తీక మాసంలో ఎవరైనా పెద్ద ముత్తయిదువను పిలిచి పసుపు రాసి, పువ్వులు, పళ్ళు, పసుపు, కుంకుమ పెట్టి చీర పెడితే చాలా పుణ్యమని ఓ పుస్తకంలో చదివాను. ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తూంటే అమ్మనాన్న ఉన్నారని మా పిన్నిలిద్దరూ, మరికొందరు కజిన్స్ అంతాకలిసి ఓరోజు ఇంటికొచ్చారు. ఇంకేముంది నాకు పండగే పండగ. మొత్తం అయిదుగురినీ కూచోపెట్టి పసుపు రాసేసి, మిగిలినవన్నీ పెట్టి అందరికీ తలో చీరా పెట్టేసి దణ్ణం పేట్టేసా. ఎంత పుణ్యమో కదా. శభాష్ శభాష్... అని భుజం తట్టేసుకున్నా..! నేనూ ఖుష్. బంధువులూ ఖుష్. దేవుడూ ఖుష్.
ఇక ఇవాళ పొద్దుటే దీపాలు వదలటంతో కార్తీకం అయ్యింది. హామ్మయ్య అనుకుని గాఠ్ఠిగా ఊపిరి తీసుకుని ఓ పుస్తకం పట్టుకున్నానా, మార్గశిర శుధ్ధ పాడ్యమి నాడు విష్ణుసహస్రనామం చదివితే మంచిది అని ఉంది ఆ పుస్తకంలో. సరే ఇంత పొద్దుటే చీకట్లో చేసే పనేముంది అనేసుకుని ఆ సహస్రనామాలు కూడా పూర్తయ్యాయనిపించా !!
యూట్యూబ్ లో పోలి స్వర్గం కథ రెండూ భాగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చూడండి:
http://www.youtube.com/watch?v=a9459H0nerI&feature=related
Friday, November 25, 2011
అప్పుడేమైందంటే...
గత రెండు వారాల్లో ఇద్దరు ముగ్గురు ఫెండ్స్ మైల్ చేసారు. వారి మైల్స్ లో ఒకటే మెసేజ్..."సర్దుకోవటం అయ్యిందా? రోజూ చూస్తున్నా...బ్లాగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నావ్?" అని. ఏం రాయాలో తెలియక జవాబే రాయలేదు. నిన్నమరో ఫ్రెండ్ ఫోన్ చేసింది "ఎక్కడున్నావ్? ఏంటి సంగతులు?" అని. ఇక చెప్పక తప్పలేదు... " లేదు. మేం ఇక్కడే ఉన్నాం...వెళ్ళనే లేదు.." అని. 'అదేమిటి చెప్పావు కాదే...' అని ఆశ్చర్యపోయింది నా మిత్రురాలు ! అప్పుడేమైందంటే... అని చెప్పుకొచ్చాను..
చుట్టాలకూ, స్నేహితులకూ, బ్లాగ్మిత్రులకూ అందరికీ డప్పు కొట్టేసాను.. వెళ్పోతున్నాం.. వెళ్పోతున్నాం... అని. సామాను సగం సర్దేసాం. టికెట్స్ బుక్ చేసేసాం. పేకర్స్ వాడిని మాట్టాడేసాం. కొత్త ఊర్లో పాపకు స్కూలు మాట్టాడేసాం. నెల ముందే అక్కడ ఇంటికి అద్దెతో పాటూ ఏడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. ఇంక నాల్రోజుల్లో ప్రయాణం అనగా అప్పటిదాకా మౌనంగా ఉన్న పాత ఆఫీసు బాసుగారి బుర్రలో బల్బు వెలిగింది. ఓహో ఇతగాడు వెళ్పోతే ఎలా...అని కంగారు పుట్టింది. ఇక మొదలుపెట్టాడు నస. రిలీవ్ చెయ్యటానికి రావటం కుదరట్లేదన్నాడు. ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకొమ్మన్నాడు. మాదసలే ఆఫీసు కం రెసిడెన్స్. అతగాడికి మేమన్నీ అప్పజెపితే కానీ కదలటానికి లేదు. అలాగలాగ మరో పదిరోజులు గడిచాయి. ఈలోపూ నా దసరా పుజలు ఇక్కడే అయిపోయాయి. శెలవులు అయి స్కూళ్ళు మొదలైపోయాయి. ఇక తను కదిలినా నేను,పాప కదలటానికి లేదు. ఎలాగెలాగ అని టెన్షన్. అక్కడ కొత్తాఫీసువాళ్ళు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని శ్రీవారిని తొందరపెట్టేస్తున్నారు.
ఈలోపూ మరో రెండు దారులు రారమ్మంటూ ఎదురయ్యాయి. అదీ, ఇదీ కాక మరో రెండు దారులా .... బాబోయ్... అనుకున్నాం. ఎటువైపు వెళ్లాలో తెలియదు. అసలు ఎక్కడికైనా వెళ్తామో వెళ్ళమో తెలియదు. గడిచిన రెండు నెలల కాలం ఎంత ఉద్వేగంతో, సంఘర్షణతో నడిచిందో... పరిస్థితులు మాలో ఎంత చికాకునీ, అనిశ్చింతనీ పెంచి పోషించాయో మా మనసులకు తెలుసు. చుట్టుతా అయోమయం, అసందిగ్ధం తప్ప మరేమీ కనబడేది కాదు.
చివరకు కొన్ని మాటలు జరిగాకా వాళ్ళ పాత ఆఫీసువాళ్ళు ఉండిపొమ్మని అడిగారు. సరే అయినవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. పొరుగు రాష్ట్రం పోయి నా..అనేవాళ్ళు లేక, అర్ధంగాని ఆ అరవభాషను భరించటం కన్నా ఇక్కడ ఉండటమే మేలని నిర్ణయించుకున్నాం. సరేనని ఒప్పేసుకున్నాం. లేకపోతే ఈ కార్తీకమాసం అంతా మద్రాసు మహనగరంలో గడపవలసిన మాట..!! ఊరు మారలేదు కాబట్టి ఇంత త్వరగా మళ్ళీ నా బ్లాగ్ ముహం నేను చూడగలిగాను. లేకపోతే ఇహ ఇప్పట్లో మరో ఆరేడు నెలలు దాకా ఇటువైపు రాలేనని బెంగ పడిపోయా !
ఇలాంటివి సంఘర్షణలు, నిర్ణయాలు జరిగినప్పుడే మరీ బలంగా అనిపిస్తుంది..."అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్ని...జరిగేవన్నీ మంచికనీ అనుకోవటమే మనిషి పని..." అని.
Wednesday, November 23, 2011
Anuranan - a resonance
అప్పుడెప్పుడో ప్లానెట్ ఎం లో తీసుకున్న ఒక సీడి కొన్ని నెలల తరువాత ఓపెన్ చేసి చూస్తే సరిగ్గా లేదు. తిరిగి ఇచ్చేస్తే తీసుకుంటాడో లేదో అన్న సందేహంతో వెళ్ళే సరికీ మరో సీడీ తీసుకోండి అన్నారువాళ్ళు. ఏం కొనాలా అని వెతుకుతూంటే కనబడింది బెంగాలీ చిత్ర దర్శకుడు అనిరుధ్ధ్ రాయ్ చౌదరి తీసిన "అనురనన్" అనే హిందీ సినిమా. mainmeri-patni-aur-woh సినిమాతో నచ్చేసిన రితుపర్నాసేన్ గుప్తా, ఇంకా రాహుల్ బోస్ , రైమా సేన్ మొదలైనవారు కనబడేసరికీ బావుంటుందనిపించి సీడీ తీసేసుకున్నాను.
కథనం కొద్దిగా స్లోగా సాగినా ఆసక్తికరంగా ఉండటంతో చివరిదాకా చూసాం. కానీ చివర్లో ఎదురైన ట్విస్ట్ చూసి...ఎండింగ్ లో ఈ ట్రేజెడి ఏంటీ...అని బెంబేలెత్తిపోయాం. అయితే సినిమా చివరిలో వచ్చే ఒకే ఒక డైలాగు ఆ కథ బాగా నచ్చేలా చేసింది. నిజంగా భార్యాభర్తల అనుబంధం ఇలా ఉండాలి....ఒకరిపై ఒకరికి నమ్మకం ఇలా ఉండాలి అనిపించేలా ఉన్న క్లైమాక్స్ మనసుకు హత్తుకునేలా ఉంది. "a friend is one.. who comes in when the whole world has gone out.." అని ఒక కొటేషన్ ఉంది. భార్యాభర్తల అనుబంధం స్నేహంతొనే ముడిపడుతుంది కాబట్టి, ప్రపంచం అంతా నమ్మినా నమ్మకపోయినా జీవిత భాగస్వామి నమ్మకం, వారి అనుబంధం ఇలా ఉండాలి.. అన్న సిధ్ధాంతాన్ని చూపిస్తుందీ సినిమా.
"అనురనన్ - a resonance" అన్నది సినిమా పేరు. resonance అంటే అనుకంపన. అంటే ప్రతిధ్వని అనుకోవచ్చేమో. రాహుల్ - నందిత, అమిత్ - ప్రీతి; ఈ రెండు జంటలు కలినప్పుడు, ఆ నలుగురి పరిచయం వారి వారి వైవాహిక జీవితాలపై చూపిన ప్రభావమే కథాంశం. అదే resonance. రాహుల్, నందిత కొన్నేళ్ళుగా లండన్ లో ఉంటుంటారు. కాంచనజంగ లో ఒక రిసార్ట్ కట్టే ఉద్యోగబాధ్యతపై రాహుల్ ను ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తారు. లండన్ లో పరిచయమైన అమిత్, ప్రీతి దంపతులు ఇండియాలో వీరికి స్నేహితులుగా మారతారు. నొనీగా పిలవబడే నందిత మొదటి పరిచయంలోనే ప్రీతి జీవితంలో వెలితినీ, ఆమెలోని శూన్యతను పసిగడుతుంది. రాహుల్ ఊరు వెళ్ళినప్పుడు నందితను పలకరించటానికి అమిత్,ప్రీతి వచ్చినప్పటి సీన్ చాలా బావుంటుంది. అలంకరణ లేకుండా ఉదాసీనంగా ఉన్న నందిత ముహంలో భర్తను మిస్సవుతున్న భావం బాగా కనబడుతుంది. అదే సమయంలో వంటింట్లో బీటేన్ కాఫీ చేస్తుండగా వచ్చిన ప్రీతిని "दॊनॊं मॆं दरार कहां है? शरीर मॆं या मन मॆं या प्यार मॆं..." అని అడగటం, ప్రీతి దాటువెయ్యటం, "भागना है तॊ भाग.. लॆकिन खुद सॆ नही.." అని నందిత అన్న సీన్ చాలా నచ్చింది నాకు. ఈ సీన్ నందిత పాత్రను, ఆమె సునిశిత దృష్టినీ, వ్యక్తిత్వాన్నీ మరింత ఎలివేట్ చేస్తుంది.
రాహుల్ సినిమా మొదటి నుంచీ తన డిక్టాఫోన్(Digital Voice Recorder ) లో తన భావాలూ, అభిప్రాయాలూ రికార్డ్ చేస్తూ ఉండటం వెరైటీగా బాగుంది. సినిమా చివరలో కూడా కొన్ని బంధాలకు పేర్లు పెట్టలేము అని మాట్లాడే వాక్యాలు బాగుంటాయి. అవి కూడా అనుమానాన్ని వ్యక్తం చేసేలా ఉన్నా కూడా;ప్రీతి భర్తతొ సహా అందరూ రాహుల్,ప్రీతి ల స్నేహాన్ని అపార్ధం చేసుకున్నా సరే, అతనిని అపార్ధం చేసుకోకపోవటం ఆ భార్యాభర్తల గాఢానుబంధాన్ని తెలియజేస్తుంది.
రాహుల్, నందిత పాత్రల్లో అన్యోన్యమైన జంటగా రాహుల్ బోస్, రితుపర్నాసేన్ గుప్తా ల నటన ఆకట్టుకుంటుంది. భారతీయత ఉట్టిపడేలా చక్కని కాటన్ చీరల్లో, నుదుటిన ఎర్రని బొట్టుతో హీరోయిన్లిద్దరూ కనువిందు చేసారు. ముఖ్యంగా జుట్టుకు పెద్ద ముడి, కాటన్ చీర, నుదుటిన ఎర్రని బొట్టుతో సుచిత్ర సేన్ మనవరాలు, మున్ మున్ సేన్ కుమార్తె అయిన రైమా సేన్ చాలా అందంగా కనబడింది. నటన ఈమె రక్తంలో ఉందేమో అనిపించింది.
పౌర్ణమి పూట హిమాలయాలపై వెన్నెల పడే దృశ్యాన్ని అతి హృద్యంగా చిత్ర్రీకరించారు. ఆ సన్నివేశం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ రాహుల్ - ప్రీటి ల మధ్య డైలాగ్స్ కూడా బాగున్నాయి. అంతం చాలా బరువుగా విషాద భరితంగా నాకు నచ్చని విధంగా ఉన్నా కూడా, రాహుల్ ని అతని భార్య అర్ధం చేసుకుంది అని తెలపటం కాస్త ఊరటనిచ్చింది. సినిమా చివరి సన్నివేశంలో నందిత "चल पगली...तन सॆ कॊई उड सकता हैं? मन कॆ साथ उड...आत्मा कॆ साथ उड... फिर दॆखना सारा आकाश निछावर हॊजायॆगा तॆरॆ सामनॆ...ऎ मैं केह रही हूं तुम्सॆ केह रही हूं..." అంటుంది హాస్పటల్ బెడ్ పై ఉన్న ప్రీతి చేతిని తన చేతిలోకి తీసుకుని ! " ऎ मैं केह रही हूं तुम्सॆ केह रही हूं..." అన్న ఒక్క వాక్యంలో బోలెడు అర్ధం. ప్రీటి భర్త అమిత్ ఫోన్ చేసి సానుభూతి మాటలు చెప్పినప్పుడూ ఫోన్ మధ్యలో కట్ చేసేసి ఆమె ఏడుస్తుంది. దాని అర్ధం ఈ డైలాగ్ తో మనకు తెలుస్తుంది. కథనం స్లోగా ఉన్నా, అద్భుతమైన చిత్రీకరణ, అందమైన లాంస్కేప్స్, సరౌండింగ్స్ ముచ్చట గొలుపుతాయి. కథలోని ట్విస్ట్ మనసును భారం చేసినా, భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చూపిన ఈ చిత్రం చూడతగ్గది.
Tuesday, November 22, 2011
జంధ్యాల గారి "చిన్నికృష్ణుడు"(1988) నుంచి రెండు మంచి పాటలు..
రమేష్ బాబు, ఖుష్బూ నటించిన జంధ్యాల గారి "చిన్నికృష్ణుడు" సిన్మా నుంచి రెండు మంచి పాటలు. రెండూ కూడా నాకు భలే ఇష్టం :
పాడినది: ఎస్.జానకి
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం:వేటూరి
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచే నా ప్రేమ
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు(2)
పొద్దే తాంబూలాలై ఎర్రనాయే సంజెలన్నీ
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ బాటలాయె
ఈ దూరం దూరతీరం ముద్దులాడేదెన్నడో ((ప))
కన్నె చెక్కిళ్ళలో సందె గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు(2)
వచ్చే మాఘమాసం పందిరేసే ముందుగానే
నీవూ నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
నీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో
((ప))
=============================================
2)song:జీవితం సప్తసాగర గీతం
పాడినది: ఆశా భోంస్లే
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం:వేటూరి
ప: జీవితం సప్తసాగర గీతం
వెలుగు నీడల వేగం
సాగని పయనం
కల ఇల కౌగిలించే చోట(2)
1చ: ఏది భువనం ఏది గగనం తారాతోరణం
ఈ చికాగో సిల్స్ టవరే స్వర్గసోపానము
ఏది సత్యo ఏది స్వప్నం నిజమీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
హే...బ్రహ్మ మానసచిత్రం చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించే చోట(2)
((ప))
2చ: ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేఛ్ఛా జ్యోతులు
ఐక్యరాజ్య సమితిలోనా కలిసే జాతులు
ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మియామీ బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము
హే..సృష్టికే ఇది అందం
దృష్టి కందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట(2)
((ప))
Sunday, November 20, 2011
Speilberg - టిన్ టిన్
Steven Speilberg. ప్రపంచంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన ప్రముఖ దర్శకుల్లో ఒకడు. నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకడు. ఊళ్ళోకి స్పీల్ బర్గ్ సినిమా వచ్చిందంటే మాకు తప్పకుండా చూపించేవారు నాన్న. అలాగ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాల్లో సగం పైనే సినిమాలు చూడగలగటం వల్ల అతనంటే ఒక విధమైన ఆరాధన. మా ముగ్గురికీ(siblings) సుపరిచితుడు. ఒక చిరకాల నేస్తం. ఒక యుధ్ధ నేపధ్యంతో తీసిన "షిండ్లర్స్ లిస్ట్" కు ఆస్కార్ అవార్డ్ రావటం అనందకరమే అయినా ,కెరీర్ ప్రారంభించిన ఎన్నో ఏళ్ల తరువాత ఆస్కార్ రావటం ఆశ్చర్యకరం. చాలా సినిమాలు నేను చూడటం కుదరనే లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు విచిత్రంగా మేం ముగ్గురం, నాన్నతో కలిసి ఇవాళ స్పీల్ బర్గ్ తీసిన " The Adventures of Tintin " 3D చూడటం మధురమైన అనుభూతిని మిగిల్చింది నాకు.
విశ్వ విఖ్యత కార్టూన్ కేరెక్టర్ "టిన్ టిన్" గురించి కొత్తగా చెప్పేదేమీలేదు. ఎన్నో యేనిమేషన్ సిరీస్ లూ, కార్టూన్ పుస్తకాలూ, టివీ సీరియళ్ళూ. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, "టిన్ టిన్" కేరెక్టర్ స్పీల్ బర్గ్ కి చాలా ఇష్టమని... సినిమా తీయాలని కొన్నేళ్ళ క్రితమే స్క్రిప్ట్ రెడి చేసుకున్నాడని...అది ఇప్పటికి కార్య రూపం దాల్చిందని. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక performance capture చిత్రం. అంటే సినిమాలోని పాత్రలను ఒక పధ్ధతి ద్వారా యేనిమేట్ చేస్తారు. గతంలో మొదటిసారిగా ఇలాంటి ప్రయోగంతో 2004 లో వచ్చిన చిత్రం "The Polar Express". 3D గానే కాక ఐమాక్స్ స్క్రీన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసారు ఈ చిత్రాన్ని. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఈ టిన్ టిన్ సినిమా తీసారు. 3Dలో ఈ చిత్రాన్ని చూడటమే ఒక ఆనందం అనుకుంటే, performance capture technique లో చూడటం ఇంకా గొప్ప అనుభూతి.
గతంలో స్పీల్ బర్గ్ సినిమాలకు సంగీతాన్ని అందించిన జాన్ విలియమ్స్ ఈ సినిమాకు కూడా ఆకర్షణీయమైన నేపధ్య సంగీతాన్ని అందించాడు. చిత్రకథ ఒక సాహసోపేతమైన రిపోర్టర్ కథ. టిన్ టిన్ అనే ఒక చిన్న రిపోర్టర్ ఒక చోట అందంగా కనబడ్డ ఒక పాత ఓడ నమూనాను కొంటాడు. ఆ బొమ్మ లో ఏదో రహస్యం దాగి ఉందని అది తన ఇంటి నుండి దొంగలించబడ్డాకా అనుమానం వస్తుంది టిన్ టిన్ కి. దానిని వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అలాంటివే మరో రెండు ఓడ నమూనాలు ఉన్నాయనీ, వాటి వెనుక ఎన్నో ఏళ్ళ క్రితం సముద్రం పాలైన ఒక గుప్తనిధి తాలూకూ వివరాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది.
Saturday, November 19, 2011
బాపు-రమణల మ్యాజిక్ "శ్రీ రామరాజ్యం"
బాపూగారు తమ "శ్రీ రామరాజ్యం"తో నయనానందం, శ్రవణానందం, రసానందం మూడూ కలిగించారు. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. తన సినిమా ద్వారా ప్రేక్షకుడికి నయనానందాన్ని అందించటం బాపూగారి సినిమాల్లోని ప్రత్యేకత. ఆ ఆనందానికి రమణ గారి సంభాషణలు శ్రవణానందాన్ని కూడా జోడిస్తాయి. ఈ రెండు కలిసి ప్రేక్షకుడికి శాశ్వత రసానందాన్ని మిగులుస్తాయి. అదే బాపు-రమణల మ్యాజిక్. ఆ మ్యాజిక్ మళ్ళీ జరిగింది. చాలా ఏళ్ల తరువాత. నెట్ బుకింగ్ కుదరక, చాలా రోజుల తర్వాత నిన్న గంట ముందు వెళ్ళి నిలబడి కౌంటర్లో మొదటి టికెట్టు నేనే కొన్నా. కష్టానికి ఫలితం దక్కింది. శాశ్వత రసానందం మిగిలింది.
చిన్నప్పుడు ఎన్నిసార్లో బాపూ బొమ్మలతో ఉన్న బొమ్మల రామాయణం పుస్తకాన్ని తిరగేస్తూ, ఆ బొమ్మలను చూస్తూ ఉండేవాళ్ళం. వాటిల్లో కొన్ని బొమ్మలు మా తమ్ముడు వేసాడు కూడా. ఆ బొమ్మలను టైటిల్స్ లో మరోసారి మళ్ళీ చూసి బాల్య స్మృతుల్లోకి వెళ్పోయా ప్రారంభం లోనే. ఎర్రటి కేన్వాస్ మీద తోరణంలో కదులుతున్న పచ్చటి మామిడిఆకులు చిత్రమైన ఆనందాన్ని కలిగించాయి. మళ్ళీ ఓ "సంపూర్ణ రామాయణం", ఓ "సీతా కల్యాణం", ఓ "శ్రీరమాంజనేయ యుద్దమో" చూస్తున్న భావన. ఇన్నాళ్ళకు మళ్ళీ తెరపై పూర్తినిడివి రంగుల చిత్రాన్ని గీసాడే బాపూ అని మనసు మురిసిపోయింది. రాముడి ద్వారా, వాల్మీకి ద్వారా చెప్పించిన కొన్ని రమణ గారి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ కొట్టినట్లు, చికాకుగాను అనిపించలేదు. టకా టకా సీన్ పై సీన్ వెళ్పోయింది. నటీనటులందరూ తమ వంతు నటనా బాధ్యతను సమర్ధవంతంగా పోషించేసారు. డైరెక్టర్ ప్రతిభ ప్రతి ఫ్రేం లోనూ కనబడింది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇదే టెక్నాలజీ అందుబాటులో ఉండిఉంటే స్పీల్ బర్గ్ సినిమాలను మించిన చిత్రాలను మన విఠలాచార్య వంటివారు అందించేవారు కదా అనిపించింది.
ఇళయరాజా కూడా చాన్నాళ్ళకు ఏకాగ్రతతో పనిచేసినట్లు నేపధ్య సంగీతం తెలుపకనే తెలిపింది. ముఖ్యమైన సన్నివేశాల వెనకాల వచ్చిన వయోలిన్స్ మొదలైనవి ఇళయరాజా మార్క్ సంగీతాన్ని అద్భుతంగా వినిపించాయి. పాటలు కూడా విడిగా వినేకన్నా సినిమాలో చూస్తూంటే ఇంకా బాగున్నాయి అనిపించాయి. "జగదానంద", "ఎవడున్నాడీ లోకంలో", "రామ రామ రామ అనే రాజమందిరం" మూడు పాటలు నాకు బాగా నచ్చాయి. బాలు గళం చాన్నాళ్ళకు ఖంగుమంది.బాపూగారు ముందే చిత్రం గీసేసి, సన్నివేశాన్ని అలానే చిత్రీకరిస్తారని వినికిడి. ప్రతీ సన్నివేశానికీ బాపూ గారి ఫ్రేమింగ్, రాజు గారి సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. కొని దాచుకున్న పౌరాణిక చిత్రాల సీడీలకు ఈ చిత్రాన్ని కూడా జోడించాలి అని బలంగా అనిపించేలా ఉంది చిత్రం.
బాలకృష్ణ, నయనతార, శ్రీకాంత్ మొదలైన నటులను వారి పాత్రలలో చూసి ప్రేక్షకుడి మనసు తృప్తి పడిందంటే అది ఆ యా నటుల కృషి తో పాటుగా, వారితో అలా నటింపజేసిన ఘనత దర్శకుడిదే. సునీతా డబ్బింగ్ వాయిస్ సీత పాత్రకు ప్రాణం పోసిందని చెప్పాలి. ఏ.ఎన్.ఆర్ నటన చిత్రానికి అదనపు ఆకర్షణ. వశిష్ఠులవారిగా నటించిన బాలయ్యగారు డైలాగులు చెప్పేందుకు కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించగా, ఇంత వయసులో కూడా అంత స్పష్టంగా, పూర్వపు ధాటితో ఆయన డైలాగు చెప్పటం ఆశ్చర్యపరిచింది. నాగేశ్వరరావు సినీప్రస్థానంలో మరో మైలు రాయిగా ఈ వాల్మీకి పాత్ర నిలిచిపోతుంది. హనుమంతుడి పాత్రధారి నటన కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోయపిల్లవాడు బాలరాజుగా చేసిన పిల్లవాడు నాకు లవకుశుల కన్నా బాగా నచ్చేసాడు. లవకుశలుగా వేసిన పిల్లలిద్దరూ కాస్తంత బొద్దుగా ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ నటనలో ఎక్కడా ఓవరేక్షన్ వగైరాలు లేకుండా బహుచక్కగా చేసారు. పాటలు పాడేప్పుడు కూడా లిప్ సింక్ బాగా కుదిరింది.
అయితే అన్నీ ప్రశంసలేనా? లోపాలే లేవా సినిమాలో అంటే ఉన్నాయి. నటనా పరంగా ఒకటి రెండు చెప్పలంటే నయనతార ఎంత వంకపెట్టలేనటువంటి అత్యుత్తమ నటన కనబరిచినా "సీతాదేవి" వంటి శక్తివంతమైన పౌరాణిక పాత్రలో అంజలీదేవిలో, చంద్రకళనో, జయప్రదనో, బీ.సరోజాదేవినో మరచి నయనతార ను కూర్చోబెట్టలేకపోయాను నేను. బహుశా ఆమె బాపు మార్క్ పెద్ద కళ్ళ హీరోయిన్ కాకపోవటం కారణం కావచ్చు. ఇక వీపుపై ఎన్.టి.ఆర్ లాగనే పుట్టుమచ్చను పెట్టుకున్నా కూడా రాముడన్న, కృష్ణుడన్నా ఎన్.టి.ఆర్ మాత్రమేనన్న నానుడిని అధిగమించటం మరెవరివల్లా కాదేమో అనిపించింది. ఎన్.టి.ఆర్ లోని గాంభీర్యం కూడా బాలకృష్ణ నటనలో లోపించిందేమో అని కూడా అనిపించింది. అయినా చంద్రుడి అందాన్ని చూస్తామే కానీ మచ్చలు వెతుకుతామా మరి? ఇదీ అంతే. రా-వన్, రోబో లాంటి సినిమాలూ మాత్రమే పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గా మారిన నేటి సూపర్ ఫాస్ట్ శతాబ్దపు రోజుల్లో అత్యుత్తమ విలువలతో ఇటువంటి పౌరాణిక చిత్రం రావటమే అదృష్టం నా దృష్టిలో.
కాకపోతే ఈ విజయానందాన్ని అనుభూతి చెందటానికీ, పంచుకోవటానికీ "రమణ" గారు బాపుగారితో, మనతో లేరన్నదొక్కటే విచారకరమైన విషయం. మొత్తమ్మీద రమణగారికి అంకితమిచ్చిన ఈ చిత్రం బాపురమణల కీర్తిప్రతిష్ఠలకు మరో కలికి తురాయి.