సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, November 20, 2012

ఏకాంతకోకిల






అడవి యాకులందు నలరుల రేకుల
నీటి చినుకులెల్ల నిలిచి, గాలి
వీచినంత తెరలి, విచ్చలవిడి తోడ
మబ్బులేని వాన మరియు కురియు

కొండపైని వాన గుడి ముంగిటనువాన
చెరువు తమ్మిపూల చెంత వాన
పల్లెటూరి వరినాట్ల పై వాన
విరహిజనుల మనసు బరువు, వాన

***     ***       *** 

తనువులోపల జేరగ తపనపడుట
వెలుపలికి ముక్తి గోరుచు వెతలcబడుట
అక్షరమ్ముల మిగులు నా యనుభవములు
పుస్తకము వంటి బ్రదుకులో పుటలనడుమ

***      ***      *** 

తరిమి మూసిన రాతిరి తరిగిపోని
దిగులు నదివో లెవ్యాపించు, దెసలనడుమ
ఎన్ని నిట్టూర్పు పొగ మబ్బులిచటc గురిసి
తడియు, స్పర్శయులేనిదై సుడులు రేపు!

***      ***       *** 

రేయి నాకసమ్ము చేయి విదల్చుచు
ఆసవంపుపాత్ర నవని పైకి
వంపినప్పు డాసవమ్ము తొణికె నేమొ
తరువు తరువు తడిసి యరుణమాయె !



***       ***       *** 

 అనుభవమ్ము నాకు ఆప్తప్రమాణమ్ము
కవితకైన, బ్రతుకుకథలకైన;
అంతరంగ శుక్తి హత్తుచు, మేలైన
స్వాతి వాన చినుకు వ్రాలవలయు !


***     ***        *** 

తెలియబడనిది, తెలియగా విలువగలది
తెలిసి తెలియని వేళలొ తీపుc గలది,
మదికి తహతహ పుట్టించు మహిమcగలది
మనిషి యనుభూతి, కవితకు మర్మశక్తి !


***     ***        *** 


"ఏకాంతకోకిల" శ్రీకాంతశర్మ గారి కొత్త పుస్తకం
తన మిత్రులు, కథారచయిత తల్లావజ్ఝుల పతంజలిశాస్త్రి గారికి అంకితం చేసారు.
కవర్ బొమ్మ: బాపూ
కవర్ డిజైన్: చంద్ర
నవోదయా పబ్లికేషన్స్
వెల: నలభై రూపాయిలు



4 comments:

Manasa Chamarthi said...

"ఎన్ని నిట్టూర్పు పొగ మబ్బులిచట కురిసి
తడియు స్పర్శలు లేనిదై సుడులు రేపు...":

తృష్ణ గారూ - ఖండిస్తున్నాం, ఇలా ఊరించి వదిలేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం...మీ మాటలేవీ, మీరు ఆ కవిత్వంలోకి కలలోలా జారుకుంటూ మమ్మల్ని వెంట తీసుకెళ్ళే మంత్రమేదీ?

తృష్ణ said...

@manasa: కలలోకి జార్చేది ఈ కవిత
అనుభూతి నింపేది ఈ కవిత
మనసు తడిపేది ఈ కవిత
ఆత్మను కదిపేది ఈ కవిత

ఇక నా మాటలెందుకు మానసగారు :)
Thank you.

ధాత్రి said...

తేట తెలుగు ఎంత బాగుందో తృష్ణ గారూ..చదవాలన్నమాట..:)

తృష్ణ said...

@ధాత్రి: దొరికితే తప్పక చదవండి. ధన్యవాదాలు.