"మంచి కథ రాసిన తర్వాత ఒక పూలతోటని పెంచి పూలు పూయించినంత ఆనందం కలుగుతుంది" అంటారు వీరలక్ష్మి గారు. పుస్తకం .నెట్ కి నేను రాసిన మొదటి వ్యాసం వాడ్రేవు వీరలక్ష్మిగారి పుస్తకం “ఆకులో ఆకునై….” (http://pustakam.net/?p=2204) అప్పుడు ఈ కథల పుస్తకం గురించి తెలీదు. మొన్నటి పుస్తకప్రదర్శనలో కనబడితే కొనుక్కున్నా. ఇటీవలి కాలంలో నేను చదివిన పుస్తకాలన్నింటిలోకీ బాగా ఆస్వాదించిన పుస్తకం ఇది. కొన్ని రచనలు చదివినప్పుడు ఆ రచయిత ఎవరో మనకి తెలియకపోయినా అవి మన హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. బహుశా మన ఆలోచనల్లో తిరగాడే కొన్ని భావాలకు, అభిప్రాయాలకు భావ సారూప్యం ఉన్న రచనను చదివితే కలిగే ఆనందం ఆ దగ్గరతనానికి కారణం కావచ్చు. అలాంటి దగ్గరితనాన్ని నాకు ఈ "కొండఫలం" కథలు అందించాయి. రచయిత్రి పట్ల అభిమానాన్ని మరింత పెంచాయి.
"నేను చూస్తున్న జీవితంలోని సమస్యల మూలాలను వివరించే ప్రయత్నం నా కథల రూపంలో చేసాను" అంటారు రచయిత్రి. ప్రపంచీకరణ వల్ల సమాజంలో తగ్గిపోతున్న మానవీయ విలువలను నిలబెట్టాల్సినవారు కవులు రచయితలే అనీ, తన ఆలోచన కూడా అదే అని, ఆ విషయమై ఇంకా కథలు రావాల్సి ఉందని వాడ్రేవు వీరలక్ష్మి గారు తన 'ముందుమాట'లో అంటారు. స్త్రీ వాదాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోగలిగితే స్త్రీపురుషుల జీవితాలు ఎంతో ఉన్నతంగా మారగలవనీ, ఒక వంద సంవత్సరాల పాటు ఈ విషయమై కథలు,నవలలు వస్తే తప్ప స్త్రీపురుషుల మధ్య ఉన్న అసమానతలు తీరవంటారు ఆవిడ.
ఈ పుస్తకంలోని కథలన్నీ ఎనభై,తొంభైలలో వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. "కొండఫలం"లో మొత్తం పన్నెండు కథలు ఉన్నాయి. తన అభిమాన రచయిత్రి ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి కథ "ఒక రాత్రి గడవాలి". ఆవిడ రచనలు చదివి తాను ఊహించుకున్నట్లుగా కాక ఒక సాధారణ గృహిణి బాధ్యతలు నెరవేస్తున్న తన అభిమాన రచయిత్రిని చూసి అంతవరకు తెలియని ఎన్నో విషయాలతో పాటూ జీవన విధానంలో స్వేచ్ఛ ఎంత ముఖ్యమో తెలుసుకుంటుంది వినీల. గిరిజనుల భూమి సమస్య, వాటివల్ల గిరిజన మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు ఇతివృత్తంగా తీసుకున్న కథ "కొండఫలం". ఇదీ, ఇలాంటి గిరిజన నేపథ్యంలో సాగే "బినామీ" కథా, మరో గిరిజన స్త్రీ కథ "పేరెంట్" మూడూ చదువుతూంటే నాకు వంశీ రాసిన "మన్యంరాణి" గుర్తుకు వచ్చింది.
ప్రపంచీకరణ వల్ల స్వాతంత్ర్య దినోత్సవమంత ఉధృతమైన ఉద్యమంగా మారిన ప్రేమికుల దినోత్సవం గురించీ, ఇటువంటి దినోత్సవాల ఆకర్షణ వల్ల యువత ఎలా తప్పటడుగు వేస్తోందో తెలియచెప్పే కథ "ప్రేమికుల దినం". ప్రేమ వివాహం చేసుకుని, సంసారంలో ఎదురైన ఒడిదొడుకులను తట్టుకుని, తన అస్థిత్వాన్ని కాపాడుకంటూ, జీవితాన్ని ఒక ఉపయోగకరమైన పనివైపు నిర్దేశించుకున్న ఒక ఉద్యోగిని కథ "జ్ఞానప్రసూన". వివేక్ ఎదురుచూసీ, వెంటపడి పెళ్ళి చేసుకున్న తృషిత తన వైవాహిక జీవితంలో నేర్చుకున్న జీవితపాఠాలు గురించిన కథ "తృషిత" అయితే, ప్రేమవివాహం చేసుకుని ఒకరికొకరు అర్థంకాకున్నా ఒకరినొకరు వదలలేక సంఘర్షణతోనే బ్రతికేస్తున్న మరో జంట సమీర-ప్రమోద్ ల కథ "తెలుసుకొనవె యువతా..."
మావయ్య ఇంట్లో వంటమనిషీ పనిమనిషీ అయిన సత్యవతి ఆత్మవిశ్వాసం, చిన్నప్పుడు కుటుంబం కోసం తన అమ్మమ్మ పడ్డ కష్టాల వెనుక ఉన్న మనోధైర్యం, విలాసవంతమైన జీవితం గడిపే వదిన సువర్చల, రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే వృత్తి చేసుకుంటున్న స్త్రీ పట్ల ఆశ్చర్యం - వీటన్నింటి గురించీ ఆలోచిస్తూ, ఎవరినీ కాదనలేని తన బలహీనమైన స్వభావాన్ని తరచుకునే ఒక యువతిలో జరిగే మనసికసంఘర్షణ "ఆ పిలుపు ఇంకా అందలేదు" కథానిక. "కూటి కోసం కూలి కోసం" కథ రకరకాల ఉద్యోగాలు చేసే యువతుల సంఘర్షణ, అమ్మ నుంచి 'అనిమిష' నేర్చుకున్న జీవిత పాఠాలేమిటో తెలుపుతుంది.
ఈ పుస్తకంలో అన్నింటికన్నా నాకు బాగా నచ్చిన కథ "ఇలా... ఉన్నాం". డాక్టర్లు, కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరు; ఇంకా కొలీగ్ శారద, పక్కింటి విజయ, పనిమనిషి నూకాలమ్మా, ఆమె కూతురు రామలక్ష్మి నుండి లలిత ఏం నేర్చుకుందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలో లలితకు వ్యక్తపరిచే సందేహాలూ, ప్రశ్నలు ప్రతిఒక్కరూ తమలో తాము వేసుకునేవేనేమో అనిపిస్తాయి.
పుస్తకంలో కథలన్నీ విభిన్న అంశాలను స్పృశించినా, స్త్రీవాద కథలు అనిపించినా, అంతర్లీనంగా ఇవన్నీ సమకాలీన సమాజంపై రచయిత ఎక్కుపెట్టిన బాణాలు అనిపించింది నాకు. చక్కని శైలి, రచన ద్వారా చెప్పదలుచుకున్న విషయంపై స్పష్టత, అందమైన భావాలు, సున్నితమైన అంశాలపై ప్రశ్నలు ఇవన్నీ ఈ పుస్తకాన్ని ఆద్యంతం చదివించేలా చేస్తాయి. "The pen is mightier than the sword" అన్న వాక్యాన్ని బలపరిచేలా మనలోని ఆలోచనలను ప్రభావితం చేయగల శక్తి ఉన్న వీరలక్ష్మి గారి కలం నుండి ఇంకా ఎన్నెన్నో ఆలోచనాత్మకమైన కథలు, వీలైతే నవలలు చదివే అవకాశం రావాలని ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ అనిపించింది.
5 comments:
Nice review Trushna gaaru..:-)
వాడ్రేవు వీరలక్ష్మి గారి కధలు నేను ఏమి చదివిన గుర్తు లేదు. చదవాలి.
konda phalam bhagundandi
తృష్ణ గారూ మీరే పుస్తకాన్ని పరిచయం చేసినా వెంటనే చదవాలనిపిస్తుంది. నా జాబితాలో మరొ రెండు పుస్తకాలను చేర్చుకున్నాను. ధన్యవాదాలు
తృష్ణా - మీ స్పందన స్పష్టంగా ఉంది. నేను వాడ్రేవు వీరలక్ష్మి గారి కధలు చదవటం మొదలెట్టింది గత 2 ఏళ్ళలోనే కానీ నాకు బాగా నచ్చుతున్నాయి. రచయిత్రిగా "మంచి కథ రాసిన తర్వాత ఒక పూలతోటని పెంచి పూలు పూయించినంత ఆనందం కలుగుతుంది" అన్నది, పాఠకురాలిగా "మంచి కథ చదివిన తర్వాత ఒక పూలతోటలో విహరించినంత ఆనుభూతి కలుగుతుంది." అన్నట్లుగా మారుతుంది.
Post a Comment