Tuesday, March 20, 2012

మార్నింగ్ స్కూల్


వేసవి ఎండలు ముదురుతున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఒంటిపూట బడి అని ప్రకటిస్తారు. ప్రైవేటు స్కూల్స్ వారు కూడా వారివారి వీలుని బట్టి ఓ వారం అటు ఇటులో మార్నింగ్ స్కూల్ ప్రకటన ఇస్తారు. రెండవ క్లాస్ చదువుతున్న మా పాపకు ఇవాళ్టి నుంచీ మార్నింగ్ స్కూల్. స్కూలు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉన్నా, పాపను త్వరగా లేపి, రోజూ కన్నా ఓ గంట ముందే తయారుచేయాల్సి ఉంటుంది.
నాకు చిన్నప్పటి నుండీ ఈ మార్నింగ్ స్కూల్ అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టం. నా చిన్నప్పుడు ఏడవ తరగతి దాకా మేము చదివిన స్కూల్ ఇంటి దగ్గర్లోనే ఉండేది. పది, పదిహేను నిమిషాల నడక పెద్ద దూరం కాదప్పట్లో. నడచివెళ్ళేవాళ్ళం. ఐదో క్లాస్ దాగా అమ్మ మా బ్యాగ్గులు భుజాన వేసుకుని దిగపెట్టు, మళ్ళీ సాయంత్రం తీసుకువెళ్ళేది. ఈ మర్నింగ్ స్కూల్ టైం లో మాత్రం పొద్దున్న 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు ఉండేది స్కూల్. అప్పుడు మాత్రం మధ్యాన్నం ఎండగా ఉంటుందని ఎండుపూటలకీ మా కోసం రిక్షా మాట్లాడేది అమ్మ. పొద్దున్నే ఏడున్నరకే రిక్షా వచ్చేసేది. అదికూడా అందరిలా ఓ పదిమందితో ఇరుక్కుని కూర్చునేలా కాకుండా మేమిద్దరం, ఇంకో ఇద్దరూ కలిపి నలుగురం మాత్రమే ఉండేలా రిక్షా మాట్లాడేది అమ్మ. అలా ఇరుకు లేకుండా ఫ్రీగా కూచునేలా రిక్షాలో స్కూలుకి వెళ్లటం ఎంతో దర్జాగా అనిపించేది.
ఇక స్కూల్లో సాయంత్రం దాక ఉండక్కర్లేకుండా మధ్యాన్నమే ఇంటికి వచ్చేయటం మరీ ఇష్టంగా ఉండేది. చక్కగా త్వరగా హోంవర్క్ చేసేస్కుంటే బోలెడంత ఖాళీ సమయం. కావాల్సినంత సేపు ఆడుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఏడూ ఎప్పుడు మార్నింగ్ స్కూల్స్ మొదలవుతాయా అని ఎదురుచూసేదాన్ని. 8th క్లాస్ లో కాస్త పెద్ద స్కూల్ కి మారాకా స్కూల్ బస్ ఉండేది. మాములు రోజుల్లోనే స్కూల్ బస్ 7.45 a.m కి వచ్చేసేది. ఇక మార్నింగ్ స్కూల్ అప్పుడు స్కూల్ ఎనిమిదికైనా బస్సు మరీ ఆరున్నరకే వచ్చేసేది. చాలా చోట్ల తిరగాలి కదా. అందుకని మరీ అంత త్వరగా తెమలటం కాస్త కష్టం గానే ఉండేది. అందుకని పెద్ద స్కూల్లో కంటే నాకు చిన్నప్పటి మార్నింగ్ స్కూల్ అంటే ఉన్న ప్రత్యేకమైన ఇష్టం అలానే ఉండిపోయింది.


అయితే, ఇప్పుడు మా పాప చదివే స్కూల్ ఇంటి దగ్గరే అవ్వటంతో తన మార్నింగ్ స్కూల్ అంటే కూడా నాకు భలే ఇష్టం. దీనివల్ల నాకు బోలెడు ఆనందాలు...
నేను హడావిడి పడి లంచ్ బాక్స్ ఇవ్వక్కర్లేదు,
రోజూలా లంచ్ బాక్స్ లోని గుప్పెడు మెతుకులు కాక పిల్ల ఇంటిపట్టున కాస్త కడుపునిండా అన్నం తింటుందని,
ఒంటిపూట స్కూలే కాబట్టి రోజూలా బండెడు పుస్తకాల బస్తా మోయక్కర్లేదు,
మరికాసేపు ఆడుకోవటానికి పిల్లకి కాస్త టైం దొరుకుతుంది...
నేను కూడా ఎక్కువ సమయం పాపతో గడపచ్చు..
ఇలా అన్నమాట. ఓ ఇరవై రోజులు ఇలా గడిపేస్తే ఇక వేసవి సెలవలే !!

11 comments:

SHANKAR.S said...

ఒంటిపూట బడి అంటే ఆ ఆనందమే వేరు లెండి.మా చిన్నప్పుడు రోజూ సాయంత్రం దాకా ఈసురోమని స్కూల్లో ఉండక్కర్లేదు అన్న ఆలోచనే భలే ఉత్సాహాన్నిచ్చేది. మధ్యాహ్నం స్కూలు అయిపోవడం ఆలస్యం ఒక్క పరుగున ఇంటికొచ్చి గబగబా తిన్నామా లేదా అన్నట్టు కుసింత కడుపులో పడేసి ఆడుకోడానికి వెళ్లిపోయేవాళ్ళం.ఇంక ఇంట్లో వాళ్ళ డైలాగులు ఇలా ఉండేవి

"మధ్యాహ్నం సెలవేకదా అని ఇంటికి రాగానే ఆటలకి పరిగెట్టడం కాదు.నాలుగు దాటే దాకా గుమ్మం కదిలితే కాళ్ళు విరగ్గోడతా. ఎండలో వెధవ ఆటలూ నువ్వూను"- అమ్మ

"ఒంటిపూట బడి అని సంబరపడటం కాదు వీటి వెంటనే యాన్యువల్లీ పరీక్షలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకో" - నాన్నగారు

"వెధవ ఒంటి పూట బళ్ళు కాదుగానీ పిల్ల వెధవల్ని నీడపట్టున ఉండకుండా మాంచి ఎండలో పన్నెండింటికి ఇంటికి పంపుతున్నారు.ఇంత ఎండలో మళ్ళీ వీడు ఆటలంటూ బయటకి తిరగడం.ఏ వడదెబ్బో తగిలితే?? అయినా ఆ హెడ్మాస్టరు వెధవకి బుద్ధుండాలి." - నాయనమ్మ

ఇవేవీ పట్టేవి కావు నాకు:). అర్ధరూపాయి అద్దెతో ఓ చిన్న సైకిల్ అద్దెకి తీసుకుని మా వీధులన్నీ చక్కర్లు కొట్టడం,మూడున్నర నాలుగింటికి ఇంట్లో గొడవపెట్టి మరీ చొల్లంగి తీర్ధం లో కొనిపించుకున్న చెక్క బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ కి పరిగెట్టడం, ఒక్కోసారి ఇంట్లోనే ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంక్, వైకుంఠపాళి లాంటి ఆటలు పెట్టుకోవడం.అబ్బో పండగలెండి.మళ్ళీ ఒక్కసారి ఆరోజులన్నీ కళ్ళముందు తిరిగాయి.

ఆ.సౌమ్య said...

మార్నింగ్ స్కూల్ అని రాస్తే ఏవిటో అనుకునానండీ. ఒంటిపూట బడా :))
భలే ఉండేవిలెండి ఒంటిపూటబళ్ళు. పొద్దున్నే లేచి చలిదన్నం తినేసి బడికి పారిపోయేవాళ్ళం. మధ్యాన్నం ఇంటికొచ్చేసి అన్నం తినేసి ఎంచక్కా హాయిగా ముసుగు తన్ని పడుకోవడంలో ఉండే ఆనందం ఇంకెదులోనూ రాదు.

మళ్ళీ మూడింటికి లేచి డీడీ లో ఏ చెత్త వచ్చినా చూసేసి తరువాత ఎంత హాయిగా ఆడుకునేవాళ్ళమో!

జ్యోతిర్మయి said...

తృష్ణ గారూ మీ మార్నింగ్ స్కూల్ కోసం మేమూ ఎడురుచూస్తున్నామండీ. మీరూ మీ పాప బాగా ఎంజాయ్ చేసేసి ఆ కబుర్లు మాతో ఎప్పుడు చెప్తారా అని..

చిలమకూరు విజయమోహన్ said...

ఒంటిపూట బడి అందరికీ ఇష్టమే.
"పొద్దున్నే లేచి చలిదన్నం తినేసి బడికి పారిపోయేవాళ్ళం."
అయినా సౌమ్యా!బడినుంచి పారిపోయేవారినే చూసాగానీ బడికి పారిపోయేవాళ్ళని మిమ్మల్నే చూసా! :)

శేఖర్ (Sekhar) said...

:))

'Padmarpita' said...

Nice....thanks for sharing with us.

తృష్ణ said...

@శంకర్: "చిన్న సైకిల్ అద్దెకు తీసుకుని..." ఇది మేము వేసంశెలవుల్లో చేసేవాళ్లం..:) బాగున్నాయి మీ ఒంటిపూటబడి జ్ఞాపకాలు !
ధన్యవాదాలు.

@ఆ.సౌమ్య: అవునండోయ్.. చద్దన్నం సంగతి రాయటం మరిచాను..:)
అమ్మ నిద్రోతూంటే మాత్రం చప్పుళ్ళు చేస్తున్నామని కోప్పడేది.మధ్యాన్నం నిద్ర మాత్రం ఇప్పటికీ నాకు అలవాటవ్వలేదు..:(
ధన్యవాదాలు.

@జ్యోతిర్మయి: అవునాండి...? అయినా ఇప్పుడేముంది ముందుంది నాకు పండగ....(వేసవి శెలవుల్లో)...:))
ధన్యవాదాలు.

తృష్ణ said...

@చిలమకూరు విజయమోహన్: :) ధన్యవాదాలు.
నిజమే కదండిసౌమ్య గారూ... :))

@శేఖర్(sekhar): :)
ధన్యవాదాలు.

@పద్మార్పిత: :)
ధన్యవాదాలు.

ఇందు said...

Cute! Naku aa days gurtostunnay :) Nenaithe morning breakfast teesukelli friends tho share chesukuntu tinedaanni break time lo :) anduke naku boledu ishtam ga undedi. Inkoti entante.... inkoddi rojullo full day holidays vastunnay ani cheppadaaniki annattu undevi ee half day holidays ;) anduke naku bhale ishtam :)

తృష్ణ said...

@ఇందు: "ఇంకొన్ని రోజుల్లో బోల్డు శెలవులు వస్తున్నాయి..." అవును కదా... ఇది కూడా మార్నింగ్ స్కూల్ పట్ల ఇష్టాన్ని పెంచేసేది..:) థాంక్యు.

రసజ్ఞ said...

ఒంటి పూట బడిలో ఉన్న ఆనందమే వేరు! నాకు మాత్రం స్కూలు ఇలా పెట్టడం ఆలస్యం రస్నా కొనిపించేసుకోవచ్చన్న ఉత్సాహం. అది కాక సెలవులు వచ్చేస్తున్నాయి కనుక చుట్టాలందరూ ఇంటికి వస్తారు వాళ్ళందరితో ఆడుకోవచ్చు, అమ్మమ్మో, పిన్నో ఒక కంచంలో పిల్లలందరికీ అన్నం కలిపి ముద్దలు పెడతారు అందరికీ అదొక సరదా! ఇహ ఒంటి పూట బడి పెట్టడం ఆలస్యం ఎండలు ఎక్కువయిపోయాయి అనుకుంటూ వట్టి వేళ్ళ తడికలు కడితే ప్రతీ అరగంటకీ వెళ్ళి వాటిని తడిపి ఆ వాసనతో మైమరచిపోయేదానిని.