సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, March 5, 2012

The Artist - ఒక సృజనాత్మక ప్రయోగం




ఈ సినిమా ట్రైలర్


రెండు హాల్స్ లో రెండే షోలు, అవి కూడా టైమింగ్స్ సరిగ్గా లేని కారణంగా పదిహేను రోజులుగా వెళ్లాలనుకుంటన్నా ఓ సినిమా చూడటం కుదర్లేదు. ఈలోపూ అదృష్టవశాత్తు ఈ సినిమాకు ఐదు ఆస్కార్స్ వచ్చేసి మరో థియేటర్లో మరో షో వెయ్యటం మొదలెట్టాకా నిన్న ఆదివారం మాకు వెళ్లటం కుదిరింది. 2011 - 'Cannes International Film Festival' లో ప్రీమియర్ కాబడి, అప్పటి నుంచీ వరుసగా ఎన్నో అవార్డులను చేజిక్కించుకుంటున్న ఫ్రెంచ్ సినిమా "The Artist". ఇటీవలే ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డ్ ను అందుకున్న ఈ చిత్రానికి మరో నాలుగు విభాగాల్లో కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. ( ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, సంగీతం, కాస్ట్యూమ్స్). కేవలం ఒక ప్రయోగాత్మక చిత్రంగా ఈ సినిమా తీసిన ఫ్రెంచ్ దర్శకుడు Michel Hazanavicius కు ఒక్కసారిగా యావత్ ప్రపంచం ప్రశంసల బంగారు కిరీటం పెట్టించిన సినిమా ఇది. ఈ black & white సినిమా నిజంగా ఒక పాత తరం సినిమాను చూస్తున్నామనే భ్రమను, మాటలు అవసరం లేకుండా దర్శకుడి భావాలను ప్రేక్షకుల మనసులకు అందించే ప్రయత్నంలోనూ నూరు శాతం సఫలం అయ్యిందనే చెప్పాలి.


ఇది పూర్తిగా దర్శకుడి చిత్రం. సినిమాలో డైలాగులు లేకున్నా జరుగుతున్న కథ సులువుగా ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా సన్నివేశాలను రూపొందించారు. కాకపోతే మధ్య మధ్య కొన్ని ముఖ్యమైన డైలాగ్స్ స్లైడ్స్ లాగ(చార్లి చాప్లిన్ సినిమాల్లో లాగ) చూపెట్టారు. కొన్ని సన్నివేశాల్లో ఇవి అనవసరం అనిపించాయి కూడా. డైలాగులు లేవు కాబట్టి చిత్రం అంతా నటీనటుల హావభావలపై నడుస్తుంది. తెరపై ఎక్కువగా కనబడ్డ హీరో, హీరోయిన్లు ఇద్దరు కూడా అత్యుత్తమ నటన కనబరిచారు. జార్జ్ పాత్ర వేసిన ఫ్రెంచ్ నటుడు Jean Dujardin ఆస్కార్ నే కాక, 2011 ప్రీమియర్ తోటే Cannes Film Festival లో తన నటనకు గానూ Palme d'Or (Golden Palm) అవార్డ్ దక్కించుకున్నాడు. ప్రముఖ మూకీ చిత్ర హీరోగా, ఆ తర్వాత ఓటనిమి అంగీకరించలేని అహంకారాన్ని, అంతలోనే నిస్సహాయతనూ, పెప్పీ పై అభిమానాన్నీ, సాటి నటిగా ఆమెలోని ప్రతిభను మెచ్చుకునే నటుడిగా అతడు కనబరిచిన హావభావాలు బాగా ఆకట్టుకుంటాయి. పెప్పీగా నటించిన ఫ్రెంచ్ నటి "బెరెనిస్ బిజో" (ఈ సినిమా దర్శకుడి భార్య) కూడా ఉత్తమ అభినయాన్ని కనబరిచింది. డాన్సర్స్ లో ఒకతెగా అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడు కావల్సిన సహజత్వాన్ని, తరువాత ప్రముఖ నటి అయ్యాకా అవసరమైన హుందాతనాన్నీ రెండిటినీ సమపాళ్ళలో తన నటనలో చూపెట్టింది.


హాల్లో ఈ సినిమా మొదలవగానే నాకు మొట్టమొదట గుర్తుకొచ్చిన వ్యక్తి "సింగీతం శ్రీనివాసరావు". చెప్పదలుచుకున్న సందేశాన్ని వ్యక్తపరచటానికి భాష, మాటలు ఏదీ అవసరం లేదు... అనే ఉద్దేశంతో సృజనాత్మక ప్రయోగంగా "పుష్పక విమాన"మనే మూకీ చిత్రాన్ని పదిహేనేళ్ల క్రితమే తీసి, అదే 'Cannes International Film Festival' లో అందరి ప్రశంసలు పొందారు 'సింగీతం' గారు. ఇది colour లో తీసిన ఒక social satire. "The Artist" సినిమా పూర్తిగా నలుపు తెలుపుల్లో చిత్రీకరించిన ఒక నటుడి జీవితకథ.1927 లోని మూకీ చిత్రాల్లో నటించిన ఒక ప్రముఖ నటుడి నటజీవితం ఎలా, ఎన్ని మలుపులు తిరిగింది అన్నది ఈ చిత్ర కథాంశం. కేవలం ముఫ్ఫై ఐదు రోజుల్లో ఈ చిత్రాన్ని ఎలా తీసారో, ఏ ఏ విధానలను వాడారో ఈ వికీ లింక్ లో చదివి తెలుసుకోవచ్చు.


ఈ చిత్రం గురించి చెప్పుకునేప్పుడు దర్శక నటీనటులతో పాటూ తప్పక గుర్తుంచుకోవాల్సిన మరో వ్యక్తి సంగీత దర్శకుడు. డైలాగులు లేని ఈ సినిమాకు ప్రాణం సంగీతమే. ప్రతి సన్నివేశానికీ అనుగుణమైన, భావవ్యక్తీకరణకు అవసరమైన సంగీతాన్ని అందించటంలో ఫ్రెంచ్ స్వరకర్త Ludovic Bource సఫలీకృతుడయ్యడు.



1927 లోని మూకీ చిత్రాల్లో నటించిన ఒక ప్రముఖ నటుడి నటజీవితం ఎలా, ఎన్ని మలుపులు తిరిగింది అన్నది ఈ చిత్ర కథాంశం. కథాసమయం ఐదారేళ్ళు. జార్జ్ వేలెంటిన్ ఒక ప్రముఖ మూకీ చిత్ర నటుడు. డైలాగులు ఉండే మాట్లాడే సినిమాల నిర్మాణం మొదలవ్వగానే జార్జ్ వెలుగు తగ్గిపోతుంది. పంతంతో అతడు తన ఆస్తంతా పెట్టుబడిగా పెట్టి తీసిన సినిమా నష్టపోతుంది. ఆస్తిని, ఇంటిని, పేరుప్రతిష్ఠలనూ అన్నింటినీ పోగొట్టుకున్న అతనితో గొడవపడి అతని భార్య కూడా విడిపోతుంది. తన విలువైన సామానులను సైతం వేలం వేసుకుని అంత గొప్ప నటుడూ వీధినపడతాడు. అతనిని అభిమానించే 'పెప్పీ మిల్లర్' అనే ఒక సాధారణ డాన్సర్ అంచలంచలుగా ప్రముఖ నటి స్థాయికి ఎదుగుతుంది. మొదట్లో తనను ఆదరించిన జార్జ్ కు ఆమె ఏ విధంగా సహాయపడింది అనేది మిగిలిన కథ. కొంతవరకూ ఈ సినిమా గురుదత్ తీసిన "కాగజ్ కే ఫూల్" సినిమాను గుర్తుకు తెస్తుంది.



సినిమాలో నాకు అందరికన్న బాగా నచ్చినది హీరో పెంపుడు కుక్క. ఆత్మహత్యకు పాల్పడుతున్నప్పుడు తన యజమానిని రక్షించుకోవాలనే తపనతో పరిగెత్తుకువెళ్ళి వీధిలో కనబడ్డ పోలీసాఫీసరును తీసుకువచ్చే సీన్ కళ్ళ నీళ్ళు తెప్పించింది. మనుషులకు లేని విశ్వాసం, ప్రేమ పెంపుడు జంతువుల్లో ఉంటాయి. వాటికి మనిషి డబ్బుతో గానీ, పరపతితో గాని పనిలేదు అని ఈ సన్నివేశం చెప్తుంది. మరి కొన్ని సన్నివేశాల్లో.. ఈ పెంపుడు కుక్కతో కూడా ఎంత చక్కగా నటింపజేసాడీ దర్శకుడు అనిపించింది.


ఇక గుర్తుండిపోయే సన్నివేశాల గురించి చెప్పాలంటే,

* సినిమా మొదట్లో సెట్స్ లో తెర వెనుక ఉన్నదెవరో ఒకరికొకరికి తెలీకుండా హీరోహీరోయిన్లు చేసే టాప్ డాన్స్ సీన్ చాలా నచ్చింది నాకు.

* తర్వాత జర్జ్ కోట్ లో చెయ్యిపెట్టి పెప్పీ చేసిన అభినయం,

* "నువ్వు గొప్ప నటివి అవ్వాలంటే అందరికన్న విభిన్నమైనదేదైనా నీలో ఉండాలి.." అంటూ ఆమె పై పెదవిపై ఒక బ్యూటీ స్పాట్ పెట్టే దృశ్యం,

* పెప్పీ గొప్ప నటిగా మారే విధానాన్ని టైటిల్స్ ద్వారా చూపెట్టడం (చివరిలో ఉండే పేరు నెమ్మది నెమ్మదిగా మైన్ టైటిల్స్ లోకి మారినట్లుగా చూపెట్టడం)

*  నలుగురైదుగురు మాత్రమే ఉన్న హాల్లో  తాను కూర్చుని ఫ్లాప్ అయిన జార్జ్ తీసిన సినిమాను చూసి పెప్పీ కంటతడిపెట్టే సన్నివేశం,

* పెంపుడు కుక్క జార్జ్ ని రక్షించటం

* తాను వేలం వేసిన తన వస్తువులను పెప్పీ ఇంట్లో జార్జ్ చూసే సన్నివేశం

* బజార్లో షాపులో సేల్ కు ఉన్న కోటును బయట నుంచుని అద్దంలోంచి చూసుకునే దృశ్యం

* చివర్లో ఇద్దరు కలిసి టాప్ డాన్స్ చేసే సన్నివేశం

ఈ చివరి దృశ్యంలో నిజంగా వాళ్ళిద్దరి కళ్ళలో ఉన్న ఆనందం మన కళ్ళలో,మనసులో కూడా నిలిచిపోతుంది. అది ఇద్దరు నటులు తమ గెలుపును చూసుకునే ఆనందం.



అద్బుతమైన సినిమా అనను కానీ సినిమా అమ్టే ఇష్టం ఉన్నవారంతా చూసి తీరాల్సిన చాలా మంచి సినిమా ఇది. ఇటువంటి మంచి సినిమాలను మల్టిప్లెక్సులకు, ఒకటి రెండు షో లకూ పరిమితం చేయటం మంచి సినిమాలకు సామాన్య ప్రేక్షకుడికి దూరం చేయటమే అవుతుంది !


10 comments:

Country Fellow said...

Good one. The Artist is like fresh air in these days of blockbusters.

Nice article

SHANKAR.S said...

"కొంతవరకూ ఈ సినిమా గురుదత్ తీసిన "కాగజ్ కే ఫూల్" సినిమాను గుర్తుకు తెస్తుంది."

కథ చదువుతుంటే నాకు ఆ సినిమాయే గుర్తోచ్చిందండీ.
బహుశా ఒక నటుడి జీవితంలో ఒడిదుడుకుల గురించి అయినందువల్లేమో.

ఈ సినిమా థియేటర్ లో చూసే అదృష్టం నాకు లేనట్టుంది :(. ఇంతకీ ఎక్కడ ఆడుతోంది?

నిన్న సాయంత్రం డౌన్లోడ్ చేశాకానీ ఇంత వరకు చూడలేదు. మీ రివ్యూ చదివాక ఈ రోజు రాత్రి వర్క్ అయిపోయాక చూసేయాల్సిందే అని డిసైడ్ అయిపోయా.

Purnima said...

WoW! Didn't know this one was playing in the city. Thanks for writing about it. I'll make sure I'd watch it.

సుజాత వేల్పూరి said...

వావ్, చాలా బావుంది. నేను థియేటర్ లో కాకపోయినా డీవీడీ అయినా కొనుక్కుని చూస్తాను. థాంక్స్ తృష్ణా!

జ్యోతి said...

అకాడమీ అవార్డ్ వచ్చినప్పుడే చూడాలనిపించింది, మీ రివ్యూ చదివాక చూడక తప్పదనిపిస్తోంది :) మంచి రివ్యూ , థాంక్స్ తృష్ణ :D

మరువం ఉష said...

బాగా చెప్పారు తృష్ణ. నేను నిన్న రాత్రి అంటే 4వ తేదీన చూశాను. నలుగురైదుగురు మాత్రమే ఉన్న హాల్లో మాత్రమే ఉన్న హాల్లో నా శ్వాస నాకు వినిపింఛేంత నిశ్శబ్దంలో. చూసినంతసేపూ ఒక చిత్రకారుడు కుంచె వెంబడి కళ్ళు కదిపినంత తదేకంగా చూస్తూ. మీరన్నవన్నీ కాక నాకు హత్తుకున్న మరొక పాత్ర - స్వామి భక్తి కనపరిచిన ముసలి డ్రైవరు. అలాగే, సగటు సామాజికజీవులు ఏ కాలాన్నైనా ఉంటారు అనిపించిన ఆ మిగిలిన లోకుల చూపుల మాటలు గుర్తుండిపోతాయి. నాకు ఆ ఈక పడిన సన్నివేశం, హీరో అవతనం/హీరోయిన్ అధిరోహణం చూపిన విధం కూడా మెదణ్ణి వదల్లేదెంతకీ. అద్భుతం కాదు అనూహ్యమైన ప్రయోగం, ఆశించని ఆదరణ. (పుష్పకవిమానం ఛాయ ఒక్కసారే అనిపించింది రెండూ మూకీలే అయినా)

తృష్ణ said...

@country fellow: ధన్యవాదాలు.
@శంకర్: చూసారా? వీలైతే హాల్లో చూడండి. మూడు చోట్ల ఆడుతోంది.
ధన్యవాదాలు.
@పూర్ణిమ,@ సుజాత: మీకు నచ్చుతుంది. తప్పక చూడండి.
ధన్యవాదాలు.

తృష్ణ said...

మహెక్: అవార్డ్ రాకముందు కూడా ఈ పరిశోధనాత్మక సినిమా ఏమిటో చూడాలి అనిపించిదండీ నాకు. వీలుచూసుకుని చూసేయండి..
ధన్యవాదాలు.

ఉష: హాయ్ చూసారా...బావుంది కదా!
అవును..ఆ డ్రైవర్ నాకూ నచ్చాడు. హీరోయిన్ ఎదుగుదల చూపిన విధానం బాగుంది కదండి..! ఈక పడటం, వేలంపాట అయ్యాకా జర్జ్ వెళ్పోతుంటే పెప్పీ కారులోంచి కన్నీరు కార్చే దృశ్యం కూడా బాగున్నాయి.
ఇక్కడ హాలో సగానికి పైగా ఉన్న జనాన్ని చూసి నాకూ భలే ఆనందం వేసింది.
"పుష్పక విమానం" ఛాయల గురించి కాదండీ నేను అన్నది...both are two distinct themes.but ఇటువంటి మూకీ ప్రయోగం మన తెలుగువాడు పదిహేనేళ్ల క్రితమే చేసాడు కదా అని గర్వం కలిగింది. అందుకని అతన్ని తల్చుకున్నా హాల్లో..!
ధన్యవాదాలు.

gita said...

watched the movie on the week end . didnot know it was a silent movie . it was a pleasant surprise. in the beginning we
were sceptic if could sit through the movie but at the end we felt it was over all too soon. our 7 year old son sat through the movie with out any complains. did you feel 'the dirty picture ' was 'inspired' by this movie ?
just want to check if it is only me that felt this.

తృష్ణ said...

@sangeetha: హాల్లో వెనుక rowలో కూర్చున్నవాళ్ళు ఇదే మాట అనుకున్నారు...:) అలా అనిపించటం కోఇన్సిడేన్స్ కావచ్చు..
ధన్యవాదాలు.