సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, December 19, 2011

ఈసారి పుస్తక ప్రదర్శన కబుర్లు





మా నాన్నగారు పుస్తకాలు బాగానే కొనేవారు కానీ పుస్తకాల మనిషి కాదు. ప్రముఖమైనవీ, తనకి ఆసక్తి ఉన్న పుస్తకాలు కొనేవారు. సాహితీమిత్రుల ద్వారా పరిచయమైన పుస్తకాలు కొన్ని, కొందరు బహుకరించినవి ఇంకొన్ని మా ఇంట్లో ఉండేవి. నాన్న లానే నాకూ మా ఇంట్లో ఉన్న పుస్తకాలతో తప్ప కొత్త పుస్తకాలతో పరిచయం తక్కువే. అందువల్ల సాహితీ లోకంతో నాకు పేద్ద పరిచయం ఏమీ లేదు. మా ఇంట్లో నే చూసిన... "అ నుండి ఱ" వరకూ అన్ని అక్షరాల నిఘంటువుల సిరీస్, చాలా వరకూ చలం రచనలు, శ్రీ శ్రీ పుస్తకాలు, శ్రీరమణ సాహితీ సర్వస్వం వాల్యూమ్స్, బాపు రమణల తాలుకూ పుస్తకాలు, సినిమాల నేపధ్యంలో ఉన్న కొన్ని పుస్తకాలు, కృష్ణశాస్త్రి గారి అన్ని పుస్తకాలు, టాగూర్ పుస్తకాలు, శరత్ సాహిత్యం అన్ని వాల్యూమ్స్, బాపిరాజు రచనలు, కొన్ని కవితా సంపుటిలు, కథా సంపుటిలు...మొదలైనవి మాత్రమే నాకు తెలిసిన పుస్తకాలు.

మర్క్ ట్వైన్, పి.జి.వుడ్ హౌస్, ఆర్.కె.నారాయణ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, డ్రాయింగ్ & పైంటింగ్ గురించిన ఆంగ్ల పుస్తకాలు చాల ఉండేవి చిన్నప్పుడు. కానీ ఒకసారి ఫైర్ ఏక్సిడెంట్ అయ్యి అవన్నీ కాలిపోయాయి. మళ్ళీ అవన్నీ ఇక కొనలేదు నాన్న. విజయవాడలో పుస్తకప్రదర్శన మొదలైన దగ్గర నుండీ దాదాపు 14 book festivals దాకా అన్నీ వదలకుండా చూసాను. తర్వాత ఇప్పుడు రెండేళ్ళ నుంచే మళ్ళీ పుస్తక ప్రదర్శన చూస్తున్నా, కొంటున్నా.

ఈసారి పుస్తక ప్రదర్శనలో నేను చూసిన కొన్ని మంచి పుస్తకాలు:

* "తూర్పుగోదావరి ప్రయాణం" అని మంచి మంచి ఫోటోలతో ఒక పుస్తకం ఉంది.(400/-) వాళ్ల వెబ్సైట్ కూడా ఉందిట http://www.egyatra.com అని. ఇటువంటి పుస్తకాలు అసలు ఆంధ్రాలో ఉన్న అన్ని ప్రదేశాల మీదా ఉంటే చాలా బావుంటుంది అనిపించింది.

* తెలుగు రచయిత్రులందరి పరిచయాలతో ఒక సంకలనం ఉంది. పేరు మర్చిపొయా కానీ అందులో అందరు స్త్రీ రచయిత్రుల పరిచయాలూ ఉన్నాయి.

* తాపీ ధర్మారావు గారు అనువదించిన "అన్నా కెరినీనా" పుస్తకం.

* బీనాదేవి సమగ్ర రచనలు.

* చలం రచనలన్నీ ఆకర్షణీయమైన కొత్త ప్రింట్స్ తో వచ్చాయి.

* నోరి నరసింహశస్త్రి గారి చారిత్రాత్మక రచనలు : (టాగూర్ పబ్లిషర్స్ అనుకుంటా.. )
రుద్రమదేవి,
నారాయణ భట్టు,
కవిద్వయము,
కవిసార్వభౌముడు(ఇది నా దగ్గర ఉంది)

* వేటూరి వారి పాటల పుస్తకాలు రెండు మూడు రకాలు ఉన్నాయి...("కొమ్మకొమ్మకో సన్నాయి" మాత్రం ప్రింట్లు లేవుట).

* యోగానంద స్టాల్లో "Living with the Himalayan Masters" ఒకటి.. (చాలా రోజులుగా కొనాలని...వీలైతే లాస్ట్ రౌండ్ లో చూడాలి)

* యోగానంద స్టాల్లో పోస్టర్స్ చాలా బావున్నాయి. రెండు కొన్నాను.

* అక్కడే చిన్న చిన్న ఇన్స్పిరేషనల్ బుక్స్ కూడా చాలా బావున్నాయి.

* పిలకా గణపతి శాస్త్రి గారి "హరివంశము", మరో మంచి పుస్తకం కూడా చూసా..పేరు గుర్తురావట్లే.

* కృష్ణాదేవరాయుల మీదో విజయనగరసామ్రాజ్యం మీదో ఒక పుస్తకం(పేరు గుర్తులేదు).
(గతంలో నేను "Forgotten Empire"కి తెలుగు సేత "విస్మృత సామ్రాజ్యం విజయనగరం" అని ఒకటి కొన్నాను.బావుంటుంది ఆ పుస్తకం.)

* "కొత్త పల్లి " అనే పిల్లల కథల మ్యాగజైన్ స్టాల్లో పిల్లల బొమ్మల కథల పుస్తకాలు బాగున్నాయి.

* సి.పి.బ్రౌన్ అకాడమీ స్టాలో కూడా రేర్ బుక్స్, కొన్ని జీవిత చరిత్రలు బావున్నాయి.

* పబ్లికేషన్స్ డివిజన్ (ఐఽబి మినిస్ట్రీ వాళ్ళది) స్టాల్లో కూడా పిల్లలకి మంచి పుస్తకాలు తక్కువ ధరల్లో ఉన్నాయి.
ముందు తెలుగు చదవటం నేర్పించాలనే ఉద్దేశంతో మా అమ్మాయికి పిల్లల ఇంగ్లీషు పుస్తకాలు ఏవీ కొనలేదు. అన్నీ తెలుగువే కొన్నాం.

* ఆక్స్ఫార్డ్ వాళ్ల దగ్గర చిన్నపిల్లలకు బాగా పనికివచ్చే మంచి మేథిమేటిక్స్ బుక్స్ ఉన్నాయి.

* ఇంగ్లీషు పుస్తకాల జోలికి వెళ్లలే.. (వెళ్తే మళ్ళీ కొనాలనిపిస్తుందని..:))

*** **** *****

తన దగ్గర ఉన్న పుస్తకాలు కాక వేరేవి కొనుక్కోమని నాన్న చెప్తూంటారు. అందువల్ల ఇంతవరకు నాకు తెలియని కొత్త పుస్తకాలు మాత్రమే కొంటూంటాను నేను. క్రితంఏడు నా కిష్టమైన యద్దనపూడి, కోడూరి నవలలు, రకరకాల శతకాలు మొదలైనవి కొనుక్కున్నా.

ఈసారి నే కొన్నవి చాలావరకూ పాత పుస్తకాలే కాబట్టి అవన్నీ లిస్ట్ రాయను కానీ కొన్ని పేర్లు రాస్తాను ..))

* బంకించంద్ర చటర్జీ రాసిన "ఆనంద్ మఠ్" తెలుగు అనువాదం. ఇదే పేరుతో హిందీలో సినిమా వచ్చింది. అందులో "వందేమాతరం" పాట చాలా ఫేమస్. సిన్మాలో భరత్ భూషణ్, గీతా బాలి ముఖ్య పాత్రలు.

* అడవి బాపిరాజు కథలు.

* Shakespeare sonnets కి తెలుగు అనువాదం.

* జి.వి.పూర్ణచంద్ గారి "తరతరాల తెలుగు రుచులు". ఈ పుస్తకంలోని చాలా వ్యాసాలు రేడియో టాక్స్ లాగ ప్రసారమయినవే. చాలా ఉపయోగకరమైన పుస్తకం.
(పూర్ణచంద్ గారు అదివరకూ చాలా ఏళ్ల క్రితం రాసిన "తల్లి వైద్యం" అనే పుస్తకం కూడా చాలా బావుంటుంది. నిత్యం మనం వాడే అన్ని వంట పదర్ధాలు, కూరలు,ఆకుకూరలు అన్నింటి ఉపయోగాలూ ఉంటాయి అందులో.)

* ప్రేమ్ చంద్ "నిర్మల". (స్కూల్ రోజుల్లో టివీలో సీరియల్ గా వచ్చేది ఈ నవల. )

* వాడ్రేవు వీర లక్ష్మీదేవి కథలు.

* "సత్యాన్వేషి చలం" (ఇది వాడ్రేవు వీరలక్ష్మి గారి పి.హెచ్.డి సిధ్ధాంత వ్యాసం.)

* కాశీభట్ల వేణుగోపాల్ గారి రెండు నవలలు.

* సోమరాజు సుశీల గారి రెండు పుస్తకాలు.

*వనవాసి

* chess ఆడటం గురించిన ఓ పుస్తకం..

* జె.పి.పబ్లికేషన్స్ వాళ్ల "ఎస్.జానకి మధురగీతాలు "(జానకి పాడినవి దాదాపు 265 పాటలు ఉన్నాయి ఈ సంకలనంలో)

* వంగూరి చిట్టెన్ రాజు గారి "అమెరికామెడి కథలు"

* "తెలుగు పద్యాలా? బాబోయ్ !" అని ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి గారి పుస్తకం ఒకటి కొన్నా. మంచి మంచి పద్యాలతో భలేగా ఉంది పుస్తకం.
ఇంకా ఏవో అవీ ఇవీ.. కొన్నా !

* ఈసారి ఎక్కువభాగం మా అమ్మాయికి కథల పుస్తకాలు, బొమ్మల కథల పుస్తకాలు, బొమ్మల రామయణం, బొమ్మలతో భరతం కథలు, ఆక్స్ఫార్డ్ స్టాల్లో మేథిమేటిక్స్ బుక్స్ మొదలైనవి కొన్నాం.

* ఇంకా యోగానంద స్టాల్లో రెండు పోస్టర్స్ కొన్నా...





ఇవీ...ఈసారి పుస్తక ప్రదర్శన కబుర్లు...వీలైతే చివరిరోజు లోపూ మళ్ళీ మరో ప్రదక్షిణ చేయాలి.

9 comments:

Indira said...

పుస్తకప్రదర్శన కి మీరు తప్పకుండా వస్తారని తెలుసు.దీనిగురించి మీ టపాకోసం చూస్తున్నాను.పిలకా గణపతిశాస్త్రిగారి ప్రాచీన గాధాలహరి,వారణాసి అభితుకుచలాంబ రాసిన విజయనగర సామ్రాజ్య చరిత్ర,స్వర్ణ యుగ సంగీత దర్శకులు 3వ సారి (వేరొకరికి బహూకరించటానికి) కొన్నవాటిలో ముఖ్యమైనవి.సోమరాజు సుశీల గారి దీపశిఖ,మల్లాది హిమాలయం-మహిమాలయం కోసం ఎంతవెదికినా కనపడలేదు.స్వామి రామా గారి పుస్తకం లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ నాకు చాలా నచ్చిన పుస్తకం.

pradeep said...

nenu ee madye telugublog group lo oka thread start chesanu .. telugulo manchi pustakaala list okati tayaru cheddamani... meeku veelu ayite meeru ippati varaku chadivina pustakaalalo meeku nachinavi alage meeku nachina rachayitala perlu cehputaara...oka vela meeru kooda a group lo unte aa mail ki reply ivvagalaru

తృష్ణ said...

@ఇందిర: అది పేరు.."ప్రాచీన గాధలహరి" ఇప్పుడు గుర్తువచ్చింది. ఇది కూడా బావుందండి.. "స్వర్ణయుగ.." పుస్తకం మీరూ బహుకరిస్తున్నారా? నాన్నగారు కూడా ఒక ఫ్రెండ్ కు ఇచ్చారు. కలవటం ప్రదర్శనలో మిస్సయ్యాం అన్నమాట...:((
ధన్యవాదాలు.

@ప్రదీప్: చూస్తానండీ. తెలిసినవి రాస్తాను...కానీ నాకు తెలిసిన పుస్తకాలు, పేర్లు చాలా తక్కువేనండి.
ధన్యవాదాలు.

పద్మవల్లి said...

తృష్ణా.. బలే కుళ్ళుగా ఉంది నాకు మీమీద. చక్కగా అన్నీ పుస్తకాలూ కోనేసుకున్నారా. నాకు కూడా బీనాదేవి కథలు ఇష్టం, కానీ నరసింగరావు గారు పోయాక, ఆవిడ ఒక్కరే రాసినవి ఏవి చదవలేదు. ఆనంద్ మఠ్, అమెరికామెడి కథలు కూడా నా దగ్గర ఉన్నాయి. మిగిలినవి మీరు చెప్పిన లిస్టులో చాలా లేవు నా దగ్గర. మీరు తొందరగా చదివేసి మాకోసం రాస్తే అప్పుడు కొనాల్సిన లిస్ట్లో బాగున్నవి చేర్చేసుకుంటాను.
ఎంజాయ్ ది బుక్స్.

తృష్ణ said...

ప్రదీప్ గారూ,

మంచి పుస్తకాల వివరాలు అన్నీ ఒకచోట నిక్షిప్తం చేస్తున్నానన్నారు కదా, ఇక్కడ కొన్ని వివరలు పెడుతున్నానండి....మరెవరికైనా ఉపయోగపడతాయి కూడా. నేను చదివిన పుస్తకాల వివరాలకన్నా నేను ఇక్కడ పెడుతున్న పుస్తకాల జాబితాల తాలూకూ లింక్స్ చాలా ఉత్తమమైనవి.


ఈ క్రింది లింక్ లో పుస్తకం.నెట్ లో "Reading list" అనే లేబుల్ క్రింద ఉన్న అన్ని టపాలూ కనబడతాయి. అందులో చాలామంది తమకు ఇష్టమైన, చదివిన పుస్తకాల జాబితాలు ఇచ్చరు. క్రింద లింక్ లోకి వెళ్ళి ఆ యా జాబితాలను చూడగలరు:
http://pustakam.net/?cat=368


మరికొన్ని పుస్తకాల జాబితాల తాలూకూ టపాల లింకులు:
http://pustakam.net/?p=6773

http://pustakam.net/?p=2338

http://saraswathikumar.wordpress.com/2010/08/25/%E0%B0%B5%E0%B0%82%E0%B0%A6-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/

http://te-palavelli.blogspot.com/2009/06/blog-post_29.html

http://pustakam.net/?p=6418

తృష్ణ said...

పద్మ గారూ,
నేను చూసినవాటి జాబితా ఒకటి, కొన్న జాబితా ఒకటి మీరు రెండూ నే కొన్నవే అనుకోలేదు కదా...:)) మీరు బజ్జు లో రాస్తూండే కొన్ని పుస్తకాలు కూడా నాకు అస్సలు తెలీదండి...పుస్తకాల గురించి నాకు తెలిసింది సాగరంలో నీటిబొట్టంత..!!
సరే అయితే వీలయినన్ని చదివి చెప్తాలెండి...:)))

SHANKAR.S said...

కెవ్వు తృష్ణ గారూ. ఆలశ్యానికి క్షమించాలి.
ప్రతి సారిలా కాక ఈ సారి ఇంచుమించు ప్రతిరోజూ బుక్ ఫెస్టివల్ కి వెళ్లానండీ.మొదట్లో నాకోసం పెద్దగా తీసుకోలేదు. చివరికి వచ్చేసరికీ పించ్ హిట్టింగ్ మొదలెట్టా. మొత్తం మీద పుస్తకాల పండగ ముగిసి నాదగ్గర నికరంగా లెక్క తేలిన పుస్తకాలు ఇవీ.

బోణీ కొట్టింది "సినిమా పోస్టర్" తో ఆ తర్వాత

నోరి నరసింహ శాస్త్రి గారి "కవి సార్వభౌముడు, రుద్రమదేవి, కవిద్వయం, వాఘిరా, సర్ప సత్రం (నాటిక)" ఈ చివరి రెండూ బావుంటాయని డాక్టర్ కొనిపించాడు

శారదా శ్రీనివాసన్ గారి "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు"

డా.కోడూరు ప్రభాకర రెడ్డి గారి "చాటు కవి సార్వభౌమ శ్రీనాధుని చాటువులు"

దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటు పద్య రత్నాకరం"

పురావస్తుశాఖ వారు పబ్లిష్ చేసిన "గాథా సప్తశతిలో తెలుగు పదాలు"

రావూరి భరాద్వాజ గారి "పాకుడు రాళ్ళు"

కొవ్వలి వారి "కొవ్వలి నవలలు కొన్ని"

పి.వి.ఆర్.కే ప్రసాద్ గారి "తిరుమల లీలామృతం" (స్వాతి ఎఫెక్ట్ :)) )

శ్రీదేవి గారి "కాలాతీత వ్యక్తులు"

బలివాడ కాంతారావుగారి "బలివాడ కాంతారావు కథలు"

ఇవన్నీ కొనే సరికి గొల్లపూడి వారు "సాయంకాలమైంది" బుక్ ఫెస్టివల్ చివరికోచ్చేస్తోంది ఇంకా ఏమన్నా కొనాలంటే కోనేస్కో అని ఓ రెండు పీకి హెచ్చరించారు. సరే ఇంకా ఎవరు మిగిలారబ్బా అని ఆలోచిస్తుంటే "అంపశయ్య" మీద పడుకుని ఓ పెద్దాయన కనిపించారు. వార్నీ మీ పేరు నవీన్ గారు కదా అని పలకరించి ఆయన వేసిన లాస్ట్ బాల్ కి సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించాను. ఇదిగో ఆయన పుస్తకాల లిస్టు

1. అంపశయ్య
2. సినిమా వీక్షణం
3. జీవన శైలి
4. చెదిరిన స్వప్నాలు
5. కాల రేఖలు
6. నవీన్ నవలలు (విచలిత, సౌజన్య, చెమ్మగిల్లని కన్నులు, తారుమారు)


ఈ సారి మొదట్లో మెల్లిగా మొదలయ్యి చివరికి వచ్చేసరికి లిస్టు ఇలా పూర్తయింది.

అన్నట్టు మీరన్న "తూర్పు గోదావరి ప్రయాణం" పుస్తకం చూశానండీ. కానీ మీరిచ్చిన వాళ్ళ వెబ్సైట్ లింక్ లో అస్సలు కాకినాడ పేరు లేకపోవడం, కాకినాడ కాజా గురించి మాటమాత్రమైనా ప్రస్తావించకపోవడం చూసి రగతం మరిగింది. అందుకే ఆ పుస్తకాన్ని నిషేధించా.

అవ్విధంబుగా ఈ యేటి పుస్తకాల పండగను విజయవంతంగా ముగించా :))

తృష్ణ said...

@shankar.s:అయ్యబాబోయ్...అయితే మీ ఇంటి మీద దాడి చేయాల్సిందే...! బావుందండీ కలక్షన్.
"తూర్పు గోదావరి" పుస్తకంలో కాకినాడ కాజాల గురించి లేకపోవటమేంటండీ? ఒక పేజీలో మొత్తమ్ కాజాలతో ఉన్న ఫోటో నేను చూస్తేనూ...మీరు మిస్సయారేమో.

SHANKAR.S said...

తృష్ణ గారూ పుస్తకంలో కాదండీ. ఆ ముందు రోజు మీరు పెట్టిన పోస్ట్ లో లింక్ చూసి వాళ్ళ వెబ్ సైట్ కి వెళ్తే అస్సలు కాకినాడ పేరు లేకపోవడం చూసి నాకు ఖోపం వచ్చింది. కాకినాడ పేరు లేకుండా తూ.గో.జీ యా అని గర్జించి వాళ్ళ పుస్తకాన్ని బ్యాన్ చేసానన్న మాట.