పట్టిసీమ :
మూడవరోజు ఎక్కడికెళ్ళాలో ప్లాన్ లేదు కాబట్టి కాస్త ఆలస్యంగా లేచాము. ఆ రోజు రాత్రికే కాకినాడలో అత్తయ్యగారిని కలిసి, రైలు ఎక్కాలి. అంతర్వేది, అదీ ఇది అని రకరకాలు అనుకుని చివరకు "పట్టిసీమ" వెళ్ళొచ్చేద్దాం అని నిర్ణయించుకున్నాము. పోలవరం బస్సులు ఎక్కమని మావయ్య చెప్పాడు. బస్టాండ్ లో మేం వెళ్ళిన సమయానికి పోలవరమ్ బస్సులేమీ లేవు. "తాళ్లపూడి" బస్సు ఉంది, అది ఎక్కమని టికెట్ కౌంటర్లో చెప్తే అది ఎక్కాము. ఆ బస్సు గోదావరి దాటి "కొవ్వూరు" మీదుగా గంటన్నర కి తాళ్లపూడి చేరింది. ఎర్రబస్సులెక్కి చాలా కాలమైంది. పైగా రోడ్డు కూడా బాగోలేదు. అక్కడ నుండి షేర్ ఆటోలో పట్టిసం వెళ్లటానికి అరగంట పట్టింది. ఆ రోడ్డు మరీ దారుణంగా ఉంది. అన్నీ గొయ్యిలే. పిల్ల ఇబ్బంది పడింది పాపం. దగ్గరే కదా వెళ్ళొచ్చేయచ్చు అనుకున్నాం కానీ రోడ్డు ఇంత ఘోరంగా ఉంటుందని తెలిస్తే ఏ టాక్సీనో మాట్లాడుకుని ఉందుమే అనుకున్నాం.
పట్టిసీమకు వెళ్ళే రేవు దగ్గర షేరాటో దిగి రేవుకి వెళ్లాం. పేద్ద ఆంజనేయస్వామి విగ్రహం, అందమైన రేవు ఆహ్లాదాన్ని కలిగించాయి. అక్కడే జీళ్ళు చేసి అమ్ముతూంటే వాటి ఫోటోలు తీసా. దేవాలయానికి లడ్డూ ప్రసాదం కూడా అక్కడే చేస్తున్నారు. అవతల ఒడ్డుకు వెళ్ళిన పడవ రావటానికి కాసేపు ఆగాము. మేం ఎక్కిన పడవలో మోటారు ఉంది కానీ అది మేము కాశీలో ఎక్కిన తెడ్డు పడవలాగానే ఉంది. చెయ్యి పెడితే నీళ్ళు అందుతున్నాయి. పడవ వెళ్తుంటే వంగి నీళ్ళలో చెయ్యిపెట్టడం భలే తమాషాగా ఉంటుంది. కనుచూపు మేరదాకా చుట్టూరా అంతా నీళ్ళు, దూరంగా కనబడుతున్న పాపికొండలు, ఎదురుగా చిన్న కొండ మీద వీరేశ్వరస్వామి ఆలయం.. ఎంతో అందమైన దృశ్యం అది. ఈ మొత్తం ప్రయాణంలో మేము బాగా సంతోషంగా ఎక్కువసేపు గడిపిన ప్రదేశం ఇది.
అవతల ఒడ్డు ఒక ద్వీపంలాగ ఉంది. పడవ లేకపోతే అవతలి ఒడ్డుకు మళ్ళీ వెళ్ళలేము. తిరిగి వెంఠనే వెళ్లకుండా రెండు మూడు ట్రిప్స్ వదిలేసి ఓ గంట సేపు అక్కడ గడిపాము. మిట్టమధ్యాన్నం ఒంటిగంట అవుతోంది. ఎండబాగా ఉంది కానీ నదీతీరం కాబట్టి చల్లగా ఉంది. తడిసిన ఇసుక సముద్రపు ఒడ్డును గుర్తుకు తెచ్చింది. గోదావరి అంచు, ఇసుక తప్ప ఇంకేమీ లేదక్కడ. మా పాప నీళ్లలో ఆడుతుంటే, లోతులేని ప్రాంతం చూపెట్టి అక్కడ ఆడుకోవచ్చన్నాడు పడవబ్బాయ్. ఇక అక్కడికి వెళ్ళి మేం కూడా మా మా లోకాల్లో ములిగిపోయాం. పిల్ల ఒడ్దునే ఇసుక గూళ్ళు కడుతూ కూచుంది. తనేమో కాస్త నీళ్లలోపలికి వెళ్ళారు. నేనేమో white డ్రస్ పాడవుతుందని మరీ నీళ్లలోపలికి వెళ్లలేదు. ఒడ్డునే కాస్త పాదాలవరకు నీళ్ళల్లో మునిగేలా చూసుకుని ఆ అంచమ్మటే నడుచుకుంటూ అటూ ఇటూ తిరిగాను.
ఆ గోదావరి తీరం అంచున చాలా బుజ్జి బుజ్జి చేపల గుంపులు తెగ తిరిగేస్తున్నాయి కానీ ఎన్నిసార్లు ఫోటో తీసినా ఫోటోలోకి రాలేదవి. క్లిక్ మనేలోపూ పారిపోతున్నాయి. నా పాదాల మధ్యన బుజ్జి బుజ్జి చేపలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే అలా నీళ్ళల్లో నడవటం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళీ కాస్త ఇవతలకి వచ్చి తడి ఇసుకలో నా పాదాలగుర్తులు కనబడేలా నడిచి వాటికి ఫోటో తీస్కున్నా :) అలా ఎంతోసేపు ముగ్గురం సరదాగా పట్టిసీమలో గడిపాము.
ఆ ప్రకృతిలో, నిశ్శబ్దంలో మమేకమవ్వాలని చేసే ప్రయత్నంలో నాకు Thoreau తన "Walden" ఎంత ఉద్వేగంతో రాసి ఉంటాడో అర్థమైంది. ఇటీవల ఓ పుస్తకంలో చదివిన నది నేర్పే పాఠాలు కూడా గుర్తుకువచ్చాయి. ఈ చిన్నచిన్న ఆనందాలన్నీ ఆస్వాదించగలుగుతూ ఇక్కడే ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది. కానీ ఇక్కడుండేవాళ్ళు ఇలా అనుకోరేమో... సిటీ రణగొణధ్వనుల మధ్యనుంచి, ఆదరాబాదర జీవితాల నుండీ వచ్చాం కాబట్టి ఇలాంటి గొప్ప అనుభూతిని కలిగిందేమో అని కూడా అనిపించింది.
మేం వెనక్కి తిరిగి రాజమండ్రి వచ్చేసరికీ నాలుగున్నర. పాపకి అన్నం పేక్ చేసుకుని, ఇద్దరు మావయ్యల దగ్గరా శెలవు తీసుకుని బస్సు ఎక్కేసరికీ ఆరున్నర. కాకినాడ చేరేసరికీ పావుతక్కువ ఎనిమిది. ఈ చివరి కాసేపు మాత్రం హడావుడి అయ్యింది. మేమింకా రాలేదని అత్తగారికి కంగారు. అత్తయ్యగారిని తీసుకుని రైల్వేస్టేషన్ చేరేసరికీ సరిగ్గా ట్రైన్ వచ్చే టైం అయ్యింది. మర్నాడు పొద్దున్న ఇక్కడ రైలు దిగి ఇల్లు చేరేసరికీ పొద్దున్న ఏడున్నర. ఎనిమిదింటికి పిల్ల స్కూల్ ఆటో వస్తుంది. అప్పటి నుండీ మళ్ళీ నా మామూలు తకధిమి తకతైలు మొదలైపోయాయి !! ఎన్నాళ్ళకో అరుదుగా దొరికిన ఈ అందమైన అనుభూతిని, ప్రకృతి ఇచ్చిన ప్రశాంతతనీ మర్చిపోకూడదని ఇలా బ్లాగులో పొందుపరుచుకుంటున్నా..!
*** *** ***
మరికొన్ని ఫోటోలు ఇక్కడ: