చిన్నప్పుడు టీవీ తో ఉన్న గాఢమైన అనుబంధం వల్ల ఆనాటి నటీనటులు, ఆనాటి సీరియల్స్, ఆ జ్ఞాపకాలన్నీ ఎంతో మధురంగా అనిపిస్తాయి. ఆ అనుబంధం వల్లే ఆనటి నటీనటుల పట్ల కూడా అభిమానం నిలిచిపోయింది. హిందీ ఛానల్స్ మాత్రమే ఉండే ఆ రోజుల్లో ఎందరో గొప్ప నటులు ఉండేవారు. వారిలో అతికొద్ది మందికే వెండితెరపై వెలిగే అవకాశం దక్కింది. వారందరిలోకీ ఒక విలక్షణ నటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఒకరు ఇర్ఫాన్ ఖాన్!
ఇర్ఫాన్ ఖాన్ పేరు వినగానే నాకు ఎప్పటికీ గుర్తుకు వచ్చేది "బనేగీ అప్నీ బాత్(Banegi Apni Baat)" అనే టివీ సీరియల్. Madhavan, shefali chaya, Irfhan khan మొదలైన నటులను నాకు పరిచయం చేసిన ఆ సీరియల్ ఎంతో బావుండేది. కథ, కథనం, నటీనటుల అద్భుతమైన అభినయం అన్నీ బావుండేవి. కాలేజీ రోజుల్లో అస్సలు మిస్సవకుండా చూసేవాళ్లం.. నేను, నా స్నేహితురాళ్ళూ. అప్పట్లో ఇర్ఫాన్ ని ఇంకా మరెన్నో సీరియల్స్ లో చూసేదాన్ని. నాకు బాగా గుర్తున్నవి - 'చంద్రకాంత', 'చాణక్య', 'శ్రీకాంత్', 'స్పర్ష్' సీరియల్స్. మంచి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకునేవాడు ఇర్ఫాన్. మంచి పాత్రలను ఎంత బాగా చేసేవాడో, నెగెటివ్ రోల్స్ లో కూడా అంతే బాగా నటించడం అతడి ప్రత్యేకత. అందుకేనేమో అంతమంది టీవీ ఆర్టిస్టుల్లో బాగా గుర్తుండిపోయాడు.
సినిమాల్లో అవకాశాలు లేటుగా వచ్చినా అదృష్టవశాత్తూ మంచి memorable roles లభించాయి ఇతనికి. తను నటించిన సినిమాల్లో నేను చూసినవి చాలా తక్కువే. తపన్ సిన్హా తీసిన "ఏక్ డాక్టర్ కీ మౌత్", విశాల్ భరద్వాజ్ తీసిన "మక్బూల్", తెలుగులో విలన్ గా నటించిన "సైనికుడు", Salaam bombay, Slumdog millionaire, New york, New york, I love you, Life in a - Metro, Life of Pi, The lunch box, Piku మొదలైనవి గుర్తున్నాయి. అన్నింటిలోనూ Piku బాగా గుర్తుంది. ముఖ్యంగా చిత్రంలో వంద శాతం మార్కులు అమితాబ్ నటనకే అయినా, దీపిక తో పాటూ అంతే దీటుగా నటించిన ఇర్ఫాన్ పాత్ర కూడా గుర్తుండిపోయింది.
తన కృషికీ, కష్టానికీ ఫలితంగా పద్మశ్రీ పురస్కారాన్ని సగర్వంగా అందుకోగలగడం ఒకవిధంగా చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ప్రతిభ ఉండి, ఎంతో కళాసేవ చేసిన ఎందరో మహానుభావులు, కళాకారులు ఆ పురస్కారాన్ని అందుకోకుండానే వెళ్పోయారు. ఇర్ఫాన్ ఇక లేడన్న వార్త చదవగానే బాధతో పాటూ ఒక నిట్టూర్పూ... ఇతని ఆయుష్షు సంగతి తెలిసేనేమో భగవంతుడు పిన్న వయసులోనే ఆ పురస్కారాన్ని ఇర్ఫాన్ కి అందించేశాడనిపించింది.
హాస్పటల్ లో తన అభిమానుల కోసం రికార్డ్ చేసిన తన చివరి సందేశం గురించి చదివి మనసు ఎంతో ఆర్ద్రమైంది..! చివరి క్షాణాలని ఎదుర్కోవడానికి కూడా ఎంతో bravery ఉండాలి.
అవే చివరి క్షణాలు అని తెలియకుండా వెళ్పోయేవారు దురదృష్టవంతులే కానీ అవే చివరి క్షణాలు అని తెలిసాకా చెప్పే మాటల్లో ఎంతో సత్యం దాగి ఉంటుంది. ఈమధ్యన near death experiences గురించి ఒక ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికరమైన విషయాలు విన్నాను.
హ్మ్!! ఏదేమైనా ఇర్ఫాన్ ఆత్మకి శాంతి కలుగుగాక!
ఈ సందర్భంలో H.W.long fellow పద్యంలోని
నాలుగు వాక్యాలు ...
"Lives of great men all remind us
We can make our lives sublime,
And, departing, leave behind us
Footprints on the sands of time"