సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, May 19, 2019

తెలుగు సినీప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే రాళ్లపల్లి !


రాళ్లపల్లి అనగానే -
"దర్శకరత్న దాసరి నారాయణరావ్ పక్కన్నేను
నటశేఖర కృష్ణ పక్కన్నేను
నూతన్ పెసాదు పక్కన్నేను
జయప్రద పక్కన్నేను
శరత్ బాబు పక్కన్నేను
రాళ్లపల్లి పక్కన్నేను" అనే డైలాగ్ ఠక్కున గుర్తుకొస్తుంది.
లేడీస్ టైలర్ సినిమాలో 'అడ్డతీగల హనుమంతు' అనే కోయదొర వేషం చిన్నదే అయినా, కథానాయకుడు రాజేంద్రప్రసాద్ కు జోస్యం చెప్పి, అప్పటి నుంచీ మొదలయ్యే మొత్తం కథంతటికీ మూలకారణమవుతాడు. 




కొన్ని దశాబ్దాల పాటు వెండితెరపై రకరకాల పాత్రలను అవలీలగా పోషించి, ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్న కళాకారుడు రాళ్ళపల్లి. రాళ్లపల్లి వెంకట నరసింహారావు ది ఒక పెక్యూలియర్ వాయిస్. అదే ఆయన ప్లస్ పాయింట్. పేరు పెద్దగా ఉందని ఒక దర్శకుడు రాళ్లపల్లి అని వేయించారుట టైటిల్స్ లో. అలా ఇంటిపేరుతోనే ప్రసిధ్ధులైపోయారు ఆయన. ఎనిమిదివందలకు పైగా సినిమాల్లో నటించిన రాళ్లపల్లి సినీపాత్రల వైవిధ్యాల గురించి చెప్పడం నాలాంటి సాధారణ మానవులకు సాధ్యం కాని పని. కానీ ఒక ఇష్టమైన కళాకారుడి గురించి, నాకు గుర్తున్నంత వరకూ, నేను చూసిన చిత్రాలలో ఆయన నటించిన కొన్ని పాత్రలను ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నాను. 

ఒక నటుడు తన అసలు పేరుతో కాక పోషించిన పాత్రల పేరుతో గుర్తుండిపోయినప్పుడు అసలైన కళాకారుడిగా గుర్తింపబడతాడు. అటువంటి విలక్షణ నటుడు రాళ్లపల్లి. లేడీస్ టైలర్ లో కోయదొర తర్వాత నాకు గుర్తుకొచ్చేది "రెండు రెళ్ళు ఆరు"లో తికమక. ఈ సినిమాలో ఒకే వాక్యాన్ని ఐదారు రకాల భాషల్లోకీ తర్జుమా చేసి చెప్పే చిత్రమైన పాత్రను రాళ్లపల్లికి ఇచ్చారు జంధ్యాల.  పేరు "తికమక". అర్థం ఏమిటని అడిగితే - "అన్నిభాషల్లోనూ!" అంటాడు. "తెలుగు కి ’తి ’, కన్నడానికి ’క ’, మరాఠీ కి ’మ ’, కొంకిణీ కి ’క ’ కలిపి అలా పెట్టుకున్నాను. మిలిటరీలో వంటవాడు గా పనిచేసినప్పుడు అన్ని భాషలూ మాట్లాడే సైనికులతో మాట్లాడడానికి దాదాపు పధ్నాలుగు భారతీయ భాషలు నేర్చుకున్నాను" అని చెప్తాడు. 



ఆ తర్వాత "శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్" సిన్మాలో సిలోన్ సుబ్బారావు బావ!! ఆ సినిమా చూసినప్పుడల్లా, పట్టు పద్మిని పాత్ర "మా సిలోన్ సుబ్బారావు బావ.." అని అన్నప్పుడల్లా ఘొల్లున నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు అందరూ "టేకిట్ ఈజీ.." అని చెప్తూంటారు కానీ అలాంటి ఈజీ పాత్రని ఎప్పుడో సృష్టించారు వంశీ. ఎవరెంత వేళాకోళంగా మాట్లాడినా ఏ మాత్రం తొణక్కుండా, తడుముకోకుండా, ఎంతో అవలీలగా, ఏదో ఒక జవాబు ఠక్కున చెప్పేసే ఆ పాత్ర చాలా రోజులు గుర్తుండిపోయింది. 



బాపూ తీసిన "మంత్రిగారి వియ్యంకుడు" లో అల్లూ రామలింగయ్య అల్లుడుగా రాళ్లపల్లి చేసిన "సిర్కిల్ ఇన్స్పెక్టర్" పాత్ర భలే ఉంటుంది. పేరుతో కాకుండా ఎప్పుడూ "ఏమయ్యా సర్కిలూ" అంటూంటాడు అల్లూ రామలింగయ్య. బాపూ తీసిన మరో చిత్రం ’రాధా కల్యాణం ’లో "ఏమ్మొగుడో...ఏమ్మొగుడో " అనే గమ్మత్తైన పాట ఉంది. నిందాస్తుతి పధ్ధతిలో తాగుబోతు మొగుడుని ముద్దుగా తిడుతూ ఓ భార్య పాడే పాట. అందులో ఆ తాగుబోతు వేషం రాళ్ళపల్లిది. చిన్న వేషం అయినా, చిన్నప్పుడెప్పుడో చూసిన సినిమా అయినా, చాలా ఏళ్లవరకూ ఆ పాట గుర్తుండిపోవడానికి కారణం రాళ్లపల్లి అంటే అతిశయోక్తి కాదు. 

నిన్న పేపర్లో రాళ్లపల్లి గురించిన వార్త చదివాక గుర్తుకొచ్చిన మరికొన్ని సినిమాలు - పాత్రలు - "సితార"( పాత్ర పేరు గుర్తులేదు), "అన్వేషణ"లో సత్యనారాయణ డ్రైవర్ పాండు పాత్ర, "ఏప్రిల్ ఒకటి విడుదల" లో శర్మ గారు, "శుభలేఖ"లో "గుర్నాధం"! ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మరిన్ని సినిమాల్లో ఇంకా మంచి పాత్రలు రాళ్లపల్లి పోషించే ఉంటారు కానీ చిన్నప్పుడు మాకు విశ్వనాథ్, జంధ్యాల, బాపూ, వంశీ ఈ నలుగురు  దర్శకుల సినిమాలే ఎక్కువగా చూపెట్టేవారు. అందువల్ల నాకు ఈ పాత్రలు మాత్రమే బాగా గుర్తుండిపోయాయి. 

మాకు కేబుల్ కనక్షన్ లేదు కాబట్టి ఎప్పుడు ప్రసారమయ్యేదో తెలీదు కానీ ఆమధ్యన యూట్యూబ్ లో ఎక్కడో "బాబాయ్ హోటల్" అనే ఒక టివీ షో చూశాను. ఏదో వంటల కార్యక్రమం. ఇంత పెద్ద వయసులో ఇది కూడా హోస్ట్ చేస్తున్నారా. చాల గ్రేట్ అనుకున్నాను. 


టివీ చూడకపోవడం చాలా అదృష్టకరమైన విషయం అని ఇలాంటి వార్తలు పేపర్లో చదివినప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎంతో బాగా హెల్తీగా ఉన్నప్పుడు చూసిన వ్యక్తుల్ని, చివరి దశల్లో బలహీనంగా, అనారోగ్యంతో ఉన్న క్లిప్పింగ్స్ నీ, చనిపోయిన వీడియోలను చూడలేము. నేనైతే ఇప్పటికీ పేపర్ లో వచ్చిన ఇలాంటి వార్తలను కూడా రెండోసారి చూడడానికి మనసొప్పక పాత పేపర్ల వెనుక దాచేస్తూంటాను. రాళ్లపల్లిపై ఉన్న అభిమానం కొద్దీ ఈ నాలుగు వాక్యాలనూ ఆయనకు నా నివాళిగా రాయాలనిపించి రాయడం. ఒక అనుభవజ్ఞుడైన నటుడిని గుర్తుచేసుకోవడం. అంతే!

కొద్దిగా గూగులిస్తే రాళ్లపల్లి నటించిన కొన్ని సినిమా సీన్ల లింక్స్ రెండు దొరికాయి. క్రింద ఇస్తున్నాను -