ఇప్పుడే వార్త విన్నాను... బాపూ..
ఇన్నాళ్ళకి విముక్తి లభించిందయ్యా నీకీ భవబంధాలనుండీ.. అని చటుక్కున అనిపించింది..
నీ ఆత్మకు ఇప్పుడెంత ప్రశాంతతో కదా!
ఎంత హాయిగా.. ఎంత స్వేచ్ఛగా.. ప్రాణమిత్రుడ్ని కలవడానికి రెక్కలు కట్టుకుని నింగికెగిరి ఉంటావో కదా..
ఇన్నాళ్ళ వియోగాన్ని ఎలా భరించావో కానీ నాకు మాత్రం చెప్పలేనంత దిగులుగా ఉండేది నిన్ను వార్తల్లోనో, పేపర్లోనో చూసినప్పుడల్లా...
అబ్బా ఈ దేవుడింత నిర్దయుడేంటబ్బా.. ఇలా ఒంటరిని చేసేసి చోద్యం ఎందుకు చూస్తున్నాడా అని వాపోయేదాన్ని...
ఏమో.. ఇంకా ఏ స్వామికార్యం నీతో చేయించుకోదలిచాడో నీ రాముడు.. అనుకునేదాన్ని!
పోనీలే.. ఇప్పుడు నిమ్మళమేగా..
ఇంక బెంగెందుకు.. ఇవాళ నేను హాయిగా నిద్దరోతా.
సృష్టి మొత్తంలో నాకు తెలిసిన ఇద్దరే ఇద్దరు ప్రాణమిత్రులు ఇక ఒకటయ్యారని సంతోషంతో నిద్దరోతా!!
ఈ జనాలకేమన్నా పిచ్చా..
ఎందుకిలా దు:ఖపడుతున్నారు నువ్వు లేవని??
ఎవరన్నారు నువ్వు లేవనీ..
పక్కింటి లావుపాటి పిన్నిగారిలో
ఆవిడ వెనుకనే నక్కి ఉన్న సన్నపాటి మెగుడుగారిలో
వంటింట్లో అప్పడాల కర్రలో
పొరుగింటి బుడుగ్గాడిలో
ఎదురింటి సీనాగపెసూనాంబలో
కొత్తగా పెళ్ళైయ్యే రాధాగోపాళాల్లో
నీ బొమ్మలాంటి అందమైన అమ్మాయిల్లో
ఆ రైలింజను డ్రైవరులో
ఆఫీసుల్లో ఉండే విగ్గులేని యముళ్ళలో
అవకతవక కంగాళీ సినిమాల "భశుం" కార్డుల్లో..
దేవుడిగూట్లో నవ్వుతూ నిలబడ్డ రాముడిలో...
అన్నింట్లో నువ్వు కనబడుతూనే ఉంటావు కదా...!
ఇన్నింటీలో నువ్వు సజీవమేనన్న నిజం ఈ పిచ్చిజనాలకి అర్థమయినరోజు
నీ కొంటెబొమ్మల పుస్తకంలోంచి ఓ జోకు చదూకుని నవ్వేసుకుంటార్లే..
నువ్వు హాయిగా నీ నేస్తంతో ఇన్నాళ్ళు గుండె పొరల్లో దాచుకుని ఉంచిన కబుర్లన్నీ చెప్పేసుకుని..
ఇక కంటినిండా హాయిగా నిద్రో...