సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, February 28, 2014

ఒక నిన్న...



27-2-14,
గురువారం
శివరాత్రి!

పొదున్నే హడావుడిగా తెమిలి ముగ్గురం హాస్పటల్ కు చేరుకున్నాం. అప్పుడే నాన్నను లోపలికి తీసుకువెళ్ళారని అన్నయ్య చెప్పాడు. ఓ ముప్పావుగంట అయ్యాకా అన్నయ్యని పిలిచారు. 'ఇదివరకు పెట్టిన స్టెంట్స్ బాగానే ఉన్నాయి. కొత్త ప్రమాదాలేమీ లేవు. హీ ఈజ్ ఓకే' అని చెప్పారుట డాక్టర్. హమ్మయ్య! అని ఊపిరితీసుకున్నాం.


 పొద్దుట ఏంజియో తీస్తారని నిన్ననే చెప్పారు. గతకొన్నాళ్ళుగా ఎదో ఒక ఇబ్బందితో అవస్థ పడుతున్న నాన్న మొన్న రాత్రి బాగోలేదని చెప్తే ఎమర్జన్సీ ఎడ్మిషన్ చేసారుట. నేనొట్టి కంగారుమనిషినని రాత్రి చెప్పకుండా నిన్న పొద్దున్న తను ఊరు నుండి వచ్చాకా అప్పుడు అమ్మ చెప్పింది ఇలా అని..! ఆఫీసు పనిలో బిజీగా ఉండి అన్నయ్య కేబ్ మాట్లాడితే వాళ్ళిద్దరే వెళ్లారుట హాస్పటల్కి. రాత్రంతా అమ్మ ఒక్కర్తే కంగారుగా గడిపింది పాపం! ముగ్గురు పిల్లలం ఉన్నాం.. ఏం లాభం? చాలాదూరంలో తమ్ముడు, ఆఫీసులో పీకల్లోతు పనిలో అన్నయ్య, విషయం తెలియక నేను.. ముగ్గురం ఉపయోగపడలేదు. అంతేనేమో ఒక స్టేజ్ వచ్చాకా.. భార్యాభర్తలిద్దరే ఒకరికి ఒకరు తోడు.. అదీ ఇద్దరిలో ఒకరైనా ఆరోగ్యంగా ఉంటే రెండోవారిని చూసుకోవడానికి ఉంటుంది! సరే, కాసేపుండి తను ఆఫీసుకెళ్ళిపోయారు. పాపను రూం లోకి అలో చెయ్యమని హాస్పటల్ స్టాఫ్ చెప్పేసారు. ఓ ల్యాపీ ఇస్తే ఏవో కార్టూన్స్ చూసుకుంటుందిలే అని పాపను అన్నయ్య వాడితో ఆఫీసుకు తీస్కెళ్ళాడు.


ఆ పూటకి అమ్మకు తోడుగా నేను ఉండిపోయాను హాస్పటల్లో. రకరకాల సందర్భాల్లో గతంలో చుట్టిన నానారకాల ప్రదక్షిణల మూలంగా హాస్పటల్ అంటేనే పరమ చిరాకు, భయం నాకు. అయినా ఇప్పుడు పూర్వంలా లేవు హాస్పటల్స్ కూడా. ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఫీలింగ్. విశాలమైన రూమ్స్, సోఫాలు, ఏసీ, టివీ, ఫోన్ చేస్తే టిఫిను, కాఫీ-టీలు, భోజనాలు క్షణాల్లో ప్రత్యక్ష్యమౌతున్నాయి. మధ్యలో డ్యూటీ నిమిత్తమై కిలకిల్లాడే మళయాళీ నర్సులు! పేషేంట్ రోగం సంగతెలా ఉన్నా వాళ్ళకీ, వాళ్ళ వెంటనున్నవాళ్ళకీ వైభోగమే! పచ్చకాగితం పవరది...!! ఇంత పెద్ద హాస్పటలూ పేషేంట్స్ తో కిటకిటలాడిపోతోంది. రూమ్స్ ఖాళీ లేవుట అస్సలు :(  ఐసీయూ లో పేషంట్స్, బయట హాల్లో వాళ్ల తాలూకా మనుషులు వెయిట్ చేస్తున్నవారెందరో! రకరకాల కథలు..కన్నీళ్ళూ.. అనారోగ్యాలూ.. వాటికి వందరకాల ఆధునిక వైద్యాలూ! కేథ్ రూమ్ బయట ఆ అరగంటలో నాలుగు కథలు విన్నా! దినచర్యల్లో, తినే ఆహారంలో మార్పులే ఇన్ని రకాల ఆరోగ్యసమస్యలకు దారితీస్తున్నాయి అనిపించింది.


చిన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే బైపాస్ సర్జరీనే మార్గం. ఇప్పుడేమో ఇక్కడ గంటకు నాలుగు ఏంజియోగ్రాములు తీస్తున్నారు.. ఎక్సరేలు, స్కానింగ్ లు చేసినట్లు! అసలు వీటిల్లో ఎన్ని అత్యవసరమో తెలీదు. మొన్న మా బంధువులొకరు విజయవాడలో ఏంజియో పదిహేనువేలన్నారని కాకినాడ వెళ్ళి తొమ్మిదివేలకు చేయించుకు వచ్చారు. స్టెంట్స్ కి కూడా హాస్పటల్ ని బట్టి, పేషంట్ ని బట్టి రకరకాల రేట్లు. ఏంజియోలు మాత్రం తప్పవు.. స్టెంట్స్ అక్కర్లేని కేసులు కొన్ని.. అప్పటికప్పుడు స్టెంట్స్ వేయాల్సిన కేసులు కొన్ని.. అవి వేయడం కోసమే చేస్తున్న ఆంజియోలు కొన్ని! మళ్ళీ ఆ స్టెంట్స్ లో మూడు నాలుగు రకాలు. హాస్పటల్లో ఒక రేటు, బయట కొంటే ఒక రేటు, ఏజెంట్ ద్వారా ఎక్కడ్నుంచైనా తెప్పించుకుంటే ఒక రేటు, డయాబెటిక్ పేషేంట్స్ కి కోటెడ్ స్టెంట్స్ అంటూ అవో రకం..! ఈ వైద్యాలకు పేదా, గొప్పా తేడాలేమీ లేవు. ఎవరికైనా అదే గుండె, అదే సమస్య, అదే స్టెంట్ మరి! మనసు లేకుండా మనుషులు ఉండగలరు కానీ గుండే లేకుండా మనుషులు ఉండలేరు కదా మరి!!


సరే ఇక నాన్నకు కొత్త ఇబ్బందులేమీ లేవు.. మందులు కాస్త మార్చి ఇస్తామన్నారు మా డాక్టరు. నాన్నకు రూమ్ కు తీసుకువచ్చాకా అమ్మా, నేను కాసేపు శరీరాలూ, ఆరోగ్యాలూ, డాక్టర్లు,ఖర్చులు గురించి కాసేపు మాట్టాడేసుకున్నాం. కరెంట్ పోయిందని నేను మూడో అంతస్థులో ఉన్న ఆ రూమ్ అద్దం కిటికీ తెరిచాను. క్రిందన చిన్న మురికివాడ ఉంది. రేకు టాపులతో ఓ పదిపదిహేను ఇళ్ళు ఉన్నాయ్. మధ్యన ఓ చిన్న గుడి కూడానూ. పిల్లల్లు, పెద్దలు ఎవరిపనుల్లో వాళ్ళున్నారు. నీళ్ళు పట్టేవాళ్ళూ, అంట్లు తోముకునేవాళ్ళూ, ఉన్న ఆ కొద్దిపాటివాకిలీ తుడిచేవాళ్ళూ.. ఓ పక్కగా శివరాత్రి అనేమో మైక్లో పెద్దగా సినిమా పాటలు పెట్టారు. నే గమనించినదేమిటంటే అన్ని ఇళ్ళల్లో ఈ క్లీనింగ్ పని ఆడవాళ్ళే చేస్తున్నారు. వంట, అంట్లు తోమడం, ఇల్లు-పరిసరాలు శుభ్రం చేయడం, చంటి పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం ఇవన్నీ ఎక్కడైనా ఆడవారి పనులే...ఎక్కడైనా ఇంతే కదా అని నవ్వొచ్చింది! అభ్యుదయం, సమానత్వం, వంకాయ, బీరకాయ పది శాతం జనాభాలో మాత్రమే నాకు కనబడుతుంది. చదువులేనివాళ్ళు ఇళ్ళలో చాకిరీ చేస్తే, చదువుకున్నవాళ్ళు ఆఫీసుల్లో+ఇళ్ళల్లో రెండుచోట్లా చాకిరీ చేస్తున్నారు. డబ్బు, సౌఖ్యం ఉన్నా శారీరిక శ్రమ కూడా రెట్టింపు ఉంటోంది కదా..ఇంతకన్నా పూర్వకాలం అమ్మమ్మలూ,మామ్మలే నయమేమో ఇంటిపనులయ్యాకా కాస్తైనా విశ్రాంతి దొరికేది వాళ్ళకి! ఇంటాబయటా పనులతో సతమతమయ్యే నేటి మహిళల పరిసరాల్లో 'స్ట్రెస్ అండ్ స్ట్రైన్' తప్ప 'రెస్ట్' అనే పదం ఎక్కడైనా కనబడుతోందా..?! ఈలోపూ మళ్ళీ కరెంట్ రావడంతో ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి కిటికీ మూసేసి ఇవతలకొచ్చేసా !


కాసేపు నే ప్రస్తుతం చదువుతున్న పుస్తకం తాలూకూ కథనీ, రచయిత గురించి అమ్మానాన్నలకు చిన్న సైజు లెక్చర్ ఇచ్చేసా! సాయంత్రం తను అన్నయ్య వద్దనుండి పాపను తీసుకుని హాస్పటల్ కి వచ్చాకా, నాన్నని రేపు డిస్చార్జ్ చేస్తారని తెలుసుకున్నాకా మళ్ళీ ముగ్గురం ఇంటిదారి పట్టాం. ఎంతరాత్రైనా గుడికి తీసుకువెళ్ళాల్సిందే నాన్నా అని పిల్ల ఆర్డర్! దారిలో శివాలయానికి వెళ్ళి హరహర మహాదేవా! అని పొద్దుటి నుండీ ఎక్కువైపోయిన హృదయభారాన్ని అక్కడే దింపేసి, కొంత ప్రశాంతతని  మళ్ళీ మనసులో నింపుకిని, కాసిని క్షణాలక్కడ గడిపి పదవుతుంటే ఇల్లు చేరాం! అప్పుడు మళ్ళీ పొద్దుట చెయ్యని పూజాకార్యక్రమాలు పూర్తిచేసి, ఇంటిలోని ఈశ్వరుణ్ణి స్తుతించేసరికీ పొద్దుటి నుండీ అలుముకున్న అలజడంతా ఒక్కసారిగా దూరమయినట్లయ్యింది. అలా హడావుడిలో కూడా లోటు లేకుండా తన పూజలు తాను జరిపించుకున్నాడీవాళ శివయ్య!!

నిన్న ఇవాళ్టికి నిన్నే కానీ నిన్నటికి ఇవాళే కదా!