తెలుగు వెండితెరపై చల్లని తల్లిగా పేరుపొందిన పి. శాంతకుమారి నటిగానే కాక గాయనిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న అభినేత్రి. నవ్వుతూ ఉండే శాంత స్వరూపం ఆమెది. అందుకే ఆ పేరు పెట్టారేమో! ఆవిడ అసలు పేరు సుబ్బమ్మట. నలుపు తెలుపు చిత్రాల్లో "అమ్మ" అంటే శాంతకుమారే గుర్తుకు వస్తారు. వదిన, అమ్మ మొదలైన పాత్రల్లో వేయకముందు హీరోయిన్ పాత్రలు కూడా ఆమె చేసారు. నాగేశ్వరరావు కు హీరోయిన్ గా 'మాయలోకం' అనే చిత్రంలో నటించి, 'జయభేరి'లో వదిన పాత్ర వేసి, మళ్ళీ 'అర్థాంగి' లో సవతి తల్లి పాత్ర వేసారామె.
చిన్న వయసులోనే శాస్త్రియ సంగీతంతో పాటూ, వయోలిన్ వాదన కూడా అభ్యసించిన శాంతకుమారి తన చక్కని స్వరంతో ఎన్నో సినీగీతాలను ఆలపించారు. దర్శక,నిర్మాత పి.పుల్లయ్య గారిని వివాహమడిన శాంతకుమారి, ఆయన ప్రోత్సాహంతో చాల ఏళ్లపాటు తన నటనను కొనసాగించారు. ఆయన నిర్మించిన చిత్రాల్లోనే కాక, తాను నటించిన ఇతర చిత్రాల్లో కూడా శాంతకుమారి పాటలు పాడారు. సారంగధర, కృష్ణప్రేమ, ధర్మదేవత, ధర్మపత్ని మొదలైన చిత్రాల్లో ఆవిడ గానం చేసారు కానీ అవన్నీ చాలా పాత చిత్రాలవ్వడం వల్ల అంతర్జాలంలో ఆవిడ పాటలు చాలావరకు లభ్యమవడం లేదు :(
'సిరిసంపదలు', 'శ్రీ వేంకటేశ్వర మహత్యం' ఈ రెండు చిత్రాల్లో పాడిన పాటలు మాత్రం దొరికాయి. రెండు పాటలూ చాలా బాగుంటాయి. వాటిల్నిక్రిందన చూడవచ్చు..
'శ్రీ వేంకటేశ్వర మహత్యం' చిత్రంలో వకుళాదేవి పాత్ర పోషించారామె.
పాట: ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ
పాట: చిట్టి పొట్టి పాపలు చిరుచిరు నవ్వుల పువ్వులు
చిత్రం: సిరిసంపదలు