సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, September 26, 2013

చెలిమితో కాసేపు...


ఎందుకు పరిగెడుతున్నామో తెలియకుండా, ఎలా పరిగెడుతున్నామో తెలియకుండా, పరిగెత్తి పరిగెత్తి ఏం సాధించామో కూడా తెలియకుండా... మనందరం కాలం వెంట ఏళ్ల తరబడి పరిగెడుతూనే ఉంటాం. పొద్దున్నే లేవకపోతే ఎలా? త్వరగా తయారవ్వకపోతే ఎలా? వంటవ్వకపోతే ఎలా? బస్సు రాకపోతే ఎలా? ఆఫీసుకి లేటైతే ఎలా? ఆఫీసులో పని ఎక్కువైతే ఎలా? పిల్లలడిగినవి తేకపోతే ఎలా? శెలవు దొరక్కపోతే ఎలా? జీతం రాకపోతే ఎలా?
అబ్బా... ఎన్ని ప్రశ్నలో కదా.. 


వీటన్నింటికీ సమాధానాలు వెతుక్కునే సమయం కూడా ఒకోనాడు మనకి ఉండదు! అలా పరిగెత్తుతున్నాం అందరం రేపవళ్ల వెంట.. రోజుల వెంట.. నెలల వెంట.. సంవత్సరాల వెంట! ఫలానా ఫలానా పనులు చెయ్యాలి అని లిస్ట్ రాసుకుంటాం. కానీ లిస్ట్ ఎక్కడ పెట్టామో మర్చిపోతాం లేదా ఆ లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు. ఒకటో రెండో శెలవు రోజులు వస్తాయి మధ్య మధ్యలో.. అపుడు బడలికగా ఒత్తిగిల్లడానికో, ఆలస్యంగా లేవడానికో సరిపోతాయా శెలవుదినాలు. చూస్తూండగానే ఐదు, పది, ఇరవై అని ఏళ్ళు గడిచిపోతాయి ఇలానే...



మరి ఈ పరుగుపందాల్లో కాస్త ఊరట, కాస్త విశ్రాంతి, కాస్త ఆనందం ఎలా వెతుక్కోవాలి? మనలోకి కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపుకోవాలి? మన హాబీలను వదలకుండా.. అన్నది ఒక మార్గం. సంగీతం, సినిమా, దైవ చింతన, చిత్రలేఖనం, పుస్తక పఠనం, సంఘ సేవ, స్నేహితులతో గడపడం ఇలా ఏది చేస్తే ఉల్లాసంగా ఉంటుందో అది చెయ్యడానికి చాలామందిమి ప్రయత్నం చేస్తూంటాం. ఇవన్నీ కాక నిన్న ఒక పని చేసా నేను. చిన్ననాటి స్నేహితురాలితో కాసేపు..కాదు కాదు బోళ్డు సేపు మాట్లాడా! ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. స్కూల్లో చదువుకునేప్పటి నేస్తం. ఇన్నాళ్ళూ అలా కాపాడుకుంటూ వచ్చాం మా స్నేహాన్ని ఇద్దరమూ. పూనా దగ్గర్లో ఉంటున్నారు వాళ్ళిప్పుడు. మేం కలిసి కూడా ఐదేళ్ళు దాటుతోంది. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో కూడా తెలీదు. తనకి జాబ్ తో మెయిల్స్ రాయడానికి కూడా ఖాళీ ఉండదు. ఎప్పుడైనా వీలయినప్పుడు ఫోన్లోనే మాట్టాడుకుంటాం.


 

నిన్న అలా ఇద్దరం చిన్నప్పటి కబుర్లు, ఆ రోజులన్నీ తలుచుకుంటూ, అలా మాట్టాడుకుంటే ఎంతో ఊరటగా అనిపించిందో! ఈ హడావుడి పరుగుల్లో పడి ఏదో కోల్పోతున్నామేమో అనిపించే వెలితేదో తీరినట్లు! "నాకయితే నిన్ననే జరిగాయేమో అన్నంత ఫ్రెష్ గా ఉన్నాయి ఆ జ్ఞాపకాలు.." అని తను, "అవును కదా.. ఇన్నేళ్ళేలా గడిచిపోయాయే.." అని ఆరోగ్యాల గురించీ, ఇంటివిషయాలు, స్నేహితుల గురించి, పిల్లల గురించీ.. ఇలా చాలా విషయాల గురించీ నేనూ తనూ... ఊసులడుకున్నాం.  కాసేపు నే మాట్టాడాకా, ఉండు నే చేస్తా అని తను ఫోన్ చేసింది. ఇంకాసేపు..ఇంకాసేపు అలా ఓ గంట దాకా కబుర్లు చెప్పుకున్నాకా గానీ మా కరువు తీరలేదు. లక్కీగా ఆ సమయంలో ఏ మిస్డ్ కాల్ రాలేదు, ఎవ్వరూ కాలింగ్ బెల్లు కొట్టలేదు :-)

 

ఫోన్ పెట్టేసాకా అనిపించింది.. హాబీలను కాపాడుకోవడమే కాదు చిన్ననాటి స్నేహాలను కూడా కాపాడుకుంటే ఇలా రిఫ్రెష్ అయిపోవచ్చు అని. మరి మీరు కూడా త్వరగా మీ చిన్ననాటి చెలిమితో కాసేపు కబుర్లాడేసి రిఫ్రెష్ అయిపోతారుగా...