సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, April 30, 2013

బాలరాజు కథ(1970)




1970 లో బాపూ దర్శకత్వంలో వచ్చిన సినిమా "బాలరాజు కథ". 1971లో ఉత్తమ జాతీయ
తెలుగు చిత్రం పురస్కారాన్ని అందుకుంది. 'ఏ.పి.నాగరాజన్' గారి కథకు, 'ముళ్ళపూడి' మాటలు రాసారు. ఈ సినిమా బాలల చిత్రమనిపించినా, పెద్దవారిని కూడా ఆకట్టుకునే చిత్రమిది. ఇప్పటి పిల్లలకూ చూపిస్తే కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తారీ సినిమాని అనిపిస్తుంది చూసినప్పుడల్లా. 


బాలరాజుగా మాష్టర్ ప్రభాకర్, అతని చిట్టిచెల్లిగా బేబీ సుమతి ఉత్సాహవంతంగా నటించారు. మిగతా పాత్రల్లో నాగభూషణం, అల్లు రామలింగయ్య, సూర్యాకాంతం, మిక్కిలినేని, హేమలత, ధూళిపాళ, పుష్పకుమారి మొదలైనవారు నటించారు. ఏనిమేషన్ తో రూపొందించిన సినిమా టైటిల్స్ ఓ ప్రత్యేక ఆకర్షణ. పిల్లల సినిమా కాబట్టి లా తీసారేమో కానీ మొత్తం సినిమా కథంతా క్లుప్తంగా ఈ టైటిల్స్ లోనే మనకు చూపెడతారు బాపూ.



చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని హాలుకు తీసుకువెళ్ళి చూపించిన నలుపు తెలుపు చిత్రాల్లో పాటలతో సహా బాగా గుర్తుండిపోయిన చిత్రం ఇది. ఆరుద్ర, కొసరాజు రాసిన పాటలకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ అనవచ్చు. మొత్తం ఆరు పాటలూ ఎంతో పాపులర్ అయ్యాయి. అన్ని పాటలు వినడానికీ, చూడటానికీ కూడా భలే సరదాగా ఉంటాయి.

* మహా బలిపురం మహా బలిపురం మహా బలిపురం...
* అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయద్దు..(క్రింద సినిమా లింక్లో 1:53:14
వద్ద ఈపాట  చూడవచ్చు)
* హిప్పి హిప్పీ హిప్పీ హిప్పీ ఆడపిల్లలు
* ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
* చూడు చూడు తమాషా భలే తమాషా
* చెప్పు చెప్పు భాయ్

వీటిల్లో మొదటి రెండూ నాకు బాగా నచ్చుతాయి. మొదటి పాట యూట్యుబ్ లో దొరికింది. చూడండి..


* మహా బలిపురం మహా బలిపురం మహా బలిపురం...


  


కథలోకి వస్తే, బాలరాజు అనే కుర్రవాడు "మహా బలిపురం "లో టురిస్ట్ గైడ్ లా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అనారోగ్యంతో తల్లి చనిపోతే మిగిలిన ఒకేఒక తోడైన చెల్లెల్లితో మేనమామ ఇంట్లో ఉంటుంటాడు. మేనమామ కుటుంబానికి కూడా అతని సంపాదనే ఆధారం. మావయ్య పిల్లలు ముగ్గురు, వీళ్ళిద్దరూ.. మొత్తం అయిదుగురూ అన్యోన్యంగా ఉంటుంటారు. బాలరాజు ఉత్సాహం, తెలివితేటలు, చురుకుదనం ఊరు చూట్టానికి వచ్చిన టూరిస్టులందరినీ ఆకట్టుకుంటుంటాయి. 


ఒకరోజు ఒక ధనిక వ్యాపారవేత్త భార్యతో మహాబలిపురం వస్తాడు. సంతానం లేని ఆ జంట బాలరాజునీ, అతని చెల్లినీ చూసి ముచ్చటపడి వెంట తీశుకువెళ్ళి దత్తత చేసుకోవాలనుకుంటారు. రాజు మేనమామ ధనికుడితో బేరం కూడా కుదుర్చుకుంటాడు. కానీ అనుకోకుండా ఒక అవాంతరం ఎదురౌతుంది.


ధనికుడి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగిందని,నష్టం వచ్చిందని తెలిసి పిల్లల అదృష్టంపై అతనికి అనుమానం వ్యక్తపరుస్తాడు. దంపతుల వాగ్వివాదం విన్న బాలరాజు చెల్లెలితో కలిసి వాళ్ల గెస్ట్ హౌస్ నుండి వెళ్పోతాడు కానీ తాము దురదృష్టవంతులమన్న మాట ఆ పిల్లవాడి మనసుని గాయపరుస్తుంది. చిత్రం మొదట్లో గురువుగారు చెప్పిన
'సప్త సూత్ర శాస్త్రం'లో మొదటి వాక్యం నిజమైందని అనుకుంటాడు బాలరాజు.



'సప్త సూత్ర శాస్త్రం' అంటే ఏడు నీతులు. ఈ ఏడు నీతులూ ఇటీవలే బయటపడ్డాయి.  ఇవన్నీ ఎప్పుడో అప్పుడు అందరికీ జీవితంలో అనుభవమౌతాయి అని ఇలా రాతిపై చెక్కించి ఉంచాను అని చెప్తాడు గురువుగారు. అవేమిటంటే -

* ఆశ కొలదిగ పెరుగు అవనిలో నిరాశ (ఎంత ఎక్కువ ఆశ పడితే అంత ఎక్కువగా నిరాశ కలిగి బాధ పడతావు)
* ఒక్క వేలు జూపి ఒరులను నిందించ, వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు(ఒకరి తప్పును ఎత్తిచూపేముందు నీ తప్పులు మూడుంటాయని తెలుసుకో)
* తెలుపు క్షీరము కాదు నలుపు నీరము కాదు.( తెల్లనివన్ని పాలు కాదు, నల్లనివన్నీ నీళ్ళు కాదు)
* చెడ్డవారలకెపుడు చేదోడు కావలదు. (చెడ్డవారికి సహకరించకూడదు)
* అలయు మీరిన వేళ అమృతము విషమగును.(మితిమీరిపోతే ఎంత ఇష్టమైనదైనా వెగటౌతుంది)
* తాడు పామవగలదు, పాము తాడవగలదు (తొందర పడి దేన్ని నమ్మకూడదు)
* కలసివచ్చిననాడు కడుపేద రాజగును.



రకరకాల సంఘటనల ద్వారా ఈ ఏడు సూత్రాలూ బాలరాజుకి ఏ విధంగా అనుభవంలోకి వచ్చాయి? చివరికి బాలరాజు కథ ఏమైంది? అన్నది మిగిలిన సినిమా. ఈ పిల్లవడు ఎవరో గానీ మహా చురుకుగా ఉన్నాడు. సినిమాలో టూరిస్ట్ లకే కాదు ప్రేక్షకులకు కూడా నచ్చేలాగ ! పూర్వంలో వచ్చిన ప్రతి నలుపు-తెలుపు సినిమా చక్కని సందేశాన్ని ఇచ్చేది. ఫలానా సినిమా చూశాం అంటే ఏదో ఒక నీతి, లేక సత్యాన్ని తెలుసుకున్నం అని అనిపించేది. చూసిన ప్రతి ఒక్కరికీ అలా అనిపించే చిత్రమే ఈ బాపు రమణల "బాలరాజు కథ". అన్ని ప్రముఖ వీడియో కేసెట్ షాపుల్లోనూ ఈ సీడి లభ్యమౌతోంది.





పూర్తి సినిమా క్రింద ఉన్న యూట్యుబ్ లింక్ లో చూడవచ్చు: 
http://www.youtube.com/v/rdr5XxQLyKA?hl