సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, April 1, 2013

వేములవాడ - నాంపల్లి





వేములవాడ:

సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రము - ఆంధ్రప్రదేశ్, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలంలో ఉంది. ఎప్పటినుండో వెళ్ళాలనుకుంటూ... మొన్నవారాంతలో వెళ్ళివచ్చాము. ఆర్ టి.సి.బస్సులో హైదరాబాద్ నుండి సుమారు మూడున్నర గంటల ప్రయాణం. సిధ్ధిపేట, సిరిసిల్ల ల మీదుగా బస్సు వెళుతుంది. "దక్షిణ కాశీ"గా పిలవబడే వేములవాడలో  శివుడు శ్రీ రాజరాజేశ్వరస్వామి పేరుతో కొలువై, భక్తులచే "రాజన్న"గా పిలుపునందుకుంటున్నాడు. అమ్మవారి పేరు రాజరాజేశ్వరీదేవి. వేములవాడ ఆలయం ఎంతో పురాతనమైనదిగా చెప్తారు. ఆ ప్రాంతంలో దొరికిన శిలాశాసనాలలో ఈ ఊరి పేరు "లేంబులవాటిక" అని ఉన్నదట. తర్వత అది "లేములవాడ" అయి, ఇప్పుడు "వేములవాడ" అయ్యిందిట. ఈ ఊరిని రాజధానిగా చేసుకుని చాళుక్యులు క్రీ.శ.750 నుండీ క్రీ.శ.973 దాకా రాజ్యమేలారని అక్కడి శిలాశాసనాలు తెలుపుతాయి. పంపన, వగరాజు, భీమన మొదలైన మహాకవులు కళాపోషకులు,సాహితీప్రియులైన చాళుక్యుల ఆస్థానంలోవారేనట.






ఇక్కడి ప్రధానాలయ ప్రాంగణంలోని ధర్మకుండము ప్రముఖమైనది. ఇందులో స్నానం గ్రహచార భాధలను,సమస్త బాధలను తొలగించి, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. కానీ పవిత్రమైన ఈ ధర్మకుండాన్ని భక్తులు పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు కనబడలేదు :( 

సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభస్వామి ఆలయం, ఇంకా కాస్త పక్కగా బాల రాజేశ్వరాలయం,విఠలేశ్వరాలయం, కోటిలింగాలు, సోమేశ్వరాలయం, బాలాత్రిపురసుందరీదేవి ఆలయం ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శివలింగానికి ఎడమ పక్కన లక్ష్మీగణపతి విగ్రహం, కుడివైపున అమ్మవారి విగ్రహం ఉన్నాయి. గుడి బయట ఊళ్ళో మరిన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో వేణుగోపాలస్వామి ఆలయం బాగా పెద్దగా కనబడింది.

మేం వెళ్లిననాడు జనం బాగా ఉన్నారు. ఊరు పన్నెండింటికి వెళ్ళాం. దర్శనం అయి బయటకు వచ్చేసరికీ రెండున్నర అయ్యింది. జనం ఉన్నా అదృష్టవశాత్తు ఆ రోజున ఎవరో పీఠాధిపతి వచ్చారు. అయన వచ్చాకా కాసేపు క్యూ నిలిపివేసారు. అందువల్ల ఆయన ఆలయంలో ఉన్నంత సేపు, వేదపఠనాల మధ్యన మాకు చక్కగా దర్శనం అయ్యింది. 






 గుడి బయట దాదాపు చాలా కొట్లలో బెల్లం అచ్చులు అమ్ముతున్నారు. స్వామివారికి మొక్కు తీర్చుకోవటానికి బెల్లం తూకం వేస్తారుట. ఇంకా గుడి చుట్టు ఆవులను,దూడలనూ ప్రదక్షిణ చేయిస్తున్నారు. అది కూడా మొక్కేనట.

గుడి బయట ఒకామె అప్పుడే కుట్టిన విస్తరాకు




నాంపల్లి :

వేములవాడ వస్తోందనగా బస్సులోంచి ఒక చిన్న కొండ, దానిపై ఒక గుడి కనబడ్డాయి. రాజన్న దర్శనం అయ్యాకా, ఆ కొండ మీద గుడికి వెళ్దామన్నాను. వెములవాడ పక్కనే ఉన్న 'నాంపల్లి’ అనే గ్రామంలో ఆ గుడి ఉందట. 'లక్ష్మీనరసింహస్వామి' ఆలయంట. వేములవాడ దేవస్థానంవారిదేట ఆ గుడి కూడా. కొంతదాకా ఆటోలు వెళ్తాయి. తర్వాత మెట్లు ఎక్కాలి అని చెప్పారు. ఎండ విపరీతంగా ఉంది. అయినా కొండపై గుడి చూడాలనే ఉత్సాహంలో బయల్దేరాం.


view from the hill









 కొంతదాకా పైకి ఎక్కాకా కృషుడు కాళీమర్దనం చేస్తున్నట్లున్న పెద్ద నాగవిగ్రహం ఉన్న చోటన ఆటోలు ఆగుతాయి. ఆశ్చర్యం కలిగించేంతటి గొప్ప నిర్మాణం అది. చాలా అందంగా ఉంది. ప్లాన్ చేసి, కట్టిన ఇంజినీరుని తప్పక మెచ్చుకోవాలి. ఆ నాగపడగ  లోపలికి దారి ఉంది. రూపాయి టికెట్టు. టికెట్టు కనీసం ఐదు రూపాయలు చేయండి లేదా ద్వారం మూసేయండి అని ఆలయంవారు వినతిపత్రం ఇచ్చుకున్నారుట. అక్కడ మైంటైనెన్స్ కన్నా డబ్బులు మిగలాలి కదా! అక్కడ నుండీ ఈ వంద మెట్లు ఉంటాయి పైకి. మెట్లు స్టీప్ గానే ఉన్నాయి. చెప్పులు క్రింద వదిలేయటం వల్ల ఎండలో పైకెక్కటం కష్టమే అయ్యింది. ఇక్కడి నరసింహస్వామివారు స్వయంభూ ట. చలికాలంలో అయితే ఈ కొండపైకి రావటం చక్కని అనుభూతిగా మిగలగలదు.


ఇంటికొచ్చాకా నెట్లో వెతికితే ఈ గుడి విశేషాలు ఇక్కడ దొరికాయి:
http://www.youtube.com/watch?v=WA9IcbhaFpY