సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, January 28, 2013

Horti Expo 2013



ఇరవై మూడవ ఉద్యానవన ప్రదర్శన (Horti Expo 2013) jan26 న హైదరాబాద్ లో మొదలైంది. జనవరి30 వరకూ ఐదురోజులు కొనసాగుతుందీ ప్రదర్శన. మొదటిరోజూ, నిన్న రెండుసార్లూ వెళ్ళి కనులారా మొక్కలన్నీ చూసి వచ్చాను. 

ప్రదర్శన మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆకారంలో ఆయా జిల్లాల్లో పండే పంటలతో, కూరగాయలతో నింపిన చిత్రం ఆకట్టుకుంది. ప్రదర్శన ఆకట్టుకున్నప్పటికీ ఈసారి కనబడ్డ మార్పులు, తగ్గిపోయిన పూలమొక్కలూ నన్ను నిరాశపరిచాయనే చెప్పాలి. కొత్తవాటికి చోటు పెరగటంతో పూలమొక్కలు తగ్గిపోయాయని కూడా నాకు అనిపించి ఉండచ్చు.





ఈసారి రంగురంగుల కాగితంపూల చెట్లు ఎక్కువగా కనబడ్డాయి. చిన్నపాటి కుండీ కూడా మూడువందల ఏభై చెప్తున్నా కూడా అవే ఎక్కువగా అమ్ముడుపోవటం ఆశ్చర్యపరిచింది. Feng shui పుణ్యమా అని చిన్నా,పెద్దా వెదురు చెట్లు, నీటిలో తాబేళ్ళు కూడా బాగానే కొంటున్నారు. ఫ్లవర్ ఎరేంజ్మెంట్ పోటిలు ఈసారి జరగలేదేమొ..ఆ స్టాల్ లేనేలేదు..:( బోన్సాయ్ విభాగంలో క్రిందటేడాది పెట్టిన చింతచెట్టునే మళ్ళీ పెట్టారు. కొత్తవాటిల్లో ఒక సీమ చీంతకాయ చెట్టు మాత్రం నాకు నచ్చింది. మొక్కలు పెంచేందుకు కొబ్బరిపీచుతో చేసే మట్టి, మరికొన్ని ఎరువులూ విడిగా కేజీలెఖ్ఖన అమ్ముతున్నారు ఒకచోట. ఇదే మట్టి పదికేజీలు పేక్ చేసి ఐదొందలు దాకా భర చెప్తున్నారు మరో చోట.










క్రిందటి ఏటికీ ఈ ఏటికీ ప్రధానంగా వ్యాపారాత్మకమైన మార్పు నాకు కనబడింది. మొదట్లో కేవలం రకరకాల మొక్కలు, పువ్వులు, చెట్లు మాత్రమే ప్రదర్శనలో ఉంచేవారు. తినుబండారాలు, హెర్బల్ టీ స్టాల్, స్టీవియా, హనీ, రకరకాల హోంమేడ్ వడియాలు, ఆమ్లా టీ, పుస్తకాల స్టాల్, గృహాలంకరణ సామగ్రీ, క్రోకరీ ఎప్పుడూ ఉండేవే. ఉద్యానవన పరికరాలు,  పొలాల్లో పనికొచ్చే పరికరాలు, సోలార్ ఎనర్జీ తో పనిచేసే వస్తువులు మొదలైన అభివృధ్ధి కారకాలైన ఎన్నో పరికరాలు,వస్తువులు కూడా కొన్నేళ్ళుగా ప్రదర్శనలో ఉంచుతున్నారు. 

అవన్నీగాక పెద్ద పెద్ద ఇళ్ళల్లో.. ఉద్యానవనాల్లో ఏర్పరుచుకుందుకు విగ్రహాలు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన వృక్షాలు, కుర్చీలు, సెట్టింగ్స్, పంజరంలో పక్షులు మొదలైనవి కూడా ఈసారి ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ఇది మంచి విషయమే కానీ ప్రదర్సనలో ఎక్కువగా ఉండే మొక్కలు, పువ్వులూ తక్కువయిపోయాయి. ఇంతదాకా  కన్నులపండుగగా సాగిన ఈ ప్రదర్శన ఇకమీదట వ్యాపారాత్మకమైన ప్రదర్శనగా మారిపోతుందని స్పష్టమైపోయింది.  










wheat grass




చివరిగా నాకు అర్థమైందేమిటయ్యా అంటే.. ఏ "ప్రదర్శన" అయినా అది జనాల జేబులు ఖాళీ చేసేందుకు మాత్రమే కనుగొనబడ్డ విజయవంతమైన వ్యాపారాత్మక వ్యవహారము అని !