సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, April 30, 2012

ఏం పెళ్ళిళ్ళో...!!


ఈ ఏడు బొత్తిగా పెళ్ళిళ్ళకే వెళ్ళకపోవటానికి నేనేమీ గ్రహాంతరవాసిని కాదు కానీ మా ఇరుపక్షాల కజిన్స్ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయి వాళ్లంతా పిల్లల్ని ఎత్తే స్టేజ్ కి వచ్చేయటంతో ఈ సీజన్లో బొత్తిగా పెళ్ళిపిలుపులే లేకుండా పోయాయి. ఈ ఏడు అసలు ఏ పెళ్ళికీ వెళ్లలేదు అని మేమిద్దరమూ చింతింస్తూ ఉండగా ఒక్కసారిగా ఇదేనెలలో ఐదారు తప్పనిసరిగా వెళ్ళాల్సిన పెళ్ళిళ్ళు తగిలాయి. ఏ పెళ్ళిపిలుపూ రాకపోతే రాలేదని బాధ...తీరా ఎవరన్నా పిలిస్తే వెళ్ళాలని బాధ. బాధ ఎందుకంటే దూరాలు వెళ్ళాలని. ఇప్పుడు చాలామటుకు అన్నీ ఎక్కడో ఊరి చివర ఉండే సువిశాలమైన ఏసీ కల్యానమంటపాల్లో పెళ్ళిళ్ళు. అక్కడికి వెళ్తే బానే ఉంటుంది కానీ వెళ్ళేదెలా? ఆటోల్లో వెళ్ళేదూరాలు కూడా కాదు, పట్టుచీరలూ గట్రా కట్టుకుని బస్సుల్లో ఎక్కలేము. కనీసం అక్కడికి వెళ్ళేదాకా అన్నా కట్టుకున్న బట్టలు నలక్కుండా ఉండాలి కదా ! ఏదో ఈ సిటీలో ఉన్న పుణ్యానికీ, అదృష్టవశాత్తూ మేం బస్టాపులో నించున్న సమయానికి ఏసీ బస్సులో, లేక డీలక్స్ బస్సులో రాబట్టి మా గండం గడిచింది.


ఆ విధంగా ఏవో తంటాలు పడుతూ ఈ ఒక్క వారంలోనే ముచ్చటగా మూడు పెళ్ళిళ్ళు చూసివచ్చాం. నిన్నరాత్రి కూడా ఒక రిసెప్షన్కి వెళ్ళి వచ్చాం. (పెళ్ళి వేరే ఊళ్ళో అయ్యింది) నేను సిటీలో పెళ్ళిళ్ళకి వెళ్ళి రెండేళ్ళు పైనే అయ్యింది. క్రిందటేడు గుడివాడలో ఓ పెళ్ళివాళ్ళు చాలా సాంప్రదాయకుటుంబానికి చెందినవాళ్ళవటంతో చక్కగా పందిళ్ళు వేయించి, బఫేల జోలికి పోకుండా హాయిగా బల్లలు అవీ వేసి కూచోపెట్టి అరిటాకులో భోజనాలు పెట్టారు. నాకసలు ఈ బఫే భోజనాలంటే పరమ చిరాకు. క్యూలో నిలబడి ప్లేటిచ్చుకుని అడుక్కుని తినటం ఏంటో.. అనుకుంటూ ఉంటాను. నా పెళ్ళిలో కూడా ఆఫీసువాళ్లకి బఫే పెట్టినా, చుట్టాలందరికీ చక్కగా టేబుల్స్ వేసి కూచోబెట్టి టిఫిన్, భోజనం పెట్టాలని ఖచ్చితంగా నాన్నతో చెప్పేసాను. సరే ఇంతకీ నే వెళ్ళిన పెళ్ళిళ్ళ గురించి కదా చెప్తున్నాను...ఈ సిటీల్లో పెళ్ళిళ్లు చూసి కాస్త ఎక్కువకాలమే అవ్వటం వల్ల నాకు ప్రతి చోటా ఆశ్చర్యమే ఎదురైంది.


ఓ మోస్తరు మామూలు పెళ్ళిళ్ళలో కూడా అలంకరణలకీ, ఆర్భాటానికీ జనాలు పెడుతున్న ఖర్చు విపరీతంగా తోచింది. వేలంవెర్రిలా కూడా అనిపించింది. వాళ్ల సరదా కోసం అనుకుందామంటే అసలు లోపలున్నవాళ్లకి బయటకు వచ్చి కల్యాణమంటపానికి ఏం అలంకరణ చేసారో చూసుకునే సమయమే ఉండదు. మరి ఈ బయట రోడ్డు పొడుగునా ఉన్న విపరీతమైన అలంకరణ,చెట్లకీ పుట్టలకీ లైటింగులు ఎవరికోసం? దారేపొయేవాళ్లకు చూపించుకోవటానికా? వీధిలో వెళ్ళేవాళ్ల కోసమా? తెలీదు. ఇక లోపల పెళ్ళి జరుగుతున్నంత సేపు సన్నాయి, బాజాభజంత్రీలు ఎప్పుడో పోయాయి...పాట కచేరీలు కొత్త ఫేషన్. సినిమా పాటలు కొందరైనా వింటారు. కానీ శాస్త్రీయంగా త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు , వాద్య సంగీతం పెట్టుకునేవారు కొందరుంటారు. అవి ఎంతమంది వింటారు అన్నది వాళ్లకి అప్రస్తుతం. పాడేవాళ్లకీ, వాయిద్యకారులకీ పైకమందుతుంది. వాళ్లపని వారు చేసుకుపోతారు. కానీ నాలాంటి ప్రాణులు కొందరు మాత్రం అయ్యో ఈ సంగీతాన్ని ఎవరూ విని ఆస్వాదించటంలేదే అని వాపోతారు. మొన్నటి పెళ్ళిలో ఇద్దరు ఆడపిల్లలు చక్కగా పట్టుపరికిణీ,ఓణీలు వేసుకుని కీర్తనలు పాడారు. ఎంతబాగా పాడుతున్నారో...కానీ పట్టుమని పదిమందైనా వింటున్నారోలేదో అని బాధ వేసింది నాకు. విలువ తెలియని చోట కళను ప్రదర్శించటం ఆ కళకు అవమానం కాదా.. అనిపించింది.



ఇక భోజనాల సంగతి తలుచుకోకపోతేనే మంచిదేమో. అక్కడ జరిగే వేస్టేజిని తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. చిన్న పెళ్ళి అయినా పెద్ద పెళ్ళి అయినా ఐటెమ్స్ తగ్గుతున్నాయి కానీ అందరి భోజనాలు దాదాపు ఇదే స్టైల్లో ఉంటున్నాయి. ముందర స్టార్టర్స్ లో పానీపురీ, చాట్లు, రగడాలు, మంచూరియాలు, నూడిల్స్, సూప్ మొదలైనవి తిన్నాకా ఇక భోజనం ఎందుకో నాకు అర్ధం కాదు. సరే భోజనం తినాలి కదా అని ఆ వైపుకి వెళ్ళాం. దోశ, పూరీ, పెసరట్టు ఉప్మా మొదలైన టిఫిన్స్ అన్నీ ఒకవైపు వేడివేడిగా వేసేసి నాలుగురకాల చట్నీలతో వడ్డించేస్తున్నారు. ఆ తర్వాత రోటిలు, నాన్లు, పూరీలూ వాటికో ఐదారురకాల కూరలు; ఆ తర్వాత వైట్ రైస్, సాంబార్, కూరలు మొదలైనవి. అవి అయ్యాయా, ఇక ఓ ఐదారు రకాల స్వీట్స్ ఓ పక్క, నాలుగైదు రకాల ఐస్క్రీంలు ఒకపక్క. ఇవన్ని అయ్యాయ అంటే ఓ పది రకాల ఫ్రూట్స్ వరుసగా ! అసలు మనిషన్నవాడెవడన్నా ఇన్ని రకాలూ ఒకేసారి తినగలడా? లేదు కదా. అయినా కొందరు జనాలు ఆతృత కొద్దీ చాలా రకాలు ప్లేట్లో వేసుకోవటం సగం తిని పడేయటం చేస్తున్నారు. ప్లేట్స్ పడేసే డస్టబిన్ దగ్గర, తినటానికి మధ్యలో వేసిన గుండ్రని టేబుల్స్ మీదా సగం సగం తిని వదిలేసిన ప్లేట్సే. అసలు ఎంత తింటారో తెలీకుండా అలా అన్నేసి ప్లేట్లలో ఎందుకు పెట్టించుకుంటారో, పెట్టించుకున్నది ఎందుకు పడేస్తారో వాళ్లకే తెలవాలి. కొందరమో తగుమోతాదుల్లో ఈ నానారకాల చెత్తల్నీ కడుపులో నింపేసుకుని కదల్లేక మెదల్లేక పాపం కూర్చుండిపోయేవారు కొందరు. ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలీకుండా ఇలా పెళ్ళి భోజనాలు తినేయటం వల్ల ఆనక ఎసిడిటీలు, ఇన్డైజెషన్ లు !! వీటన్నింటికన్నా భోజనాల దగ్గర జరిగే వేస్టేజే నాకు బాధను కలిగించింది. దేశంలో తిండిలేక మలమల మాడేవారు కొందరైతే, ఇలా పెళ్ళిళ్ళ పేరుతో భోజనపదార్ధాలను వ్యర్ధపరిచేది ఇంకొందరు.

జీవితాంతం గుర్తుంపోయే మధురక్షణాలను పదిలపరుచుకోవటం చాలా మంచిదే. ఎవరి తాహతను బట్టి వారు ఖర్చు చెయ్యటం కూడా సరదానే. కాదనను. కానీ అది శృతి మించితే... నష్టం ఎవరికి? పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్నట్లు ఒకళ్లను చూసి ఒకళ్ళు తాహతకు మించి ఆర్భాటాలకు పోవటం ఎంతవరకు సమంజసం..? ఈ ఖర్చుల్లో సగమైనా వధువరుల పేరున దాచితే వాళ్లకు అత్యవసర పరిస్థితుల్లోనో లేదా ఏ ఫర్నిచర్ కొనుక్కోవటానికో ఉపయోగపడుతుంది కదా..! ఏంపెళ్ళిల్లో ఏమిటో...!