సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 30, 2011

మిథునం : దస్తూరీ తిలకం


1998 లో "రచన" పత్రికలో బాపూగారి స్వదస్తూరిలో మిథునం కథానిక అచ్చయినప్పుడు; ఆ కథానిక, ఇంకా శ్రీరమణ గారి "బంగారు మురుగు" కథ తాలూకూ జిరాక్స్ కాపీ, రెండూ శ్రీకాంత శర్మగారు నాన్నకు ఇచ్చారు. అపురూపమైన బాపుగారి స్వదస్తూరిలో మిథునం కథానిక, ఆద్యంతం మధురమైన "బంగారు మురుగు".. రెండు కథలూ మా ఇంటిల్లిపాదికీ ఎంతగానో నచ్చేసి, ఆ రెండు కథలూ మరిన్ని జిరాక్సులు తీయించి మరికొందరు సాహితీ మిత్రులకూ, బంధువులకూ అప్పట్లో కొరియర్లో కూడా పంపించాము. తర్వాత ఇంటర్నెట్ లో బాపుగారి దస్తూరితో ఉన్న కథానిక పెట్టారనీ, బాగా ప్రాముఖ్యం పొందిందనీ విన్నాం.

తర్వాత మద్రాసు రేడియోస్టేషన్ నుంచి మిథునం కథ నాటక రూపంలో ప్రసారమైంది. శ్రీమతి పద్మజా నిర్మల గారు ప్రొడ్యూస్ చేసిన ఈ నాటకంలో సినీనటులు సుత్తివేలు, రాధాకుమారి గారూ అనుకుంటా ప్రధాన పాత్రలు పోషించారు. వాసుదేవన్ నాయర్ గారు ఈ కథపై తీసిన మళయాల సినిమా గురించి అందరికీ తెలిసినదే. తనికెళ్ళ భరణి గారు ఈ కథను తెలుగులో సినిమాగా తియ్యబోతున్నారన్నది కొత్త వార్త.



ఇప్పుడు మరొక కొత్తవార్త ఈ కథానిక అదే బాపూ గారి స్వదస్తూరీతో "ఒకే ఒక్క మిథునం" పేరుతో పుస్తకరూపంలో వచ్చింది. రచయిత శ్రీరమణ గారి ముందుమాట కొత్త విషయాలను తెలిపితే, శ్రీ జంపాల చౌదరి గారి ముందుమాట మనసుకు హత్తుకునేలా ఉంది.

ఈ పుస్తకాన్ని నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా పంపిన బ్లాగ్మిత్రుడు, అంతకు మించి మంచి సహోదరుడు అయిన శంకర్ గారికి బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు. అభినందనలు.