సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Thursday, September 15, 2011
break at 400... !!
ఐదు బ్లాగులు..
వంద మంది నాతో నడిచేవాళ్ళు..
నాలుగొందలు టపాలు..
బోలెడు ప్రశంసలు..
మూడే మూడు ఘాటు విమర్శలు..
సులువుగా వేళ్ళపై లెఖ్ఖపెట్టుకునేంత తక్కువ పరిచయాలు..
ఒక మనసు చివుక్కుమనే బాధ..
ఇవన్నీ..
నా రెండున్నరేళ్ళ బ్లాగ్ ప్రయాణంలో మజిలీలు.
తోడొచ్చినవాళ్లకు కృతజ్ఞతలు
ప్రోత్సహించినవారికి వందనాలు
మిత్రులైనవారికి ధన్యవాదాలు
నొచ్చుకున్నవారికి క్షమాపణలు
నేనీ ఈ ఐదు బ్లాగ్లులూ నిర్వహించగలగటానికి అనుమతినిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, అప్పుడప్పుడు మందలింపులతోనే ఎంతో ప్రోత్సాహాన్నీ అందించిన మావారికి బ్లాగ్ ముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తన ప్రోత్సాహం లేనిదే నేను వంద టపాలు కూడా పూర్తి చేయకుండానే బ్లాగ్ మూసేసేదాన్నేమో.
ఎప్పుడూ అందరూ ఆనందంగా, క్షేమంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. జీవితంలోనూ, బ్లాగుల్లోనూ కూడా నేను ఎవ్వరి చెడునూ ఎప్పుడూ కోరలేదు. తోచింది రాసాను. అభిరుచులను పంచుకోవటానికీ, జీవితాల్లోని బరువునూ, భారాన్ని తేలిక చెసుకోవటానికి బ్లాగు ఒక చక్కని వేదిక. దీనిని సద్వినియోగ పరుచుకోవాలే తప్ప వాగ్వివాదాల్లోకి దిగి మనసులను మరింత భారం చేసుకోకూడదు అన్నదే నా అభిప్రాయం. అందమైన ప్రపంచంలో జీవించే అవకాశం దొరికినందుకు, మనిషి గా రకరకాల అనుబంధాలను ఆస్వాదించే అదృష్టం దొరికినందుకు ఆనందిస్తూ గడపాలి తప్ప చేదునీ, చీకటినీ, ద్వేషాన్నీ తల్చుకుని కాదు అన్నది నా జీవన విధానం.
ఇది నా బ్లాగ్ ఫాలోవర్స్ కోసం :
ఇలా బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాలనూ, అభిరుచులనూ పంచుకునే అవకాశం దొరికినందుకు ఎప్పటికీ ఆనందమే. అయితే మాకు ఈ తెలుగు ప్రాంతం నుంచి తరలి వెళ్ళే సమయం దగ్గర పడింది. మరో కొత్త రాష్ట్రానికీ, కొత్త మనుషుల మధ్యకూ. అందువల్ల ఈ బ్లాగ్ ప్రయాణానికి కొన్ని నెలలు విరామం ఇవ్వక తప్పటం లేదు. అన్నీ సర్దుబాటు అయ్యాకా మళ్ళీ బ్లాగ్ జీవన స్రవంతిలోకి రావాలనే నా కోరిక. బ్లాగుల్లో, బజ్జుల్లో కూడా కనబడకపోతే నన్ను మర్చిపోకండేం !!
.
అందరికీ శుభాభినందనలతో..
మీ
తృష్ణ.
Subscribe to:
Posts (Atom)