పైన ఫోటోలోని పుస్తకాలు చాలా అపురూపమైన పుస్తకాలు. నాన్న కలక్షన్ లోవి. వాటిల్లో మొదట కనబడుతున్న బొమ్మల కథలు అనే లావుపాటి పుస్తకం లో మొట్టమొదటి పాత రోజుల్లో పత్రికలలో పడిన బాపురమణల రచనలు, కార్టూన్లు అన్నీ ఉంటాయి. ఆ ఫోటోలోని అన్ని పుస్తకాల్లో ఉన్న బాపూ బొమ్మలే మూడొంతులు దాకా ఇటీవలి బాపూ బొమ్మల కొలువులో ఉన్నాయి. అయినా వీలయినన్ని ఫోటోలు అపురూపంగా ఫోటోలు తీసుకుని వచ్చాను. ఇంట్లో ఉన్నవే అయినా, నా కెమెరాతో ఆ ఒరిజినల్ బొమ్మల ఫోటోలు తీసుకోవటం ఒక అలౌకిక ఆనందం.
కాసంత కలాపోసన , మూడొచ్చినప్పుడు బొమ్మలేసే చీమంత ఆర్టిస్ట్ పనితనం చిటికెడు ఉండటం వల్ల చిత్రకారుడిగా బాపూ పై అభిమానం పాళ్ళు మరింత ఎక్కువనే ఉండటం వల్ల గేలరీలో తీసిన ఫోటోలను కొన్ని కేటగిరీల్లోకి విభజించాను. ( ఆసక్తి ఉంటే "క్రియేటివ్ వర్క్స్" లేబుల్ లో నా ఫ్యాబ్రిక్ పైంటింగ్ వర్క్స్ , చిన్నప్పుడు వేసిన బొమ్మలు గట్రా చూడచ్చు.) నాలుగైదు కలిపి తీసుకున్నవాటిని కట్ చేసి సింగిల్ ఫోటోలుగా మార్చుకున్నాను. నేను చేసుకున్న విభాగాలేమిటంటే,
* గేట్లోంచి మొదలు లోపలిదాకా ఇరుపక్కలా పెట్టిన చిత్రాలు, లోపల గేలరీలో గుండ్రని స్థంభాలకు కూడా కట్టిన బేనర్ల తాలూకూ ఫోటోలు
* వంశీ కోసం వేసిన చిత్రాలు
* దేవుళ్ళ తాలూకూ చిత్రాలు
* పత్రికలకూ, నవలలకూ, కథలకూ వేసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు
* రకరకాల సుందరీమణులు, మిగిలినవి
ఇలా చేసుకున్న విభాగాల్లో ఆయా చిత్రాలను ఎడిట్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా అవ్వలేదు..:) ఇలా ఫోటోలు తీసుకోనివ్వటం ఒక వరమైతే, తీసుకునేందుకు మంచి కెమేరా ఉండటం నా అదృష్టం అనుకున్నా. తీసుకుంటున్నంత సేపూ ఓ సందర్భంలో ఆ కెమేరా నాకు బహుకరించిన నాన్నకు బోలెడు థాంక్సులు చెప్పేసుకున్నా. సరే ఇప్పుడు బ్లాగ్ లో ఏవి పెట్టాలి? అన్న ప్రశ్న చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆ కుంచె నుంచి రూపుదిద్దుకున్న ప్రతీ బొమ్మా ఒక అపురూపమే. అందువల్ల ఏవి పెడితే మిగతా బొమ్మలకి కోపాలొస్తాయో అని భయం.
సరే మరి చూడనివాళ్లకి బొమ్మల కొలువు చూపించెయ్యనా? ముందుగా గేట్లోంచి వేళ్దాం.. క్రిందివన్నీ బేనర్ల తాలూకూ ఫోటోలే.
తదుపరి టపాలో వంశీ కోసం వేసిన చిత్రాలు చూద్దాం. సరేనా?