రెండు, మూడు రోజులుగా పరస్పర విరుధ్ధమైన ద్వంద్వ భావాలు మనసులో ఒకేసారి పొటీపడుతున్నాయి.
"ఏదో ఒకటి రాయాలి.. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ప్రతి దృష్టికోణంలోనూ ఏదో ఒక వైరుధ్యం ఉంటుంది. ఎవరి భావాలువారివి కాబట్టి నా బ్లాగులో నా రాతలు నేను రాసుకోవాలి అనే నిరంతర తపన" ఒకవైపు!
" ఏదీ కూడా శాశ్వతం కానీ కనురెప్పపాటి జీవితంలో ఏం రాస్తే ఏమిటి? నేను రాయకపోతే వచ్చే అణుమాత్రం నష్టం కూడా లేనప్పుడు, ఏం రాసి ఏం ప్రయోజనం? అనే నిర్లిప్తత మరోవైపు!!
పాటలు పోగేసుకున్నాను, అక్షరాలను వెతుక్కున్నాను, మాటలు సమీకరించుకున్నాను, ఎంతో రాయాలనే తపన కూడా ఉంది కానీ పైన పేర్కొన్న ద్వంద్వ భావాలలో నన్ను రెండవదే ఎక్కువగా ప్రభావితంచేస్తోంది. ఒకానొక అనాస్థ దశలో ఎలాగైతే నిర్లిప్తంగా నాకత్యంత ప్రియమైన ఈ బ్లాగు మూసేసి ఏకాంతంలోకి వెళ్పోయానో, ఇప్పుడూ అదే అనాస్థ దశ. మూగగా, స్తబ్దంగా, భావాలను ముందుకు నడవనివ్వని ఒక నిస్తేజ స్థితి ఆవరించి ఉంది.
కాదు.. ఇది వైరాగ్యం కానే కాదు.. అంతకు మించిన ఏదో భావం!
ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మలోని పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కలిగే నిర్లిప్త భావమేమో... బహుశా!!
కానీ నేను సమీకరించుకున్న పాటలతో, మాటలతో ఒక మహానుభావుడికి అంజలి ఘటించే ప్రయత్నం త్వరలో తప్పకుండా చేస్తాను.