2021... వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయాయి.. ఇవాళ్టి వినాయకచవితి కూడా స్దబ్దుగా గడిచిపోయింది ! ఈ కాలం ఇలా త్వరగా గడవడం మంచిదే కానీ మరీ ఇంత త్వరగానా .. అనిపిస్తోంది . ఏ హడావుడి లేకుండా పండుగ వెళ్పోయింది . ఏమో నాకైతే అలానే అనిపించింది . రోడ్డు మీద పత్రి అమ్మేవాళ్ళు కూడా ఇదివరకటిలా పది అడుగులకొకళ్ళు లేరు. మా వైపున పత్రి అమ్మకం ఉన్న ఒక్క చోటా కూడా ఇదివరకటిలా అన్ని రకరకాల ఆకులు అమ్మలేదు . జిల్లేడు ఆకులూ , తామరపూలు , తామర ఆకులూ , ఏవి లేవు . ఇదివరకూ చాలామంది నానారకాల ఆకులూ అమ్మేస్తున్నారు అని విసుక్కునేవాళ్ళం . అయినా వాళ్లకి ఆ ఒక్కరోజే ఉపాధి . ఎక్కడెక్కడికి వెళ్లి ఇవన్నీ తెస్తారో వీళ్ళు అని ఆశ్చర్యపోయేవాళ్ళం కూడా. మన జీవితాలలోకి ఈ మహమ్మారి ఎన్ని మార్పులు తెచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రోజువారీ ఉపాధి అవకాశాలు మాత్రం బొత్తిగా శూన్యం అయిపోయాయి . నిరుపేద జీవితాలపై మాత్రం ఇది చాలా బలమైన దెబ్బ అనే చెప్పాలి . ఈ గడ్డు కాలం సమసి , వారి జీవితాలు వికసించే రోజులు మళ్ళీ రావాలని ఆ వినాయకుడుని ప్రార్థిస్తున్నాను .
*** *** ***
పుస్తకం తెరిచి ఎన్నాళ్లైయిందో ! ఇంటి పనితోనో , ఆఫీసు పనితోనే రోజులు గడిచిపోతున్నాయి . OTT ల పుణ్యమా అని నానావిధ సినిమాలకేకొదవాలేదు. అవి పనులు చేసుకుంటూ కూడా చుసేయచ్చు . కానీ పుస్తకానికి ఏకాంతం , ఏకాగ్రత రెండూ కావాలి. ఎప్పుడైనా సమయం దొరికితే కాసేపు పడుకుందాం , రెస్ట్ తీసుకుందాం అన్న ఆలోచనే తప్ప చదువుదామనే ధ్యాసే ఉండడం లేదు .
ఇదివరకూ ఇంట్లో సామాను కూడా ఎటునుంచి ఇటు , ఇటు నుంచి అటూ అవలీలగా జరిపేసి సర్దేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక్కరోజు సర్దితే నాలుగురోజులు మరేపని చెయ్యలేని స్థితి . ఇది వయసు ప్రభావమా ? లేక పనిపనిషి లేకుండా గత రెండేళ్ల నుండీ చాకిరి చేసుకుంటున్న వత్తిడి ప్రభావమా ? అన్నది తేల్చుకోవడం కష్టమే!
*** ***. ***
ఈ టపాలో ప్రత్యేకత ఏమిటంటే నా కొత్త లాప్టాప్ లో ఇంకా సరైన సదుపాయాలు లేక డైరెక్ట్ గా బ్లాగ్ నుండే డ్రాఫ్ట్ లోoచి ఈ టపా రాస్తున్నాను. ఎలాగైనా ఇవాళ రాయాలనే సంకల్పంతో ! అక్షరాలు వెతుక్కుoటూ రాస్తుంటే బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తల్లో ఒక టపా రాయడానికి ఎన్ని కష్టాలు పడేదాన్నో, ఎన్ని తప్పులు వచ్చేవో గుర్తుకొస్తోంది.
నవ్వు వస్తోంది .... మళ్ళీ గతం తాలూకూ చెరగని చేదు గురుతులు కలవరపెడుతున్నాయి కూడా! కానీ ఒకటి మాత్రం నిజం - ఏది జరిగినా మన మంచికే అని నేను ఎప్పుడూ నమ్మే సూత్రం . ఈ బ్లాగు రాతలు నాకు కేవలం చేదు జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చినా , ఈ రాతలు నాకు తెలుగు టైపింగ్ నేర్పాయి . ఎలా రాయాలో , ఎంత రాయగలనో , ఏది రాయగలనో తెలిపాయి . నా జీవితకాలపు కలను నిజం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించింది ఈ బ్లాగ్ రాతలే! భగవంతుడు నాకు అన్ని విధాలా సహకరించాడనే చెప్పాలి. ఆ నిరాకార స్వరూపుడికి కృతజ్ఞతలు .
*** *** ***
చాలా కాలం నుంచి తెలిసిన కొందరి గురించి మనకి ఏర్పడిన అభిప్రాయాలను మార్చుకోవడం కష్టమే అయినా ఒకోసారి మార్చుకోవాల్సి వస్తుంది . ఇలాంటివాళ్ళు అనుకున్నాము ... కాదన్నమాట అని ఆశ్చర్యం వేసినా నిజరూపం తెలిసాకా అసలు కొందరితో మాట్లాడాలనే అనిపించదు . ఎదురైనా తప్పించుకు తిరుగుతాం.
*** *** ***
ఏకాంతాన్ని ఆస్వాదించడం మొదలైయ్యాకా మనుషులకు దూరంగా ఉండడమే ఆనందాన్ని ఇస్తోంది . మనసు మరింత ఏకాంతాన్ని కోరుకుంటుందే తప్ప మరో ఊసే గుర్తుకురాదు . భగవధ్యానం , ఆధ్యాత్మిక జీవితం , మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఇదివరకటి మామూలు పుస్తకాల వైపుకి దృష్టిని మరలనివ్వడమే లేదు . ఇందులో ఉన్న ప్రశాంతత మరెందులోను లేదు అన్న సత్యం ఆలస్యంగానైనా తెలిసిరావడం పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను. గత ఆరేళ్లలో ఆత్మోన్నతికి ఉపయోగపడే ఎన్నో మంచి మంచి పుస్తకాలు తెప్పించుకున్నాను. కొన్ని చదివాను .. ఆనందించాను. ఇంకా చాలా చదవాలి . అటువంటి ఏకాగ్రతనిచ్ఛే ఖాళీ సమయాన్ని ఇమ్మని భగవంతుడిని కోరుకుంటున్నాను .