నేను నేనుగా మిగిలి, నాకై నేను గడిపే క్షణాలు చాలా ఉండేవి. అలాంటి కొన్ని క్షణాలు ఉండేవి కదూ... అని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన రోజులు గడుపుతున్నాం. నేను, నాలాంటి వందల, వేల, లక్షల మహిళలు. ఈ దశాబ్దానికి ఆఖరి రోజు ఇవాళ. పన్నెండు దాటి ఇరవై నిమిషాలు అయ్యింది. ఇవాళ బలవంతాన పడుకోకుండా కూర్చుని కాసేపు ఏదన్నా రాయాలని చాలా మనసైంది. రాయాలని చాలాసార్లు అనిపిస్తుంది కానీ సమయం చిక్కదు. గతంలో ఇంట్లోని మిగతావారు పరుగులు పెడుతుంటే, వాళ్లకి కావాల్సినవి అందించి, ఇల్లు నిశ్శబ్దంగా మారాకా వార్తాపత్రికనో, నచ్చిన పుస్తకాన్నో చదువుతూ, బాల్కనీలో ప్రశాంతతని ఆస్వాదిస్తూ ఎన్నో క్షణాలు ఏకాంతంగా, ఆనందంగా గడిపిన రోజులు ఉండేవి. గత పదినెలలుగా ఆ ఏకాంతం, ఆ ప్రశాంతత కరువైపోయాయి. ఇంటి బాధ్యతలతో పాటూ, అదనంగా అందిన పనిమనిషి ఉద్యోగం జీవితాన్ని తలకిందులు చేసిందనే చెప్పాలి. అంట్లు తోమి తోమి చేతులు బండబారిపోయాయనే చెప్పాలేమో! మధ్యలో రెండునెలల పాటు ఇల్లు మార్పు, అటు ఇటు తిరుగుడు, చేస్తోన్న బండ చాకిరీతో పాటూ చేత్తో బట్టలు ఉతకాల్సి రావడం, లిఫ్ట్ లిఫ్ట్ పనిచెయ్యకపోవడం, మూడుపూటలా వంటింట్లో అదనపు డ్యూటీలు, పెరుగుతున్న వయసునీ, తరుగుతున్న ఆరోగ్యాన్నీ పదే పదే గుర్తుచేసుకునేలా చేశాయి. నష్టపోతున్నది సమయాన్నో, ఆరోగ్యాన్నో తెలీకుండా చేసేసింది ఈ 2020.
ఇంత చెత్త సంవత్సరాన్ని ఇన్నేళ్లల్లో చూడలేదు. ఇంటి మనుషులు ఇంట్లో కళ్ళెదుట ఉంటే ఆనందమే. కానీ పనిమనిషి, వంటమనిషి, చాకలి అందరి పదవులూ ఇల్లాలికి దక్కించిన ఈ సంవత్సరాన్ని తిట్టుకోని ఇల్లాలు ఉంటుందా? చేతులు కడిగి కడిగి అరిగిపోయాయి, సానిటైజర్లు వాడి వాడి పర్ఫ్యూమ్స్ కూడా వాడాలంటే వెగటు పుడుతున్నాయి, ఆన్లైన లో తెప్పించిన వస్తువులు, కూరగాయలు కడిగి, తుడిచి, ఆరబెట్టి, అలసి సొలసి వంటిల్లంటే విరక్తి కలగని మహిళ, "i need a break" అనుకోని మహిళా ఉంటుందా అసలు అనుకుంటూ ఉంటాను.
ఇక ఈ ఆన్లైన్ క్లాసులేమిటో.. నిద్దర్లు పోతూ, ఆవులిస్తూ, స్క్రీన్ మీద టీచరమ్మలూ,మాష్టార్లు వాళ్లపాటికి వాళ్ళు పాఠాలు చెప్పుకుంటూంటే, స్క్రీన్ మ్యూట్ చేసి తమ తని తాము చేసుకునే పిల్లలే ఎక్కువైన ఈ సంవత్సరంలో అందరు పిల్లల చదువులు అటకలెక్కాయని నొక్కి వక్కాణించాల్సిందే!! ఇంక అప్పుడప్పుడూ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు ఏమాత్రం జాగ్రత్తలు పాటించని ప్రజానీకాన్నీ, మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా పెళ్ళిళ్ళూ పేరంటాలూ చేసేసుకుంటున్న ధైర్యస్తులని, మరో పక్క అతి దీనావస్థలో ఉన్న చిన్నపాటి రోజువారీ వ్యాపారస్తులని, రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలనీ చూస్తూంటే దు:ఖం, బాధ, కోపం, అసహనం, నిస్సహాయత మొదలైన భావాలన్నీ కట్టకట్టుకుని బయటకు తన్నుకు వస్తున్నాయి. ఇలాంటి భావాలనే అనుకుంటా అదేదో సినిమాలో frustration..frustration అన్నారు. ఈ విపత్తు కాలంలో ఇటువంటి frustration అందరి కంటే ఎక్కువ మా ఇళ్ళాళ్ళమే భరించాము అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
పది రోజులకు ఒకసారైనా ఏదో పని పెట్టుకుని బయటకు వెళ్ళి రాకపోతే నాకు తోచదు. తలెత్తి ఆకాశాన్ని చూసి, స్వేచ్ఛగా గాలినీ పీల్చి ఎన్నాళ్ళైందసలు?! ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. అయిపోయిందనుకుంటుంటే మళ్ళీ భయపెడుతున్నారు. రాబోయే రోజులు ఇటువంటి frustration నిండిన క్షణాలనే ఇస్తాయని జోస్యాలు కూడా ఎక్కువగానే వింటున్నాం. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం కన్నా చెయ్యగలిగింది ఏముంది? నిజం చెప్పాలంటే ఇలా సింహావలోకనం చేసుకునే సమయం కూడా ఇన్ని నెలల తరువాత ఇవాళే దొరికింది. ఈ మహమ్మారి పుణ్యమా అని నా ఆఫీసు పనులు బాగా తగ్గిపోయినా, ఇంటి పనులు మాత్రం ఓవర్ టైం చెయ్యల్సినంత ఉంటున్నాయి. అందుకే ఇవాళ కాస్త నిద్రను త్యాగం చేసి అయినా ఈ దశాబ్దపు ఆఖరి రోజున నాలుగక్షరాలు రాయాలనిపించింది. ల్యాప్టాప్ దుమ్ము దులిపి, నాకై నేను మిగిలే ఈ క్షణాలను మిగుల్చుకోవాలని ఆశ కలిగింది.
రేపటి రోజు బాగుంటుందని ఆశగా ఎదురుచూడడం మనిషి నైజం. ఆశావాదుల దృక్పధం. ఇదే ఆశతో ఎదురుచూస్తాను...
కనీసం ఇంటి పనులకైనా స్వేచ్ఛగా బయటకు వెళ్లగలిగే రోజు కోసం..
ఇష్టంగా కొనుక్కున్న పుస్తకాల పేజీలు ఆత్రంగా తిప్పగలిగే రోజుల కోసం..
మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకునే రోజుల కోసం..
మాస్క్ లేకుండా రోడ్డుపై వెళ్తూ సూర్యోదయాలనూ, సూర్యాస్తమయాలనూ చూసే రోజు కోసం..
అంట్లు తోమక్కర్లేని రోజు కోసం..
మాస్కులు, సానిటైజర్ వాడక్కర్లేని రోజు కోసం..
రైలు కిటికీలోంచి వేగంగా వెళ్పోతున్న పచ్చని చెట్లని చూసే రోజు కోసం..
లిస్ట్ రాసుకున్న పుణ్య క్షేత్రాలను ఒక్కొక్కటిగా దర్శించే రోజుల కోసం..
ఈ దశాబ్దపు ఆఖరి రోజున నేను ఎదురుచూస్తాను -
నాకై నేను మిగిలే మరిన్ని క్షణాల కోసం..
ఏ భయాలూ లేని రోజు కోసం..
ప్రజలు ఆనందంగా, క్షేమంగా తిరిగే రోజుల కోసం!
సర్వేజన:సుఖినో భవంతు!