భారతదేశం యావత్తూ మహాత్మునిగా కొనియాడిన బోసినవ్వుల బాపూకి భార్యా, పిల్లలు ఉంటారని, దేశాన్ని ఒక్క త్రాటిపై నడిపించి నిర్దేశించడం మాత్రమే కాక బాపూజీకి వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందనే ఆలోచన చిన్నతనంలో ఉండేది కాదు. "గాంధీ" చిత్రం ద్వారా మాత్రం వారి వ్యక్తిగత జీవితం గురించి, కస్తూరి బా గురించీ కొన్ని వివరాలు తెలిసాయి. అయితే వారి పిల్లల గురించిన వివరాలు మరెక్కడా చదివిన గుర్తు లేదు. కాలేజీ రోజుల్లో ఒక ఆంగ్ల పత్రికలో వారి మొదటి కుమారుడి గురించి ఆర్టికల్ చదివి, భద్రపరిచిన గుర్తు. అప్పటి నుండీ హరిలాల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. కొన్నేళ్ళ క్రితం నటుడు అక్షయ్ ఖన్నాతో అనిల్ కపూర్ "గాంధీ, మై ఫాదర్" అనే చిత్రం నిర్మించారు. ఒక నవల ఆధారంగా చిత్రాన్ని తీసారని అన్నారు. ఆ నవల నాకు దొరకలేదు కానీ ఇన్నేళ్ళ తెరువాత ప్రముఖ గుజరాతీ రచయిత దినకర్ జోషీ నవల(ప్రకాశవో పరభావో)కు కూచి కామేశ్వరి గారి అనువాదం నాకు లభించింది. అదే "మహాత్మునికీ గాంధీకీ మధ్య"! బాపూని ఒక సాధారణ తండ్రిలా మనకు చూపెట్టే కథ ఇది. గాంధీ మహాత్ముని పెద్ద కుమారుడైన హరీలాల్ జీవిత కథ. ఒక వ్యధాభరితమైన యదార్థ గాధ.
ఈ నవల ద్వారా నాకొక మంచి రచయిత పరిచయమయ్యారు. దినకర్ జోషీ గారి వంటి డేడికేటెడ్ రైటర్ గురించి ఇప్పటికైనా నేను తెలుసుకోవడం చాలా ఆనందకరమైన సంగతి. కథా సంకలనాలు, నవలలూ, అనువాదాలు, సాహిత్య వ్యాసాలు అన్నీ కలిపి ఇప్పటివరకూ జోషీ గారివి 152 పుస్తకాల ప్రచురించబడ్డాయి. ఎనభై వసంతాలు దాటిన వయసులో కూడా సాహిత్యాభివృధ్ధికి ఆయన ఇంకా చేస్తున్న సేవ అపారమైనది. గుజరాతీ రచనలను ఎక్కువమందికి చేరవేయాలనే సదుద్దేశంతో ఆయన "గుజరాతీ సాహిత్య ప్రదాన్ ప్రతిష్ఠాన్ " అనే సంస్థను మొదలుపెట్టారుట. “We talk about Shakespeare, Tennyson…and Dostoevsky, but we don’t read books of our own languages. We lose out on a lot. It doesn’t make sense..” అంటారాయన. ప్రాంతీయ భాషా సాహిత్యానికి ఎంత ప్రాధ్యాన్యత ఉందో, మన సాహిత్యానికి మనం ఎంత విలువ ఇవ్వాలో తెలియచెప్తూ ఆయన అన్న ఈ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. ఎవరి భాషను వారు నిలబెట్టుకోవడానికి సాహిత్యకారులు, రచయితలు ఎంతటి కృషి చేయ్యవలసి ఉందో ఈ మాటలు చెప్తాయి.
"మహాత్మునికీ గాంధీకీ మధ్య" నవలలో ఏ ఒకరి పక్షాన్నీ వహించకుండా బాపూకీ, వారి కుమారుడికీ మధ్యన నిలబడి, ఇధ్దరి దృష్టికోణాల్లోంచీ వారి వారి జీవితాలను మనకు చూపెట్టి; తుది నిర్ణయాన్ని పాఠకులకే వదిలేయడం రచయిత సామర్ధ్యానికి నిదర్శనం. నాకు మాత్రం వారు బాపూ వైపుకి సమానమైన న్యాయం చూపెట్టడానికి ఎక్కువ కష్టపడ్డారేమో అనే అనిపించింది. వ్యక్తిగతంగా గాంధీజీ పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ హరిలాల్ జీవితగాధ చదువుతున్నంత సేపూ హరిలాల్ పై అవ్యాజమైన కరుణ కలుగుతుంది. జాతిని నడిపించిన మహాత్ముడి కుమారుడికా ఈ దురవస్థ? అయ్యో బిడ్డా.. ఎన్ని ఇక్కట్లపాలయ్యావయ్యా అని మనసు దు:ఖపడుతుంది. అతడి బలహీనతలపై జాలి కలుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా అతడు చూపే వివేకం, వాటిని అతడు ఎదుర్కున్న నేర్పూ, సామర్ధ్యాలను చూసి ఆశ్చర్యం వేస్తుంది. చదువుతునంత సేపూ దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు గాంధీ గారు అని సరిపెట్టుకోలేకపోయాను. కాస్తంత ఆధారం, రవ్వంత ప్రేమ, కొద్దిపాటి మార్గదర్శకత్వం దొరికి ఉండుంటే అతడి జీవితం ఏ ఉన్నత శిఖరాల వైపుకు పయనించి ఉండేదో అన్న ఆలోచన రాకమానదు. ఏదేమైనా గాంధీజీ ఒక చోట అన్నట్టు కర్మ ఫలాన్ని మార్చడం ఎవరి తరం?! ఆ తల్లికి ఆ ఆక్రోశం, ఆ తండ్రికా అవమానం, ఆ బిడ్డకా పతనం రాసిపెట్టి ఉన్నాయి..!!
హరిలాల్ మరణవార్తతో, కేవలం వేళ్ళపై మాత్రమే లెఖ్ఖపెటగలిగిన సభ్యుల సమక్షంలో జరిగిన అతని అంత్యక్రియ ఘట్టంతో మొదలౌతుంది హరిలాల్ జీవితగాథ. ఉత్సాహవంతుడైన యువకుడిగా గాంధీ బాటలో సత్యాగ్రహంలో, పలు స్వాతంత్ర్యౌద్యమాల్లో పాల్గొన్న ఎంతో తెలివైన వ్యక్తిగా, ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించే ప్రాసంగికుడిగా పాఠకులకు పరిచయమైన హరిలాల్ జీవనపయనం పాఠకుల ఉత్సాహాన్నీ, ఆశ్చర్యాన్నీ చివరిదాకా ఆపకుండా నడిపిస్తుంది. అతడి వ్యక్తిత్వ పతనం ఎలా మొదలైంది, ఎటువంటి దీనావస్థలో చివరికి ఒంటరిగా మిగిలాడు అన్న సంగతులు పాఠకుడి కళ్ళని చెమ్మగిల్లకుండా ఆపలేవు. ఆ పతనానికీ, జరిగిన విషయాలన్నింటికీ మూలకారణంగా స్వకర్మనో, తల్లిదండ్రులనో కాక విధిని నిలబెట్టడం అనేది జోషీ గారి విఙ్ఞతకు నిదర్శనం.
పుస్తకం పూర్తయిన తర్వాత అంతర్జాలంలో హరిలాల్ గురించిన మరిన్ని వివరాల కోసం వెతుకుతూంటే ఎన్నో ఆశ్చర్యకరమైన వివరాలు దొరికాయి. పలు వార్తాపత్రికల్లో అచ్చయిన గాంధీగారి స్వదస్తూరీ తాలూకూ ఉత్తరాలూ.. కొన్ని సంగతులు.. వాటిని సొమ్ము చేసుకోవడానికి వాటి హక్కుదారులు చూపిన ఉత్సుకత.. వగైరా వగైరా! వాటి వల్ల అర్ధమైంది ఏమిటంటే, హరిలాల్ జీవితంలోని కొన్ని సత్యాలని విపులీకరించకుండా రచయిత ఎంతో శ్రధ్ధతో ఈ కథని తీర్చిదిద్దారని, తద్వారా గాంధీమహాత్మునికి, హరిలాల్ కి కూడా ఎంతో గౌరవాన్ని మిగిల్చినవారయ్యారని!! శ్రీ దినకర్ జోషీ పట్ల మరింత గౌరవం పెరిగింది. ఈ కథ అనే కాదు కానీ కొన్ని చారిత్రక విశేషాలను, మనుషులను గురించి చదివిన ప్రతిసారీ నన్నో ప్రశ్న వేధిస్తూ ఉంటుంది - గతించిన చరిత్ర తెలిసినవాళ్ళ కన్నా తెలియనివాళ్ళే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, ఎవరిదైనా గాథ రాసేప్పుడు వారి చరిత్రల్లోని లోటుపాట్లని, చీకటి కోణాలను యదార్థం పేరుతో తెలియనివాళ్ళకు తెలియచెప్పి ఆ మనుషులకు అప్పటిదాకా ఉన్న గౌరవాన్ని తుడిచిపెట్టేయడం అనేది ఎంతవరకూ సమంజసం? అని! ఇప్పుడా గతించిన చీకటిని తవ్వుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది? సమాజం, మానవాళి మరింతగా ఎదగటానికి మాత్రమే చరిత్ర ఉపయోగపడాలి. అంతే తప్ప ఎవరికీ ఏమాత్రం ఉపయోగకరం కాని గత కాలపు అభ్యంతకరమైన విశేషాలనూ, వివరాలనూ కెలికి, వెలికితీయడమనేది గతించిన వారిని అవమానించడమే కాక వ్యర్థ ప్రయాస అన్నది నా స్వాభిప్రాయం.
ఈ నవల గురించి మరి కొన్ని వాక్యాలు రాస్తే పుస్తకాభిమానులతో ఈ పుస్తకం చదివించాలన్న నా ఉద్దేశం చప్పబడిపోతుందన్న అభిప్రాయంతో వ్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. ఈ నవల ద్వారా గాంధీగారి గురించి, కస్తూరి బా గురించీ, వారి ఇతర కుటుంబ సభ్యుల గురించీ, మనుషుల్లోని భిన్న స్వభావాల గురించీ ఎన్నో తెలియని విషయాలను తెలియపరిచిన శ్రీ దినకర్ జోషీ అభినందనీయులు.