సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 23, 2019

అత్తయ్యగారు


ప్రియమైన అత్తయ్యగారికి నమస్కరించి,

మేమంతా కులాసా. మీరు ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళయిందో కదా మీకు ఉత్తరం రాసి! మేము బొంబాయి లో ఉన్నప్పుడు మీరు మీ అబ్బాయి మీద బెంగ పెట్టుకున్నారని వారానికో ఉత్తరం అన్ని విశేషాలతో తప్పనిసరిగా రాసేదాన్ని. మీరెంత మురిసిపోయేవారో ఆ ఉత్తరాలు చదువుకుని. మళ్ళీ ఇన్నాళ్ళకి మీకు ఉత్తరం రాస్తున్నాను.

మిమ్మల్ని తలుచుకోని రోజు లేదండీ. ఏదో ఒక విషయంలో, ఏదో కారణంగా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు. ఒకటా రెండా పదిహేనేళ్ల సాంగత్యం మనది. నిజం చెప్పాలంటే మీ అబ్బాయి కన్నా మీతోనే కదా నేను ఎక్కువగా గడిపినది. కానీ మనం కలిసి ఉన్న ఏడేళ్ళూ కూడా మీరు అత్తగారిగా, నేను కోడలిగానే మసిలాము. మీకు అత్యంత ప్రియమైన అబ్బాయిని నాకు ఇచ్చేసాన్న మీ బాధ నన్ను ఒక కోడలిగా మాత్రమే చూసేలా చేసింది. మిమ్మల్ని సంతృప్తి పరచాలని, మీతో మెప్పించుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో దేవుడికి బాగా తెలుసు. నా ప్రతి పనిలోనూ మీరు వెతికే పొరపాట్లు..నన్ను చాలా బాధ పెట్టినా, అవి ఇప్పుడు నేను ప్రతి పనినీ పర్ఫెక్ట్ గా చేసేలా చేసాయని ఇప్పుడు కదా నాకు అర్థం అయ్యింది! "మీ అమ్మాయికి అభిమానం ఎక్కువ, చిన్న మాట కూడా పడదు" అని మీరు అమ్మతో చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. ఇన్నాళ్ళకు ఒక్క విషయం నాకు బాగా అర్థం అయ్యిందండీ.. ఇష్టం ఉన్నచోట తప్పు కూడా చిన్న పొరపాటులానే అనిపిస్తుంది. ఇష్టం లేని చోట చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పులానే తోస్తుంది. ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం లోనే ఉంటుంది.

మనిద్దరి దృష్టికోణం మారడానికి పదేళ్ళు పట్టింది. ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎదురుచూసిన నాకు మీరు ఏకంగా ప్రసంశల శాలువానే కప్పేశారు. మీరు నా మీద ప్రేమగా రాసిన కవితని ఎంత భద్రంగా దాచుకున్నానో!!

జీవితంలో కొన్ని చేదు అనుభవాలు మనకి చాలా మంచిని చేస్తాయనే సత్యం స్వానుభవం మీదనే ఎవరికైనా అర్థం అవుతుందేమో. ఐదేళ్ల క్రితం నా జీవితంలో నాకు తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బకి ఏడాది దాటినా నేను నిలదొక్కుకోలేక,  బాధతో విలవిల్లాడిపోతుంటే ఎంత ధైర్యం చెప్పారూ..! అసలు అది ఎంతో పెద్ద సర్ప్రైజ్ నాకు. ఆ సాయంత్రం నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నా పక్కన కూర్చుని, కళ్ల నీళ్ళు తుడిచి.. పదేళ్ళుగా నేను మీ నోటి వెంట విన్నలని తపనపడుతున్న మాటల కన్నా పదిరెట్లు ఎక్కువ మెచ్చుకోలు మాటలు చెప్పి, ఎంతగా ఓదార్చారో! నా జీవితపు చివరి క్షణాల దాకా ఆ మాటలు నేను మర్చిపోనండీ. అంతగా ధైర్యం చెప్పారు. ఈవిడ మనసులో నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా? ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయాను. నేను మొదటిసారి మీ ప్రేమను అర్థం చేసుకున్నది ఆరోజే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక కోడలిగా నేనేనాడూ నా బాధ్యతను విస్మరించలేదు. మీకూ తెలుసు. కానీ ఆ రోజు నుండీ నా బాధ్యతకు, అభిమానం కూడా తోడైంది.
నేను వినాలని తపించిన మాటలనే కాకుండా, మరో రెండు మూడు ప్రశంసా వాక్యాలు మీ నోట వినడం నిజంగా నా అదృష్టం. నాతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా ఎంతో సంతృప్తిగా మీరన్న మాటలు నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని మిగిల్చాయండీ. ఈ జీవితానికి అంతకన్నా ఏం కావాలి? నాకు ఎదురైన చెడు ఈ విధంగా మిమ్మల్ని నాకు దగ్గర చేసింది.

కానీ అసలు మీరు ఎందుకని వెళ్పోయారండీ? ఎందుకంత తొందరపడ్డారు? ఏమంత వయసైందని? మీరు లేకపోతే మీ పిల్లలు ఎలా తట్టుకోగలరనుకున్నారు? ఎంత ప్రేమగా పెంచారు వాళ్లని.. మీ ప్రపంచమంతా వాళ్ళతోనే నింపుకుని, వాళ్ళే లోకమై బ్రతికారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు దిగమింగారో, ఎన్ని అవమానాలు సహించారో మీ అబ్బాయి చెప్పినప్పుడూ, తల్చుకున్నప్పుడూ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మొదట్లో మీ వైఖరి వల్ల మీపై కోపం ఉన్నా కూడా, మీలో ఉన్న ఈ గొప్ప తల్లిప్రేమను చూసి నేను చలించిపోతూ ఉండేదాన్ని. మీపై కొండంత గౌరవం ఉండడానికి కూడా కారణం ఇదే. మీలాంటి గొప్ప తల్లిని నేనెక్కడా చూడలేదండీ. నిజం! ఖాళీగా ఎప్పుడూ ఉండేవారు కాదు. ఓపిక ఉన్నంతవరకూ చివరిదాకా తోచిన సాయం చేశారు. మీరు బాలేకుండా ఉండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండిపోండి.. అంటే అలాగే అనేసి, కాస్త బావుండి నడవగలిగే ఓపికరాగానే బ్యాగ్ సర్దేసేవారు. నేను కోప్పడితేనేమో, "అమ్మలా కోప్పడుతున్నావు.. పోనీలేమ్మా. ఇక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటా. నేను చేసేదేముందని..పిల్లలకి కాపలా. అంతేగా" అనేసి నా నోరు మూసేసేవారు. వచ్చి వెళ్పోయే ప్రతిసారీ మాత్రం "వస్తాలే. బాధపడకు. ఎప్పటికైనా మీ దగ్గరకు రావాల్సిందాన్నేగా. చివరిరోజులు పెద్దకొడుకు దగ్గరే.." అనేవారు. మాట నిలబెట్టుకున్నారు. చివరికి వచ్చారు. కానీ ఎలా వచ్చారు? కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లుగా... ఎంత పిలిచినా పలకలేనంత నిద్రలోకి వెళ్పోయి, ఎన్ని మాటలు మాట్లాడినా కళ్లు విప్పలేనంత నిద్రలోకి వెళ్పోయి వచ్చారు. మీరు అదృష్టవంతులు. అనాయాస మరణం ఎందరికి దక్కుతుంది?  పది నెలలు అయిపోయాయి అత్తయ్యగారూ... మేమే ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ లోంచి బయటకు రాలేకపోతున్నాం. నిత్యం తలుస్తున్నాం. మీరు నాకు అప్పుడప్పుడూ చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఎంతగా పనికి వస్తున్నాయో, ఎంత అనుభవంతో చెప్పారో  కదా అని రోజూ అనుకుంటూ ఉంటాను. మిమ్మల్ని తలిచినప్పుడల్లా ఎటువంటి గిల్టీనెస్ నాకు లేకుండా చేసి వెళ్పోయారు. అదీ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం.

ఇవాళ మీ పుట్టినరోజు! పదిహేనేళ్ళుగా మీకు పుట్టినరోజుకు చీర పెట్టడం అలవాటు. ఈసారి ఎవరికి పెట్టను? కొని అయితే ఉంచాను. ఎవరికో ఒకరికి పెడతానులెండి. చీర పెట్టినప్పుడల్లా "నా పుట్టినరోజు నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోవు" అనేవారు. పొద్దున్నుంచీ మీ మాటలు, అలోచనలు, అవే తలపులతో గడిపాను. ఎవరికైనా సరే కడుపునిండా భోజనం పెట్టడం మీకు ఇష్టం కదా అందుకని మీ అబ్బాయితో అన్నదానానికి డబ్బు కట్టించాను. మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు తెలుసు.

మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వచనాలు మాకు తప్పక ఉంటాయి. అవే మాకు శ్రీరామరక్ష. చాలా రాసేసాను. ఇంక ఉంటానండీ, missing you...
                                                        ప్రేమతో.. మీ కోడలు.