"హృదయమెంత తపిస్తే... బతుకు విలువ తెలిసింది.
గుండెనెంత మథిస్తే... కన్నీటి విలువ తెలిసింది.
చీకటసలే లేకుంటే... వెన్నెలకేం విలువుంది.
నిన్న ముగిసిపోయాక... నేటి విలువ తెలిసింది"
చాలా రోజులకి ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసానన్న ఆనందంతో కుర్చీలోంచి లేవబోతూంటే స్క్రోలింగ్ టైటిల్స్ తో పాటూ మొదలైన ఈ పాట మళ్ళీ కూర్చోపెట్టేసింది.. అప్పటికే తుడిచి తుడిచి చెమ్మగిల్లి ఉన్న కళ్ళు మరోసారి మసకబారాయి.
పాలలో బియ్యం ఉడికాకా, నేతిలో ఎర్రగా వేగిన పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి, సమ పాళ్లలో తగినంత తీపి వేసి వండిన చక్కని చక్రపొంగలిలో.. చివరిలో చిటికెడు పచ్చకర్పురం వేస్తే ఎంత అద్భుతమైన రుచి వస్తుందో - అలా ఉంది సినిమా చివర్లో వచ్చిన ఈ కవితా గానం - like a tasty topping on an already delicious cake - మనసుని ఎంతగానో కదిలించింది !!
చాలా వరకు మన సినిమాల్లో..
1) ఒక హీరో ఉండుట. అతడొక హీరోయిన్ ని చూచుట. ఆమెను ఒప్పించుట కొరకు అష్టకష్టాలు పడుట.
2) ఒక హీరో ఉండుట. అతడికి ఆల్రెడీ ఒక హీరోయిన్ పరిచయం ఉండుట. వారి ప్రేమను గెలిపించుకునేందుకు అష్టకష్టాలు పడుట.
3) ఒక హీరో ఉండుట. హీరోయిన్ కాదందని, లేదా విధి విడదీసిందనో జీవితాన్ని నాశనం చేసుకొనుట.
4) ఒక హీరో ఉండుట. అతగాడికి కనబడ్డ అమ్మాయి మాత్రమే ప్రపంచంలోకెల్లా అద్భుతమైన సౌందర్యరాశి అయి ఉండుట. ఆమె కోసం ఏం చెయ్యడానికైనా సిధ్ధమయిపోయి, రకరకాల విలన్లతో రకరకాల యుధ్ధాలు చేయిట.
సినిమా అంటే 90% ఇవే కథలు. వీటిల్లో కొన్ని అంటే 10% సినిమాలు పాటల వల్లో, కథనం వలనో మనం ఇంప్రెస్ అయి బావుందనుకుంటాం. కానీ అసలు ఇవి తప్ప వేరే కథాంశాలే దొరకవా? జీవితం అంటే అబ్బాయి, అమ్మాయి కలుసుకోవడమో, లేక తప్పనిసరిగా ఎవరినో ఒకరిని ప్రేమించి తీరాలి అనో చూసేవాళ్లకి బోధించే విధంగా ఎందుకిలాంటి సినిమాలు తీస్తున్నారు అని ఎన్నోసార్లు అనుకుంటూంటాను. ఈమధ్యకాలంలో కాస్తంత మార్పు వచ్చి డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు (అంటే భారీ తారాగణం, బడ్జెట్ లు లేనివి) విభిన్నమైన ఇతివృత్తాలతో బావుంటున్నాయి. కానీ కమర్షియల్ ఎలిమెంట్ నుండి తప్పించుకోలేకపోతున్నాయి. ఓ ఫైట్, లేదా బలవంతంగా కథలో దూర్చిన ఐటెమ్ సాంగ్ లేకుండా సినిమా రావట్లేదు. ఇంకా ముఖ్యంగా "స్మోకింగ్ & డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టూ హెల్త్" అంటూనే సిగరెట్టు, మందు సిన్లు లేకుండా అసలు సినిమా ఉండట్లేదు. ఒక తండ్రి పాత్రధారి కొడుకుతో పాటూ తాగడం లాంటి దురదృష్టకరమైన సన్నివేశాలు కూడా కొన్ని సినిమాల్లో చూస్తున్నాం. ఇదేమిటని ఎవరినైనా ప్రశ్నిస్తే ఇవాళ సో కాల్డ్ ఫ్యాషనబుల్, కల్చర్డ్ సొసైటీలో ఇదొక క్యాజువల్ విషయం అని కొట్టిపారేస్తున్నారు. కానీ ఇలా చూపించడం అనేది యువత పై ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగిస్తోందో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇలాంటి కమర్షియల్ మొహమాటాలు లేకుండా చాలా మామూలుగా, నిజాయితీగా ఉన్న సినిమా "నీదీ నాదీ ఒకే కథ".
పరీక్షలతో, పోటీ ప్రపంచంతో పోరాడుతూ స్కూళ్ళలో , కాలేజీల్లో నలిగిపోతున్న విద్యార్థులకు, వారిని స్టేటస్, పెద్ద ఉద్యోగాలు, డబ్బు సంపాదన పేరిట పోటీల చట్రంలో ఇరికించేస్తున్న తల్లిదండ్రులకు ఈ సినిమా పెద్ద కనువిప్పు. జీవితం అంటే ఉద్యోగం, డబ్బు సంపాదన కాదు... సంతోషంగా జీవించడం అని చెప్పే ఒక్క సినిమా ఇన్నాళ్లకు వచ్చిందని చాలా సంతోషం కలిగింది. ఇటువంటి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నందుకు, దానిని న్యాయంగా చిత్రీకరించినందుకు దర్శకుడికి హేట్సాఫ్ !
నాకు బాగా నచ్చిన మరో అంశం ఏమిటంటే, అంతటి సంఘర్షణతో మనసుతో యుధ్ధం చేస్తున్నా, హీరో పాత్ర ఎటువంటి చెడు అలవాట్ల వైపుకీ వెళ్లకపోవడం. తండ్రి 'చావరాదా..' అని తిట్టినా కూడా ఆత్మహత్య లాంటి పిరికి ప్రయత్నాలు చెయ్యకపోవడం. సినిమా హీరోలో హీరోయిజం చూసి , మనలో లేనిదాన్ని ,కావాలనుకునేదాన్ని హీమాన్ లాంటి హీరోలని చూసి హీరో పట్ల ఎడ్మిరేషన్ పెంచుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే మనలో ఉండే బలహీనతలనీ, పిరికితనాన్నీ, పొరపాట్లనీ ఒక హీరోలో చూస్తామో, అప్పుడు మనతో పోల్చుకుంటాం. ఇతనూ మన తోడి వాడే అన్న ఆత్మీయత పెరుగుతుంది. శ్రీ విష్ణు గత సినిమా(మెంటల్ మదిలో) లోనూ , ఈ సినిమా లోనూ కూడా అదే తరహా - సామాన్య మధ్య తరగతి కుర్రాడి పాత్ర - పోషించడం వల్ల, కమర్షియల్ ఇమేజ్ కు భిన్నంగా ఉండడం వల్ల నటుడిగా అతను ప్రేక్షకులని బాగా మెప్పించగలిగాడు. తండ్రి ని ఎలాగైనా కన్విన్స్ చెయ్యాలని, తన పాయింట్ ఆఫ్ వ్యూ ని తండ్రికి అర్థం అయ్యేలా చెయ్యాలని సాగర్ పడిన తాపత్రయాన్ని ఎంతో కన్విన్సింగ్ గా చూపెట్టగలిగాడు. అమేజింగ్ టాలెంట్! కొందరు మంచి నటుల్లా కమర్షియల్ సినిమాల ఉచ్చులో పడకుండా ఉంటే తెలుగు సినిమాల్లో మరో మంచి నటుడు మిగులుతాడు.
ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా కథకు అనుకూలంగా ఉండి, సన్నివేశం తాలుకూ ఫీల్ ని ఇంకా ఎలివేట్ చేసింది. సాగర్ ఇంట్లోంచి వెళ్ళిపోయే దృశ్యంలో ఏ సంభాషణా అవసరం లేకుండా నేపథ్య సంగీతం తో సన్నివేశాన్ని పండించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఏ ఒక్క సన్నివేశం లోనూ కొత్త దర్శకుడు అనిపించలేదు. ఎంతో అనుభవజ్ఞుడైన దర్శకుడి చిత్రం చూసినట్లే అనిపించింది. పాత నలుపు-తెలుపు సినిమాల్లో రమణారెడ్డి తరువాత నెల్లూరు యాసను అంతే చక్కగా ఈ సినిమాలోనే విన్నాననిపించింది. సాగర్ తల్లి, తండి, చెల్లి, హీరోయిన్ లే కాక చిన్న చిన్న పాత్రధారులందరూ ఎవరికి వారే మెప్పించారు.
రియలిస్టిక్ గా ఉన్నా కూడా నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం ఏమిటంటే, హీరో చెల్లెలిని కాలితో తన్ని లేపడం. చాలా ఇళ్ళల్లో అలానే జరుగుతుంది కానీ తెరపై చూపెట్టేప్పుడు అదంత సమంజసం కాదని నాకు అనిపించింది. వయసులోకి వచ్చిన తోడపుట్టినవారిని లేదా కూతురిని ఒక స్త్రీగా గౌరవించాలి. ఎక్కడపడితే అక్కడ తన్నకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
వేణు ఊడుగుల గారు ఇంకెన్నో మంచి, ఉపయోగకరమైన సినిమాలు తీయాలని, తద్వారా యువత ఆలోచనల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేశజనాభాలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. వారు సరైన మార్గంలో నడిస్తే కుటుంబాలు బావుంటాయి. సమాజం బాగుపడుతుంది. తెలుగు ప్రేక్షకులం ఇటువంటి చిత్రాలను ప్రోత్సహిస్తే, మరిన్ని మంచి సినిమాలు మన తెలుగు తెరకు అందించేందుకు దర్శకులకు బలాన్ని అందించినవాళ్ళమౌతాము.