విజయవాడ ప్రయాణం అనేది చాలా సామాన్యమైన విషయం. బెజవాడేమీ అమ్రీకా కూడా కాదు వెళ్లలేకపోవడానికి. కానీ సంసారసాగరంలో పడ్డాకా మళ్ళీ వెళ్ళాడమే కుదర్లేదు. పాతికేళ్ళ పైగా నేను పెరిగి, తిరిగిన నా బెజవాడని వదిలి పన్నెండేళ్ళు అయ్యింది. మధ్యలో ఏవో పనుల మీద రెండుసార్లు వెళ్లాను కానీ అరపూటో, పూటో ఉండి వెళ్ళిన పనయ్యాకా వెనక్కు వచ్చేసానే తప్ప ఉండటానికి వీలవలేదు. ఇన్నాళ్ళకి అనుకోకుండా మొన్న సోమవారం విజయవాడ వెళ్లాను. నెలరోజుల్నుండీ నాన్న అడుగుతూ ఉన్నారు.. "బెజవాడ వెళ్దామని.. మాతో వస్తావా.” అని. అబ్బే నావల్ల కాదు.. ప్రయాణం చెయ్యలేనని చెప్తూ వచ్చాను. ఆదివారం రాత్రి అమ్మ "పెట్టె సర్దుకున్నాం.. ఫలానా ఫలానావాళ్లను కలుస్తామని చెప్తే మాత్రం.. "నేనో.." అన్నను. రాలేనన్నావుగా..మరోసారి వెళ్దువులెమ్మంది అమ్మ. ఆ రాత్రి నిద్రలో.. కలలోనేమో.. బెజవాడ.. చిన్నతనం.. స్నేహితులు..కాలేజీ అన్నీ కనబడుతూ ఉన్నాయి. పైగా తమ్ముడు హాస్టల్ కి వెళ్పోయాకా అమ్మ,నాన్న,నేను ముగ్గురమే దాదాపు పదేళ్ళు కలిసి ఉన్నాం. మా ముగ్గురికీ కలిపి ఎన్నో ఙ్ఞాపకాలు నిండి ఉన్న ఊళ్ళోకీ వాళ్ళిద్దరే వెళ్తుంటే నా మనసు ఊరుకోలేదు. పొద్దున్నే మా పాప రిజల్ట్ తీసుకుని వచ్చాకా పదింటికి మావారిని అడిగాను వెళ్తానని. ఇప్పటికిప్పుడంటే రిజర్వేషనో... అన్నారు. దొరికితేనే వెళ్తానన్నాను. అప్పటికప్పుడు నాకూ, మా పాపకీ ఏ.సి. చైర్ కార్లో రానూ,పోనూ రిజర్వేషన్స్ దొరికేయడం, టికెట్ ఎస్.ఎం.ఎస్ లు నా ఫోన్ లోకి రావడం జరిగిపోయాయి. కానీ తయారవడానికి గంట మాత్రమే సమయం ఉంది! అసలే పొద్దున్నుంచీ ఏదో ఆందోళన.. ఉన్నదాన్ని ఊరుకోక ఏదో ఓ తలనెప్పి తెచ్చుకుంటూ ఉంటాను. ఆ కంగారుతోనే గబగబా వంట చేసి, తిని బయల్దేరాం.
హటాత్తుగా వాతావరణం చల్లబడిపోయింది. కాస్త దూరం వెళ్లగానే పేద్ద వాన మొదలైంది. స్టేషన్ చేరి ట్రైన్ ఎక్కాకా కూడా "ఎందుకు ఇప్పుడు బయల్దేరుతున్నాను.. ఇన్నేళ్ళలో తనని వదిలి ఎప్పుడూ ఏ ఊరు వెళ్లలేదు.. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం సర్దుకుంటోంది.. ఇప్పుడీ ఒంటరి ప్రయాణం అవసరమా.. విజయవాడ అనగానే పరిగెట్టేయడమేనా.." అని గందరగోళపడ్డాను. సీట్లో వెనక్కి వాలి పడుకున్నా, చల్లగాలి తగులుతున్నా ఆందోళన తగ్గలేదు. నా కూడా పట్టుకెళ్ళిన పుస్తకాలు తెరవలేదు కానీ ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామం చదువుకుని, మృత్యుంజయ మంత్రజపం చేసుకున్నాకా మనసు బాగా శాంతించింది. ఈలోపూ తెచ్చుకున్న టైంపాస్ పజిల్స్ అయిపోయి, అమ్మకానికి వచ్చిన టమాటా సూప్, చిప్స్, బిస్కెట్లు అన్నింటినీ కొనిపించేసి, వాట్ మోర్.. ఇంకా ఎంతసేపు.. బోర్.. అంటూ నా బుర్ర తినడం మొదలెట్టింది అమ్మాయిగారు. ఇక ఓ స్టేషన్లో ట్రైన్ ఆగగానే గబగబా దిగి వెళ్ళి ఓ ’టింకిల్’ కొని తెచ్చి, ప్రస్తుతానికి దీనితో కాలక్షేపం చెయ్యి.. విసిగించకని కాస్త గట్టిగానే చెప్పి, కళ్ళుమూసుకుని పడుకున్నా.
చీకటి పడినా అద్దాల కిటికీలోంచి దూరంగా వరుసగా కనబడుతున్న బోలెడు లైట్లు, ఎత్తైన కొండలు కనబడగానే పాపకు చూపెట్టా.. అదిగో మా ఊరు.. అలా లైట్లు కనబడ్డాయంటే వచ్చేసినట్లే! అని. స్టేషన్లో దిగి సంబరంగా చుట్టూ చూశాను. ఏదో అత్తారింటి నుండి పుట్టింటికి వచ్చిన భావన..! ఐదో ప్లాట్ఫారం మీంచి చివరకంటా వెళ్ళి ఏడమపక్కకు తిరిగితే బయటకు దారి ఉందని గుర్తు. అలానే వెళ్ళి ఆటో ఎక్కి అమ్మవాళ్ళు దిగిన హోటల్ రూమ్ కు చేరాను. అది మొదలు నా దిగుళ్ళు, భయాలన్నీ మర్చిపోయాను. మళ్ళీ పన్నెండేళ్ల క్రితపు మనిషినైపోయాను.
నే రైలెక్కాకా అమ్మవాళ్లకి నా ప్రయాణం చెప్పడంతో వాళ్ళ ప్లాన్సన్నీ మారిపోయాయి. తను ముఖ్యంగా కలవాలనుకున్న రజని గారిని కలవడం మర్నాటికి వాయిదా వేసారు నాన్న. నేను కాస్త ఫ్రెష్ అయ్యాకా భట్టుమావయ్యగారి ఇంటికి బయల్దేరాం. చీకట్లో ఇల్లు కాస్త వెతుక్కున్నాం కానీ చెట్లను బట్టీ నాన్న గుర్తుపట్టేసారు. భట్టుమావయ్యగారిలో పెద్దగా మార్పేమీ లేదు. సినిమాల్లో ఓల్డ్ అయిన హీరో/హీరోయిన్ తల్లి జుట్టుకు కాస్త(ఓ పాయకు) తెల్లటి రంగు వేసినట్లు.. జుట్టు రంగులో కాస్తంత మార్పు తప్పిస్తే కృష్ణకుమారక్క కూడా అలానే ఉంది. డిజిగ్నేషన్ ప్రకారం ఇప్పుడు తను ఆకాశవాణి స్టేషన్ డైరక్టర్ అయిపోయింది కానీ నాకు మాత్రం మా చిన్నప్పటి కృష్ణకుమారక్కే! మా చిన్నప్పుడు తను యూనివర్సిటీలో చదువుకునేప్పటి నుండీ అక్కా అనే పిలవడం అలవాటు. ఇంటర్నెట్ నుండీ గుమ్మడి వడియాల దాకా కబుర్లయ్యాకా, ఫలహారాలయ్యాకా, "తనని కూడా తీసుకువచ్చి మిమ్మల్ని, ఇంటినీ, పుస్తకాలనీ చూపెట్టాలని కోరిక.. మళ్ళీ తప్పకుండా వస్తామని" భట్టుమావయ్యగారితో చెప్పి శెలవు తీసుకుని, బరువైన బహుమతులతో వెనక్కు బయల్దేరాం.
మర్నాడు పొద్దున్నే తయారయి రజనిగారి ఇంటికి వెళ్ళాం. ఈమధ్యన చాలామందిని గుర్తుపట్టట్లేదని చెప్పారు. సో, గుర్తు పడతారో.. పట్టరో అనుకుంటూ వెళ్ళామా.. గుమ్మంలో నాన్న నించోగానే, తన పక్కన ఉన్న కృష్ణ (కూడా ఉంటూ వారికి ఆత్మీయుడైపోయిన రజని గారి సహాయకుడు) కి "ఇతను శ్రీరామ్మూర్తి.. ace announcer!" అని చెప్పారు. తర్వాత అమ్మను చూపెట్టి "ఈవిడ వాళ్ళావిడ.. సీత.. తను ఆశా.. వాళ్ళమ్మాయి(నేను). నా పాట వాళ్ళింట్లో అమ్మాయిగా పుట్టింది." అని చెప్పారు. నన్నేమో మా అమ్మాయి పేరడిగారు. అప్పుడు నాన్న "ఆశా నా ప్రాణా సఖీ" పాట గురించి కృష్ణకు చెప్పారు. రజని గారు పాడిన ఆ లలితగీతం నాన్నకు చాలా ఇష్టం. రజని గారిపై ఎంతో ప్రేమతో, నే పుట్టిన తరువాత నాన్న ఆ పాట నా పేరుగా పెట్టుకున్నారు.
ఇంతకీ అప్పుడు కృష్ణ ఏమో రజనిగారితో "అయితే ఆ పాట పాడండి.." అనడిగాడు. వెంఠనే పాట మొత్తం పాడేసారు రజనిగారు. మధ్యలో ఓ చరణం తడబడితే కృష్ణ వాక్యాలందించాడు. నేను ఆశ్చర్యపోతుంటే అతనే చెప్పాడు "రోజూ పొద్దున్నే వాకింగ్ అయ్యాకా ఓ గంటసేపు పాటలు పాడతారు అయ్యగారు. వారితో పాటూ నన్నూ పాడమంటారు. అలా నాకూ వచ్చేసాయండి" అని! "ఆహా..ఎంత అదృష్టవంతుడివయ్యా" అన్నాను. "నిజమేనండి.. ఇంత గొప్పవారితో, మంచివారితో గడపగలగడం ఎంతో అదృష్టం" అన్నాడతను. అక్కడ ఆయన చుట్టూ ఉన్న హెల్పర్స్ అంతా కూడా ఆయనను చిన్నపిల్లడిని చూసుకుంటున్నట్లు ఎంతో ప్రేమగా చూడడం చాలా ఆనందాన్ని కలిగించింది. గదిలో సుభద్రమ్మగారి(రజనిగారి అర్థాంగి) ఫోటోలు చూసి ఆవిడను తల్చుకున్నాం. మహాగొప్ప ఇల్లాలు ఆవిడ. రాత్రి ఎనిమిదింటికి వెళ్ళినా తినడానికో, తాగడానికో ఏదో పెట్టకుండా పంపేవారు కాదు. ఎన్నిసార్లు వెళ్ళనీ ఎవరినీ ఉత్త చేతులతో అస్సలు పంపేవారు కారావిడ. రజనిగారు ఇటీవల అందుకున్న పురస్కారాలన్నీ చూపించాడు కృష్ణ. ఆ చిన్న గదిలో, ప్రశాంత వాతావరణంలో చుట్టూరా 'Ulysses' మొదలు 'సామల సదాశివంగారి స్మృతిసంచిక' వరకూ రకరకాల పుస్తకాలతో Walden దగ్గర Thoreauలా ఉన్నారీయన అనిపించింది. ఎక్కువగా పుస్తకాలు చదువుకుంటూంటారుట ఇప్పుడు. ఇంతలో వారబ్బాయి హేమచంద్రగారు వచ్చారు. నాన్నవద్ద ఉన్న రజనిగారి రేడియో కార్యక్రమాలు, పాటలూ, సంగీత రూపకాలు అన్నీ కలిపి ఓ ఎనిమిదిగంటల పాటు వచ్చే మెటీరియల్ అంతా అన్నయ్యతో సీడీలు చేయించి తెచ్చి, ఆ కాపీలు వారబ్బాయికి ఇచ్చారు నాన్న. హేమచంద్రగారు ఫేస్ బుక్ లో నా బ్లాగ్ అప్డేట్స్ అన్నీ చూస్తూంటారు కాబట్టి నేను బాగానే తెలుసు. ఈ అమ్మాయి రచయిత్రి.. బాగా రాస్తుందని రజనిగారికి చెప్పారు. ఆయన కూడా బరువు చేతులతోనే పంపించారు మమ్మల్ని! నాకు సుభద్రమ్మగారే గుర్తుకొచ్చారు. వచ్చేసేప్పుడు "మళ్ళీ వచ్చే పుట్టినరోజుకి తప్పకుండా రమ్మని" నాన్నకు చెప్పారు రజని గారు! వారిద్దరిదీ ఓ ప్రత్యేకమైన అనుబంధం..! భారమై, అంతలోనే ఆనందభరితంగా మారిన మనసులతో ముగ్గురం రజనిగారి వద్ద వీడ్కోలు తీసుకున్నాం. "అంత గొప్ప మనిషి నన్ను గుర్తు పట్టారు..ఇది చాలీ జీవితానికి" అన్నాను బయటకు వచ్చాకా అమ్మానాన్నలతో.
అక్కడనుండి మరొకరి ఇంటికీ వెళ్ళి హోటల్ కు చేరాం. ప్రయాణం బడలిక, తిరుగుడికి నాన్న బాగా అలసిపోయి నీరసపడిపోయారు. మనసు ఉత్సాహంగా ఉన్నా వయసు, శరీరం సహకరించాలి కదా.. అందుకే మిత్రులందరూ ఇంటికి ఆహ్వానించినా రెస్ట్ గా ఉండాలనే హోటల్లో దిగారు ఆయన. భోంచేసాకా అమ్మ,నాన్న కునుకుతీస్తూంటే, ఊరికే ఉండలేక పాపను తీసుకుని బీసెంట్ రోడ్డు చూసి వస్తానని బయల్దేరా!
బీసెంట్ రోడ్ కీ నాకూ బోలెడు స్నేహం. రామనవమి పందిళ్ళు వేసిన ఆ వీధిలో నడుస్తూంటే అసలు ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. చెప్పినా అక్షరాలు సరిపోవు నా ఆనందాన్ని వర్ణించడానికి. పాపకి ఆ షాపులూ, మేం తిరిగిన గల్లీలు అవీ చూపెడుతూ, వీధి మధ్యలో ఉండే బుల్లి రాములవారి గుడి చూపెట్టి అక్కడ దణ్ణం పెట్టుకుంటూంటే కళ్ళు చమర్చాయి...! బీసెంట్ రోడ్ కు వచ్చినప్పుడల్లా అమ్మ ఆ బుల్లి గుడి దగ్గర ఆగి దణ్ణం పెట్టుకునేది. నేనూ అమ్మ వెనకాల..! ఇన్నేళ్ల తరువాత నేను మళ్ళీ ఆ రామనవమి పందిళ్ళ క్రింద.. అదే రాములవారి ముందు నా కూతురితో నిలబడి ఉన్నాను...