సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, March 5, 2015

Millet Fest - 2015


వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు గృహవిఙ్ఞాన విభాగం.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్న చిరుధాన్యాల ప్రదర్శన ఈ ఏడు కూడా క్రిందటి నెలాఖరులో జరిగింది. "Millet Fest 2015" ప్రకటన ఆఖరిరోజున అనుకోకుండా పేపర్లో చూసి అప్పటికప్పుడు బయలుదేరాం.  ఆ రోజు పేపర్ చూడకపోతే అదీ మిస్సయిపోదును. ఇది నాలుగవ ప్రదర్శనట. 2013 Fest కబుర్లు Millet Fest - 2013 లో రాసాను. నిరుడు టపా రాయలేదు కానీ వెళ్ళాను. ఈమధ్యన ఒంట్లో బాలేక ప్రతి ఏడూ వెళ్ళే హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ , మరికొన్ని పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కూడా మిస్సయిపోయాను..:(  ఈ Millet Fest మాత్రం ఎలాగైనా చూడాలని బయలుదేరాను. ఆరోగ్యకరమైన, ఉపయోగకరమైన విషయాలు తెలుస్తాయి +  చిరుధాన్యాలతో చేయదగిన కొత్త రెసిపీస్ తెలుస్తాయని నా ఆశ. నా అంచనా తప్పలేదు. మరిన్ని కొత్త విషయాలు తెలిసాయి. 

ఈ ప్రదర్శన వివరాలు తెలిపే వెబ్సైట్ కూడా ఉందిట.. మళ్ళీ ఏడు ఎవరైనా ఈ ప్రదర్శనకు వెళ్ళాలనుకుంటే ఈ వెబ్సైట్ చూస్తూండండి.. ప్రదర్శన తారీఖులు తెలుస్తాయి. 



ఈసారి చివరిరోజు ఆదివారం అవడంతో సందర్శకులు బాగా ఉన్నారు. కొనుగోళ్ళు చూస్తూంటే చిరుధాన్యాల పట్ల ఆసక్తి కూడా బాగా పెరిగినట్లు అనిపించింది. ఈ రోజుల్లో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు కదా! ఇదీ ఒకందుకు మంచిదే. ఏ పదార్థాలు ఎక్కువ తినాలో, ఏది మానేయాలో తెలుసుకోవడం అనేది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఎలా ఉంచుకోవాలో తెలియడమే. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది 'ఆరోగ్య శాఖ' మరియు 'వ్యవసాయ విశ్వవిద్యాలయం' వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శన కాబట్టి ఇందులో పెట్టే వస్తువులు రిలయబుల్ మరియు వారు చెప్పే విషయాలు కూడా నమ్మదగినవీనూ!

మిల్లెట్స్ తో చేసిన వంటలు ఉంచిన ఫుడ్ కోర్ట్ లో కూడా బాగా జనాలు ఉన్నారు. అన్ని పదార్థాలూ బాగా సేల్ అవడం చూసి సంతోషం కలిగింది. వాటిల్లో నేనిదైవరకూ బ్లాగ్ లో రాసిన ఒక హెల్త్ డ్రింక్ "అమృతాహార్" పేరుతో పెట్టారు. ఇంకా రాగి జావ , తేనె కలిపిన సబ్జా గింజల నీరు , సజ్జ ఉప్మా, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి ఫ్రూట్ పంచ్, జొన్న మంచూరియా, జొన్న నూడుల్స్.. మొదలైన ఎన్నో రకాల వంటకాలు అమ్మారు. ఇవన్నీ చూసి నాకు కొత్త రెసిపీలకి బోలెడు ఐడియాలు వచ్చాయనేసరికీ పాపం అయ్యగారి ఫేస్ లో కలర్స్ మారాయి :-)


స్టాల్స్ లో ఒకచోట జొన్న రొట్టెలు తయారుచేసే మషీన్ ఒకటి పెట్టారు. అంటే అది చిన్న పరిశ్రమకు ఉపయోగపడేలాంటి పెద్ద పరికరం. భలేగా జొన్న రోటీలు వత్తేస్తోంది ఆ మషీన్.





పిల్లలు సరదాగా స్పూన్ కూడా తినేసేలాగ బియ్యం, జొన్నలు, గోధుమలు, వాము, జీలకర్ర, ఉప్పు మొదలైన వాటితో చేసిన ఈటబుల్ స్పూన్స్ ఒకచోట పెట్టారు. అవి బాగా అమ్ముడౌతున్నాయి. 



జొన్న, రాగి బిస్కెట్స్, లడ్డూలు మురుకులు, టేస్టీ బైట్స్ కాక ఒక చోట మొత్తం ఆరు రకాల మిల్లెట్స్ తో చేసిన లడ్డూస్ అప్పటికప్పుడు చేసి అమ్ముతున్నారు.


ఇంకా.. విజయవాడ కు చెందిన ఒక స్టాల్ నన్నాకర్షించింది. (మా బెజవాడ కదా :)) ఆ వివరాలు..



అన్ని చిరుధాన్యాల్లోకెల్లా ఎక్కువ ఫైబర్ కొర్రల్లో(foxtail millet) ఉంటుందని తెలిసాకా ఈమధ్యన నేను కొర్రలు, కొర్ర బియ్యం కూడా వాడకం మొదలుపెట్టాను. వీటిల్లో ఎర్ర కొర్రలు, తెల్ల కొర్రలు రెండు రకాలు ఉంటాయిట. ఒక స్టాల్ లో దాదాపు కొర్ర బియ్యం లాగానే ఉన్న వరిగలు(proso millet) అమ్ముతూంటే అదో పేకెట్ కొన్నాను. ఏ ఉప్మా ప్రయోగమో చేయచ్చని.







ఒక స్టాల్ లో అన్నంలో కులుపుకునే ఉసిరి పొడి, కాకర పొడి, ఒక హెర్బల్ టీ పౌడర్ కొన్నాను. మంజిష్ఠ, ఏలకులు, జాజికాయ, శొంఠి మొదలైన వాటితో తయారుచేసిన ఈ టీ పౌడర్ కాస్తంత మామూలుగా పెట్టుకునే టీలో కలుపుకోవచ్చు లేదా విడిగా ఈ పౌడర్ తోనే టీ పెట్టుకోవచ్చుట. అధిక ఫైబర్ మరియు Omega 3 fatty acids ఎక్కువగా ఉండే  Flax seeds(అవిసెలు) ఉపయోగాలు తెలిసాకా కొన్ని నెలల క్రితం ఫ్లాక్స్ సీడ్స్ కొన్నా కానీ వాటితో ఏమీ చెయ్యలేదు. కర్వేపాకు పొడిలాగ చేయచ్చు అని ఎక్కడో చదివాను. ఒక చోట ఆ పొడి అమ్ముతుంటే అది కొన్నాను కానీ తర్వాత మా అన్నయ్యతో ఈ సంగతులన్నీ చెప్తుంటే మరో స్టాల్ లో ఉన్న ఒక రీసర్చ్ స్టూడెంట్ విని, మమ్మల్ని పిలిచి, "సారీ ఫర్ ఓవర్ హియరింగ్..అన్చెప్పి, ఈ పొడులూ అవీ వేస్ట్.. దానివల్ల అందులోని పోషకాలన్నీ పోతాయి. ఫ్లాక్స్ సీడ్స్ లోని పోషకాలు డైరెక్ట్ గా శరీరానికి అందాలంటే ఒక్కసారి జస్ట్ డ్రైగా టాస్(toss) చేసి అలానే తినేసేయండి అదే బెస్ట్ అని  చెప్పారు. నిజానికి ఫ్లాక్స్ సీడ్స్ ఉత్తినే తిన్నా బానే ఉంటాయి.


మరో చోట పచ్చి అరటికాయ పొడి అమ్ముతుంటే కొన్నా. ఏక్చువల్ గా అది ఒకటే పేకెట్ సాంపిల్ గా పెట్టారుట. ఆ స్టాల్లో ఉన్న ఒక పరిశోధకుడు(కొంచెం పెద్దాయనే) చెప్పిన విషయం ఏమిటంటే అరటి పండులో ఉన్న షుగర్ అరటి కాయలో ఉండదుట. చాలా పరిశోధనల తరువాత ఇటీవలే అరటికాయను డయాబెటిక్ పేషంట్స్ కూడా తినచ్చని నిర్ధారించారుట. పచ్చి అరటికాయలో ఉండే స్టార్చ్ మంచిదిట. పచ్చి అరటి కాయ నుంచి చేసిన ఈ పొడిని కూరల్లో, సూప్స్ లో, చపాతీ పిండిలో కలుపుకోవచ్చుట. ఇంకా అది ఏమేమి చేస్తుందో.. అలా బోలెడు ఉపయోగాలు చెప్పాకా మాకు కావాలని అడిగితే ఉన్న ఆ ఒక్క పేకెట్ అమ్మేసారు ఆయన. మార్కెట్లోకి వస్తుందన్నారు త్వరలో. ఎప్పుడు వస్తుందో మరి.

ఇదివరకూ కొనని రెండు రెసిపీ బుక్స్, ఎరువు ఎలా తయారు చేసుకోవాలో,  గార్డెన్ కేర్ గురించిన పుస్తకమూ కొన్నాను.





ఇంకా ఊళ్ళో ఉన్న రెండు మిలెట్ ఫుడ్ కోర్ట్స్ గురించి తెలిసింది. ఎప్పుడన్నా వెళ్లచ్చు..




కేవలం సైంధవ లవణం(rock salt) అమ్ముతున్న ఒక స్టాల్ ఉంది. అందులో ప్రదర్శనకు ఉంచిన పెద్ద ఉప్పు గడ్డ భలే ఉంది. ఈ ఉప్పు ఉపయోగాలు క్రింద కాగితంలో...





ఈ విధంగా సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందుకుని సజ్జల ఉప్మా, జొన్న మంచూరియా, జొన్న నూడుల్స్, జొన్న సలాడ్ లు తిని, అమృతాహార్ జావ తాగి మేమూ, అన్నయ్య ఇళ్ళదారి పట్టాం.


ప్రదర్శన తాలూకూ మరిన్ని ఫోటోలు:
http://lookingwiththeheart.blogspot.in/2015/03/millet-fest-2015.html