నిన్న రాత్రి చూసిన ఈ సినిమా పూర్తయ్యేసరికీ విషయం తక్కువ హంగామా ఎక్కువ అనిపించేట్లు ఉంటున్న ఈ కాలపు సినిమాల మధ్యన ఈ చిత్రం నిజంగా "...వనంలో తులసి మొక్క" అనిపించింది. ఇటువంటి మణిపూసని మనకందించిన దర్శకుడు శరత్ కతారియాను అభినందించి తీరాలి. ఈ చిత్రం యాష్ రాజ్ ఫిల్మ్స్ నుండి రావడం గొప్ప ఆశ్చర్యం! ఆ ప్రొడక్షన్ హౌస్ అదృష్టం. చిత్రాన్ని గురించి ఇంకేమైనా చెప్పేముందు ఈ పాట వినండి(చూడండి)..
ఊ..చూసేసారా?! అమేజింగ్ కదా అసలు. పాట మొదలవగానే అసలు ఏదో లోకంలోకి వెళ్పోయాను నేనైతే. లుటేరా లో "సవార్ లూ.." పాడిన అమ్మాయి మోనాలీ ఠాకుర్ ఈ పాట పాడింది. ఆ పాట కన్నా ఈ పాటలో క్లాసికల్ బేస్ ఉన్న మోనాలీ ట్రైన్డ్ వాయిస్ బాగా తెలిసింది. ట్యూన్ అలాంటిది మరి. చాలా రోజులకి అనూ మాలిక్ కంపోజ్ చేసారు. ఇదే పాటకు మేల్ వర్షన్ Papon అనే పేరుతో ప్రసిద్ధుడైన గాయకుడు అంగరాగ్ మహంతా పాడారు. మనసుని సున్నితంగా తట్టే ఈ పాటకు సాహిత్యాన్ని వరుణ్ గ్రోవర్ అందించారు. నా దృష్టిలో "ఎక్స్ట్రార్డినరీ" పదం ఒక్కటే ఈ పాటకు, అది తయారవడానికి కారణమైనవారందరికీ సమంగా సరిపోతుంది. ప్రముఖ గాయకుడు కుమార్ సానూ కూడా చాలారోజులకి ఒక పాట పాడి, సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.
కుమార్ సానూ పాట:
ఇంతకీ ఇదెలాంటి సినిమా అంటే ఎలా చెప్పాలి...
తావి లేని కనకాంబరాల మధ్యన గుబాళించే మల్లె మొగ్గలా..
చుక్కల మధ్య మెరిసిపోయే చందమామలా..
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందమైన పువ్వులా..
ఉంది సినిమా. డెభ్భైలు, ఎనభైల్లో బాలీవుడ్ లో తయారైన మధ్యతరగతి కథలు, తళుకుబెళుకులు లేని అతి మామూలు సదాసీదా కామన్ మేన్ జీవిత కథలతో తయారైన చిత్రాలు ఒక్కసారిగా గుర్తు వచ్చాయి. సినిమాల్లో, తద్వారా మనుషుల్లో పెరిగిపోయిన అసహజత్వాలనీ, ఆర్భాటాలనీ పక్కన పెట్టి ఇలాంటి డౌన్ టూ ఎర్త్ సినిమాను తీయాలనే ఆలోచనకు గొప్ప ధైర్యం కావాలి. ఇమేజ్ నూ, పాపులారిటీను పక్కన పెట్టి తండితో ప్రాక్టికల్ గా చెప్పు దెబ్బలు తినే ఒక నిరాశాపరుడైన, పిరికి అబ్బాయి పాత్రను ఒప్పుకున్నందుకు హీరో ఆయుష్మాన్ ఖురానా మరింత నచ్చేసాడు. "విక్కీ డోనర్" లో కన్నా ఎక్కువగా! (ఒక నటుడిగా మాత్రమే :))
చిత్రకథ తొంభైల కాలం లాంటిది. ఆ కాలం నాటి హిట్ హిందీ చిత్ర గీతాలు తెలిసిన వాళ్ళు, 'శాఖ ట్రైనింగ్' గురించి తెలిసినవాళ్ళూ సినిమాని బాగా ఎంజాయ్ చెయ్యగలరు. బాగా కనక్ట్ అవుతారు. గాయకుడు "కుమార్ సానూ" వీరాభిమాని హీరో. పదవ తరగతి రెండుసార్లు ఫెయిలయి, హరిద్వార్ లో తండ్రి నడిపే ఒక కేసెట్ రికార్డింగ్ సెంటర్ లో పాటలు రికార్డ్ చేసే పని చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల, తండ్రి బలవంతం వల్ల బీఎడ్ చదివి టీచరవబోతున్న అమ్మాయిని ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటాడు. గుడిలో జరిగిన పెళ్ళి చూఫుల్లోనే కాస్త ఎక్కువ బొద్దుగా ఉన్న పెళ్ళికూతురు నచ్చదతనికి. ఒక అమ్మాయి బీయిడీ చదువుకుంది.. 'టీచర్ అవ్వాలన్నది ఆమె చిన్ననాటి కల' అన్న సంగతి ఇంకా నచ్చదతనికి. మరి తను 10th ఫెయిల్ కదా! చాలా అయిష్టంగానే ఒక సామూహిక వివాహవేదిక మీద సంధ్య వర్మ(భూమీ పెడ్నేకర్) ను పెళ్ళాడతాడు ప్రేమ్ ప్రకాష్ తివారీ(ఆయుష్మాన్ ఖురానా). అదిమొదలు తన అయిష్టాన్నీ ప్రకటించడానికి అతగాడు, భార్యగా తన స్థానాన్ని కాపాడుకోవాలని సంధ్య చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏదీ కలిసిరాక ఒకానొక అవమానకరమైన సందర్భంలో అభిమానం దెబ్బతిని అత్తవారిల్లు విడిచి వెళ్పోయి, తర్వాత విడాకుల నోటీసు పంపిస్తుంది సంధ్య. విడాకుల మంజూరుకు ముందు ఓ ఆరునెలలు కలిసి ఉండమని ఆ జంటను కోర్టు ఆదేశిస్తుంది. ఈ ఆరు నెలల్లో ఏమౌతుంది? ఉత్తర దక్షిణ ధృవాల్లా మారిపోయిన ఆ భార్యాభర్తలు కలుస్తారా? అన్నది మిగిలిన చిత్ర కథ.
ఈ ఇద్దరి తర్వాత హీరో తండ్రి పాత్రధారి సంజయ్ మిశ్రా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఇంతకు ముందు " jolly LLB" లో హవాల్దార్ పాత్రలో అలరించిన ఈ నటుడి ప్రతిభకు తగ్గ పాత్రలు ఇంతవరకూ ఎక్కువ దక్కలేదనే చెప్పాలి. హీరో ఇంట్లో ఉండే అతని మేనత్త పాత్ర కూడా గుర్తుండిపోతుంది. ఒక ఉదయాన ఆవిడ మరిది నుండి ఫోన్ వచ్చే సన్నివేశం చాలా టచ్చింగ్ గా ఉంది. హీరోయిన్ తల్లిగా వేసినావిడ చిన్నప్పుడు దూరదర్శన్లో ఫేమస్ అయిన "బునియాద్" సీరియల్లో ఉన్నారని గుర్తు. ఇక పదవ తరగతి చదివే సంధ్య తమ్ముడు చెప్పే డైలాగ్స్ భలే నవ్వు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్స్ ఫ్యామిలీస్ రెండింటిలో అందరు కుటుంభ సభ్యుల మధ్యన అన్యోన్యత, దగ్గరతనం బాగా చూపించారు. ఫ్యామిలీ కోర్ట్ లో కుటుంబసభ్యులందరి మధ్యా వాగ్వివాదాలయ్యే సీన్ కూడా భలే నవ్వు తెప్పిస్తుంది. కోర్టులో కలవగానే వియ్యపురాళ్ళిద్దరూ కాగలించుకుని దు:ఖపడే సీన్ కదిలిస్తుంది.
తొంభైల్లో పాపులర్ పాటల ద్వారా భార్యాభర్తలు తమ నిరసనలు వ్యక్తం చేసుకునే సీన్ సినిమాకే హైలైట్. హాల్లో అంతా పొట్ట చక్కలయ్యేట్టు నవ్వులే నవ్వులు. ఆ పాటలు తెలిసినవాళ్ళు ఆ సీన్ చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ సాంగ్స్ అవన్నీ కూడా. ప్రేమ్ గదిలో చిందర వందరగా పడిఉన్న కేసెట్ల్స్ ద్వారా అతడి జీవితాన్ని, తాను వచ్చాకా అవి సర్దిన సంధ్య మనస్తత్వాన్నీ సింబాలిక్ గా బాగా చూపెట్టారు. చివర్లో భార్యను ఎత్తుకు పరిగెత్తే పోటీ కూడా భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక అనిపించింది. ఈ పోటీలో బరువుని ఎత్తడం అనే విషయం కన్నా ఇద్దరి మధ్యన ఉండే సంయమనమే విజయాన్ని ఇస్తుంది. పోటీ అయిపోయాకా ఆమెని దింపకుండా ఇంటిదాకా తీసుకుపోయే సీన్ నాకు బాగా నచ్చింది.
వాళ్ళ మధ్యన నిశ్శబ్దం,
వాళ్ల కన్నీళ్ళూ,
వారి వారి స్థానాల్లో వారు కరక్టేననిపించే సందర్భాలూ,
రిక్షలో ప్రయాణాలు,
హరిద్వార్,
ఆ పాత పట్టణపు వాతావరణం,
చిత్ర సన్నివేశాల వెనుక మౌనంగా ప్రవహిస్తూ కనబడే పవిత్ర గంగానది,
ఓ పాటలో కనబడే లక్ష్మణ్ ఝూలా,
వేలితోనో పెన్ను తోనో పాడయిన కేసెట్ లోకి టేప్ చుట్టే సన్నివేశం,
ఇవన్నీ కూడా మనల్ని రకరకాల పాత ఙ్ఞాపకాల్లోకి తీశుకువెళ్ళి సినిమాతో బాగా కనక్ట్ అయ్యేలా చేస్తాయి.
మరో విశేషం ఇటాలియన్ కంపోజర్ Andrea_Guerra అందించిన అద్భుతమైన నేపధ్య సంగీతం. నటీనటుల భావావేశాల ప్రవాహంలో మనల్నీ కొట్టుకుపోయేలా చేస్తుందీ సంగీతం.
చివరిగా ఏం చెప్పనూ... విభిన్నతకు నాంది పలికే ఓ మంచి నిజాయితీ నిండిన ప్రయత్నమీ చిత్రం. వాస్తవికతకు దగ్గరగా ఉండే ఇలాంటి అతి మామూలు సినిమాలు ఇంకా ఇంకా రావాలంటే మనం ఇలాంటి సినిమాలని ఆదరించాలి. చివరలో డ్యూయెట్ అనవసరం అనిపించింది. అంత చూసే ఓపిక మన జనాలకి ఉండదు కదా! షూట్ చేసేసిన పాటను మధ్యలో పెట్టే అవకాశం లేక చివరలో ఇరికించి ఉంటారనుకున్నాం.
చిత్రంలో నాకు బాగా నచ్చిన పాట "Moh Moh Ke Dhage" మేల్ వర్షన్తో post పూర్తి చేస్తాను.
*** ***