సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, December 3, 2014

గులాబీల గుబాళింపు.. 3rd Rose Convention at HICC







మొన్న ఆదివారం పొద్దున్నే న్యూస్ పేపర్లో "రోజ్ కన్వెన్షన్" పేరుతో గులాబీల ప్రదర్శన తాలూకూ ఫోటోలు కనబడ్డాయి. ఆదివారంనాడు మేం తెప్పించుకునే నాలుగు పేపర్లలోనూ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వివరాలతో ఆర్టికల్ ఏమీ లేదు :( నెట్లో వెతికినా టైమింగ్స్ కాదు కదా, ఏ వివరాలూ కనబడలేదు. ఆఖరికి నోవొటెల్ హోటల్ లో ప్రదర్శన జరుగుతోంది అన్న వివరం ఒక్కటీ పట్టుకుని, ఆ అడ్రస్ వెతుక్కుంటూ బయల్దేరాం. పొలోమని మా ఇంటి నుండి రకరకాల వాహనాలు మారి ఓ ముఫ్ఫై ఐదు, నలభై కిలోమీటర్లు అలా.......ఆ..... వెళ్పోతే ఉందన్నమాట ఈ హోటేలు ఉన్న ప్రదేశం. 

రెండూ బస్సులు మారాకా మధ్యలో మూడో చోట, శుక్రవారం నాడు సిటీలో రిలీజ్ చేసిన ఎనభై వోల్వో ఏసి బస్సుల్లో ఒక బస్సు ఎక్కే అవకాశం అదృష్టవశాత్తూ  రాబట్టీ బ్రతికిపోయాం. ఎండలో అలసట లేకుండా Hitex Exhibition center చేరాం. ఆ లోపల మరో రెండు, మూడు కిలోమీటర్లు వెళ్ళాకా ఈ నోవోటెల్ హోటేలు ఉంది. షేర్ ఆటో అబ్బాయి సగం దాకా తీస్కెళ్ళి ఆపేసాడు. ఇక వాల్కింగ్ చేసుకుంటూ డెస్టినేషన్ చేరాం. మధ్యలో ఎక్కడా ఓ పోస్టర్ గానీ, ప్రదర్శనశాలకు డైరెక్షన్ చెప్తూ వివరం గానీ లేవు. అసలీ ప్రదర్శన ఉన్నట్లే అక్కడ దారిలో కనబడ్డ కొందరికి తెలీదు. ఇదేదో కారుల్లో వచ్చే పెద్ద పెద్దోళ్ళందరికీనేమో మనలాంటి సామాన్యులకి కాదేమో.. అనుకున్నాం. కానీ ఆ దారిలో నడక మాత్రం చాలా బావుంది. ఎండలో రోడ్డుకిరుపక్కలా నీడనిచ్చే చెట్లు ఆహ్లాదాన్ని కలిగించాయి. హోటల్ దగ్గర్లోకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైన గులాబీ రంగు కాగితంపువ్వుల కుండీలు ఎంత బావున్నాయి.


ఆ పక్కన మహర్షి విద్యాలయం ప్రాంగణం కనబడింది. కుడిపక్కన ఉన్న ఒక ఫంక్షన్ ప్లేస్ లో ఏదో పెళ్ళికి స్టేజ్ అలంకరణ జరుగుతోంది. క్రోటన్ మొక్కలు, బంతి మొక్కలు వేనుల్లోంచి దింపుతున్నారు.




గులాబీ ప్రదర్శన ఎంట్రీ ఫ్రీ నే! పెట్టినా కొనేవాళ్ళం.. ఇంత దూరం వచ్చాం కదా మరి :) ఎంట్రన్స్ లో వేరే దారి నుండి వస్తూ వస్తూ ఉన్న కొందరు జనాలు కనబడ్డారు. పర్వాలేదు జనం ఉన్నారు అనుకున్నాం. హాలు బయట పెద్ద పెద్ద కుండీల్లో అలంకరించిన గులాబీలు మనసు దోచేసాయి. లోపలికి వెళ్ళగానే ఎదురుగా తేబుల్స్ మీద చిన్న చిన్న గాజు సీసాల్లో పెట్టిన రంగురంగుల అందమైన చిన్నా,పెద్దా గులాబీ పువ్వులు రారామ్మని స్వాగతం చెప్పాయి. 




పెద్దగా బాగున్నవి, మంచి ఆకృతిలో ఉన్న గులాబీలకూ ఫోటోలు తీసుకుంటూ ఒక్కో టేబుల్ నుండీ కదులుతున్నాం.. ఇంతలో హాలు మధ్యలో వేల గులాబీలతో నిర్మించిన గులాబీ చార్మినార్ కనబడింది. అందరూ వంతులవారీగా ఫోటోలు తీస్కుంటూన్నారు అక్కడ నిలబడి. ఎందుకనో అది కట్టి అంత అందమైన గులాబీలన్నింటినీ వృధా చేసారనిపించింది. 







ప్రదర్శనలో అన్నింటికన్నా బాగా నచ్చినవి.. చిన్న చిన్న కుండీల్లో ఉన్న గులాబీ వృక్షాలు. అవును వృక్షాలే అవి. సుమారు ఆరడుగుల ఎత్తుకు ఎదిగి చెట్టు నిండా పాతిక, ముఫ్ఫై దాకా పెద్ద పెద్ద గులాబీ పువ్వులు ఉన్నాయి. అలాంటివి ఒక పది రంగుల గులాబీ పువ్వుల కుండీలు మొత్తం ప్రదర్శనకు ఆకర్షణ అనిపించాయి. ఆ చెట్లకు ఏవో పేర్లు కూడా ఉన్నాయి. పువ్వులో రకాలన్నమాట.








ఇంకా ఇకబన, మొరిబన మొదలైన వివిధ రకాల స్కూల్స్ వాళ్ళు ఎరేంజ్ చేసిన ఫ్లవర్ ఎరేంజ్మెంట్ పాట్స్ హాలు చుట్టూతా పెట్టారు. కాంపటీషన్ పెట్టినట్లున్నారు..ప్రైజెస్ రాసి ఉన్నాయి కొన్నిటిపైన. పింగాణీ
జాడీలు, ఇత్తడి బిందెలు,పళ్ళాలూ కూడా ఇలా ఫ్లవర్ ఎరేంజ్మెంట్స్ లో వాడడం కొత్త ఐడియానిచ్చింది నాక్కూడా. ఇంట్లో వాడకుండా పైన పెట్టేసిన పెద్ద పెద్ద పాతకాలం జాడీలు ఇకపై ఇలా వాడచ్చని ఆనందం కలిగింది.










ఒకచోట ఓ మెంబర్ మరెవరితోనో బాధతో హిందీలో అంటున్న మాటలు వినబడ్డాయి.. "బయట అవన్నీ పెట్టదన్నాను.. మీరెవరూ వినలేదు..అందరూ పువ్వులు తీసుకుపోతున్నారు.." అని! బయట వెళ్పోయేప్పుడు చూశాము.. కొందరు వెళ్పోతున్నవాళ్ళు వాజుల్లోంచి యద్ధేచ్ఛగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా తీసుకుని పోతున్నారు :( ఎంత శ్రమపడి వాళ్ళంతా పాపం వాటిని ఎరేంజ్ చేసి ఉంటారు.. ఎందుకని జనాలకు కొన్ని విషయాల్లో మేనర్స్, సెన్స్ ఉండవు..? అందమైన వాటిని సొంతం చేసుకునే తీరాలనే దుర్బుధ్ధి ఎందుకు? దూరం నుంచి ఆస్వాదించి పోకూడదా? లేదా ఆర్గనైజర్స్ యొక్క అనుమతి అడగకూడదా?.. జవాబు దొరకని ప్రశ్నలివి! 

చివరలో కలిగిన ఈ చిన్న డిస్టర్బెన్స్ తో, గులాబీల తాలూకూ పరిమళాలనూ, ఫోటోలనూ వెంట తీసుకుని ఇంటి దారి పట్టాం.