సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, June 23, 2014

కొత్త పుస్తకాలు :2. నివేదన


 రెండవ పుస్తకం కూడా చిన్నదే..
"నివేదన" పేరుతో వెలువడిన ఈ పుస్తకంలో "కొరొ జాగొరితొ"(where the mind is without fear..) అనే రవీంద్రుని కవితకు తెలుగులో లభ్యమయిన ఒక వంద అనువాదాలు ఉన్నాయి. నోబుల్ పురస్కారాన్ని అందుకున్న "గీతాంజలి" కావ్యమాలలోనిదీ గేయం. ఇదివరకూ కొన్ని అనువాదాలతో ప్రచురించిన ఈ పుస్తకాన్ని మరిన్ని లభ్యమైన అనువాదాలు కలిపి పునర్ముద్రణ చేసారు. గీతాంజలి తెలుగులోకి అనువాదమై శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈ పుస్తకరూపాన్ని నివాళిగా అందించారు "సంస్కృతి" సంస్థ వారు. వెల వంద రూపాయిలు.




క్లాస్ గుర్తులేదు కానీ ఈ కవిత చిన్నప్పుడు ఇంగ్లీష్ పొయిట్రీ టెక్స్ట్ లో ఉండేది. తర్వాత రేడియోలో రజని గారి పాట వినడమే. గత వంద సంవత్సరాలలో దాదాపు ఒక వందమంది రచయితలు ఈ కవితకు తమ తమ అనువాదాన్ని అందించారుట.  ఒక్క కవితకు ఇందరు అనువాదాన్ని అందించడం అనేది ప్రపంచ సాహిత్యంలోనే చాలా అరుదైన విషయం కదా. ఈ పుస్తకంలో మన బ్లాగ్మిత్రులు అనురాధ గారి అనువాదం కూడా చోటు చేసుకోవడం మరో విశేషం.


నివేదన లోని అనువాదకులు కొందరి పేర్లు: చలం, బాలాంత్రపు రజనీకాంతరావు, రాయప్రోలు సుబ్బారావు, తిరుమల రామచంద్ర, ఆచంట జానకీరామ్, బెజవాడ గోపాలరెడ్డి, దాశరథి, శంకరంబాడి సుందరాచారి, కొంగర జగ్గయ్య, మో, ఓల్గా, గుర్రం జాషువా, రావూరి భరద్వాజ, వాడ్రేవు చినవీరభద్రుడు మదలైనవారు. అసలిలా ఒకేచోట ఇందరి అనువాదాలు చేర్చాలన్న ఆలోచన బి.ఎస్.ఆర్.కృష్ణ గారికి వచ్చిందిట. ఈ పుస్తకం గురించిన ప్రకటన చదివినప్పుడు ఒకే కవితకు వందమంది ఏం రాస్తారు?ఎలా రాస్తారు? అనుకున్నా కానీ ఒకే కవితకి ఇందరి అనువాదాలూ, ఇందరి అభిప్రాయాలూ, పదాల పొందిక, వారి వారి వొకాబులరీ ఇవన్నీ చదువుతుంటే కూడా భలే సరదాగా ఉంది. వీటిల్లో ఒక్కటి కూడా ఇదివరకూ తెలియవు కానీ రజని గారు ఈ గేయాన్ని తెలుగులోకి అనువదించి స్వరపరిచి, గానం చేసిన అనువాదమొక్కటే నాకు చిన్నప్పటి నుండీ తెలుసు. ప్రస్తుతం మా PCకి ఆయొచ్చి నిద్దరోతున్నందున ఆ గానాన్ని ఈ టపాలో వినిపించలేకపోతున్నాను :( సాహిత్యం మాత్రం రాస్తాను..

రజని గారి తెలుగు అనువాదం :

చిత్తమెచట భయశూన్యమో
శీర్షమెచట ఉత్తుంగమో
జ్ఞానమెచట ఉన్ముక్తమో
గృహప్రాంగణ తలములు ప్రాచీరమ్ముల
దివారాత్ర మృత్తికా రేణువుల
క్షుద్ర ఖందములు కావో!

వాక్కులెచట హృదయోద్గతోచ్ఛ్వసన
మొరిసి వెలువడునో
కర్మధార యెట అజస్ర సహస్ర స్రోతమ్మై
చరితార్థంబై, అనివారిత స్రోతమ్మై
దేశదేశముల దెసదెస లంటునో
తుచ్ఛాచారపు మరుప్ర్రాంతమ్ముల
వివేక స్రోతస్విని యొటనింకదొ 
శతవిధాల పౌరుషయత్నమెచ్చట
నిత్యము నీ ఇచ్ఛావిధి నెగడునో

అట్టి స్వర్గతలి భారతభూస్థలి
నిజహస్తమ్మున నిర్దయాహతిని
జాగరితను గావింపవో పితా!
సర్వకర్మ సుఖదు:ఖ విధాతా!

ఇంత క్లిష్టమైన పదాలు ఎలా వాడారో.. అనీ, రజని గారి  తెలుగు భాషా పరిజ్ఞానం ఎంత గొప్పదో అనీ ఆశ్చర్యం వేసేది చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడల్లా. పుస్తకంలో  అనువాదం క్రింద అయన పరిచయంలో ఈ గేయానికి స్వరాలను అందించిన స్వరకర్తగా కూడా పరిచయం చేసి ఉంటే బాగుండేది. 


రజనిగారు - రవీంద్రసంగీతం:

"టాగూర్ రత్న" అవార్డ్ గ్రహీత, వాగ్గేయకారులు శ్రీ రజనీకాంతరావు గారు కొన్ని రవీంద్రగీతాలకు స్వరాలను అందించారు. రజనిగారు 1961 లో టాగూర్ సెంటినరీ సెలబ్రేషన్స్( 1861- 1961) సందర్భంగా కొందరు ఆకాశవాణి కళాకారులను కలకత్తా పంపి నొటేషన్స్ తెప్పించి , హైదరాబాద్లో వాటికి తాన అనువాదాలతో పాటూ మల్లవరపు విశ్వేశ్వర్రావుగారు, డా.బెజవాడ గోపాలరెడ్డి తదితరులతో అనువాదాలు చేయించి, నొటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ తెలుగు అనువాదక రవీంద్రగీతాలను రవీంద్రుడు కూర్చిన అవే బాణీలలో ఆకాశవాణిలో రికార్డ్ చేసారు. ఈ గేయాలను గురించిన సిరీస్ నా 'సంగీతప్రియ' బ్లాగ్లో ఒక్కొక్కటే రాస్తున్నాను.



ఇంతే కాక ఈ గీతం పట్ల చాలా ప్రేమతో నాన్నగారు దీనికో ప్రత్యేకమైన ఫాంట్ వెతికి, టాగూర్ చిత్రంతో కలిపి ప్రింటవుట్ తీయించి ఫ్రేమ్ చేయించుకుని తన గదిలో పెట్టుకున్నారు కొన్నేళ్ల క్రితమే. క్రింద ఫోటో అదే..




***      ***     ***

మూడవది భలే పుస్తకం.. అది సినీసంగీతానికి సంబంధించినది. దాని గురించి రేపు రాస్తానేం..