సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, April 17, 2014

నాన్న చెప్పిన 'ఆవకాయ' కబుర్లు..




హనుమచ్ఛాస్త్రి గారి "ఆవకాయ మహోత్సవం" కథ గురించి నేను చెప్తే, వాళ్ళ చిన్నప్పటి ఆవకాయ కబుర్లు నాన్న చెప్పారు. అవి నాన్న మాటల్లోనే రాద్దామని గబగబా రాసుకుని టపాయిస్తున్నా...

నాన్న మాటల్లో..:

" ప్రతి ఏడూ అవకాయ పెట్టడం అనేది ఓ యజ్ఞం లా సాగేది. ముందు కారం ఉప్పు ఆవాలు మెంతులు గుండ తయారుచెయ్యడం. 

కారం,ఉప్పు, ఆవగుండ, మెంతిగుండ:
ఆవకాయ సీజన్ లో ఆవకాయకని ప్రత్యేకం గా గొల్లప్రోలు మిరపకాయలు(వెడల్పాటివి) కిరాణాకొట్లో అమ్మేవారు. ఎరుపుదనం, కమ్మదనం వాటి స్పేషాలిటీ. అప్పుడే ఎక్కువకొనేసుకుని ఏడాది పొడుగునా రోజువారీ వాడకానికి దాచేవారుట. వాటిని రెండు మూడూ ఎండలకి లోపల గింజలు గలగలలాడేలా బాగా ఎండనిచ్చి, వాటితో కారం కొట్టించడం మొదటి పని. ప్రతీ ఇంట్లోనూ రోలు రోకలి తప్పనిసరిగా ఉండేవి. చుట్టుపక్కల అందరి ఇళ్ళల్లోంచీ ఒక రిథిమ్ లో వినిపించేది కారం దంచే చప్పుడు. ఇలానే రాళ్ళుప్పు కూడా ఎండబెట్టి కొట్టించేవారు. మెంతికాయ కోసం మెంతులు కూడా వేయించి గుండ కొట్టించడం మరో పని. వీటితోపాటూ ఆవాలు కూడా. వాటిల్లో మళ్ళీ సన్నావాలు,పెద్దావాలు. సన్న ఆవాల ఆవకాయ అని విడిగా పెట్టేవారుట. ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి. ఏ ఆవాలు నాణ్యమైనవో తెలుసుకోవడానికి నాలుగు కిరాణా కోట్లూ తిరిగి ఇంట్లో వాళ్ళు సాంపిల్స్ తేవడం ఒక పని.

పప్పునూనె:
దాదాపు నువ్వుల పంటే ఉండేది చాలామందికి. బస్తాల్లో నువ్వులు వచ్చాకా, నూపప్పు డబ్బా అని చిల్లుల డబ్బా ఒకటి ఉండేది. ఆ డబ్బాలో నానబెట్టిన నువ్వులు పోస్తే, ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేసేది. చేత్తో పిసిగితే నువ్వుల పై పొట్టు పోయేది. అది బయట పారేసి, ఛాయనూపప్పు ఒక్కటీ బయటకు తీసేసి ఎండబెట్టేవారు. ఆ తర్వాత వాటిని గానుగకి తీసుకువెళ్ళి ఆడించడం. ఈ పనొక్కటీ మా పిల్లలకు అప్పచెప్పేవారు. మేం కూడా గానుగ దగ్గరకు ఇష్టంగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే రంగులరాట్నంలా గిరగిరా తిరిగే గానుగ మీద కూచుని తిరగచ్చని సరదా. గానుగెద్దు గిరగిరా తిరుగుతుంటే గానుగ లోంచి విచిత్రమైన ధ్వనులతో సంగీతమొచ్చేది. ఆ గానుగ సింఫనీ చాలా బాగుండేది. ఎందుకో తెలీదు కానీ నువ్వులతో పాటూ బెల్లం కూడా గానుగలో వేసేవారు. గానుగ ద్వారా పప్పు నూనే కాకుండా తెలగపిండి కూడా వచ్చేది. గానుగలోంచి వచ్చిన ఫ్రెష్ పప్పు నూనె వాసన తాగెయ్యాలనిపించేంత తియ్యగా ఉండేది. ఇదంతా బెల్లం మహత్యం అయి ఉండచ్చు.

ఆవకాయ కాయ:
ఇలా సంబారాలన్నీ సమకూర్చుకున్నాకా, అసలు సిసలైన మామిడికాయ ఎంపిక మొదలయ్యేది. పుల్లటి పులుపు, పీచుదనం, ఏడాది పొడుగునా నిలవ ఉండే నాణ్యత ఆవకాయ కోసం వెతికే ఉత్తమ మామిడి లక్షణాలు.
కోతుల తోట అని ఓ పొలం ఉండేది మాకు. అందులో ఒకే ఒక ప్రశస్థమైన మావిడి చెట్టు ఉండేది. అది ఊరగాయల టైం కి కనీసం రెండువేల కాయ కాసేది. ఇంట్లోని నాలుగు కుటుంబాల వాళ్ళకీ విడివిడిగా జాడీలతో పెద్ద పెద్ద కుండలతో ఊరగాయ కి సరిపడా కాయ కాసేది ఆ ఒక్క చెట్టూ! ఇది కాక గోదావరి లంకలో పెద్ద మామిడి తోటే ఉండేది. బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, పెద్ద రసాలు, జొన్నల రసాలు, కొబ్బరి మామిడి, ఏనుగు తలకాయ మామిడి, ఇంకా అనేక రకాక జాతుల మామిడి చెట్లు ఉండేవి. వేసంకాలం నాటికి ఈ మామిడి చెట్ల నుండి టాటాకు బుట్టలతో రకరకాల మామిడి పళ్ళు ఇంటికి వచ్చినా, ఊరగాయ కాయ మాత్రం కోతుల తోట లోని ఆ ఒక్క మామిడి చెట్టు నుండే వచ్చేది.



కాయ దింపడం:
పొడుగాటి గడకర్రకి చివర్న తాడుతో చిక్కం(తాడుతో అల్లిన బుట్టలాంటిది. పదిపన్నెండు కాయలు ఒకేసారి పట్టేవిట అందులో.) కట్టేవారు. కాయ క్రింద పడకుండా ఆ చిక్కం లోకే పడేలాగ చెట్టు నుండి వేరు చేసి కాయ కోయడం ఒక కళ. కాయ పరువుకి రావడం అనేవారు. అంటే ఇంకొక నాలుగు రోజులు ఆగితే కాయ పండిపోతుంది. అలా పరువుకి వచ్చిన కాయలు మాత్రమే ఊరగాయకి పనికి వచ్చేవి. ఆ కాయలు మరకత్తిపీటతో(ఆ కాలం పల్లెటూళ్ళలో ప్రతీ ఇంటా ఒక మరకత్తిపీట ఉండేది) ముక్కలు క్రింద కొట్టేవారు. కాయ సైజుని బట్టీ ఎనిమిది గానీ పన్నెండు గానీ ముక్కలయ్యేవి. ప్రతీ ముక్కకీ మధ్యలో డొక్క ఉండితీరాలి. అలా లేకపోతే అది ఆవకాయకి పనికిరాదు. మామిడికాయ కట్ చేసినప్పుడూ ముక్కతో పాటూ జీడి కూడా వస్తుంది కదా, ఆ జీడి, డొక్క పైపొర తీసేసి చిన్న బట్టతో ముక్కను తుడిచి రెడీ చేసేవారు. కాయ పరువానికొచ్చిందేమో, ప్రతి ముక్కా లేత పసుపు రంగులో ఉండేది. 
తెలుపుకీ, పసుపుకీ మధ్య రకం అన్నమాట. ఇక్కడికి ఆవకాయకి ముడిసరుకు రెడీ అయినట్లే. 

ఆవకాయ కలపడం:
నాపరాయితో తాపడం చేసిన అరుగు శుభ్రం చేసుకుని మిరపకాయ,ఉప్పు గుండ, ఆవపిండి పాళ్ళ ప్రకారం కలిపేసి, ఆ గుండ మధ్యలో కొత్తగా తయారయి వచ్చిన పప్పు నూనె కొంచెం కొంచెంగా పోస్తూ శుభ్రం చేసిన మామిడికాయ ముక్కలు వేస్తూ గుచ్చెత్తేవారు. దీంట్లోకి ఎవరు రుచిని బట్టి వాళ్ళూ వెల్లుల్లిపాయ, మెంతులు, శనగలు, లవంగాలు కలుపుకునేవారు విడివిడిగా. లవంగాల ఆవకాయ ముఖ్యంగా రాజుల ఇళ్ళల్లో పెట్టేవారు. ఏడాది పొడుగునా ఎప్పుడు జాడీ లోంచి ఆవకాయ తీసినా మంచి లవంగాల వాసన వస్తూ ఉండటం ఈ లవంగాల ఊరగాయ ప్రత్యేకత. మా ఇంట్లో అయితే పది రకాల ఆవకాయలు పెట్టేవారు. వెల్లుల్లి ఆవకాయ, వెల్లుల్లి లేనిది, పెసర ఆవకాయ, నూపప్పు ఆవకాయ, అల్లం ఆవకాయ, శనగల ఆవకాయ, సన్నావాల ఆవకాయ, పచ్చ మెరపకాయలతో పెట్టే పచ్చావకాయ(ఇది విపరీతమైన కారంగా ఉంటాయి ఈ పచ్చమిరపకాయలు), పులిహారావకాయ , బెల్లంపావకాయ.

భోజనాల దగ్గర ఊఅగాయ వడ్డించేప్పుడు ఊరిన వెల్లుల్లిపాయల కోసం పిల్లలం పోట్లాడుకుంటూన్నామని వెళ్ళూల్లిపాయలు దండగా గుచ్చి ఊఅగాయలో వేసేవారు. ఎన్నికావాలో అన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని మిగిలిన దండ మళ్ళీ జాడిలో వేసేసేవారు. ఊరీఊరని ఊరగాయ, వచ్చీరాని కబుర్లు ముచ్చటగా ఉంటాయని అన్నట్లుగా ఉండేది కొత్తావకాయ. పాళ్ళు సరిపోయాయా లేదా అని ఇరుగుపొరుగులు ఆవకాయలు ఇచ్చిపుచ్చుకోవడం ఓ హాబీలా ఉండేది."

***    ***      ***

ఊరగాయల గురించి ఇదివరకూ రాసిన కబుర్లు..

* మామ్మయ్య ఊరగాయలు:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_04.html
* ఊరగాయ వైరాగ్యం:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_15.html