సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, April 11, 2014

శిలకోల కథలు




పేరు, రచయిత, కంటెంట్ ఏది నచ్చినా పుస్తకం కొనుక్కుని చదవడం నాకు అలవాటు. ఫలానా సబ్జెక్టే చదవాలి అనే ప్రత్యేకమైన విభజనలేమీ లేవు నాకు. ఈ పుస్తకం వచ్చిందని కినిగె వారి ప్రకటన చూసినప్పుడు ముందర కవర పేజీ.. తర్వాత టైటిల్.. నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కినిగె లో ఆర్డర్ చేసి తెప్పించుకుందుకు లేట్ అవుతుందని, త్వరగా ఈ పుస్తకం కొనేసుకుందామని విశాలాంధ్రకు ఓ శనివారం వెళ్తే ఆ రోజు షాప్ త్వరగా మూసేసారు. అక్కడ నుండి కాస్త దూరంలో ఉన్న మరో విశాలాంధ్ర బ్రాంచ్ కు వెళ్తే అదీ మూసేసారు. అక్కడి నుండి కాళ్ళీడ్చుకుంటూ నవోదయాకు కూడా వెళ్ళాను. వాళ్ళసలు పేరే వినలేదన్నారు. ఏవో వేరే బుక్స్ కొనుక్కుని వచ్చేసా. మళ్ళీ వారం ఈసారి షాపు ఉందో లేదో కనుక్కుని విశాలాంధ్రకు వెళ్ళా. వాళ్ళూ పుస్తకం గురించి తెలీదన్నారు. మార్చ్ ఎండింగ్ హడావుడిలో ఉన్నారు వాళ్ళు. ఆఖరుకి మళ్ళీ కినిగె ద్వారానే తెప్పించుకున్నా పుస్తకాన్ని. కినిగె ఆర్డర్ ఓ  క్లిక్ దూరమే కానీ నే చేసిన పొరపాటు వల్ల నెట్ బ్యాంకింగ్ లో ఏదో తేడా జరిగి, శ్రీవారు చెయ్యిపెట్టి బాగుచేసేదాకా ఆగవలసి వచ్చింది. అలా కళ్ళు కాయలు కాసాకా ఈ పుస్తకం చేతికొచ్చింది. దీనితో పాటూ మరో మంచి పుస్తకం కూడా తెప్పించుకున్నా.(దాని గురించి ఇంకోసారి రాస్తాను.) ఈ "శిలకోల కథలు" మాత్రం చాలా బాగుంటాయి అని నాకెందుకో ఓ నమ్మకం ఏర్పడిపోయింది. దానికి తోడు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చాలన్నట్లు మొదటి కథ చదవగానే నాకు అర్థమైపోయింది నేనో మంచి పుస్తకాన్ని చదవబోతున్నానని!


రచయిత 'మల్లిపురం జగదీశ్' ఎవరో తెలీదు నాకు. ఉత్తరాంధ్ర సాహిత్యంతో పెద్ద పరిచయమూ లేదు, అక్కడి ఆదివాసీ జీవనం గురించిన అవగాహనా లేదు. ఇదివరలో చదివిన వంశీ 'మన్యంరాణి' వల్ల గిరిజనుల ఆచారాలు, జీవనవిధానం,కట్టుబాట్ల గురించి కాస్త వివరం తెలిసింది; తర్వాత వాడ్రేవు వీరలక్ష్మి గారి 'కొండఫలం' లో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించిన మూడు నాలుగు కథలు ఉన్నాయి. ఇప్పుడీ పుస్తకం  చదివితే మాత్రం ఆ గిరిజనులతో ఏం సంబంధం లేకపోయినా వారికి తరతరాలుగా జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి చదువుతుంటే ఒక విధమైన ఆవేశం మనసుని కమ్మేసింది. అభివృధ్ధి ముసుగులో ఇన్ని అన్యాయాలు జరిగాకా ఏ గిరిజనుడు 'పల్లపోడిని' నమ్ముతాడు? అనిపించింది. 'ఇప్పమొగ్గలు' కథలో 'బూది' వేసిన ప్రశ్నలే నా మనసులో కూడా ప్రతిధ్వనించాయి.. 

"వీళ్ళలో చదువుకోనిదెవరు? చదువేం నేర్పింది? ఈ చదువుల్తో ఎవరు మాత్రం సుఖంగా ఉన్నారు? ప్రశ్నల మీద ప్రశ్నలు..."

"ఛీ..వీళ్ళు మనుషులేనా? అదవిని నమ్ముకుని కొండల్లోనూ, గూడల్లోనూ నివసిస్తున్న తమ వాళ్ల పట్ల ఇంతటి నీచ భావమా? ఎవరైనా కొత్త వ్యక్తి ఇంటికొస్తే ఆదరించడం.. పండో, కాయో, మామిడి తాండ్రచుట్టో ఇచ్చి నేస్తరికం చెయ్యడం.. కొండఫలంలోని కొంత నేస్తానికివ్వడం తమ సాంప్రదాయం. అతిధుల్ని గౌరవించడం, వాళ్ళని నమ్మడం తమ సంస్కారం." అంటుందామె.
'బాకుడుంబారి' కథలో 'శ్రీధర్' ప్రశ్నలు కలతపెడతాయి. ఆధునిక ప్రపంచంలో ఎన్నో అభివృధ్ధి కార్యకరమాలు జరుగుతున్నా కూడా కూడా వీళ్ళకీ పేదరికం ఏమీటి? విద్య అందుతున్నా ఇలా వెనుకబడే ఉన్నారేమిటి? ఈ ప్రాంతాల వాళ్ల భవిష్యత్తేమిటి? అని ఆవేదన కలుగుతుంది. రచయిత కథలు రాస్తే, చదివిన నా ఆవేదనని ఇలా టపా రూపంలో రాస్తే, ఈ పుస్తకం గురించి మరో నలుగురికి తెలుస్తుందనిపించింది.


అసలివి కాలక్షేపం కథలు కానే కావు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు, వాళ్ళ బాధలు, ఇబ్బందులూ, వాళ్ళకు జరిగిన జరుగుతున్న అన్యాయం కళ్ళకు కట్టేట్లుగా రచయిత గీసిన ఒక రేఖా చిత్రం. ప్రతి పేజీలో, ప్రతి వాక్యంలో తరతరాలుగా అణిచివేయబడుతున్న గిరిజనుల నిస్సహాయ జీవితచిత్రాలు కనబడతాయి. ఒక్కో కథలో ఒక్కో సమస్యనూ ఎంతో వైవిధ్యంగా మనముందుంచారు జగదీశ్ గారు. అసలు కథలంటే ఏమిటి? జీవిత చిత్రాలే కదా. యదార్థానికి ప్రతిరూపాలే కదా. ఒక కథ మనసుకి హత్తుకుని రచయిత తాలూకూ భావోద్వేగాన్ని పాఠకుడు అందుకోగలిగినప్పుడు ఆ కథ సజీవమౌతుంది. అజరామరమౌతుంది. అలా లేనప్పుడు అసలు ఏ కథైనా రాసీ ప్రయోజనం ఉందదని నా అభిప్రాయం. ఈ పుస్తకంలో ప్రతీ కథా హృదయాన్ని తాకి ఆలోచింపచేస్తుంది. ఏదైనా చేసి ఆ కథల్లోని మనుషుల వేదనను తగ్గించాలనిపిస్తుంది. నాలాగే ఈ పుస్తకం చదివినవారందరికీ అనిపిస్తే, "శిలకోల" అనే అనువైన పేరుతో జగదీశ్ చేసిన ఈ సాహితీ సృజన వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరగలదనే నమ్మకం కలిగింది.


జగదీశ్ గారి రచనా శైలి చాలా బాగుంది. కొన్ని వాక్యాలు చిన్నవే అయినా వాటి వెనుక అర్ధాలు బోలెడున్నాయి. వాక్యాలు సున్నితంగానూ, వాడిగా కూడా ఉన్నాయి. కొన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాను..

* "ఈ చరిత్రొకటి. అదెక్కడ మొదలౌతుందో కానీ ఏదీ అర్థం కాదు. ఆ మాటంటే మట్టిబుర్రలు, ఒక్కరోజైనా పుస్తకం తీస్తే అర్థమౌతుందని నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తారు."

* "వెర్రీ గుడ్ రా... వెయ్యేళ్ళు వర్థిల్లు.." తెరలు తెరలుగా నొక్కి చెప్పారు. 
అది దీవెనో, శాపమో వాడికే అర్థం కాలేదు.

* ఆడి పెల్లి కర్సులకని పోతులు అమ్మేసాను. కొండ మీద నల్లని తల్లి మా జిలుగుసెట్టూ, సింత సెట్టూ అమ్మేసేను. ఇంకా సాల్లేదని సావుకారి కాడ అప్పు తెచ్చఏను. ఇద ఈ పొద్దు ఆడు పిల్లల్తండ్రైనాడు. ఉజ్జోగస్తుడైనాడు, గానీ అప్పు అలాగే ఉండిపోయింది. నా గోచీ ఇలాగే మిగిలిపోయింది.

* అక్కడక్కడ దిసమొలల్తో అనారోగ్యంతో నింపుకున్న పెద్దపెద్ద పొట్టల్తో ఆటలాడుకుంటున్న ఆదివాసీ బాలలు.. అభివృధ్ధికి ఆనవాళ్ళూగా...

* పింటుగాడు ఆడుతున్న రేడియో లోంచి "మంచి పోషక విలువలు గల ఆహారం" అనే అంశం మీద డాక్టర్ గారి ప్రసంగం వినిపిస్తోంది.

* వాళ్ళనక్కడ చూస్తూంటే కొండ మీద చెట్లను తెచ్చి నగరంలో నాటి నీళ్ళు చిలకరిస్తున్నట్లుంది.

* అడవి...ఎలా ఉండేది?
ఇప్పుడది ఆరిన నిప్పు.
కొండ?
కన్నీటి కుండ.

* ఈ మౌనం ఇప్పటిదా?
దీని వెనుక దాగిన కథలెన్నో!
దశాబ్దాల నాటి వ్యధలెన్నో కదా!!

ఈ వాక్యాలు చాలు ఈ కథల గురించి ఇంకేం రాయక్కర్లేదు నేను. ఇవాళ విచిత్రంగా ఈ కథల్లోని సారం అంతా ఉన్న ఒక కవిత దొరికింది. క్రింద లింక్ లో ఆ కవిత చదవవచ్చు:
శిలకోల చూపు



ఈ పుస్తకంలోని అక్షరాల్లో నాకో విచిత్రం కనబడింది. "క్ష" అక్షరానికి బదులు "ష" వత్తు పడింది. అన్నిచోట్లా! అక్షంతలు, శుభాకాంక్షలు, అక్షరం... అన్నిచోట్లా "క" క్రింద "క్ష" వత్తు బదులు "ష" వత్తు పడింది. టైప్ చేద్దామంటే ఇక్కడ రావట్లేదు నాకు. ఇది ఉద్దేశపూర్వకమో పొరపాటో తెలీలేదు నాకు!