సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 2, 2014

13 భారతీయ భాషల 'తొలి కతలు'





"తొలి కతలు" అన్న పేరు చూడగానే అనిపించింది.. ఏ భాష లోనైనా అసలు 'తొలి కథ' అనేది ఎవరు ఎప్పుడు రాసారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ అలా దొరికినా రికార్డ్ లో ఉన్న కథే తొలి కథ అని ఏమిటి గ్యారెంటీ? అంతకు ముందు రాసిన కాథలు ఉండీ, అవి ప్రచారం లోకి రాకపోయి ఉండచ్చు కదా..? అన్న సందేహాలు కలిగాయి. వాటికి సమాధానాలు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు గారి ముందు మాటలో దొరికాయి. అచ్చులోకి వచ్చిన దగ్గరనుండీ దొరికిన కథలే తొలికతలనే గీతని నిర్ణయించి కథలను వెతికారుట. అలా వెతికి వెతికి ఒక పదమూడు భారతీయ భాషల్లోని కథలను అనువాదం చేయించి ఈ సంకలనంలో అచ్చు వేసారు. 


మిగతా భాషల్లో కన్నా తెలుగులో మొదటి కథ మీద చాలానే భిన్నాభిప్రాయాలున్నాయిట. గురజాడ గారి 'దిద్దుబాటు' కన్నా ముందు భండారు అచ్చమాంబ గారి 'ధన త్రయోదశి' కథ కాక మరో అరవై ఐదు కథలున్నాయిట తెలుగులో. మిగిలినవేమీ అచ్చులో లభ్యం కానందువల్ల ధన త్రయోదశి, దిద్దుబాటు  రెంటినీ తొలి తెలుగు కథలుగా ఎన్నుకున్నారు. ఈ పుస్తకంలో ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళం, తెలుగు, కొంకిణీ, తుళు, కశ్మీరీ మొదలైన భాషల్లోని తొలి కథలున్నాయి. అప్పటి రచయితల్లో సామాజిక స్పృహ బాగానే ఉందనీ, సామాజికమార్పుని అభిలషిస్తూ ఈ కథారచనలు చేసారనే అనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే. ప్రతి కథకూ ముందర ఆ కథారచయిత పరిచయం, కథ వెనుక అనువాదకుని/అనువాదకురాలు యొక్క పరిచయం కూడా ఇచ్చారు. 


పుస్తకంలో కథలన్నింటినీ క్రానాలజీ ప్రకారం ప్రచురించడం విశేషం. అలా చూస్తే భారతీయ భాషల్లో మొదటిది ఒక ఉర్దూకథ. ఆ తర్వాతది ఇరవై మూడేళ్ళ వయసులో ఠాగూర్ రాసిన 'రేవుకథ'. ఇందులో ఒక రేవు మనకు కథను చెప్తుంది. 'వారసత్వం' అనే మలయాళీ కథ తాను తీసుకున్న గోతిలో తానే పడిన ఓ దొంగ స్వగతం. ఒడియా కథ 'రేవతి', తమిళ కథ 'కుంభమేళాలో చిన్నకోడలు' రెండూ కంట తడి పెట్టిస్తాయి. తెలుగు కథలు రెండిటి భాష గ్రాంధికంగా ఉండి కాస్త చదవడానికి కష్టతరంగానే ఉంది. తుళు కథ కాస్త సరదగా ఉంది. అన్ని కథలనూ ఆయాభాషల నుండి అనువదించగా ఒక్క కాశ్మీరీ కథను మాత్రం ఇంగ్లీషు నుండి అనువదించారుట. 


ఇవన్నీ గొప్ప కథలు అని అనలేము కానీ వైవిధ్యభరితమైన కథలని అనవచ్చు.  సాహిత్యరంగంలో కథాప్రక్రియ ఊపిరి పోసుకుంటున్న తరుణంలో వెలువడ్డవి కాబట్టే వీటికి ప్రాముఖ్యత. భారతీయ భాషల్లోని తొలి కథలనేవి అసలు ఎలా ఉన్నాయి? తమ కథల ద్వారా రచయితలు చెప్పదలిచిన విషయాలు ఈ కథల్లో కనబడతాయా? అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ పుస్తకం కొనుక్కోవచ్చు.