శివరాత్రి ముందర పుస్తకమొకటి మొదలెట్టాను చదవడం.. మధ్యలో నాన్న హాస్పటల్ హడావుడి, తర్వాత ఇంకా ఏవో పనులు...! అసలిలా మధ్యలో ఆపేస్తూ చదవడం ఎంత చిరాకో నాకు. మొదలెడితే ఏకబిగిన అయిపోవాలి. క్రితం జన్మలో(పెళ్ళికాక మునుపు) ఇలాంటి కోరికలన్నీ తీరేవి. ఇప్పుడిక ఇవన్నీ సెకెండరీ అయిపోయాయి ;( పాలవాడో, నీళ్లవాడో, సెక్యూరిటీ గార్డో, లేక తలుపు తట్టే పక్కింటివాళ్ళో..వీళ్ళెవరూ కాకపోతే ఇంట్లో పనులో.. కుదురుగా పుస్తకం చదువుకోనియ్యవు. అందులోనూ ఇది ఐదువందల ఎనభై పేజీల పుస్తకం. ఎలాగో కళ్ళని నాలుగొందల అరవైరెండు దాకా లాక్కొచ్చాను.. ఇంకా నూటిరవై ఇవాళేలాగైనా పూర్తి చేసెయ్యాలి. అసలీలాటి పుస్తకమొకటి చదువుతున్నా..ఇంత బాగుందీ అని టపా రాద్దామంటేనే వారం నుండీ కుదర్లేదు.
కాశీభట్ల గారి నవల మొదటిసారి చదివినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో.. ఈ నవల చదివేప్పుడు అంత ఆశ్చర్యపోతున్నాను. ఇటువంటి గొప్ప నవల ఒకటి తెలుగు సాహిత్యంలో ఉందని ఇన్నాళ్ళూ కనుక్కోలేకపోయినందుకు బాధ ఓపక్క, ఇన్నాళ్ళకైనా చదవగలిగాననే సంతోషమొక పక్క చేరి నన్ను ఉయ్యాలూపేస్తున్నాయి. నాకు ఇప్పటిదాకా నచ్చిన తెలుగు నవలలన్నింటినీ పక్కకి నెట్టేసి వాటి స్థానాన్ని ఆక్రమించేసుకుందీ పుస్తకం..! ఎప్పటి కథ.. ఎప్పటి మనుషులు.. ఇంత సమకాలినంగా, ఆ భావాలింత దగ్గరగా ఎందుకనిపిస్తున్నాయి..? అంటే కాలమేదైనా స్త్రీ పురుషుల మనోభావాలు ఎప్పటికీ ఒక్కలాగే ఉంటాయన్నది సత్యమేనా? ఈ రచయిత ఇంకా ఏమేమి రాసారో? ఇప్పుడవి దొరుకుతాయో లేదో..? ఆత్మకథొకటి రాసారుట.. అదన్నా దొరికితే బాగుండు.
నా టేస్ట్ నచ్చేవారికి తప్పకుండా ఈ నవల నచ్చి తీరుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది! కొన్ని పదుల ఏళ్ల క్రితం రాసిన భావాలతో ఇంతకా ఏకీభవించగలగడం ఒక సంభ్రమం. అంటే ఇప్పటికీ స్త్రీల పరిస్థితులు, మగవారి అహంకారాలు, మన సమాజపు స్థితిగతులు అలానే ఉండడం కారణమా? అప్పట్లోనే ఎంతో అభ్యుదయం ఉన్నట్లు రాస్తున్నారు.. అప్పట్లో నిజంగా స్త్రీలు అంత డేరింగ్ గా ఉండేవారా? లేదా కేవలం హై సొసైటీలో, డబ్బున్న ఇళ్ళల్లోనే అలా ఉండేవారా..? అసలా రచనా ప్రక్రియే ఒక కొత్త పధ్ధతి కదా. ఆ ప్రక్రియ వల్లనే ఒక సామాన్యమైన కథకు అంతటి డెప్త్, గొప్పతనం, నిజాయితీ అమరింది.
అసలు పెళ్ళికి ముందు ఈ నవల చదివి ఉంటే ఇంతగా నచ్చేది కాదేమో. పదేళ్ల సంసారజీవితం తర్వాత చదివినందువల్ల ఇంత ఆకట్టుకుని ఉంటుంది. ఎందుకంటే ఇల్లాలిగా ప్రమోట్ అయ్యాకా పూర్వపు అభిప్రాయాల్లో ఎంతగా మార్పు వస్తుందో నాయిక పాత్రలో చూస్తూంటే నన్ను నేను చూసుకుంటున్న భావన! ఆ ప్రధాన నాయిక ఉంది చూడండీ.. అసలు ఏం కేరెక్టర్ అండీ అసలు.. దణ్ణం పెట్టేయచ్చు ఆవిడకి. రచయిత దృష్టిలో ఓ పర్ఫెక్ట్ వుమన్ అలా ఉండాలి అనే పిక్చర్ ఏదో ఉండి ఉంటుంది.. అలానే చిత్రీకరించారా పాత్రని. అసలు 'నవలానాయకుడు' దొరుకుతాడేమో అని మొదలుపెట్టాను చదవడం.. దొరికారు...ఒక్కరు కాదు ముగ్గురు.. ముగ్గురూ నాయికలే!!! ఇండిపెండెంట్, ఐడియల్, అగ్రెసివ్, ఫెరోషియస్, బోల్డ్.. ఇంకా పదాలు వెతుక్కోవాలి ఈ ముగ్గురి కోసం. రచయితకు పాపం మగవారి మీద ఇంత చిన్నచూపెందుకో? ముగ్గురిలో ఒక్క ఆదర్శపురుషుడినీ నిలబెట్టలేదు..:( కొన్ని పాత్రల్లో లోపాలున్నా కనీసం వాళ్ళ పట్ల ప్రేమ పుడుతుంది కానీ నాకు వీళ్ళపై జాలి కూడా కలగట్లేదు.. బహుశా నాలో ఎక్కడో మగవారి అహంకారంపై, పిరికితనంపై కోపతాపాలేవో దాగుండి ఉంటాయి.. అందుకే వీళ్లకి మార్కులు వెయ్యలేకపోతున్నాను.. అయినా ఇంకా మూడో మనిషి గురించి చదవాలి అతగాడేలాంటివాడో ఏమో. ఎలాంటివాడైనా నాయికను మించినవాడు మాత్రం అవ్వడు. అభ్యుదయ భావాలతో, ఉన్నతమైన లక్షణాలతో ఉన్న స్త్రీ పాత్రలను సృష్టించడమే రచయిత లక్ష్యంగా కనబడుతోంది మరి..
ఈ కథను సినిమాగా తీస్తే ఎంత బాగుంటుందో! వందరోజులు ఖచ్చితంగా ఆడుతుంది. కానీ అంత గొప్పగా, నిజాయితీగా ఎవరన్నా తీయగలరా? ఏమో! సరే మరి మిగిలిన భాగం చదివేసాకా మళ్ళీ అసలు కథేమిటో చెప్తానేం! అంతదాకా ఆగలేక ఈ టపా రాసేస్తున్నానన్నమాట!
***
ఒకరోజు ముందుగా.. Happy Women's day to all my friends & readers..