ఈ మధ్యన ఇల్లు మారినప్పుడు పుస్తకాలు సర్ది సర్ది... 'ఇంక ఉన్నవి చాలు కొనకూడదు బాబూ..!' అనుకున్నా. పుస్తక ప్రదర్శన మొదలయ్యే ముందు రోజు కూడా అదే స్థిరంగా అనుకున్నా..'వెళ్ళకూడదూ వెళ్లకూడదూ...' అని!
ఏడో తారీఖు సాయంత్రం అయ్యేసరికీ మనసు కొట్టుకుంది... మానెయ్యడమా.. అందులోనూ మొదటిరోజు..! 'ఏమండీ...' అన్నా...! 'సరే పదమన్నారు' శ్రీవారు. అప్పటికప్పుడు అనుకున్నందువల్ల ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాం. పదిహేనొ ఇరవయ్యొ కిలోమీటర్ల దూరం మరి! బుక్ ఫెయిర్ దగ్గరకి చేరేసరికీ ఏడుంపావు!! ఎనిమిదింటికి మూసేస్తారు కదా లోపలికి వెళ్దామా వద్దా అనుకుని.. సర్లే ఇంత దూరం వచ్చాం కదా అని లోపలికి దూరిపోయాం..
విజయవాడలో మా క్వార్టర్స్ పక్కనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉండేది. పుస్తక ప్రదర్శన మొదలెట్టిన ఏడాది నుండీ అక్కడ ఉన్నన్నాళ్ళూ ప్రతి ఏడూ సాయంత్రమయ్యేసరికీ చటుక్కున వెళ్పోయి ఓ రౌండ్ వేసి వచ్చేదాన్ని. ప్రదర్శన ఉన్న పదిరోజుల్లో వీలయినన్ని విజిట్స్ తప్పక వేసేదాన్ని. కొత్త పుస్తకాల దొంతరలు.. ప్రింట్ వాసన.. తెల్లని పేజీలపై నల్లని ఆక్షరాలు.. ఏదో ఉత్తేజాన్ని పెంచుతూ, ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ.. మహదానందంగా ఉండేదసలు. ఎన్నేళ్ళైనా అదే ఉత్సాహం ఇప్పటికీ. పుస్తకాలను చూస్తే మనసు చిన్నపిల్లై వాటివెంట పరిగెత్తుకుపోతుంది.
సరే ఇప్పుడు ఈ యేటి బుక్ ఫెయిర్ కబుర్లలోకి వచ్చేస్తే.. లోపలికి అడుగుపెట్టగానే ప్రధాన ఆకర్షణ గ్రౌండ్ మధ్యలో కట్టిన ఎమెస్కో వాళ్ల స్టాల్. మొదటి రోజు కదా ఇంకా కడుతున్నారు. లోపల ఇంకా చిత్రాలను పేర్చుతున్నారు. క్రింద ఫోటోలో ఉన్న పుస్తకం లోని బొమ్మలే లోపల నలువైపులా గోడలకు అమర్చారు.
స్టాల్స్ కి ఇంకా నంబర్లు మాత్రమే ఉన్నాయి. పేర్లు రాయలేదు. కొన్ని చోట్ల అట్టపెట్టేలు తెరవలేదు. ఇంకా సర్దుకుంటున్నారు. ఈ చిత్రం కూడా అందంగానే ఉంది. ఎంత కష్టపడతారో ఇక్కడకి ఈ బుక్సన్నీ చేర్చడానికీ అనిపించింది. ఇల్లు మారేప్పుడు నాలుగైదు అట్టపెట్టెల పుస్తకాలు సేఫ్ గా చేరేసేసరికే ఆపసోపాలు పడిపోయాం. మరి ఇన్ని వందల, వేల, లక్షల పుస్తకాలు ఒకచోట చేర్చడం..మళ్ళీ అయిపోయాకా అవన్నీ వెనక్కు తీసుకువెళ్లడం... నిజంగా ఎంత శ్రమతో కూడుకున్న పనో!
ఈసారి స్టాల్స్ ఏ,బి,సి అని బ్లాక్స్ గా డివైడ్ చేసారు. ఒక బ్లాక్ లో ఒక సైడ్ తిరిగామంతే.. విజిల్ వేసుకుంటూ అబ్బాయి వచ్చేసాడు. మొదటిరోజు ప్రదర్శన అయిపోయింది....అయ్యో.. అని నాకు ఏడుపువచ్చినంత పనైంది. నే రాసుకున్న లిస్ట్ లోవి నాలుగంటే నాలుగు పుస్తకాలు కొన్నా అప్పటికి. 'పోన్లే మళ్ళీ వద్దాం.. నెక్స్ట్ వీకెండ్' అన్నారు మావారు. మళ్ళీ ఇంటికి రావడానికి రెండు గంటలు పట్టింది. ఎలాగైనా వెళ్లాలి అని నాలుగు గంటలు కష్టపడితే ముప్పావుగంట ఉండగలిగానా...:( అని ఆ పూటంతా మూడ్ ఆఫ్ అయిపోయింది.
'మళ్ళీ వీకెండ్ కి ఏ అవాంతరమో వస్తే..వెళ్లడం కుదరకపోతే..' అని భయమేసి మొన్నగురువారం పొద్దున్నే బయల్దేరా ఒక్కదాన్నే. మా ఇంటి నుండి ఇరవై నిమిషాలు బస్టాప్ కి నడక, గంట బస్సు, మళ్ళీ ఓ ఐదారు కిలోమీటర్లు ఆటో.. అప్పుడు బుక్ ఫెయిర్ వస్తుంది. దారిలో ఉండగా నాన్న ఫోన్ చేసి ఎమెస్కొలో "తిలక్"గారి కలక్షన్ వచ్చేసిందిట తీసుకోమని చెప్పారు. సరే, ఇంక మొదట ఎమెస్కో లోకి దూరాను. ఆ తర్వాత మొదటిరోజు ఎక్కడ ఆపానో అక్కడి నుండీ మళ్ళీ చూడడం మొదలుపెట్టాను. నేషనల్ బుక్ ట్రస్ట్, I&B వాళ్ల పబ్లికేషన్స్ డివిజన్ స్టాల్, సాహిత్య అకాడమీ, తెలుగు బుక్ హౌస్, నవోదయా, విశాలాంధ్ర...ఆక్స్ఫార్డ్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై నుండి వచ్చిన ఇంగ్లీష్ బుక్స్టాల్స్... ఈసారి క్రిందటేడు కనబడ్డ కొన్ని స్టాల్స్ కనపడ్లేదు. ఈలోపూ వెళ్పోవాల్సిన టైమ్ అయ్యింది. మళ్ళీ మా పాప స్కూల్ నుండి వచ్చేలోగా ఇల్లు చేరాలి.. అప్పటికి టాగూర్ పబ్లిషింగ్ హౌస్ లో ఉన్నా.. ఇంకా మూడవ block పూర్తిగా చూడాలి.. అయినా ఇక బయల్దేరాలి... జై సిండ్రిల్లా.. అనుకుని గబగబ బయట పడ్డా.. చేతుల్లో నిండుగా, బరువుగా ఉన్న సంచీలు సంబరపెడుతున్నా ఇంకా మొత్తం చూడలేదని అసంతృప్తి..!! లక్కీగా నేను ఇల్లు చేరాను.. అప్పుడే పాప ఆటో వచ్చింది.
ఇంక మిగిలిన పార్ట్ చూట్టం వీకెండ్లో సరిగ్గా కుదరకపోతే తృప్తి ఉండదని.. మళ్ళీ మర్నాడు పొద్దున్నే బయల్దేరా.. అంచలంచలుగా తెరిచే టైమ్ కి చేరిపోయా. మళ్ళీ టాగూర్ పబ్లిషింగ్ హౌస్ దగ్గర నుండి మొదలుపెట్టి నాకిష్టమైన KFI పబ్లికేషన్స్, విజయవాడ స్టాల్స్... ఓ విజయవాడ స్టాల్లో సినిమా పుస్తకాలు బాగున్నాయి. వాటిల్లో ఆదుర్తి సుబ్బారావు గారి మీద పుస్తకమొకటి బాగుంది. షేక్స్పియర్ ప్లేస్ తెలుగులోకి అనువదించినవి ఆరో,ఏడో ఉన్నాయి. ఇవి కొనలేదు కానీ క్రిందటేడు బుక్ ఫెస్ట్ లో సోనెట్స్ కి ట్రాన్స్లేషన్ ఉంటే కొన్నాను. He is my most favourite!! ఎమ్మే ఫైనల్లో లాస్ట్ పేపర్ ఆప్షన్స్ లో "మోడర్న్ లిటిరేచర్" వదిలేసి "షేక్స్పియర్" తీసుకున్నా. ఫ్రెండ్సంతా నవ్వారు అబ్బా ఫోర్టీన్త్ సెంచరీ స్టఫ్ ఏం చదువుతావే అని. కానీ నాకెందుకో మొదట్నుండీ షేక్స్పియర్ అంటే ప్రాణం.......! ఓకె.. మళ్ళీ స్టాల్స్ దగ్గరకు వచ్చేస్తే, క్రితంసారి లాగానే ఈసారి కూడా ఓల్డ్ బుక్స్ కి డిస్కౌంట్ ఉన్న స్టాల్స్ ఉన్నాయి. ఏక్చువల్ గా సాహిత్య అకాడమీ స్టాల్ లో కొన్ని డిస్కౌంట్ బుక్స్ ఉన్నాయి. వీరలక్ష్మి గారు "భారతీయ నవల" లో మెన్షన్ చేసిన నవలలుచాలావరకూ! నేను భైరప్ప గారిదొకటి తీసుకున్నా.
ఈసారి ఎక్కువగా రావూరి భరద్వాజ గారి పుస్తకాలు, చలం సమగ్ర సాహిత్యం, టాగూర్,శరత్ నవలల అనువాదాలు, ముళ్ళపూడివారి పుస్తకాలు, వంటల పుస్తకాలు ఎక్కువగా కనబడ్డాయి. ఎమెస్కో వాళ్ళు చాగంటివారి భాగవతం, రామాయణం, శివపురాణం ప్రవచనాలు కలిపి డిస్కౌంట్ పెట్టారు. అలానే తిలక్, గురజాడ, జాషువా ముగ్గురి సమగ్ర సాహిత్యంపై డిస్కౌంట్ పెట్టారు. పిల్లల పుస్తకాలు చాలా ఉన్నాయి + బాగున్నాయి కానీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లల కోరికలను కాదనలేని పేరెంట్స్ వీక్నెస్ ని కనిపెట్టినట్లుగా పిల్లలు కావలనదగ్గ వస్తువులన్నీ స్టాల్స్ లో ఉన్నాయి..:) నే వరుసగా వెళ్ళిన రెండు రోజులూ రెండు మూడు స్కూళ్ళ వారు తమ పిల్లల్ని తీసుకొచ్చారు. ఛోటా భీమ్ స్టోస్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది.. మేము బలే..:)
చివరిగా నవోదయాకు మరోసారి వెళ్ళాను. నాకెప్పుడూ షాప్ లో కనబడే ఆయన ఉన్నారీసారి. అడిగిన బుక్సన్నీ గబగబా తీసిచ్చేసారు. నవోదయా కేటలాగ్ ఒకటిచ్చారు. అది ముందరే తీసుకుని ఉంటే వెతుక్కోవాల్సిన అవసరమయ్యేది కాదు. ఇంక లిస్ట్ లో రాసుకున్నవన్నీ దొరికేసాయనుకున్నాకా ఇంక బయల్దేరిపోయాను. రేపే ఆఖరిరోజు ఇంక..
ఈసారి కొన్న పుస్తకాలు..
ఇవండీ ఈయేటి 'పుస్తకాల తీర్థం' ఊసులు...!!!