సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, October 10, 2013

మట్టిమనిషి





"పుట్టినవాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయేవాళ్ళేరా! అసలు మనం పుట్టింది ఏడవటానికంటరా? బతకటానికిరా! బతకటానికి. బతికినన్నాళ్ళూ మగసిరిగా బతకాలి! ఒకళ్ళను దేహీ అంటూ అడక్కూడదు. అడ్డం వచ్చిన వాటిని నరుక్కుంటూ వెళ్ళాలి! చేతగాని వాడే ఏడుస్తాడు. చేతుల్లో సత్తువ ఉన్న వాడెవ్వడూ ఏడవకూడదు. సంతోషంగా బతకాలి! మనిషికి సంతోషం ఎక్కడుందంటావా? కష్టపడి పని చెయ్యడంలో ఉంది. చెమటోడ్చి భూమి దున్నటంలో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావటంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లో కొచ్చినప్పుడు ఉండే ఆనందంలాంటిది ఈ భూమ్మీదే మరొకటి లేదురా బాబూ!"
అంటాడు సాంబయ్య మనవడితో! ఎంత చక్కని ఫిలాసఫీ! 

ఇది సాంబయ్య తనకు తానుగా గ్రహించుకున్న జీవనసారం. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి, మట్టినే నమ్ముకు బ్రతికిన ఓ 'మట్టిమనిషి' నేర్చుకున్న జీవన వేదాంతం. 


'సాంబయ్య' డా.వాసిరెడ్డి సీతాదేవి రచించిన "మట్టిమనిషి" నవల లో ప్రధాన పాత్రధారి(Protagonist). కథంతా అతని చుట్టూతానే అల్లుకుని ఉంటుంది. 'ఆంధ్రప్రభ' దినపత్రిక, ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురణ పొందిన ఈ నవల విశేషంగా పాఠకుల ఆదరణ పొందింది. 1972 లో పుస్తక రూపంలో వచ్చిన తరువాత మరో రెండుసార్లు పునర్ముద్రితమైంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ నవల పురస్కారాన్ని అందుకుంది. నేషన్ బుక్ ట్రస్ట్ వారు పధ్నాలుగు భాషల్లోకి అనువదించారు ఈ పుస్తకాన్ని. ఉస్మానియా విశ్వవిద్యాలయంవారు ఫైనల్ ఎం.ఎ. విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా కూడా నిర్ణయించారు. ఇంతటి విశేష ప్రాముఖ్యత పొందిన ఈ సామాజిక నవలలో అప్పటి సమకాలీన సమాజంలోని దురన్యాయాలను, అప్పటికే పతనమవుతున్న భూస్వామ్య వ్యవస్థ లోటుపాట్లను కళ్లముందుంచారు సీతాదేవిగారు. తెలుగు నవలాసాహిత్యంలో ఎన్నదగిన పది ఉత్తమ నవలల్లో ఈ నవల కూడా చోటుచేసుకుని ఉంటుందని పుస్తకం పూర్తయ్యాకా నాకనిపించింది. 




 

సీతాదేవి గారి రచనా శైలి, సామాన్య రైతు జీవితాన్ని ఆవిష్కరించిన తీరు, పాత్రల చిత్రణ, నిశితమైన మనస్తత్వ చిత్రణ అన్ని ఎంతో వాస్తవికంగా, వివేచనాత్మకంగా ఉన్నయి. ఒకవైపు ప్రభుత్వోద్యోగం చేస్తునే సీతాదేవి గారు నవలలు, కథా సంపుటాలూ, వ్యాస సంకలనాలు, పిల్లల కథా సంపుటాలు, అనువాదాలు రాసారంటే నిజంగా అభినందనీయులు. ఆవిడ పలు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్న వివరాలు, వాటి పేర్లు నవల వెనుకవైపు రాసారు.


సుమారు ఏడాదిన్నర క్రితం కొన్న ఈ పుస్తకాన్ని మొన్న ఓ వంద పేజీలు చదివాకా తప్పనిసరిగా మూసేయాల్సి వచ్చింది. మిగిలిన మూడొండల పేజీలూ నిన్న ఏకబిగిన మూడుగంటల్లో పూర్తిచేసానంటే క్రెడిట్ అంతా నా కళ్ళను పరిగెత్తించిన ఆ రచనా శైలిదే! ఇంతకు ముందు ఆవిడ పుస్తకాలేమీ చదవలేదు కానీ ఈ ఒక్క పుస్తకం మాత్రం నన్నెంతో ఆకట్టుకుంది. అసలు నిన్న రాత్రంతా కలత నిద్రలో సాంబయ్య, కనకయ్య, రామనాథబాబు, రవి, వరూధిని...అలా కదులుతూనే ఉన్నారు కళ్లముందు! ఎంతగానో కదిలించేసింది నన్నీ కథ..! విశృంఖల ప్రవర్తనతో జీవితాన్ని నాశనం చేసుకున్న వరూధిని చావుపై కూడా జాలి పుట్టించేంతటి పట్టు ఉన్న కథనం. కొన్ని పుస్తకాలింతే.. మనసునీ, ఆలోచనల్నీ తమ వశం చేసేసుకుంటాయి.


మూడు తరాల జీవితాలలో వివిధ పరిణామాలను సమర్థవంతంగా, ఎంతో దృశ్యాత్మకంగా అక్షరీకరించారు సీతాదేవి గారు. ప్రతి సన్నివేశం ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లు కాక, మనోఫలకంపై ఒక దృశ్యాన్ని చూపెడుతూ ఉంటుంది పాఠకుడికి. ఉత్తరాది నుండి కట్టుబట్టలతో ఆ ఊళ్ళోకి వచ్చిన వెంకయ్య, మోతుబరి రైతు వీరభద్రయ్య దగ్గర పాలేరుగా కుదిరి, కష్టపడి కౌలు వ్యవసాయం చేసి, పదేళ్ళలో రెండెకరాల పొలం కొనే స్థాయికి ఎదుగుతాడు. కొడుకు సాంబయ్యకు దుర్గమ్మనిచ్చి పెళ్ళి చేస్తాడు. చమటోడ్చి సంపాదించిన ఐదెకరాల పొలాన్ని కొడుకుకి మిగిల్చి వెంకయ్య చనిపోతాడు. కొడుకు పుట్టేనాటికి సాంబయ్య ఏడెకరాల మాగాణి, మూడెకరాల మెట్ట ఉన్న చిన్నకారు రైతు. బడికి కాక, కొడుకు వెంకటపతిని తనతో పాటుగా పొలానికి తీసుకెళ్లటానికే నిర్ణయించుకుంటాడు సాంబయ్య. వెంకటపతి పెళ్ళిడుకొచ్చేసరికీ  ఎనభై ఎకరాల సుక్షేత్రమైన మాగాణి, సుమారు పాతికవేల కవిలె, దొడ్లూ దోవలు, కొత్తగా కట్టిన డాబాఇల్లు గల షావుకారవుతాడు
సాంబయ్య. ఊళ్ళో అతని పరపతి పెరుగుతుంది. అదృష్టం అందలం ఎక్కిస్తే బుధ్ధి బురదలోకి లాగిందన్నట్లు ఒక చిత్రమైన కోరిక పుడుతుంది సాంబయ్యకి. తన తండ్రి పాలేరుగా చేసిన వీరభద్రయ్య కొడుకు బలరామయ్య తో వియ్యమొందాలని! ఆస్తి హరించుకుపోయి అప్పుల్లో కూరుకుపోయి ఉన్న బలరామయ్య గత్యంతరం లేక ఆఖరి కుమార్తె వరూధినిని వెంకటపతికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ వ్యవహారమంతటికీ ముఖ్యకర్త, మధ్యవర్తి గుంటనక్కలాంటి కనకయ్య!


 రైతులకూ పెట్టుబడిదారులకూ మధ్యవర్తిగా ఉంటూ, ఊరువాళ్ల దయాధర్మాలతో సంసారం నడుపుతూ, చిన్నచిన్న పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించి, ఏదో ఒక దోవన లాభాలార్జించి భూస్వామిగా మారిన ఊసరవెల్లి కనకయ్య. ఒకనాడు బక్కపలచగా,తొండిలేక ఆవురావురుమన్న కనకయ్య కాలువగట్టు క్రింద పదెకరాల పొలం, తాను రైతుల ధాన్యం అమ్మించిన మిల్లులోనే పావలా వాటాదారు అవుతాడు. నాలుగువేలతో ఇల్లు బాగుచేసుకుని మేడ కడతాడు. మోసాలతో ధనార్జన చేసి కొడుకునీ,అల్లుడ్నీ లాయర్లను చేస్తాడు. అక్రమార్జనతో బలరామయ్య మేడను కూడా కొని, చివరికి ఆ ఊరి సమితి ప్రెసిడెంట్ కూడా అవుతాడు. సమకాలీన వ్యవస్థలోని లోటుపాట్లకు ప్రతీక అతని పాత్ర.




పట్నవాసపు మోజుతో పల్లె వదిలిన సాంబయ్య కోడలు వరూధిని వెనకాల పెళ్లాం చాటు మొగుడిగా మారిన వెంకటపతి తండ్రిని వదిలేస్తాడు. తన మొండితనం వల్ల, అజాగ్రత్త వల్ల, అదుపులేని నడవడి వల్లా, జీవితాన్ని అభాసుపాలు చేసుకుంటుంది వరూధిని. కనకయ్య వంటి గుంటనక్కల వల్ల, రామనాధబాబు
వంటి మోసకారులవల్ల, వెంకటపతి చేతకానితనం వల్లా, సాంబయ్య చెమట చిందించి సంపాదించిన ఆస్తంతా కర్పూరంలా హరించుకుపోతుంది. ఓ దిబ్బ మీద పూరిపాకలో ఒంటరిగా మిగులుతాడు సాంబయ్య! 


భార్య హఠాన్మరణం తరువాత తండ్రికి మొహం చూపలేని వెంకటపతి కాన్వెంట్ లో చదువుతున్న తన కొడుకుని ఊరిపొలిమేరల్లో తాత వద్దకు వెళ్లమని వదిలి వేళ్పోతాడు. అదంతా ఎలా జరిగింది? అంత ఆస్తి ఎలా హరించుకుపోయింది? వరూధిని ఎలా మరణించింది? తన ఆస్థిని సర్వనాశనం చేసిన కొడుకు వారసుడైన తన మనవడు రవిని సాంబయ్య చేరదీస్తాడా? చివరికి ఏమవుతుంది? మొదలైన ప్రశ్నలకి సమాధానలు తెలుసుకోవాలంటే నవల చదవాల్సిందే మరి :)


పట్నానికి తీసుకెళ్ళి భార్య ప్రాణాలు కాపాడలేని పరమ పిసినారిగా సాంబయ్య పాత్రను చిత్రీకరించినప్పటికీ, ఎందుకో అతనిపై ద్వేషం, కోపం కలగవు. మట్టిని నమ్ముకున్న అతడి ఆత్మవిశ్వాసానికీ, వృధ్ధాప్యంలో కూడా ఓటమి అంగీకరించని అతని పట్టుదలకూ అతడ్ని మెచ్చకుండా ఉండలేము. ఓ సందర్భంలో "హౌ కౄయల్ యు ఆర్? తాతయ్యా!" అంటాడు మనవడు. అందుకు సమాధానం చెప్తూ, "దున్నుతూ దున్నుతూ కాడి మెడమీద వేసుకుని పోయిండిరా! దాని ఋణం అది తీర్చుకుని హాయిగా కన్నుమూసింది. అదృష్టం అంటే దాందేరా! మనుషులకు కూడా రాదురా ఆ అదృష్టం!" అంటాడు. ఎంతటి జీవనసత్యం దాగిఉందో ఆ మాటల్లో! 

మరోసారి - "తాతయ్యా నీకు చదువు రాదుగదా! ఇదంతా నువ్వెట్టా నేర్చుకున్నావ్?" అనడుగుతాడు మనవడు.. అప్పుడు..
"ఈ నేల నా పలక. నాగలే నా బలపం. పొలమే నా బడి! భూమ్మీద దిద్దాను. రోజుకి ఒక్కొక్కమాట ఈ భూమే నేర్పింది నాకు. నా తల్లీ,దైవం, గురువూ ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పరా మనవడా? నీ బడి గొప్పదో నా బడి గొప్పదో? నీచదువెక్కువో నా చదువెక్కువో?" అంటాడు సాంబయ్య! 

ఇతను కదూ జ్ఞాని !
చివర్లో మరోసారి  "ఈ నేలా, ఈ గాలీ, ఈ ఆకాశం చమటోడ్చేవాడి సొత్తురా! అందలమెక్కినోడిది కాదురా!" అంటాడు అతను.
నవలాసారం కూడా ఇదే!


ఇలా నాకనిపించడం యాదృచ్ఛికమో, ప్రేరణో ఉందోలేదో తెలీదు కానీ నాకీ నవల చదువుతూంటే రెండు  ఆంగ్ల నవలలు గుర్తుకు వచ్చాయి. ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి, నోబుల్ పురస్కార గ్రహీత 'Pearl Buck' రాసిన 'The Good Earth', Thomas Hardy నవల 'The Mayor of casterbridge'. 'The Good Earth'లో protaganist 'wang lung';  '
The Mayor of casterbridge' లో protaganist  'Henchard'. ఈ మూడు నవలల్లోనూ protaganist  ది ఒకటే దుస్థితి.. రెక్కల కష్టం వల్లనే సామాన్యుడి నుండి ధనికుడిగా ఎదగడం, ఆ తర్వాత మళ్ళీ ఏదో కారణాన పతనమైపోయి మళ్ళీ సామాన్యుడైపోవడం. కథ, కారణాలు మాత్రమే వేరు వేరు. ఒకవేళ ఎక్కడైనా వీటి ప్రేరణ ఉండిఉన్నా కూడా "మట్టి మనిషి"కి స్వాతంత్ర్యంగా నిలబడి ఒక గొప్ప నవల అనిపించుకోదగ్గ లక్షణాలన్నీ ఉన్నాయి. సాహిత్యాన్ని అభిమానించే ప్రతి పాఠకుడూ తప్పక చదవవలసిన నవల ఇది!