సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, August 12, 2013

తప్పెవరిది?


మొన్న ఒకతని గురించి తెలిసింది. అలా చేయటానికి అతనికేం హక్కు ఉంది? అని మనసు పదే పదే ప్రశ్నిస్తోంది..


ముఫ్ఫైఏళ్ళు కూడా నిండని ఒక కుర్రాడు. ఇంట్లో అతను ఆడింది ఆట పాడింది పాట. ఉద్యోగాలు వద్దని ఓ వృత్తి చేపట్టాడు. అంతవరకూ బానే ఉంది. రకరకాల స్నేహాలు చేసాడు. వెళ్ళేది సరైన మార్గం కాదని అతన్నెవారూ వారించలేదు. పిల్లని వెతికి పెళ్ళి మాత్రం చేసారు. ఇప్పుడు ఏడాది నిండని చిన్నబాబు కూడా ఉన్నాడు.


కుటుంబం ఏర్పడ్డాకా భార్యాబిడ్డల శ్రేయస్సు గురించి ఆలోచించాలి కదా! తన అల్లరిపనులు భార్యాపిల్లల్ని ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తాయో అన్న ఆలోచన ఉండాలి కదా? కానీ అతనికి ఆ ధ్యాసే లేదు. బాధ్యతలేని పనులకు అంతే లేదు. అతని నిర్లక్యం వాల్ల ఇంతకు ముందు అతనికి రెండుసార్లు ఏక్సిడెంట్లు అయ్యాయి. వారమేసి రోజులు ఐసియులో ఉండి బయట పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ మొన్నటికి నిన్నటి రోజున అంటే రెండురోజుల క్రితం రాత్రిపూట బైక్ మీద ఎక్కడికో వెళ్ళివస్తూ ఓ హైవే మీద మళ్ళీ ఏక్సిడెంట్ అయ్యిందిట. వెనుక ఉన్న అతనికి కాలు,చెయ్యి విరిగాయిట. ముందర ఉన్న ఈ కుర్రాడికి చెయ్యి ఫ్రాక్చర్, తలలో బలమైన గాయాలు. అసలు ఏక్సిడెంట్ ఎలా అయ్యిందో తెలీదు. ఏ చెట్టుకో గుద్దుకున్న దాఖలాలు లేవుట. మత్తులో ఉన్నారేమో అని అనుమానం. ఎప్పటికి చూసారో, ఎవరు చేర్చారో తెలీదు ఒక పెద్ద హాస్పటల్లో చేర్చారు. ఒకరోజంతా కోమాలో ఉన్నాడు. తర్వాత తలకీ, చేతికి సర్జరీలు చేసారుట. రెండుమూడు రోజులైతే కానీ ఏమీ చెప్పలేమంటున్నారుట డాక్టర్లు. తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య, తోబుట్టువులు, స్నేహితులు అంతా హాస్పటల్లో అయోమయంగా పరుగులు! నీళ్ళలా ఖర్చవుతున్న డబ్బు! ఆశ ఉందో లేదో తెలిసినా హాస్పటళ్ళవాళ్ళు చెప్పరు కదా!!


ఇందరి ఆందోళనకు కారణం ఎవరు? అతన్ని అదుపులో పెట్టుకోని తల్లిదండ్రులదా? వాళ్ళిచ్చిన స్వేచ్ఛని సమంగా వాడుకోలేని అతనిదా? తప్పని తెలిసీ చిక్కుల్లో పడేవారు క్షమించదగ్గవారేనా? తప్పు ఎవరిదైనా ఇప్పుడు ఏడాది నిండని బాబు, ముఫ్ఫైఏళ్ళైనా నిండని భార్య, ఆమె తల్లిదండ్రులు ఎంత అయోమయంలో ఉంటారు? అసలు మొత్తం బంధువర్గాన్ని ఇబ్బంది పెట్టే హక్కు అతనికి ఉందా? అయ్యో పాపం అనుకోవటానికి ఇదేమీ పొరపాటున జరిగిన ప్రమాదం కాదుగా! ఇంతకు ముందు రెండుసార్లు ఇలానే అయ్యిందిగా! కానీ ఈసారి ఇంకాస్త సీరియస్ ప్రమాదం.. తనచుట్టూ ఉన్నవాళ్ళకే కాదు అతనికీ అవధే కదా! ఏమో.. ఏమౌతుందో తెలీదు.. కానీ ఆ పసివాడి కోసమన్నా అతను కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.


హైవే ఖాళీగా ఉందికదా అని స్పీడ్ డ్రైవింగ్ చేసేసేవారు ఇప్పటికన్నా కాస్త కంట్రోల్లో ఉంటే బాగుండు..
డ్రైవింగ్ చేసేప్పుడు మత్తులో లేకుండా ఉంటే బాగుండు...
భార్యాపిల్లలున్నవాళ్ళు ఏదైన సాహసమో, మన్మానీ యో చేసే ముందర నాకేదన్నా అయితే నావాళ్ళేమవుతారు? అని ప్రశ్నించుకుంటే బాగుండు...