సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, May 3, 2013
మా ఊళ్ళో కురిసిన వాన
"మన మానసిక స్థితికి సరిపోని పెద్ద సమూహంలో ఉన్నా పూర్తి ఒంటరి ఏకాకితనమే ఉంటుంది కదా! ఏకాంతంలో ఉంటూ కూడా ప్రపంచాన్నంతా అక్కున చేర్చుకుని మంతనాలాడగల సన్నివేశాన్ని అందించే పుస్తకం దొరికితే అంతకంటే గొప్ప ఎంజాయ్ మెంట్ మరేదయినా ఉందా?"
-- వాడ్రేవు వీరలక్ష్మి గారి 'మా ఊళ్ళో కురిసిన వాన' నుంచి.
ఆంధ్రప్రభ దినపత్రికలో వ్యాసాల ద్వారా నాకు పరిచయమైన రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి గారు. తర్వత ఆ వ్యాసాలన్నీ 'ఆకులో ఆకునై' అనే పుస్తకంలో చేరాయి. ఆ మొదటి పరిచయంతోనే నాకు ప్రియమైన రచయితల జాబితాలో చేరిపోయారు. ఆ తరువాత 'ఉత్సవసౌరభం', 'కొండఫలం' కథా సంపుటాలు, 'సాహిత్యానుభవం', 'మా ఊళ్ళో కురిసిన వాన' వ్యాస సంకలనాలు, 'చినుకు' మాస పత్రికలో 'భారతీయ నవలా పరిచయాలు', 'పాలపిట్ట' మాస పత్రికలో 'జాజిపూలపందిరి' మొదలైన రచనలు చేసారు.
ఇరవై నాలుగు వారాల పాటు ఆంధ్రప్రభ దినపత్రిక(2003)లో వడ్రేవు వీరలక్ష్మి గారు రాసిన "వాన చినుకులు" కాలమ్ లోని వ్యాసాలను ఒకచోట చేర్చిన పుస్తకమే "మా ఊళ్ళో కురిసిన వాన". జులై 2012లో ప్రచురణ పొందిన ఈ పుస్తకం వెల 75/-.
గోపగారి రవీందర్ గారి ముందుమాట తో పాటుగా
"గురుపూర్ణిమ నాడు
అర్థరాత్రి దాటిన తరువాత
అదృష్టపశాత్తు కరెంట్ పోగా
తురాయిపూల చెట్ల గాలిలో
బాల్కనీలో ఆకులనీడలో కూర్చొని
పున్నమివెన్నెలతో కబుర్లు మొదలు పెట్టిన దగ్గర్నుంచీ..."
అంటూ తల్లికి తక్క తనయుడు అనిపించేలా రాసిన వీరలక్ష్మి గారి అబ్బాయి రాజా సమీరనందన్ కబుర్లు, జ్ఞాపకాలు చదివి తీరాల్సిందే.
వీరలక్ష్మి గారి పుస్తకం చదివిన ప్రతిసారీ నాకు కొన్ని కొత్త పుస్తకాలో, రచయితలో తెలుస్తుంటారు. ఆవిడ చెప్పే రకరకాల రచయితల పేర్లూ, రిఫరెన్స్ లూ ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎంత ఒరేషియస్ రీడరో కదా.. అనిపిస్తుంది. ఇదివరకూ "కొండఫలం" టపాలో చెప్పినట్లుగా ఈవిడ రచనల్లో నా ఆలోచనల్లో చాలావరకూ భావసారూప్యం కనబడుతుంది నాకు. ఫలానాప్పుడు నేను ఇలానే అనుకున్నా కదా అని ఆవిడ పుస్తకాలు చదివినప్పుడల్లా ఎక్కడో అక్కడ గుర్తు చేసుకుంటూంటాను. అందుకేనేమో ఆవిడ నాకు ప్రియమైన రచయిత్రి అయిపోయారు. వీరలక్ష్మిగారి రచనల్లో నాకు ఇంకా నచ్చేవి జీవితం గురించీ, మానవ స్వభావాల గురించిన ఆవిడ రాసే చక్కని విశ్లేషణాత్మక వాక్యాలు. ఈ పుస్తకంలోనివన్నీ వ్యాసాలే కాబట్టి, వీటిల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను రాస్తాను ...
* "మా మాష్టారు యశస్సుకీ కీర్తికి తేడా చెప్పేవారు. యశస్సు అంటే సహజంగా వచ్చేదని, కీర్తిని సంపాదించడానికి కొంత ప్రయత్నం అవసరం అంటూ. ఇప్పుడు కీర్తికీ, పాపులారిటికి తేడా చెప్పుకోవాలేమి! పూర్తిగా ప్రయత్నం చేసి సంపాదించే పాపులారిటీ కోసమే ఈ క్రేజ్ అంతాను."
*హఠాత్తుగా ఒక్కనాడు తెల్లవారేసరికి మనుషులు మారిపోతారని గానీ, సంఘంలో గాని, ఇంట్లొ గాని పరిస్థితులు ఒక "ఫైన్ మార్నింగ్" చక్కబడిపోతాయని గాని అనుకోవడమూ, నమ్మడము కూడా ఎంత బుర్ర తక్కువ సంగతో ఈ ప్రకృతి ఇలా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది."
* "జీవితంలో ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛ మనిషిని ఇంత అస్థిమితంగా మర్చుతుందా?"
"...ఎంచుకోగల స్వేచ్ఛ కావాలనే కదా మనిషి కోరేది. కానీ ఎంచుకోడానికి ఎంత మనోనిశ్చలత, నాణ్యతని గ్రహించటానికి ఎంత పదునైన బుధ్ధి ఉండితీరాలి! ఇవి లేని వాడి చేతిలో రిమోట్ పెడితే ఎలా?"
* మన ఆలోచనలకు దగ్గరగా ఉండే ఆలోచనలు చదివినప్పుడు పెద్ద సముహంతో కలిసిపోయి ఆనందిస్తున్న భావనే కలుగుతుంది.
* "మనిషి ఎదుటి మనిషిని రాగద్వేషమిశ్రితమైన మనిషిగా అంగీకరించగలగటం ఎంతో గొప్ప సంగతి. అదే జరిగితే ఈ వాదాలేవి అక్కర్లేదు. ఈ అర్ధం చేసుకోలేకపోవడాల దగ్గరే మానవ దు:ఖమంతా ఉంది."
Subscribe to:
Posts (Atom)